Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 5


    "అవున్సార్! చాలా విషయాలు తెలుసు. మేడమ్ కు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలాంటి విషయాలు, ఆసక్తికరమైనవి చెప్పగలను..... ఆనందింపచేయగలను" అన్నాడు మధు.

 

    "వద్దు...... అదే వద్దు..... అలా  ఆనందింపచేసే ప్రోగ్రామ్స్ గురించి మర్చిపో..... శుభ్రంగా నీతివర్తనుడవై చదువుకో! స్నానం చెయ్యి -  కలిసి కాలేజీకి వెళదాం. బి.కాం.లో వుండగా నా పాఠాలు వినకుండా తప్పించుకున్నావ్.... ఇప్పుడెలా తప్పించుకుంటావ్?" అని అంటూ లోపలికెళ్ళాడు మైదానం నారాయణ.

 

    అరగంట తర్వతః బయటికొచ్చి - తలుపుకి తాళంవేసి, కీచెయిన్ కీ తగిలించుకుని, పాంటు జేబులో పెట్టుకుని "కీ చెయిన్ ఎక్కడ పెట్టుకున్నాను?" అనడిగాడు మధుని.

 

    "జేబులో" అన్నాడు మధు.

 

    భార్య ఇంట్లో వుండగా ఇంటికి ఎందుకు తాళం వేసినట్లు? అనుమానమా? భయమా? పిచ్చా? అదే విషయాన్ని అడుగుదామనుకొని, లేనిపోని గొడవలొస్తాయని మానేశాడు.

 

    "ఏ జేబులొ......" స్కూటర్ స్టార్ట్ చేస్తూ అడిగాడు మైదానం నారాయణ.

 

    "ఫాంటు జేబులో."

 

    "అదన్నమాట ఆన్సర్! పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఆన్సర్లు ఫుల్ గా చెప్పడం నేర్చుకోవాలి. అదే ఫస్ట్ లెసన్."

 

    "స్కూటరును పేవ్ మెంట్ పక్కనుంచి నడిపించుకుని వెళుతున్నాడు నారాయణ.

 

    "రోడ్డు మధ్యలో వెళ్ళకుండా...... పేవ్ మెంట్ పక్కనుండి ఎడ్లబండిలా నెమ్మదిగా- ఎందుకిలా?" అడిగాడు మధు.


    "ఏక్సిడెంట్లు జరక్కుండా మన జాగ్రత్తలో మనం వుండాలి. ఈ రోజుల్లో మనం దేన్నీ నమ్మలేం....." అన్నాడు మరికొంచెం ముందుకు వెళ్ళాక.

 

    సడెన్ గా స్కూటరు ఆపాడు నారాయణ.

 

    "ఇంటి తాళాలు ఎక్కడ పెట్టాను?" అనడిగాడతను.

 

    "ఈ మైదానం నారాయణకి నిజంగా పిచ్చేమైనా వుందా? తాళం చెవిజేబులో వేసుకోగానే, కీ చెయిన్ ఎక్కడ పెట్టుకున్నాను? అనడిగాడు. అది  జరిగి ఐదు నిమిషాలు కాకుండానే మరలా అడిగాడు. పిచ్చా? లేక మతి మరుపా?

 

    "జేబులో...... ఫాంటు జేబులో."


    
    "గుడ్....."

 

    "పదఇంటికి వెళదాం" అన్నాడు.

 

    "కాలేజీ దగ్గరగా వచ్చాక మళ్ళీ ఇంటికి ఎందుకు సార్?"

 

    "పనివుంది పదవయ్యా....." కసురుకుంటూ అన్నాడు మైదానం నారాయణ.

 


                                       *    *    *

 

    మళ్ళీ ఇంటికొచ్చి-

 

    తలుపు గొళ్ళాన్ని పట్టుకుని లాగి,  కుడికాలితో గట్టిగా తలుపు తన్ని జేబులో తాళాన్ని మరోసారి చూసుకుని, "పద...... వచ్చిన పని అయిపోయింది" అన్నాడు. ఎందుకు ఇంటికి వచ్చామో? ఏమిటో ఏమీ మధుకి అర్థం కాలేదు.

 

    ఆ విషయాన్నే అడిగాడు మధు.

 

    "పిచ్చివాడా..... ఇల్లు మనదే- మన ఇల్లు మంచిచెడ్డలూ మనవే కదా? అంచేత వచ్చాం."

 

    "అంటే అర్థం  కాలేదు సార్!"

 

    "తాళం వేశానో లేదో, తలుపు గెడపెట్టానో లేదోనని మళ్ళీ టెస్ట్ చేశానన్న మాట."

 

    మేడమ్ ని లోపలుంచి బయట తాళం వెయ్యడం ఏమిటో..... ఈ టెస్ట్ లేమితో అర్థంకాలేదు మధుకి.

 

    ఈ విచిత్ర మానవాకారం వింత చేష్టలకు పిచ్చెతిపోతోంది మధు బుర్ర.

 

    మేడమ్ విషయం అడిగేశాడు.

 

    "అదా..... నామీద ఆవిడకు కొన్నిఅనుమానాలున్నాయిలే..... సడన్ గా కాలేజీ కొచ్చేసి ఆరాలు తీస్తుంది..... అందుకని గొళ్లెం పెట్టి...... తాళం వేస్తే రాలేదు కదా....." అని అన్నాడు నారాయణ.

 

    ఈ వింత దాంపత్యానికి మధుకి నవ్వొచ్చింది. ఆవిడ  మీద ఇతనికి అనుమానమా? లేక ఇతనిమీద ఆవిడకు అనుమానమా? మైదానం నారాయణ బ్రెయిన్ మెదడుందా? మైదా వుందా?

 


                                             *    *    *    

 

    ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కాలేజీ ప్ర్రాంగణం స్టూడెంట్స్ తో కళకళ్లాడుతూ బృందావనంలా వుంది. కొత్త కొత్తగా చేరడానికి అమాయకంగా లోనకొస్తున్న  అమ్మాయిలు, అబ్బాయిల్ని కొంతమందిని ఏడిపిస్తున్నారు. మరికొంతమంది కాలేజీ పాత స్టూడెంట్స్ లోనికొచ్చే అమ్మాయిల వేపే చూస్తున్నారు. పెదవి విరుస్తున్నారు. మెయిన్ గేటుకి ఎడమపక్కన ఎత్తయిన గోడమీద నలుగురు స్టూడెంట్స్ కూర్చున్నారు.

 

    "ఈ సంవత్సరం కూడా మన కాలేజీకి మధురీదీక్షిత్ గానీ, మనీషా కొయిరాలాగానీ వచ్చే అవకాశం లేదురా" అన్నాడు రాజా.


    
    "వాళ్ళీ కాలేజీలో చదవడానికి వస్తున్నారా! ఏ సినిమా పేపర్ లోనూ..... నేను చదవలేదే.....! అమాయకంగా అడిగాడు గుండుబాబు.

 

    "అది కాదురా గుండూ..... మాధురీగానీ, మనీషా కానీ వస్తున్నారని అర్థం కాదురా...... అంత అందమైన ఫిగర్స్ వస్తాయా? రావా.....? అని నా దిగులు" బదులిచ్చాడు రాజా.

 

    "చూడు డాడీ...... 'విపులాచ పృధ్వీ' అన్నారు పెద్దలు. విశాలమైన ప్రపంచంలో ఎక్కడో ఈ పాటికి పుట్టే వుంటుంది. ప్రస్తుతం ట్రిమ్ గా తయారై, హైహీల్స్ వేసుకుంటుంది. ఆ అద్భుతమైన సౌందర్యరాశివైపు కన్నార్పకుందా చూస్తూ, టాంక్ బండ్ మీద విగ్రహంలా నిలబడిపోయిన డ్రైవర్ వైపు నవ్వుతూ చూస్తుంది. ఆ డ్రైవర్ వెంటనే డోర్ తీసి పట్టుకుని వెల్ కం పలుకుతాడు. ఆ వెంటనే, ఆ అమ్మాయి ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీని , అందులో నాలాంటి బ్యాచులర్ కుర్రాడ్ని, తన అందంతో ఆకర్షించడానికి ఠీవిగా కారులో కూర్చుని వస్తుంది."

 

    ఒక కలలరాణి ఊహించుకుని, అభినయం చేస్తూ చెప్పాడు ఇంకో స్టూడెంట్ పీటర్.

 

    అమ్మాయిలందరూ గుంపులు గుంపులుగా నిలబడి, తమను ఆకర్షించడానికి తాపత్రయపడే కుర్రాళ్ళను చూస్తూ టీజ్  చేస్తున్నారు...... లోలోపలే నవ్వుకుంటున్నారు. చెట్లక్రింద, అసెంబ్లీ హాలు ముందర, పార్కు ప్రక్కన రకరకాల బైక్స్. రంగు రంగుల ఖరీదైన కార్లు.

 

    "ఓసేవ్ రాగిణీ! మీ షారూఖ్ ఖాన్ వచ్చాడు..... నిన్నటికీ, ఇవ్వాల్టికీ ఇతగాడికి హీరోహోండా ఎక్కడ నుంచి వచ్చిందీ....." జోగ్గా అంది మధుబాల.

 

    "హీరో హోండామీద ఎక్కిస్తేనే, సినిమా కొస్తానన్నావ్ గదా...... అందుకే పాపం బిడ్డడు రాత్రికి ఏ బ్యాంకుకో కన్నం వేసుంటాడు....." నవ్వుతూ అంది గాయత్రి.

 

    "పోనీలే- మీ శ్రీకాంత్ లా నా బాయ్ ఫ్రెండ్ కి, మారుతీ లేదులే..... ఒన్ సైడ్ లవ్ కి హీరో హోండా చాల్లే..... చూస్తుండు- ఎప్పటికైనా, ఎయిర్ లైన్స్ లో పనిచేసే పైలెట్ ని ప్రేమించి, విమానాల్లో తిరగకపొతే.... నా పేరు రాగిణి కాదు" అంది ఉక్రోషంగా రాగిణి.

 

    సరిగ్గా అప్పుడే మైదానం నారాయణ  స్కూటర్ కాలేజీ ముందు ఆగింది.

 

    "చూడు మధూ.... నువ్విప్పుడెవడివో తెలుసా? కొత్త సీసాలో పాత విస్కీవి. అంటే ఇంటర్ మీడియట్, డిగ్రీ ఇక్కడే చదివిన పాత స్టూడెంట్ వి కాబట్టి, ర్యాగింగులూ, అవీ నీకుండవు. వున్నా పట్టించుకోకు. ఎందుకు చెపుతున్నానో తెలుసా?"

 

    "తెలీదు సార్."


    
    "నేను కూడా నీ క్లాస్ కొస్తాను...... మార్కెటింగ్ చెపుతాను..... ఈ విషయం ఎందుకు చెపుతున్నాను?"

 

    "నాకెలా తెలుస్తుంది సార్?"

 

    "తెల్సుకోవాలి...... కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. చదువు ముఖ్యం. అంచేత నీ కాన్ సన్ ట్రేషన్ అంతా చదువుమీదే వుండాలి..... మిగతా విషయాలు నేను చూసుకుంటాను..... నీ చూపు నా కీచెయిన్ మీద కాకుండా, నీ బ్రెయిన్ మీద ఉన్నప్పుడే నీకు చదువు బాగా వస్తుంది......... అండర్ స్టాండ్ .......ఓకే" అంటూ లోనికి వేగంగా నడిచాడు మైదానం నారాయణ . కొంపలేదో మునిగిపోతున్నట్టు ఏ వైపు నుంచి ఆలోచించినా, ఎంత  మాత్రం  అర్థం కాలేదు మైదానం నారాయణ సైకాలజీ. ఆలోచిస్తూనే తన క్లాస్ రూం వైపు నడిచాడు మధు.

 

                                                            *    *    *    

 

    క్లాస్ రూమ్ లో లెక్చరర్ నారాయణ సప్లయి- డిమాండ్ గురించి ఏకధాటిగా ఉద్ఘోషిస్తున్నాడు. చేతిలో అలవాటుగా 'కీచెయిన్' తప్పనిసరి. అతనికి ఒకే ఒక  స్టూడెంట్ వైపు సూటిగా చూస్తూ లెసన్ చెప్పడం అలవాటు.

 

    "చూడు పద్మశ్రీ" అని పద్మశ్రీ అనే పేరుగల అమ్మాయి వైపు సూటిగా  చూస్తూ "అసలు సప్లయ్ అంటే ఏమిటి? డిమాండ్  అంటే ఏమిటి? ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి.....? ఆ వ్యత్యాసం ఎందుకొస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు కూలంకషంగా చర్చించుకుందాం."

 

    "మీరు టీనేజ్ లో వున్నారు కాబట్టి, ఎగ్జాంపుల్ కూడా మీకు అర్థమయ్యే  భాషలోనే చెపుతాను...... ఇటు పక్క పదిమంది అమ్మాయిలున్నారు. అటు పక్క ఇరవై మంది అబ్బాయిలున్నారు. అంటే దానర్థం ఏమిటి.....? చెప్పు" అంటూ ఒక కుర్రాడిని ప్రశ్నించాడు నారాయణ.

 

    "అంటే అమ్మాయిల సప్లయ్ తక్కువగా వుందనీ , అబ్బాయిల సప్లయి ఎక్కువగా వుందని."

 

    "కరెక్ట్! ఎప్పటికైనా జీనియస్ వి అవుతావు. అంటే దానర్థం ఏంటి?" మళ్ళీ అడిగాడు నారాయణ.

 

    "అంటే అబ్బాయిల డిమాండ్ కు తగ్గట్టుగా, అమ్మాయిల సప్లయ్ వుండాలని."

 

    ఆ జవాబుకి చిరాకు పడిపోయాడు నారాయణ.

 

    "మీకు అర్థమవ్వాలని అమ్మాయిలు, అబ్బాయిల ఎగ్జాంపుల్ చెప్పాను. అసలు ఇక్కడ టాపిక్ ఏంటి? వెంటనే చెప్పేసెయ్యాలి మరి" అని కంగారుగా, కీచెయిన్ తిప్పుడూ అడిగాడు నారాయణ.

 

    ఎవ్వరూ జవాబు చెప్పకపోవడంతో ఏదో ఆలోచనలపడి, నారాయణ టాపిక్ ను మర్చిపోయాడు. సడన్ గా అతనికి ఇల్లు గుర్తుకొచ్చింది. వాళ్లవిడ ఊళ్ళోనే బంధువులింటికి వెళతానటటం కూడా గుర్తుకొచ్చింది. తను ఇంటికి తాళం వేసి వచ్చాడు. అయినా చుట్టాలింటికి వెళుతుందా...... అసలు తను కాలేజీకి వస్తున్నప్పుడు 'ఇంటికి తాళం వేసానా' అనే విషయాన్ని  తీవ్రంగా జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను. లెసన్ చెబుతూ, చెబుతూ ఉన్నట్టుండి సడన్ గా  సైలెంటయిపోయి ఎక్కడాలోచిస్తున్నాడో అర్థంకాకా, అయోమయంలో పడిపోయారు క్లాస్ లో వున్న స్టూడెంట్స్ అంతా.... అప్పుడు తలతిప్పి, మధువైపు చూసి-

 

    "మధూ..... మనం ఇంటికి తాళం వేసి వచ్చామా లేదా? వెంటనే చెప్పు" అన్నాడు సడన్ గా . లెక్చరర్ ఆ ప్రశ్న వేయడంతో మధూ బిత్తరపోయాడు. మిగతా స్టూడెంట్స్ అందరూ గొల్లున నవ్వారు. బిక్క చచ్చిపోయాడు మధు- మైదానం నారాయణ ప్రశ్నకి. వెంటనే అసలు విషయంలోకి వచ్చేసి-

 

    "ఇప్పుడు టాపిక్ ఏంటో చెప్పండి....." అని అన్నాడు తిరిగి నారాయణ.

 

    "ఇప్పుడు టాపిక్కా..... ఇంటికి తాళం సార్" అని అన్నాడు రమణ అనే స్టూడెంట్.

 

    "ఇంటికి తాళం..... పర్సనల్ టాపిక్..... ఇక్కడ లెసన్ టాపిక్ ఏంటి.....? అంటే సప్లయ్ అండ్ డిమాండ్ అని చెప్పాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటారో మీరు...." అని గట్టిగా అన్నాడు కీచెయిన్ ఊపుతూ.....

 

    "మేం కూడా సప్లయ్ చేసినప్పుడు" అన్నాడు కొంటెగా గుండుబాబు.

 

    "బోడి- నీకు సప్లయ్ చేసే వయసొచ్చేటప్పటికి ప్రపంచంలో ఒక్క ఆడ పురుగుకూడా వుండదు అర్థమైందా?"

 Previous Page Next Page