"మీ దీవెన ప్రకారం నేను వెయ్యేళ్ళు బ్రతక్కపోవచ్చు. కానీ బ్రతికిన కాలంలోనే వెయ్యేళ్ళ సంతోషం తప్పక పొందుతాను" అన్నాడు నాగరాజు తృప్తిగా.
"అసలేం జరిగిందో పూర్తిగా చెప్పండి. మా అమ్మాయిప్పుడెక్కడుంది?" అన్నాడు దక్షిణామూర్తి.
"నాకు తెలిసిన వివరాలు నేను చెబుతాను" అన్నాడు నాగరాజు.
* * * *
రవీంద్ర, రాజేంద్ర, దేవేంద్ర అనే ముగ్గురు దుర్మార్గులు అమ్మాయిల వేటకు పథకం వేసుకుంటే అది రమణ భగ్నం చేశాడు. రమణ హాసను తొలిచూపులోనే ప్రేమించి ఆమె కోరికపై ప్రతిభ అనే యువతికి జీవితం సుకరం చేసి దేవేంద్రకు జీవితం దుర్భరం చేశాడు.
ప్రతిభ, దేవేంద్రల ఆదర్శ వివాహా వివరాలు ఓ పత్రికలో సీరియల్ గా ప్రారంభమయ్యాయి. ప్రతిభ బెడద వదిలించుకునేందుకు దేవేంద్ర ఓ టెస్టింగ్ క్లినిక్ సాయం తీసుకుని ఆమెకు బ్లడ్ కాన్సర్ ఉన్నట్లు తప్పుడు రిపోర్టు సృష్టించాలనుకున్నాడు. కాకతాళీయంగా ప్రతిభ, హాస ఒకే సమయంలో ఆ క్లినిక్ కి వెళ్ళారు. రిపోర్టులు తారుమారయ్యాయి. ప్రతిభకు అంటగట్టాలనుకున్న బ్లడ్ కాన్సర్ హాసకు అంటుకుంది. ప్రతిభ సంపూర్ణారోగ్యవంతురాలని సీరియల్ లో ప్రచురించబడింది. హాస ఆ విధంగా తనకు తెలియకుండానే తన స్నేహితురాలిని రక్షించుకుంది.
విషయం అర్ధమైన రవీంద్ర ముఠా హాసను వెంటాడారు. హాస, రమణ పట్ల ఆకర్షితురాలవుతోందని గ్రహించి వీలున్నప్పుడల్లా ఆమెనతడికి వ్యతిరేకంగా తయారుచేస్తూ, రమణ గురించి తప్పుడు సమాచారాన్నంజేస్తూ చివరికే దారీ తోచక తమ వాడినొకడ్ని ప్రోత్సహించి ఆమెను సర్వభాషానందస్వామి ఆశ్రమానికి పంపారు.
రమణ కృషివల్ల రవీంద్ర బృందం కాశ్మీర్ లోనే పోలీసులకు పట్టుబడింది.
సర్వభాషానందస్వామి ఆశ్రమంలో చేరిన అందమైన యువతులకు బయటపడే అవకాశం రాదు. ఈ రోజుకామె బయటపడి రాగలిగితే ఆమె నిజంగా అదృష్టవంతురాలే అవుతుంది. లేదా ఆమెను బయటకు తీసుకురావడానికి నాగరాజు గొప్ప కృషి చేయాలి. అయితే ఆ ఆశ్రమం నుంచి వచ్చిందని తెలిసేక ఆమెకు వివాహం జరగడం ఇంచుమించు అసాధ్యం.
* * * *
"నేనామెను వివాహం చేసుకుంటాను" అన్నాడు రమణ వెంటనే.
ఆ మాటలకు లభించిన అభినందనలనతడు వినడం లేదు. మనసులోనే రామశేషు తెలివినభినందించుకుంటున్నాడు. తన గురించి కొన్ని అబద్ధాలు చెప్పడానికి నాగరాజును కన్విన్సు చేయమని అతడు కోరాడు.
రామశేషుకి స్వయాన నాగరాజు బావ. ఈ వ్యవహారంలో నాగరాజిప్పటికే అతడ్ని కొంత మోసం చేశాడు.... హాసను హత్య చేయమని దేవేంద్ర బృందాన్ని ప్రోత్సహించినిదాయనేనని రమణ, రామశేషు కూడా ఊహించగలరు.
ఏది ఏమైనా హాస అదృష్టవంతురాలని ఋజువయింది.
విషప్రయోగం నుంచి తప్పించుకుంది. బలప్రయోగం నుంచి తప్పించుకుంది. భయంకరమైన బ్లడ్ కాన్సర్ నుంచి తప్పించుకుంది.... ఇప్పుడా ఆశ్రమం నుంచి తప్పించుకుంటే ఆమె అదృష్టానికి తిరుగులేదు.
ఆమె అదృష్టం ఋజువయింది.... ఇక తన అదృష్టమే ఋజువు కావాల్సి వుంది.
ఇన్నాళ్ళ సాహచర్యంలో అతడొక విషయం గ్రహించాడు.
హాస సామాన్య మనిషి కాదు. ఎన్నో దుర్మార్గాలనవలీలగా చేయగలిగిన తాను ఆమె అనుమతి లేకుండా తాకడానికే భయపడేవాడు. ఆమెను చంపడం అతడికి సాధ్యపడేది కాదు. అయినా యాభై లక్షలతోపాటు ఆమె కూడా దక్కుతూంటే ఆమెను చంపాలనుకోవడం ఎంత తెలివితక్కువ!
ఆలస్యం మంచిదే అయింది. ఈ రోజామె వస్తే తనకు యాభై లక్షలతోపాటు ఆమె కూడా మిగులుతుంది.
ఆమెను తన బారినుండి రక్షించిన ఆ అజ్ఞాత ప్రేమికుడికీ రోజు డబ్బు కోసం ఆ పని చేసాడన్న అపవాదు తప్పదు.... నిజానికి హాసను బలాత్కారం నుండి తప్పించి దేవేంద్ర ముఠాను పోలీసుల కప్పగించినది అతడే?
* * * *
మళ్ళీ ఆ హాల్లో నిశ్శబ్దం.
నాగరాజు ఆలోచిస్తున్నాడు.
ఊళ్ళో అన్ని వైపులా తన మనుషులున్నారు. హాస గనుక ఈ ఊరొస్తే ఈ రోజుకామె ఈ యిల్లు చేరలేదు.
ఈ ఒక్కరోజు-ఆమెను ఆపడానికి తను అన్ని ఏర్పాట్లూ చేశాడు.
అసలామెకు ఆశ్రమం నుంచి బయటపడే అవకాశమే లేదు. ఉంటే ఈ యిల్లు చేరలేదు. తన మనుష్యులు సామాన్యులు కారు. వారికి ఆజ్ఞనిస్తే చీమ, దోమ కూడా కొత్తగా వూళ్ళో ప్రవేశించలేవు.
కానీ ఏది ఏమైనా తనిక్కడ రోజంతా వుండాలి.
గడువు రాత్రి పన్నెండు గంటలవరకూ వుంది.
* * * *
ఆ రోజుకు నాగరాజా యింట్లో అతిధి.
ఆ యింటివారితో వారిలో ఒకడై ఆయన భోంచేశాడు.
మధ్య తరగతి మంచి కుటుంబంలో భోంచేసే ఆ వాతావరణమే వేరు.
నాగరాజు పేదవాడిగా పుట్టాడు. స్వయంకృషితో గొప్పవాడయ్యాడు.
మధ్యతరగతి జీవితం అతడికి బొత్తిగా తెలియిదు.
గొప్పవారి హోదానూ, పేదవారి నిశ్చింతనూ కలుపుకున్న మధ్య తరగతి జీవితం గొప్పతనం గురించి అనుభవించేవారికే తెలియదు. జీవితాన్ని జీవితంలా అనుభవించేది వారు మాత్రమే. వారికి సమస్యలుండవచ్చు. అవి వారు సృష్టించుకున్నవే! వాటికి పరిష్కార మార్గాలన్వేషించడంలో జీవితానికో తృప్తి వుంటుంది.
యిప్పుడా యింట్లో అందరికీ హాస గురించిన ఆత్రుతే తప్ప బెంగ లేదు.
మధ్యాహ్నం నాగరాజు పడుకున్నాడు.
జీవితంలో ఎన్నడూ ఎరుగని తృప్తి ఆ సుఖనిద్రలో పొందాడాయన.
సాయంత్రం అందరూ టిఫిను తిన్నారు.
మధ్య తరగతి కుటుంబాల్లో ముసలమ్మ లెరిగిన పాకరహస్యాల గొప్పతనం ఆ రోజు నేతి పెసరట్లలో చూశాడు నాగరాజు.
విచిత్రమేమిటంటే రాత్రి తొమ్మిది కాకుండానే ఆయనకు కరకరమంటూ ఆకలి వేసింది.
* * * *
రాత్రి పదకొండు గంటల యాభై నిముషాలు.
నాగరాజు తిరిగి వెళ్ళిపోడానికి సంసిద్దుడవుతూ, "అప్పుడప్పుడు విశ్రాంతికి మీ యింటికొస్తూంటాను" అన్నాడు. మనసులో అంతకాలం తెలివి తక్కువగా విశ్రాంతికి హీల్ స్టేషన్సుకి వెళుతున్నందుకు విచారించాడాయన.
ఇంట్లో వారందరికీ దిగులుగా ఉంది.
హాస రాలేదు.
డబ్బుకోసం ఆమెను ఆశ్రమానికి నడిపించిన వ్యక్తి సమయానికామె నెందుకు తీసుకు రాలేకపోయాడు?
హాస క్షేమంగా ఉందా? ఉన్నా అసలు వస్తుందా?
పదకొండూ యాభై అయిదు.
ఇంటి తలుపులు తెరుచుకున్నాయి.
నాగరాజు వీధిలో అడుగు పెట్టాడు.
బయట నిలబడ్డ డ్రయివర్ ఆయనకు వినయంగా నమస్కరించాడు.
యాభై లక్షల రూపాయలు ఇంట్లోంచీ నడిచి వెళ్ళిపోతున్నాయన్న దిగులు కంటే హాస ఏమయిపోయిందన్న విచారమే ఆ యింటి వారిని బాధిస్తోంది.
టైము పదకొండూ యాభై ఏడు.
"సెలవు...." అన్నాడు నాగరాజు.
ఆ సమయంలో ఆ వీధి విర్మానుష్యంగా ఉంది.
దక్షిణామూర్తి, కోదండపాణి ఆయనకు చేతులు జోడించారు.
"మీ అమ్మాయిని క్షేమంగా మీ యింటికి చేర్చే బాధ్యత నాది...." అన్నాడు నాగరాజు.
టైము పదకొండూ యాభై తొమ్మిది.
డ్రయివర్ కారెక్కబోయి ఆగాడు.
అందులోంచి దిగాడు సురేంద్రరావు.
"మీరా?" అని నాగరాజాశ్చర్య పడుతూంటే గౌతమ్ కూడా అందులోంచి దిగాడు.
"ఎవర్నువ్వు?" అన్నాడు నాగరాజు.
అప్పుడు కార్లోంచి దిగింది హాస.
పన్నెండు కావడానికింకా పది సెకన్లుంది.
* * * *
జూన్ ఏడవ తేదీ సాయంత్రం అయిదింటికి టాక్సీ ఊరు చేరుకుంది. పొలిమేర్లలో టాక్సీని ఆపిన పోలీసులు హాసినిని చూసి, "నీ మీద నేరారోపణలున్నాయి. పోలీసు స్టేషనుకి రావాలి" అన్నారు.
అప్పుడు సురేంద్రరావు వారికి కనిపించాడు. ఆయన్ను చూస్తూనే వాళ్ళు భయపడి, "నాగరాజు గారు ఈమెపై ఫిర్యాదు చేశారు సార్!" అన్నారు.
"నాగరాజా- అంటే?" అన్నాడు సురేంద్రరావు.
అగరొత్తులు, వక్కపొడి, ఊరగాయలు, ఫలరసాలు....
నాగరాజంటే ఎవరికి తెలియదు!
"వాడా?" అన్నాడు సురేంద్రరావు తన హోదా తెలిసే విధంగా.
అరగంటలో కారొచ్చిందక్కడికి.
పోలీసులు సురేంద్రరావుతో పాటు హాసను కూడా వదులుతూ, "సార్! మీరే మాకు మాట రాకుండా చూడాలి" అన్నారు.
"ఊఁ" అన్నాడు సురేంద్రరావు.
సురేంద్రరావు బృందం టాక్సీలోంచి కార్లోకి మారారు.