వాళ్ళింకా నవ్వుతూనే ఉన్నారు.
"ఈ రోజు జూన్ ఐదు. జూన్ ఏడు నుంచి మీ ఇద్దరిలో ఎవ్వరూ నన్ను మళ్ళీ చూడలేరు" అంది హాస.
వాళ్ళ నవ్వులు ఠక్కున ఆగిపోయాయి.
"ఎందుకని?" అన్నారిద్దరూ ఏకకంఠంతో.
"స్వామి నా వద్ద మాట తీసుకున్నారు"
"ఏమని?"
"నా ఏకాంత సేవను కోరే వారిక్కడ మరికొందరున్నారుట.... నేనీ ఆశ్రమం రుణం తీర్చుకోవాలట...."
"వీల్లేదు...." అన్నాడు సురేంద్రరావు.
"వీల్లేదంటే ఉపాయం కూడా స్వామి చెప్పారు....కానీ అది నావల్ల కాదు."
"ఏమిటది?" అడిగాడు సురేంద్రరావు.
"ఈ మూడు వారాలూ వైద్యం పేరు చెప్పి ఆయనిచ్చిన మందుల్లో నేను తీసుకున్నదేమిటో ఆయనకు చెప్పాలిట!" అంటూ హాస నవ్వటం ప్రారంభించింది.
ఆమె నవ్వుతూంటే వాళ్ళు తెల్లబోయి ఆమెవంక చూస్తున్నారు.
భయంకరమైన బ్లడ్ కాన్సర్ ముదిరేక దానికి విరుగుడు లేదు వైద్యశాస్త్రంలో. అందుకే స్వామి ఆమె వైద్యాన్ని భగవంతునికి వదిలిపెట్టారు. నమ్మకం కోసం అయిదు డబ్బాల పద్ధతి ప్రవేశపెట్టినా వాటిలో ఆమె ఏమి తీసుకుందో ఆయనకు తెలియదు. వరుసగా ఏ రోజున ఏ రంగుపొడి తీసుకుంటుందో ఆమె చెప్పగలిగితే నిజంగానే బ్లడ్ కాన్సర్ కి మందు కనిపెట్టినట్లవుతుంది. స్వామి ఆమెను గుర్తు చేసుకోమని చాలా బ్రతిమాలేడు. ఆ పరిస్థితిలో ఆమెకెంత నవ్వొచ్చిందంటే అప్పుడామె తన జబ్బు నయమయిందనీ, తనకు తనవాళ్ళెందరో ఉన్నారనీ ఆమె మర్చిపోయింది.
ఆమె వైద్యాన్ని గుర్తుచేసుకోలేదని తెలిసేక స్వామి ఏకాంతసేవ గురించి మాట్లాడి, "మౌనంగా అంగీకరిస్తే నీకు కృతజ్ఞత ఉన్నట్లు. లేదూ నా అనుమతి లేనిదే ఇక్కడ్నించి వెళ్ళలేవు" అని చెప్పాడు.
* * * *
సురేంద్రరావు సర్వభాషానంద స్వామికి హాసకున్న అద్భుత శక్తుల గురించి చెప్పాడు. మొదట ఆయన నమ్మలేదు. ఎక్కడ నుంచయినా సరే ఏ సాంకేతిక వైజ్ఞానిక సహాయమూ అవసరం లేకుండా ఆమె, గౌతమ్ సంభాషించుకో గలరని రుజువయ్యాక స్వామి కలవరపడ్డాడు.
అప్పుడు సురేంద్రరావు హాసవల్ల ఉండే అసలు ప్రమాదం చెప్పాడు.
ఎలాంటి దానవుడినయినా మానవుడిగా మార్చగల హాస ప్రతిభకు సురేంద్రరావుకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?
స్వామి ఆశ్రమంలో హాస జబ్బు నివారించబడటం గురించి సురేంద్రరావు తగిన ప్రచారం యివ్వడానికి అంగీకారమయింది. స్వామి వైద్యాన్ని మించి తన త్యాగం హాస జబ్బుని నయంచేసిందని సురేంద్రరావు నమ్మడం వలన అతడిలో వచ్చిన మార్పు శాశ్వతం కూడా అయింది.
హాస, గౌతమ్ జూన్ ఆరున ఆశ్రమం విడిచేందుకు సకల సన్నాహాలూ జరుగుతున్నాయి.
* * * *
జూన్ ఏడు.
దక్షిణామూర్తి, కోదండపాణి, పార్వతమ్మ, సుభద్ర, గిరిధర్ ఒకే హాల్లో కూర్చుని ఉన్నారు.
అందరి ముఖాల్లోనూ దిగులు.
అప్పుడే ఎవరో తలుపుతట్టారు.
గిరిధర్ పరుగున వెళ్ళి తలుపు తీసి నీళ్ళుగారిపోయి, "రమణగారు" అన్నాడు.
తనను చూసి అతడంత నీళ్ళుగారిపోవడం గమనించిన రమణ చిన్నబుచ్చుకున్నా పైకి కనబడనీయలేదు.
"అక్క యింకా రాలేదా?" అడిగాడతను.
తల అడ్డంగా ఊపాడు గిరిధర్.
ఇద్దరూ లోపలకు వెళ్ళారు. వెళ్ళే ముందు గిరిధర్ మళ్ళీ తలుపేసేశాడు.
అతడి ప్రశ్న అంతా విన్నారు.
"అసలది వస్తుందంటావా బాబూ!" అడిగాడు దక్షిణామూర్తి.
"వస్తుంది" నమ్మకంగా అన్నాడు రమణ. ఆ నమ్మకం అందరికీ ఎంతో అవసరం. హాస వస్తే ఆమెను దక్కించుకునేందుకు తిరుగులేని ఆఖరి పథకం సిద్ధం చేసుకుని వచ్చాడతడిప్పుడు.
మౌనంగా కూర్చున్న వారి సమాఖ్య ఐదు నుంచి ఆరుకు పెరిగింది.
ఆ నిశ్శబ్దాన్ని మళ్ళీ తలుపు చప్పుడు ఛేధించింది.
గిరిధర్ పరుగున వెళ్ళి తలుపు తీశాడు.
తలుపు బయట ఓ అపరిచితుడు. "దక్షిణామూర్తిగారుండే ఇల్లు ఇదేనా?" అన్నాడు.
గిరిధర్ తలూపాడు.
"వాళ్ళబ్బాయి పేరు కోదండపాణి. అవునా?"
గిరిధర్ అనాసక్తంగా తలూపాడు.
"వారి అమ్మాయి హాస కదూ!"
గిరిధర్ కళ్ళు మెరిశాయి. అతడిలో ఒక్క ఉదుటున ఉత్సాహం పెల్లుబికింది. వెంటనే "అవును. అక్క మిమ్మల్ని పంపిందా?" అన్నాడు గిరిధర్.
"నన్ను పంపింది మీ అక్క కాదు. వారు...." అన్నాడు అపరిచితుడు.
గిరిధర్ అటు చూస్తే వారెవరూ కనబడలేదు. కానీ నేవీ బ్లూరంగు మారుతీ ఏసీ కారు కనబడింది.
"వారు కార్లో ఉన్నారు" అన్నాడు అపరిచితుడు.
"ఎవరు వారు?"
"వారి పేరు నాగరాజు. మాక్కావలసిన యిల్లిదే అయితే వారు లోపలకు వస్తారు...." అన్నాడు అపరిచితుడు.
కారులోంచి డ్రయివరు దిగాడు. అపరిచితుడికేసి చూసి అప్పుడు వెనుక తలుపు తెరిచాడు.
ఆపిల్ పండులాంటి మనిషి అందులోంచి దిగి ముందుకు నడిచాడు.
* * * *
నాగరాజు కుర్చీలో కూర్చున్నాడు. ఆయన కెదురుగా దక్షిణామూర్తి, కోదండపాణి కుర్చీల్లో కూర్చున్నారు. ఆడవాళ్ళు కాస్త దూరంగా నిలబడ్డారు.
రమణ నాగరాజుకు ఓ పక్కగా వినయంగా నిలబడ్డాడు. గిరిధర్ తండ్రి పక్కన నిలబడి జరిగేది అసహనంగా చూస్తున్నాడు.
"నాపేరు నాగరాజు. పేరుకు తగ్గట్లే కోటికి పడగలెత్తిన నాగరాజుని. ఎన్నో ఏళ్లుగా తిరుగులేని అదృష్టం నాది. నా అదృష్టం యిలాగే కొనసాగడానికి యాభై లక్షలు ఓ అదృష్టవంతురాలికి ఇవ్వాలనుకున్నాను. అందుకు మీ అమ్మాయి హాస ఎన్నికయింది. అతి సులభంగా యాభై లక్షలామెకివ్వదల్చుకోలేదు. ఆమె అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నాను. పరీక్షించాను.
"ఈ రోజు వీలునామాతో ఇక్కడికి వచ్చాను. వీలునామా ప్రకారం ఇంతవరకు జీవికచి ఉంటే యాభై లక్షల రూపాయలకు వారసురాలు మీ అమ్మాయి హాస. ఆమె జీవించి ఉండక వివాహమై ఉంటే ఆ ఆస్థి ఆమె భర్తకు చెందుతుంది. ఆమెకు వివాహం కాకపోతే, ఆమె జీవించి ఉండకపోతే ఆస్థి నా బావ రామశేషుకు చెందుతుంది. ఎటొచ్చీ అతడే నేరం మీద యావజ్జీవ కారాగార శిక్షకు గురి కాకుండా ఉంటే!" అతడు శిక్షార్హుడే. అయితే నా ఆస్థి నాకే ఉండిపోతుంది."
గంభీరంగా వివరాలు ముగించాడు నాగరాజు.
అందరూ తెల్లబోయి చూస్తున్నారు.
విషయం అర్ధం చేసుకుని జీర్ణం చేసుకునేందుకు అందరికీ కాసేపు పట్టింది.
ముందుగా దక్షిణామూర్తి, డబ్బు సంగతలాగుంచండి. మా హాసను పరీక్ష పేరుతో మీరేం చేసారు?" అన్నాడు.
"నేనేమీ చేయలేదు. నా వీలునామా రహస్యాన్ని ఓ భయంకర ముఠాకు విడుదల చేశాను" అన్నాడు నాగరాజు.
"అప్పుడేమయింది?" అన్నాడు కోదండపాణి.
"ఆ ముఠా ఆమెను వేటాడసాగింది."
"ఓరి దుర్మార్గుడా! నీ డబ్బు మాకెందుకురా? నిక్షేపం లాంటి పిల్ల మీదకి రాక్షసుల్ని ఉసిగొల్పుతావుట్రా...." అంది పార్వతమ్మ.
"అమ్మా! అన్నాడు కోదండపాణి మందలింపుగా.
"అననివ్వండి. పెద్దల తిట్లే పిన్నలకు దీవెనలు...." అన్నాడు నాగరాజు శాంతంగా.
"నాగరాజుగారూ! మీరు చేసినపనీ బాగోలేదు...." అన్నాడు దక్షిణామూర్తి.
"నేను హామీ యిస్తున్నాను. మీ అమ్మాయి కొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఆమెను నేను రక్షిస్తాను. నా వీలునామా అమలు జరిగే రోజిది. ఈ రోజు ఆమె రాకపోతే ఆస్తి ఎవరికి దక్కేదీ నిర్ణయమైపోతుంది. సరిగ్గా ఈ రోజు నుంచి వారం రోజుల్లోగా ఆమెను మళ్ళీ మీ ముందు నిలబెడతాను" అన్నాడు నాగరాజు.
"అంతవరకూ అది బ్రతికుండాలి గదా!" అంది పార్వతమ్మ రుద్ద కంఠంతో.
"మీరలా ఎందుకంటున్నారో తెలుసు నాకు. నన్ను దీవిస్తారో, శపిస్తారో మీకో నిజం చెబుతున్నాను. మీ అమ్మాయి హాసకు బ్లడ్ కాన్సర్ అన్నమాట నిజం కాదు. ఆమె మొదట్నించీ సంపూర్ణారోగ్యవంతురాలు" అన్నాడు నాగరాజు.
ఒక్కసారి అక్కడంతా నిశ్శబ్ధమైపోయారు. అది ఆనందమో, ఆశ్చర్యమో ఎవరికీ తెలియదు.
ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ, "మంచి ముక్క చెప్పేవు.... వెయ్యేళ్ళు వర్ధిల్లు__" అంది పార్వతమ్మ.