డ్రయివర్ సురేంద్రరావుకి సుపరిచితుడు. తన యజమాని సురేంద్రరావుకు భయపడతాడనీ అతడికి తెలుసు.
సురేంద్రరావు ఎక్కడికి వెళ్ళాలో అడ్రసు చెప్పాడు.
డ్రయివర్ ఆశ్చర్యంగా, "సార్! అక్కణ్నించే నేను వస్తూంట. ఈ రాత్రి పన్నెండు గంటలకు మళ్ళీ అయ్యగారక్కణ్నించి బయల్దేరుతారు" అన్నాడు.
నాగరాజు హాస యింట్లో ఉండడం సురేంద్రరావుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడే హాసను పట్టుకోమని పోలీసుల్ని నియమించాడు.
కారణమేమిటి?
అంటే హాస ఈరోజు వస్తుందని అతడికి తెలుసు. ఆమె కోసం రాత్రి పన్నెండు దాకా ఎదురు చూస్తాడు.
ఎందుకు?
నాగరాజు పూర్తిగా ఎదురు చూసేదాకా హాస అతడి కళ్ళపడరాదని సురేంద్రరావు అనుకున్నాడు.
కారు పన్నెండు లోగా అక్కడికి చేరుకోవాలి.
ఈలోగా సురేంద్రరావు, హాస, గౌతమ్ కారులో ఊరంతా తిరిగారు.
పదకొండున్నరకు కారు హాస యిల్లు చేరుకుంది.
తన వాళ్ళందర్నీ చూడాలని హాస మనసు ఉరకలు వేస్తోంది.
కానీ పన్నెండు దాకా ఆగక తప్పలేదు.
* * * *
ఆ యింటి హాల్లో తెల్లబోయి చూస్తున్న హాస ముందు మోకాళ్ళపై వంగి, "హేట్సాఫ్ టూ యూ అండ్ యువర్ లక్....!" అన్నాడు నాగరాజు.
మొత్తం జరిగినదంతా తెలిసేక హాసకు కలిగిన ఆశ్చర్య మింతా అంతా కాదు.
"యాభై లక్షలతో నా అదృష్టాన్ని నిలుపుకోబోతున్నాను. అందుకే ఈ మాత్రం పరీక్ష. నా అభిప్రాయంలో నాకంటే అదృష్టవంతులుండరు. ఈ డబ్బు నాకే ఉండిపోతుందనుకున్నాను. ఈ హాస అదృష్టం నాకంటే గొప్పది. లేకుంటే ఈ చివరి క్షణాల్లో నన్ను మించిన సురేంద్రరావు గారి మద్దతు లభించడం కల్ల...." అన్నాడు నాగరాజు.
"ఈమె అదృష్టం సంగతి నాకు తెలియదు. కానీ వ్యక్తిత్వం గురించి ఎంతో తెలుసుకున్నాను. ఒకానొకప్పుడు గౌతమ్ బుద్ధిని సమక్షంలో అంగుళీమాలుని వంటి బందిపోటు మారిపోయాడంటే ఎలాగో అది నాకు ప్రత్యక్షానుభవమయింది" అన్నాడు సురేంద్రరావు.
"మీరందరూ నా అదృష్టం గురించి చెబుతున్నారు. ఒప్పుకున్నాను. కానీ అందుక్కారణం తెలుసా?" అంది హాస. మిగతా వారు బదులిచ్చే లోగానే...." యిడిగో ఈ గౌతమ్! ఇతడి ప్రేమ నాకీస్థాయి తెచ్చి పెట్టింది" అందామె.
అందరూ తెల్ల బోయారు.
అప్పుడే అందరికీ గౌతమ్ వివరాలు తెలిశాయి. ఆ వివరాలు అతడి సామాన్యతను స్పష్టం చేశాయి.
* * * *
రాత్రి ఒంటి గంటయింది.
ఆ యింట్లో ఇంకా ఎవరూ నిద్రపోలేదు.
హాస కుటుంబం రమణను, హాస గౌతమ్ ని ఎన్నుకుంటున్నారు.... నాగరాజుతో సహా అందరూ గౌతమ్ డబ్బుకోసం హాసను ప్రేమించాడంటున్నారు.
చివరికి హాస ఓ నిర్ణయానికి వచ్చింది.
"నేను హాసను. లాటరీలో వచ్చినట్లుగా యాభై లక్షలు నాకొచ్చాయి. ఈ డబ్బునీ నన్నూ కలిపి ప్రేమించేవారు నాకొద్దు. అందుకే నన్ను నేను డబ్బు నుంచి వేరు చేసుకుంటున్నాను. నాకే యాభై లక్షలు విలువ కట్టి నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తిని నేను వివాహం చేసుకుంటాను. మీలో నిజంగా డబ్బెవరికి కావాలో చెప్పండి. వారికి నేను డబ్బిచ్చేస్తాను. మొత్తం యాభై లక్షలూ ఇస్తాను. బాగా ఆలోచించుకోండి. డబ్బో, నేనో....ఏదో ఒకటి మాత్రమే కోరుకోవాలి...." అంది హాస.
"నువ్వు చెప్పడం దాకా బాగానే ఉంది. నాగరాజు గారు దీని కొప్పుకుంటారా?" అన్నాడు రమణ.
"నా డబ్బు అదృష్టవంతులను చేరితేనే నాకు తృప్తి. నీ అదృష్టమెలాంటిదో తెలుస్తూనే ఉంది. ఎందరు సాయపడ్డా హాస ప్రేమను పొందలేక పోయావు...." అన్నాడు నాగరాజు.
"అదే నేనూ చెప్పబోతున్నాను. ఆమె మాటలకు మీ రొప్పుకోకూడదు. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకునే అర్హత నాకు లేదు. మొదట్నించీ ఆమెని డబ్బుకోసం ప్రేమించాను. మంచి వాడుగా నటిస్తూ ఎంతో వేధించాను. ఆమెను నా దాన్ని చేసుకోవాలని ఎంతకో తెగించాను. కానీ ఈ అసాధారణ మనిషిలో ఏదో అపూర్వశక్తి ఉంది. దానికి నేను తలవంచక తప్పదు. ఇన్నాళ్ళ ఆమె సాహచర్యంలో నాలో ఈ మాత్రం మార్పు రాకపోతే నేను మనిషినే కాదు. అబద్ధాలతో ఈమెను పొందాలని ఇక్కడకు వచ్చాను. కానీ యిప్పుడు నా మనసు పూర్తిగా మారిపోయింది. ఈ గౌతమ్ ఎలాంటివాడో నాకు తెలియదు. నేను మాత్రం హాసకు తగినవాడ్ని కాను. తప్పు చేసి సంస్కరించుకున్నవాడు కాక తప్పు చేయని వాడికే ఈమెను పెళ్ళాడే అర్హత ఉంది. నాకిక సెలవిప్పించండి" అంటూ రమణ అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
"మరి ఈ అబ్బాయి గౌతమ్ ఏం మాట్లాడడేం?" అంది పార్వతమ్మ.
గౌతమ్ బదులివ్వలేదు.
"అతడి మాటలు నా చెవుల్లో వినిపిస్తున్నాయి. అతడి నిజాయితీ నాకు తెలుస్తూనే ఉంటోంది...." అంది హాస.
"అంటే?" అంది పార్వతమ్మ.
"ఏ ఫోనూ అవసరం లేకుండా, ఏ యంత్ర సాయం లేకుండా మేమిద్దరం మాట్లాడుకో గలం. కావాలంటే యిప్పుడే పరీక్షించుకోండి...." అంది హాస.
* * * *
ఆ గదిలో నాగరాజు, దక్షిణామూర్తి, పార్వతమ్మ, గౌతమ్!
ఈ హాల్లో హాస, సుభద్ర, కోదండపాణి, గిరిధర్!
"నువ్వు మాటిమాటికీ రక్తం కక్కుకునే దానివట. మీ అమ్మ చాలా కంగారు పడేది. బ్లడ్ కాన్సరు కాకపోతే అలా ఎందుకు జరిగింది?" ఈ ప్రశ్న పార్వతమ్మ గౌతమ్ చేత కాగితం మీద రాయించింది.
"కాశ్మీర్లోనే కాదు, కాలేజీమేట్సు దగ్గర కూడా అప్పుడప్పుడిలా రక్తం కక్కేదాన్ని. దాన్ని బ్లడ్ కాన్సర్ ఆట అనేవాళ్ళం. నోట్లో ఎర్రరంగు టాబ్లెట్టుంచుకుని అలా చెయ్యొచ్చు. ఇది నా క్లాస్ మేటు మాలతికి కూడా నేర్పాను. అమ్మ నన్ను జబ్బు మనిషిలా ట్రీట్ చేస్తూంటే సరదాగా ఈ ఆట ఆడేను. అయితే అమ్మ అప్పటికే నాకు బ్లడ్ కాన్సరనుకుంటోందని నాకు తెలియదు" ఈ జవాబు హాస రాస్తే సుభద్ర ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
"సర్వభాషానంద స్వామి ఆశ్రమంలో మళ్ళీ నాకు యౌవనం వచ్చే మందేమైనా దొరుకుతుందేమో కనుక్కున్నావా....?" ఇది దక్షిణామూర్తి ప్రశ్న.
"ఆ మందు మిమ్మల్ని ప్రేమించే వారి దగ్గరుంటుంది. వారు కోరుకున్నట్లుగా ఉంటుంది మీ రూపు. బామ్మకు మీరెలా గుండాలనుందో అడిగి తెలుసుకోండి...." ఇది హాస రాస్తే కోదండపాణి చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు.
"నీ అదృష్టం యాభై లక్షలు వెచ్చించిన నా మనసులో యిప్పుడేమనుకుంటున్నానో చెప్పగలవా?" ఇది నాగరాజు ప్రశ్న.
"యాభై లక్షలు నాకు చేరడం మీ అదృష్టం. డబ్బు తృణీకరించే వారినే చేరుతుందనడానికిదే నిదర్శనం. అయితే యిప్పుడు మీ మనసులో ఈ ఆలోచనలు లేవు. ఉన్నవి చెబుదామంటే పక్కనే సురేంద్రరావు గారుండి చూస్తున్నారు" ఇది హాస వ్రాసిన జవాబు. సురేంద్రరావు ఆమె హాస్య ప్రియత్వానికి నవ్వుకున్నాడు.
"హాసా! ఇది నిజంగా నా ప్రశ్న! నేను నీకు నచ్చేనా? మన పెళ్ళి జరుగుతుందా?" ఇది గౌతమ్ ప్రశ్న.
"నా మనసు నా కంటే నీకు బాగా తెలుసు. మన పెళ్ళి జరగడమే కాదు అది యితిహాస కళ్యాణమవుతుంది" అని వ్రాసింది హాస.
రెండు గదుల్లోనూ ప్రేమికులిద్దరూ ప్రశ్నలు, జవాబులు వ్రాశారు. రెండు గదుల్లోంచీ బయటకు వచ్చిన రెండు కాగితాల్నీ కలిపి చూస్తే....విన్నవారికెలా ఉన్నా ఆ సమయంలో ఆ దృశ్యంలో పాలు పంచుకుంటున్న వారందరికీ అదొక అద్భుతానుభవం....
"ణీ బ్లడ్ కాన్సర్ రక్తంలా యిందులో కూడా ఏమైనా ట్రిక్కుందేమిటే" అంది పార్వతమ్మ ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుని.
"ట్రిక్కుంది, చాలా సింపుల్! స్వార్ధాన్ని పూర్తిగా వదిలిపెట్టి ణీ కిష్టమైన వారిని ప్రేమించు....అంతే!"
"మరైతే మీ తాత గారి మాటలు నా చెవుల్లో వినిపించవేమో....!" అంది పార్వతమ్మ అమాయకంగా.
అంతా నవ్వేశారు.
"అంటే నువ్వు తాతగారినీ, అమ్మ నాన్నగారినీ, మనదేశ నాయకులు ప్రజల్నీ నిస్వార్ధంగా ప్రేమించడం లేదనే అర్ధం. కాదంటావా బామ్మా!" అంటూ నవ్వింది హాస.
* * * *
ఆ తర్వాత కొద్ది రోజులకే ఓ శుభముహూర్తాన ఈ శతాబ్దానికే అద్భుతమనిపించే విధంగా గౌతమ్, హాసల వివాహం జరిగింది. భారతేతి హాసాన్ని మార్చగల కుమార సంభవాన్ని దృష్టిలో ఉంచుకుని సప్తర్షులు, దేవేంద్రుడు, త్రిమూర్తులు, గణనాయకులు, అవతార పురుషులు ఆ వివాహానికి వచ్చి దంపతులను దీవించి వెడితే ఆ వచ్చిన వారు నవ్వుల రాణి హాస వివాహానికి సరదాగా మారువేషాల్లో వచ్చిన ఆమె క్లాసుమేట్సని అంతా చెప్పుకున్నారు. అది నిజమే అయుండవచ్చు. కానీ ఆమె క్లాసుమేట్సు అలా రావడమే ఆ వివాహానికి సహజంగా ఉంది.
కుమార సంభవానికి, అటు పైన యితిహాసానికి చాలా వ్యవధి వుంది. కానీ యింతటితో యితిహాస కళ్యాణంగా భావించబడే యితి హాస కళ్యాణం సంపూర్ణం!
*** సమాప్తం ***