Previous Page Next Page 
సుహాసిని పేజి 52


    అతనింకా ఏదో అనబోతుండగా "మన కాటేజి, కాటేజి నెంబరు 76.... అందుకు ఎక్సెష్షన్సు" అంది ఆమె.


                           *    *    *    *


    కమాన్ మైడియర్!" అన్నాడు సురేంద్రరావు.

    ఆమె నవ్వుతూ కంబళి మీద కూర్చోగానే "భయంగా లేదుకదూ?" అన్నాడతడు మళ్ళీ.

    "మా నాన్నగారు నన్నిలాగే పిలుస్తారు, భయమెందుకు?"

    సురేంద్రరావు గతుక్కుమన్నప్పటికీ "ఆయన పిలుపులో అభిమానం, నా పిలుపులో కోరిక.... తేడా లేదూ!" అన్నాడు.

    "ఒకరి కోరిక మరొకర్ని భయపెట్టడం మనిషి విషయంలో జరగదని మా తాతగారనేవారు" అంది హాస.

    "మరెవరి విషయంలో అలా జరుగుతుందట?"

    "లేడిని చంపి తినాలని పులి కోరిక. అది లేడికి భయం కాదా?"

    "నువ్వు లేడివీ, నేను పులినీ అయితే ఏం చేస్తావు?"

    "ఇంగ్లీషులో నన్ను లేడీ అనే అంటారు. మిమ్మల్ని పులి అని ఏ భాషలో పిలుస్తారో నాకు తెలియదు. బహుశా అది రాక్షసుల భాష అయుంటుంది."

    సురేంద్రరావు ఈ మాటలు పట్టించుకోకుండా "భాషల సంగతి మనకెందుకు? నువ్వేం చేస్తావో చెప్పు...." అన్నాడు.

    "ఏం చేస్తాను? నవ్వుతూ చస్తాను. ఎందుకంటే ఏడ్వడం వల్ల చావు ఆగదు కదా!"

    "కానీ అది సాధ్యమా?"

    "ఎందుకు సాధ్యం కాదు? నా వంటి చుట్టూ బ్లడ్ కాన్సర్ నాగుపాములా చుట్టుకుని వుంది. నవ్వుతున్నానుగా...." అంటూండగా ఆమెకు దగ్గొచ్చింది. ఆమె గొంతుకు పైటకొంగు అడ్డం పెట్టుకుని ఉపశాంతి అయ్యేక వెళ్ళి నోరు కడుక్కుని వచ్చింది.

    సురేంద్రరావామెవంక విభ్రముడై చూస్తున్నాడు.

    "ఈ రోజు ఎర్రచీర కట్టుకుని వచ్చాను. ఇలా జరుగుతుందని తెలుసే అందామె.

    "హాసా! నిన్ను చూస్తుంటే నీ శరీరం ఇంకెన్నో రోజులు ఈ బాధకు తట్టుకోలేదనిపిస్తోంది" అన్నాడు సురేంద్రరావు.

    "బ్లడ్ కాన్సర్ నా గతం. మృత్యువు నా భవిష్యత్తు. ఈ రెండింటినీ తీసుకొచ్చి బంగారంలాంటి వర్తమానాన్నెందుకు పాడు చేస్తారు?" అంది హాస.

    "అయితే ఏం చేయమంటావు?"

    "ఉల్లాసంగా కబుర్లు చెప్పండి!"

    "నిజం చెబుతున్నాను నిన్ను చూస్తే కబుర్లాడాలనిపించడం లేదు. ముద్దులాడాలనిపిస్తోంది. కానీ జబ్బు తల్చుకుంటేనే నా వళ్ళు జలదరిస్తోంది."

    "నాకే జబ్బూ లేదనుకోండి...."

    "ఎలా లేదనుకోను?"

    "ఈ ప్రపంచంలో త్యాగంతో సాధించలేనిది లేదు. మీరో త్యాగం చేయగలిగితే నా జబ్బు లేదనుకోనవసరం లేదు. లేకుండానే పోతుంది" అంది హాస.

    "నిజంగా?"

    "నా జబ్బు తగ్గితే నన్ను తాకననండి...." అందీ హాస.

    సురేంద్రరావు తెల్లబోయాడు.

    "అనలేరు కదూ!" అంది ఆమె.

    అతడు మాట్లాడలేదు.

    "ఒక ఆడపిల్ల, కన్నెపిల్ల పంతొమ్మిదేళ్ళకే తన నూరేళ్ళూ నిండిపోయి ఈ లోకం నుంచి ఆ లోకానికి పోబోతూంటే ఒక చిన్న మాటతో ఆమెను ఆపాలనిపించడం లేదూ మీకు?" ఆమె గొంతులో తడి.

    "అంటాను హాసా! నాకు నువ్వు కాదు నువ్వు బ్రతకడం కావాలి" అన్నాడు సురేంద్రరావు.

    "నిజంగా?" అని నవ్వసాగింది ఆమె.

    "ప్లీజ్, నవ్వకు.... నీకు దగ్గొస్తుంది...."

    హాస నవ్వాపి- "మీ సెంటిమెంటు మీద దెబ్బతీసి మీలో మార్పు తెచ్చాను. హేట్సాఫ్ అనండి" అంది.

    "హేట్సాఫ్ టూ యూ!" అన్నాడు సురేంద్రరావు అప్రయత్నంగా.

    "నిజంగా అంటున్నారా, నేననమన్నానని అంటున్నారా?"

    అతడు సోఫా దిగి ఆమె వద్ద కూర్చుని "నిజం చెబుతున్నాను. ఇప్పుడు నిజంగా నీ వయసు పంతొమ్మిదనిపిస్తోంది...." అన్నాడు.

    "ఏం, ఇదివరకు ముసలమ్మలా ఉన్నానా?"

    "లేదు, ఆడపిల్లలా అనిపించావు."

    "అర్ధం కాలేదు నాకు!" అంది హాస.

    "నా వయసు ముప్పై ఎనిమిది. నిన్ను చూడగానే వయోభేదానికి బదులు వయసు చూడ్డం నా నీచత్వం" అన్నాడు సురేంద్రరావు.

    "ఇలా జరగడం ఇదే మొదటిసారా?" అంది ఆమె.

    "లేదు. నన్ను నేను సంస్కరించుకోవడం ఇదే మొదటిసారి!"

    ఆమె మాట్లాడలేదు.

    సురేంద్రరావు మాట్లాడ్డం ప్రారంభించాడు.

    అతడు జీవితంలో చాలా చెడ్డపనులు చేశాడు. ఆడదాన్ని విలాస వస్తువుగా చూశాడు.

    "అందుకు బాధ పడుతున్నారా?"

    "ఊఁ"

    "ప్లీజ్- గతాన్ని వర్తమానంలోకి తీసుకు రాకండి...."

    "ఎందుకని?"

    "గతం సరిచేసుకోలేనిది. భవిష్యత్తు ఊహల్లోనిది. మన ఆలోచనల నమలు చేసుకునే వర్తమానంలో గతాన్ని ప్రవేశపెట్టి సమయం వృధా చేయకండి...."

    "యూ ఆర్ కరెక్ట్! కానీ తల్లీ అనో, చెల్లీ అనో పిలవాల్సిన నిన్ను విలాస వస్తువుగా ఎలా ఊహించగలిగానో..... ఛీ! నామీద నాకే అసహ్యం పుడుతోంది."

    "గతం మరిచిపోండి. ఈ వర్తమానాన్ని గతంగా మార్చకండి. అప్పుడు భవిష్యత్తు నిండా ఈ వర్తమానమే నిండి వుంటుంది" అంది హాస.

    సురేంద్రరావు మాట్లాడలేదు.

    "రాజకీయాల్లో మీకు మంచి భవిష్యత్తుంది. అందుకే మీరు నన్ను గౌరవించాల్సిన రీతిలో గౌరవిస్తున్నారు.

    "రాజకీయ ప్రగతి కోసం కాదు. మనస్పూర్తిగా చెబుతున్నాను. నీవొక అద్భుత యువతివి. నిజంగానే మన దేశ భవిష్యత్తుకీ నీకూ ఏదో సంబంధముంది...." అని "నన్ను మార్చాలని మా అమ్మ ప్రయత్నించింది. నా భార్య ప్రయత్నించింది. ఒక అక్క, ఒక చెల్లి ప్రయత్నించారు. కానీ ఈ రోజు నీ చేతుల్లో నేను మారాను. నువ్వు రోజూ ఇలాగే నా దగ్గరకు వస్తూండు. మనం స్నేహితుల్లా మాట్లాడుకుందాం" అన్నాడు సురేంద్రరావు.


                                                                                    33


    ఆ రోజు సర్వభాషానంద స్వామి ఆశ్రమంలో పెద్ద హడావుడి!

    ఆశ్రమంలో చేరిన కొందరు నిజం రోగులని పరీక్షించడానికి అప్పుడప్పుడు వస్తూండే మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ఆ రోజు వచ్చింది.

    జూన్ అయిదో తేదీ ఆ రోజు!

    మొబైల్ టెస్టింగ్ వ్యాన్ లో అన్ని రకాల ఆధునిక పరికరాలూ వుంటాయి. కంప్యూటర్ల సాయంతో వెంట వెంటనే పరీక్షా ఫలితాలూ తెలుస్తాయి.

    హాస టెస్టింగ్ కు పంపబడింది.

    ఫలితం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నది గౌతమ్ ఒక్కడే కాదు, సురేంద్రరావు కూడా!

    ఒక యువతిలో ఆరోగ్యం కోరే మగాడు యువతికి ఆరోగ్యం కొరి ఆమెను వదులుకోవాలనుకున్నాడు. సురేంద్రరావు చరిత్రను బట్టి చూస్తే ఇది అపూర్వ త్యాగమే మరి!

    ఫలితాలు వచ్చాయి.

    డాక్టర్లు సర్వభాషానంద స్వామితో మాట్లాడుతున్నారు.

    కాసేపటికి స్వామి హాసను ఏకాంతంలోకి పిలిచారు.

    గౌతమ్ కి ఆత్రుతగా వుంది. సెకన్లు పది యుగాల్లా గడుస్తున్నాయి.

    కాలం నత్త నడక నడుస్తోంది.

    గదిలోపల స్వామి, హాస!

    గది బయట గౌతమ్, సురేంద్రరావు....

    చివరికి గది తలుపులు తెరుచుకున్నాయి.

    హాస ముఖం గంభీరంగా వుంది. ఆమె వెనుకే స్వామి వచ్చాడు.

    "ఏమయింది స్వామీ!" అన్నాడు సురేంద్రరావు.

    "అంతా దైవనిర్ణయం" అన్నాడు స్వామి.

    "దైవనిర్ణయం ఏమిటి స్వామీ!" అడిగాడు సురేంద్రరావు.

    "ఇక ఈమె యిక్కడుండడం వృధా! రేపే వెళ్ళిపోవచ్చు" అన్నాడు స్వామి.

    సురేంద్రరావు ఇంకా ఏమో అడగాలనుకున్నాడు. కానీ అప్పటికే హాస వారిని సమీపించి- "పదండి వెళదాం" అంది.


                            *    *    *    *


    కాటేజి నంబరు 76.

    హాస, సురేంద్రరావు, గౌతమ్.

    గౌతమ్, సురేంద్రరావు అదేపనిగా నవ్వుతున్నారు. మితిమీరిన విషాదమో, పట్టరాని సంతోషమో!

    హాస ముఖం ఇంకా గంభీరంగా ఉంది.

    "ప్లీజ్! ఆపండి" అందామె.

    వాళ్ళ నవ్వులు ఆగలేదు.

    "ప్లీజ్! ఆపుతారా, లేదా?"

 Previous Page Next Page