Previous Page Next Page 
షా పేజి 52

 

    "అదే ....ఆ కాప్యుల్స్ కి ఏదో ప్రాముక్యత వుండబట్టే అన్నయ్య వాటిని తెచ్చి రహస్య అరలో దాచాడు.......దానికోసమే అన్నయ్య హత్య చేయబడి వుండవచ్చు."
    "కానీ కాప్యుల్స్ లో అంత విశేషమేమి వుంటుంది?"
    "ఒకవేళ అదేమయినా ప్రభుత్వం బాన్ చేసిన మండులేమో! అది మార్కెటింగ్ చేస్తుంటే అన్నయ్య వాళ్ళను హెచ్చరించాడెమో"
    ఇద్దరూ చాలాసేపు అలోచిస్తుండిపోయారు.
    ఆలోచిస్తున్న కొద్దీ సృజన్ కి అంతా చాలా స్పష్టంగా తెలిసిపోతోంది.
    తను ఇదే ఆధారాల మీద జాగ్రత్తగా వర్క్ చేస్తే అన్నయ్యను చంపినవాడిని కనుక్కోటానికి అవకాశం వుంటుంది.
    ఆ కాప్యుల్స్ మీద కంపెని పేరు చూశాడతను.
    వాటిమీద కూడా ఈశ్వర్ ఫార్మాన్యుటికల్స్ అని వుంది.
    అంటే వాటిని రెండు సైజుల్లో వాళ్ళు తయారు చేస్తున్నారన్నమాట. అంటే దాని మీద "బాన్" వుండటం వల్ల వాళ్ళు ఎత్తుకుపోయరనేది అర్ధం లేని వాదం. "బాన్" వుంటే ఆ చిన్నవి కూడా అమ్మటానికి వీల్లేదు.
    కనుక అసలు కారణం అది కాదు. ఇంకేదో వుంది. ఏమిటది?
    భారతి కూడా ఆలోచిస్తూనే వుంది గాని ఆమెకూ ఏమీ తట్టటం లేదు.
    "పోనీ ఓ పని చేస్తే?" హటాత్తుగా అడిగిందామె.
    "ఏమిటది?"
    "రేపు ఏదయినా మెడికల్ షాపులోకెళ్ళి ఈ డాక్సీ సైక్లిన్ పెద్ద సైజ్ కాప్యుల్స్ ఇమ్మంటే యిస్తారేమో చూద్దాం"
    "అలా యిస్తారని నేననుకోను. నా ఉద్దేశ్యం ఏమిటంటే వాటిల్లో ఏదో మనకు తెలీని రహస్యం ఉంది. అందుకని మనకా రహస్యం తెలీకూడదని దానిని దొంగిలించుకు పోయారు."
    "కానీ మీ దగ్గర ఆ కాప్యుల్స్ ఉన్నట్లు వాళ్ళకెలా తెలిసిందసలు" అడిగిందామె.
    సృజన్ ఉక్కిరిబిక్కిరయ్యాడు ఆ ప్రశ్నకు.
    అవును! తనకా విషయం తట్టనే లేదు. ఆ స్ట్రిప్ తన దగ్గరున్నట్లు ఎలా తెలిసింది వాళ్ళకు - తనేవరికి చెప్పనేలేదే.
    టక్కున గుర్తుకొచ్చిందతనికి.
    వాటి విషయం నిన్నే తను యస్పీ కి చెప్పాడు.
    అంతే అతనికి తప్పితే ఇంకెవరికీ చెప్పలేదు.
    అంటే------
    అతనికి అంతా అయోమయంగా కనబడుతోంది మళ్ళీ.
    "భారతీ! కొద్ది క్షణాల తర్వాత పిలిచాడతను.
    "ఊ" అతని వేపు చూసిందామె.
    "నా దగ్గర ఆ స్ట్రిప్ వుందన్న విషయం నిన్నే యస్పీకి చెప్పాను."
    "యస్పీకా-"
    "అవును! అది నాకెక్కడా దొరికింది అని కూడా అడిగారాయన. నేను అదెలా సంపాదించానో చెప్పేసరికి తన డిపార్టమెంట్ మీద విసుక్కున్నారు కూడా."
    "ఇంకెవరికీ చెప్పలేదా-"
    "ఊహు" ఎవరికీ చెప్పదల్చుకోలేదు కూడా! ఆఖరి వరకూ ఆ 'క్లూ' ని రహస్యంగానే వుంచాలనుకున్నాను. కానీ అంతా పాడయిపోయిందిప్పుడు" విచారంగా అన్నాడతను.
    "అయినా రేపు బయట మెడికల్ షాపులో దానికోసం ప్రయత్నిస్తే కొంత ఇన్ ఫర్మేషన్ మనకి రోరకొచ్చు" సలహా యిచ్చిందామె.
    "అవును రేపు చేయాల్సిన కార్యక్రమం అదే - అంతేకాదు రేపట్నుంచి ఎలాగయినా ఆ ఒరిజినల్ కాప్యుల్స్ ఎలాగయినా మళ్ళీ సంపాదించే ప్రయత్నం చేయాలి. అది మన దగ్గర ఉంటేనే గానీ మనం దాని అంతేమిటో తెలీదు."
    "ఇంక పడుకోండి , ఉదయం లేచి ఆలోచిద్దాం" అందామె.
    సృజన్ ఆమె దగ్గరగా నడిచి , కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
    "భారతీ! మృదువుగా పిలిచాడు.
    "ఊ......"
    "నా వల్ల మీకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయ్ కదూ?"
    "కావలసిన వారికోసం పడే ఇబ్బందులు యిబ్బండుల్లా కనిపించవ్" చిరునవ్వుతో అందామె.
    "థాంక్యు భారతీ! ఇప్పటికి అనుకోకుండా అన్నయ్య హత్య గురించి నేను వెతకాల్సిన కరెక్ట్ మార్గం దొరికింది. కనుక రేపట్నుంచి విఝుంభిస్తాను చూడండి!"
    ఆమె అతని చేతిని తన పెదాలకు హత్తుకుంది.
    "కానీ మరీ రిస్క్ తీసుకోకండి! మీకోసం నేను వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటానన్న విషయం మర్చిపోకండి."
    అతను చలించిపోయాడు.
    "ఆ విషయం అంత తేలిగ్గా ఎలా మర్చిపోతానండీ! నాకీ రోజు జీవితం మీద కొంత ఆసక్తి కలిగిందంటే యిదంతా కేవలం మీవల్లే కదా----"
    ఆమె తన చేయి విడిపించుకుని చాప మీద పడుకుంది.
    సృజన్ పక్క గదిలోకొచ్చి పిల్లల దగ్గర పడుకున్నాడు.
    బాగా తెల్లారే వరకు యిద్దరకూ మెలకువ రాలేదు ---ఇద్దరినీ ఎనిమిది గంటలకు, సీతా, శంకూ నిద్ర లేపాల్సి వచ్చింది. త్వరత్వరగా లేచి కాఫీ తాయారు చేసి ఇద్దరినీ స్కూలు కి తయారు చేసింది భారతి.
    వాళ్ళు వెళ్ళిపోయాక తనూ ఆఫీస్ కి తయారయిందామె.
    ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయల్దేరారు. బస్ స్టాప్ లో ఆమెను బస్ ఎక్కించి తను ఎదురుగ్గా వున్న మెడికల్ షాప్ లోకి నడిచాడతను.

 Previous Page Next Page