"ఏం కావాల్సార్ ?" అడిగాడు షాపతను.
"డాక్సీ సైక్లిన్ విత్ విటమిన్ "సి" -- కావాలి. ఈశ్వర్ ఫార్మానుటికల్స్ కంపెనీ-"
ఆతను "అల్మారా లోంచి ఏదో కాప్యుల్స్ తీయబోయినవాడల్లా ఆగిపోయి వెనక్కు తిరిగివచ్చాడు.
"అవి దోకవు సార్ ! వేరే కంపెనీవి కావాలంటే ఇస్తాము"
"నాకవే కావాలి?"
"ఏదయినా ఒకటే గద్సార్ ! కంపెనీయే కదా వేరు?"
"ఏమో......మా డాక్టర్ అదే వాడమని చెప్పాడు........" చెప్పేసి అక్కడి నుంచి తిరిగి వచ్చేశాడు.
బస్ లో మెయిన్ మార్కెట్ ఏరియా చేరుకున్నాడతను. వరుసగా నాలుగు పెద్ద మెడికల్ షాపులు ఒకేచోట కనిపించాయతనికి.
నాలుగింట్లోనూ ఈశ్వర్ ఫార్మానుటికల్స్ మందులు సాధారణంగా తమకు సప్లయ్ చేయరని చెప్పారు వాళ్ళు...సృజన్ కి అది ఆశ్చర్యం కలిగించింది.
వాళ్ళ మందులు అన్ని మెడికల్ షాప్స్ లోనూ సప్లయి చేయకపోతే ఇంకేం చేస్తున్నట్లు వాళ్ళు.
"మేము చెప్పినమాట వినండి సార్! ఇంకో కంపెనీ వాడండీ! మీకేం ప్రాబ్లెమ్ ఉండదు......." నచ్చజెప్పటానికి ప్రయత్నించారు షాపతను.
"సారీ! డాక్టర్ అదే తీసుకోమన్నాడు. "వచ్చేస్తూ అన్నాడతను.
అయితే ఓ పని చేయండి! జగదాంబ సెంటర్ లో ఈశ్వర్ ఫార్మానుటికల్స్ వాళ్ళ కంపెనీ సేల్స్ మెడికల్ రూమ్ ఉంది అక్కడ ట్రై చేయండి."
సృజన్ ఆశ్చర్యపోయాడు.
"కంపెనీ వాళ్ళ మెడికల్ షాప్ ఉందా?"
"అవునండీ! మన రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన నగరాలల్లోనూ వాళ్లకు మెడికల్ శాపులున్నాయి. అందుకే సాధారణంగా వాళ్ళు తయారుచేసే మందులన్నీ అక్కడే స్టాక్ పెడుతూంటారు."
సృజన్ మనసులో ఆలోచనలు కమ్ముకున్నాయ్.
ఈ వార్త సరికొత్త మార్గం వేపు మళ్లిస్తోంది. తనను....తప్పకుండా తను ఆ రహస్యానికి చాలా చేరువగా వెళుతున్నాడు.
"థాంక్యూ సర్" అనేసి వడివడిగా నడిచి ఖాళీగా ఉన్నా అటో ఎక్కాడు.
"జగదాంబ సెంటర్" అన్నాడు డ్రైవర్ తో. అటో బయలుదేరింది.
"ఈశ్వర్ మెడికల్స్" మెయిన్ రోడ్ మీదే ఉంది. అయితే దాని మీదున్న బోర్డు ని బట్టి తప్ప లోపలకు వెళ్లి చూస్తే మాత్రం అది మెడికల్ షాప్ లా కనిపించదు.......చాలా పెద్ద హల్లో చాలా కొద్ది గ్లాస్ షెల్ఫ్ లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో కేవలం "ఈశ్వర్ వర్మా" వాళ్ళు తయారు చేసే మందులు మాత్రమే ఉన్నాయ్. ఏవేవో టానిక్ లు, టాబ్ లేట్లూ, కాప్యుల్స్ - ఓ మూలగా హోటల్ కాష్ కౌంటర్ లాగా ఉన్న కౌంటర్ దగ్గర ఓ సన్నటి వ్యక్తీ కుర్చుని ఉన్నాడు. అతడిని చూస్తేనే ఏదో ఓ విధమైన అనుమానం కలుగుతుంది ఎవరికయినా.
పొడుగాటి ముఖం, నిద్రపోవడానికి సిద్దంగా ఉన్నట్లున్న కనురెప్పలు, డ్రాకులా లాంటి పళ్ళు - కౌంటర్ దగ్గరకు వెళ్ళాక సృజన్ కి లోపలిగదిలో కొంత భాగం కనిపించింది.బలిష్టమైన వ్యక్తీ ఒకడు ఒక పెద్ద గన్ బుల్లెట్స్ తో కూర్చుని వున్నాడు లోపల.
అతనిని చూస్తూనే ఆశ్చర్యం కలిగింది సృజన్ కి.
సాధారణంగా అలాంటివాళ్ళు బాంక్స్ లోనూ, ఇతర ఫైనాన్సియల్ సంస్థలలోనూ ఉంటారు. మెడికల్ షాపు కి అలాంటి గార్డ్స్ ఉండటం తను మొదటిసారిగా చూస్తున్నాడు.
సృజన్ ని చూడగానే అతను లేచి నిలబడ్డాడు.
సృజన్ అతనిని పట్టించుకోకుండా కౌంటర్ దగ్గిరున్న వ్యక్తీ వేపు తిరిగాడు. అప్పటికే అతను సృజన్ వేపు అనుమానంగా చూస్తున్నాడు.
"ఏం కావాలి ?' అడిగాడతను.
"దాక్సీ సైక్లిన్ కాప్యుల్స్ కావాలి.....విత్ విటమిన్ సి......."
అతను కొద్ది క్షణాలు సృజన్ వేపే చూశాడు నిశ్చలంగా.
సృజన్ కి ఖచ్చితంగా రుజువాయిపోయింది.
అతను తనను స్టడీ చేస్తున్నాడు.
"డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏది?
"తేలేదు. ఇంటిదగ్గర వుంది. రోజూ ఆ కాప్యుల్స్ తీసుకొంటూనే ఉన్నాము. ఇవాళ అయిపోయాయ్."
"అయినా సరే - ప్రిస్క్రిప్షన్ తేవాలి"
"ప్లీజ్ - చాలా అవసరం."
"ఇవ్వరు. టైమ్ వేస్టు చేయకుండా వెళ్ళు."
సృజన్ కి స్పష్టంగా తెలిసిపోతోంది.
మెడికల్ షాప్ వాళ్ళందరూ తమ షాపులోని స్టాక్ ఎలాగోలా అమ్ముకోవాలని చూస్తారు. ఒకవేళ పేషెంట్ తెచ్చిన ప్రిస్క్రిప్షన్ లోని మందులు లేకపోతే వాటికి సరితూగే మరో కంపెనీ మందు ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. అంతేగానీ ఇలా బలవంతంగా గెంటేయ్యరు. అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడిగేవాళ్ళు చాలా తక్కువ--చాలా తక్కువ డ్రగ్స్ కి అడుగుతారది.
"పోనీ మీరు కాప్యుల్స్ ఇవ్వండి. వందరూపాయలు మీ దగ్గిర డిపాజిట్ గా పెడతాను. సాయంత్రం ప్రిస్క్రిప్షన్ తెచ్చిస్తాను."
"ఇక్కడివ్వరని చెప్పాను కదా! ఇంకోచోట ప్రయత్నించు! వెళ్ళు."
సృజన్ వెనక్కు తిరిగాడు.
అంతకంటే చేయగలిగిందేమీ కనిపించలేదు.
బయటకు నడిచాడు. అర్జంటుగా ఎవర్నయినా డాక్టర్ ని పట్టుకుని ఓ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. రోడ్ మీదపడి వడివడిగా నడవసాగాడతను. డాక్టర్ బోర్డు కోసం వెతుకుతూ-


