Previous Page Next Page 
షా పేజి 51

 

    జరిగినదంతా చెప్పాడు అతను. చాలాసేపు ఇద్దరూ ఆలోచనల్లో మునిగిపోయారు. భోజనం ముగించి బయట వరండాలో కొచ్చి కూర్చున్నారు.
    "మీకేమనిపిస్తోంది?" అడిగాడు సృజన్.    
    "వాళ్ళు అబద్దం చెప్తున్నారేమోననిపిస్తోంది." తడుముకోకుండా చెప్పిందామె.
    "ఎందుకని?"
    "ఆ కాప్యుల్స్ స్ట్రిప్, ఆ హోటల్లో వాళ్ళు చెప్పుకున్న మాటలను బట్టీ---"
    "అదే నేనూ అనుకుంటున్నాను. ఇప్పుడింకేం చేయగలమో తెలీటం లేదు-------"
    ఇద్దరూ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటే రాత్రి పన్నెండయి పోయింది టైమ్.
    "ఇంక పడుకుందాం పదండి! ఉదయం ఆలోచించుకోవచ్చు" అంది భారతి లోపలకు నడుస్తూ.
    తనూ లోపలకు నడిచాడు అతను.
    "మీరూ పిల్లలూ గదిలో పడుకోండి! నేనా గదిలో పడుకుంటాను" అందామె.
    "సరే, మీరెలా చెప్తే అలా"
    పిల్లలిద్దరూ అప్పటికే పరుపు మీద పడుకొని గాడ నిద్రలో కెళ్ళిపోయారు.
    భారతి పక్క గదిలో కెళ్ళి చాప మీద పడుకుంది.
    అతనికి వెంటనే నిద్ర పట్టేసింది.
    తలుపు భళ్ళున తెరుచుకున్న చప్పుడు వినిపించి చటుక్కున మెలకువ వచ్చిందతనికి. లేచి కూర్చుని తలుపు వేపు చూశాడు. ఎవరో పరుగెడుతున్న చప్పుడు ఒక్క ఉదుటున లేచి తలుపు దగ్గరకు పరుగెత్తి లైట్ స్విచ్ వేసి చూశాడు. అప్పటికే వాళ్ళు పరిగెడుతున్న శబ్దం వినిపించకుండా పోయింది.
    లోపలి గదిలో నుంచి ఎవరో గిలగిల కొట్టుకుంటున్న శబ్దం వినిపించింది భారతి గదిలోకి పరుగెత్తాడతను. అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడయాడతను.
    భారతి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు వెనకకు విరిచి కట్టి వేయబడి ఉన్నాయి. త్వరత్వరగా తాడు విప్పి ఆమె నోట్లో ని గుడ్డలు లాగివేశాడతను.
    ఆమె ఆయాసంతో ఒగరుస్తూ లేచి కూర్చుంది.
    "భారతీ! ఏమిటది? ఏం జరిగింది?" గాబరాగా అడిగాడతను.
    ఆమె మాట్లాదలేకపోతోంది. గొంతు పెగాలటం లేదు. ఎంత ప్రయత్నించినా? పరుగుతో లోపలి కెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చిచ్చాడు.
    మంచినీళ్ళు తాగాక కొంచెం స్తిమితం చిక్కిందామెకి.
    "వాళ్ళెవరో యిద్దరు మీ సూట్ కేస్ వెతుకుతుంటే మెలకువ వచ్చింది నాకు. వాళ్ళను చూస్తూనే భయపదిపోయాను. అలాగే కళ్ళు మూసుకుని పడుకుండి పోదామనుకున్నాను గానీ అప్పటికే ఆలస్యమయిపోయింది. వాళ్ళల్లో ఒకడు నన్ను చూసాడు. ఇద్దరూ ఒక్కసారిగా నా మీద పడి గొంతు నొక్కేశారు ---పైకి అరవకుండా! తర్వాత ఒకరు తాడు, టవలూ తీసుకొచ్చి నోట్లో కుక్కి కట్టేశారు వాళ్ళు."
    సృజన్ ఆశ్చర్యంగా తలెత్తి ఆమె పక్కనే ఖాళీగా పడివున్న తన సూట్ కేసూ, చెల్లాచెదురుగా పడి వున్న బట్టలూ, ఆ పక్కనే కుప్పగా పడి వున్న భారతి చీరలూ చూశాడు. అతనికేమీ అర్ధం కావడం లేదు.
    తన బట్టలన్నీ మళ్ళీ సూట్ కేసులో వేశాడు. తమ సూట్ కేస్ లో జాగ్రత్తగా దాచిన న్యూస్ పేపర్, కాప్యుల్స్ ఉన్న ప్లాస్టిక్ స్ట్రిప్ రెండూ కనిపించకపోయేసరికి అతనికి ఆశ్చర్యం కలిగింది. గదంతా హడావుడిగా వెతికాడు. భారతి బట్టలు కూడా ఆమె సూట్ కేస్ లో సర్దుతూ వెతికాడు గానీ అవి మాత్రం కనిపించడం లేదు.
    "ఏమిటి వెతుకుతున్నారు?" అడిగిందామె.
    "న్యూస్ పేపరూ, ఆ కాప్యుల్స్ స్ట్రిప్ కనిపించడం లేదు" అన్నాడు ఆలోచిస్తూ.
    "అదిగో ఆ కాప్యుల్స్ స్ట్రిప్ ఆ మూల శంకు వాళ్ళ బట్టల్లో నుంచి కనబడుతోంది చూడండి" అంటూ చూపించిందామె.
    ఆత్రుతగా వెళ్ళి అది తీసుకుని చూసాడతను.    చూడగానే తేడా తెలిసిపోయిందతనికి.
    అది కూడా డాక్సీ సైక్లిన్ విత్ విటమిన్ సి" యే గానీ అది మాత్రం తను ఒరిజినల్ గా చూసిన స్ట్రిప్ కాదు ......చాలా చిన్న సైజు కాప్యుల్స్! తను చూసిన కాప్యుల్స్ సైజులో సగానికి సగం ఉంటాయ్.
    "భారతీ! చాలా పెద్ద తమాషా జరిగింది" అంటూ ఆ స్ట్రిప్ తీసుకెళ్ళి ఆమెకు చూపించాడతను.
    "ఇది చూడు! అచ్చం మనం దాచిన స్ట్రిప్ లాగానే వుంది గానీ అది కాదు.....యిది యింకో సైజు.......చూశావా ఎంత చిన్నగా ఉన్నాయో------"
    భారతి తీసుకుని పరీక్షగా చూసింది.
    "అవును. వాటిని ఎత్తుకుపోతూ వాటి స్థానంలో యిది పడేసి ఉంటారు" అందామె.
    "ఎందుకలా చేసి వుంటారు?" అడిగాడతను.
    "అదే తెలీటం లేదు......."
    "అంటే కేవలం దీని కోసమే వాళ్ళు దొంగతనానికి వచ్చి ఉంటారు అవునా?"
    "కరెక్ట్! దీనికోసం కాకపోయినట్లయితే ఆ సూట్ కేస్ లు అన్నీ ఎత్తుకు పోయి ఉండేవాళ్ళు--"
    ఆ కాప్యుల్స్ వల్ల వాళ్ళకేమిటి లాభం?"
    "ఏదో వుందనే తెలుస్తుంది. అంతేకాదు-----అన్నయ్య హత్యకు సంబంధించిన కారణం కూడా దీనికే ముడిపడి వుందేమో?"
    భారతి ఉలిక్కిపడింది.
    "అంటే?"

 Previous Page Next Page