"ఒకసారి ఈ ఆశ్రమంలో అడుగు పెట్టాక బయట పడడం ఈ దేశపు ప్రధానమంత్రి క్కూడా సాధ్యం కాదు...." అన్నాడు సురేంద్రరావు....
"అంటే మీరూ ఇక్కడ బందీ లేనా?"
స్వాతి అనుమతి లేకుంటే నేనూ ఇక్కణ్నించి వెళ్ళలేను కానీ స్వామికి నావల్ల ప్రయోజనముంది. ఆయన అనుమతిస్తాడు.... నీవల్ల కూడా ప్రయోజనముంది. అందుకే అనుమతించడు...." అని నవ్వాడు సురేంద్రరావు.
"హాస అతడి మాటలు మననం చేసుకునేసరికి గుండె జలదరించింది...."
"భయపడకు నీకు నేనున్నాను...." అన్నాడు సురేంద్రరావు మళ్ళీ....
"నా జీవితం ఏ మలుపు తిరిగినా అది అదృష్టానికే దారితీస్తుంది. నాకు భయమెందుకు? మిమ్మల్నెలా సేవించుకోవాలో చెప్పండి" అంది హాస.
ఆమె కళ్ళలోని నమ్మకాన్ని చూసి సురేంద్రరావు ఆశ్చర్యపడ్డాడు! "అందమైన అమ్మాయీ? నిన్ను సేవించుకునేందుకు అనుమతినివ్వు. అదే నీవు నాకు చేయగలిగిన సేవ...." అన్నాడతడు.
"మీ యిష్టం!" అందామె.
అతడు సోఫాదిగి ఆమె దగ్గరగా కూర్చుని పాదాలు పట్టుకున్నాడు.
హాస చప్పున పాదాలు వెనక్కు లాక్కుని "తప్పు, మీరు పెద్దలు" అంది.
"రాజకీయాల్లో ఉన్నవాడ్ని. నాకంటే చిన్నవాళ్ళ పాదాలు పట్టుకోవడం నాకు కొత్త కాదు. అందులో అవకాశముంది కానీ నీ పాదాలు పట్టుకోవడంలో ఆనందం కనబడుతోంది. ప్లీజ్....నన్ను సేవించుకోనీ...." అంటూ మళ్ళీ ఆమె పాదాలు పట్టుకున్నాడు సురేంద్రరావు.
ఈ సారి హాస పాదాలు వెనక్కు లాక్కోకుండా "రాజకీయవాదులు పాదాలు దాటి పైకి రారని మా తాతగారనేవారు. అందుకే నాకు మీరంటే భయం పుట్టడం లేదు" అని నవ్వింది.
సురేంద్రరావామె పాదాలు వదిలిపెట్టి, "యూ ఆర్ సింప్లీ వండ్రఫుల్! ఐ లవ్ యూ" అన్నాడు.
"ఇద్దరు మనుషులు కలిసి సుఖంగా ఉండాలంటే వారి మధ్య ప్రేమ ఉండాలి. ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ ఉండాలంటే అందుకు అవగాహన అవసరం. అది మనమధ్య లేదు. కానీ ప్రయత్నిస్తే కుదరకపోదు" అంది హాస.
ఆమె మాటలు సురేంద్రకు నచ్చాయి. "పిల్లకు అందంతో పాటు తెలివికూడా ఉంది" అనుకున్నాడు. ఆమె వద్ద అతడు తొందర పడదల్చుకోలేదు.
"ఎలా ప్రయత్నించాలో నువ్వే చెప్పు" అన్నాడతడు.
"ముందు మీ గురించి మీరు చెప్పండి. తర్వాత నా గురించి నేను చెప్తాను." అంది హాస.
సురేంద్ర రాజకీయాల్లో తనకున్న ప్రాముఖ్యతనూ, తను సాధించిన విశేషాలనూ చెప్పాడు. దేశ రాజకీయాల్లో బాగా ఎత్తుకు ఎదగాలనున్న తన అభిలాష కూడా చెప్పాడు.
ఆమె అంతా విని, "మీరు చాలా గొప్పవారు. నా జన్మ ధన్యమైంది. ఇక మీ జన్మ ధన్యం చేయడానికి నా గొప్పతనం గురించి చెప్పాలి...." అంది.
ఆమె మాట్లాడే పద్ధతి సురేంద్రరావుకి కొత్తగా వుంది.
"మా తాత గారు నా జాతకం చూసి నా పెళ్ళి ఈ దేశ చరిత్రలోనే మార్పు తెస్తుందన్నారు. నేను చాలా గొప్పదాన్ననీ, దేవకాంశ ఉన్నదాన్ననీ చెప్పారు. అది తెలిసి పదహారేళ్ళ వయసునించే ఎందరో నన్ను పెళ్ళాడాలని వచ్చారు. కొన్ని సంబంధాలకు మా వాళ్ళూ ఇష్టపడ్డారు. కానీ ఏదో మాయచేసినట్లు అన్నీ చెడిపోతూండేవి. ఎవడైనా నా దుష్టబుద్ధితో నా చేయి పట్టుకుంటే వాడి చేతికేదో ప్రమాదం జరిగేది...."
అప్రయత్నంగా సురేంద్రరావు తన చేయి చూసుకుంటే హాస మందహాసం చేసి మళ్ళీ కొనసాగించింది.
"మా ఎదురింటి కుర్రాడొకడు ఫస్ట్ క్లాసు స్టూడెంటు. పరీక్షకి వెడుతూ వెడుతూ ఏం బుద్ధిపుట్టిందో నన్ను చూసి కన్ను కొట్టాడు. పరీక్ష హాల్లో స్పృహతప్పి పడిపోయాడు. హైటెంపరేచరని వారం రోజులు హాస్పిటల్ బెడ్ మీదున్నాడు. ప్రిపరేషనంతా వృధా! మా పక్కింటి కుర్రాడు "చెల్లాయ్ నా పరీక్షకు శకునం రామ్మా!" అన్నాడు. వెళ్ళాను. థర్డు క్లాసు కుర్రాడు కంప్యూటర్ మిస్టేక్ వల్ల ఫస్ట్ క్లాసులో ప్యాసైపోయాడు. అందుకే నేనంటే తెలిసిన వాళ్ళందరికీ మహా సెంటిమెంటు. మావాళ్ళ స్నేహితుల్లో రాజకీయవాదులందరికీ నా శకునం మీద పెద్దగురి. ఇంకా చెప్పాలంటే మా స్కూల్లో నా కారణంగా తిరుపతి దేవుడి గిరాకీ బాగా తగ్గిపోయింది."
ఆమె ఆగి ఊపిరి పీల్చుకుంది.
సురేంద్రరావు శ్రద్ధగా వింటున్నాడు. ఇప్పుడతడ్ని ఆమె అందం కంటే మాటలే ఎక్కువ ఆకర్షిస్తున్నాయి.
ఆమె మాటలు అమాయకంగానూ, నిజమేననిపిస్తూ ఉన్నాయి. కానీ ఆమె తెలివిగా నటిస్తోందేమోనన్న అనుమానం అతడిలో లేకపోలేదు.
"నువ్వు జోక్సు బాగా వేస్తావు...." అన్నాడతడు లౌక్యంగా.
"అయితే నా అద్భుత శక్తి గురించి మీరు తెలుసుకోక తప్పదు. సరిగ్గా తొమ్మిదిన్నరకు నన్ను తీసుకువెళ్ళడానికి నా స్నేహితుడు గౌతమ్ వస్తాడు. అతడు మీతో ఏమనాలనుకుంటున్నారో నాకు చెప్పండి. వచ్చీ రాగానే అతడు మీతో అవే మాటలంటాడు" అంది ఆమె.
ఇది సురేంద్రరావుకు సవాలుగా తోచింది. అతడు జేబులోంచి నోట్ బుక్ తీసి అందులో, "నేను రెండు మాసాల్లో అమెరికా వెడుతున్నాను. నాకు వీడ్కోలివ్వడానికి ఎయిర్ పోర్టుకు నువ్వూ, గౌతమ్ రావాలని నా కోరిక. ఇది తీరుస్తానని గౌతమ్ నాకు మాటివ్వాలి" అని వ్రాశాడు.
"ఇక్కడేమైనా మైక్రో ఫోన్సున్నాయేమో నాకు తెలియదు. అందుకే ఈ పుస్తకంలో రాశాను. ఇది చదువుకో" అన్నాడు సురేంద్రరావు.
హాస వివరాలు చదువుకుంది. "దీంతో మీకు నేనెవరో అవగాహన కావచ్చు" అంది నవ్వుతూ.
"నీ నవ్వు నీ ముఖానికీ, నీ ముఖం ఈ ప్రపంచానికీ ప్రత్యేకం! నువ్వో అద్భుతానివి" అన్నాడు సురేంద్రరావు.
"అందుకే దుర్మార్గులు కూడా నన్నేడిపించాలనుకోరు...."
సురేంద్రరావు తడబడ్డాడు.
"కానీ రాణి గంభీరాదేవి నన్ను నవ్వనివ్వదు" అంది హాస మళ్ళీ.
"రాణి గంభీరాదేవి ఎవరు?"
హాస తన కాలేజీ గురించి తన ధోరణిలో వివరిస్తూమ్తే అతడికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చింది.
"జీవితంలో ఇంతలా నవ్వలేదు" అన్నాడతడు కడుపు పట్టుకుంటూ.
"దేనికయినా సెన్సాఫ్ హ్యూమరుండాలి. మా కాలేజీ వివరాలు విని మా పెదనాన్నగారోకాయన ఎలా నవ్వారో తెలుసా....?" అని ముచ్చటగా మూడు సార్లు హ్హిహ్హిహ్హి అని ఊరుకున్నారు" అక్కడ హ్హిహ్హిహ్హి అనడంలో పలకమారి హాసకు దగ్గొచ్చింది. ఆ దగ్గోపట్టాన తగ్గలేదు. దగ్గలేక ఉక్కిరి బిక్కిరైపోతూ ఆమె పైటకొంగు అడ్డంగా పెట్టుకుంది నోటికి. ఒక్క నిమిషం స్థిమిత పడ్డాక పైట చెంగు అడ్డం తీస్తే అక్కడ ఎర్రటి గుండ్రటి మచ్చ!
ఆకాశం రంగు చీరమీద ఆ ఎర్రటి మచ్చ అస్తమయ సూర్యుడిలా కనపడుతోంది.
నోరు కడుక్కునేందుకు వెళ్ళింది ఆమె.
సురేంద్ర గుండె జలదరిస్తూనే ఉంది.
ఆమె తిరిగి వచ్చేస్అరికి అతడామె వంక భయం భయంగా చూశాడు.
"అలా చూస్తున్నారేమిటి? నాకిది మామూలే! ఇలాంటివి పట్టించుకోకండి. మీక్కూడా మంచి జోక్సు తెలిస్తే చెప్పండి. సరదాగా నవ్వుకుందాం...." అంది ఆమె.
"నేను నిన్ను నవ్వించను. భయమేస్తోంది...." అన్నాడు సురేంద్రరావు.
"భయపడకండి. నేను నవ్వడానికే పుట్టాను" అంది ఆమె.
కానీ సురేంద్రరావు మామూలు మనిషి కాలేకపోయాడు. అతడు భయం భయంగా చూస్తూ ఆమెతో మాట్లాడేడు.
సరిగ్గా తొమ్మిదిన్నరకు గౌతమ్ వచ్చాడు.
హాస ఆశ్చర్యంగా, "టైమెలాగడిచిందో తెలియనేలేదు. అప్పుడే తొమ్మిదిన్నరయిందా?" అంది.
గౌతమ్ గంభీరంగా సురేంద్రరావు వంక చూసి.... "మీ అందరి ఆశీర్వాద బలంతో హాస త్వరలోనే మామూలు మనిషవుతుందని నమ్ముతున్నాను. మీరు రెండు మాసాల్లో అమెరికా వెడుతున్నారు. మీకు వీడ్కోలివ్వడానికి ఎయిర్ పోర్టుకు నేను, హాస రావాలన్న మీ కోరిక తప్పక తీర్చగలమనే నమ్ముతున్నాను" అన్నాడు.
సురేంద్రరావు మ్రాన్పడిపోయాడు. రెండు మాసాల్లో అమెరికా వెడుతున్నాడన్నది అతడికి మాత్రమే తెలిసిన రహస్యం మని!
* * * *
మర్నాడు హాస బయలుదేరుతూంటే, "ఎనీ ఫియర్స్!" అన్నాడు గౌతమ్.
"మై జాయ్ న్యూ నో బౌండ్స్! వై ఫియర్స్!" అంది ఆమె.
"ఏమిటంత విశేషం?"
"నేను వెడుతున్న కాటేజి నంబర్ 76. అంటే ఏడూ ఆరూ. అంటే ఏడో తేదీ ఆరో నెల. అంటే జూన్ ఏడు...."
"ఓహ్....ఇది నాకు స్పురించనే లేదు.
"జూన్ ఏడుకీ నా అదృష్టానికీ విడిదీయరాని బ్రహ్మముడి ఏడో ఉంది" అంది ఆమె.
"అలాగే నమ్ముదాం. కానీ ఆశ్రమం గురించి సురేంద్రరావు అబద్ధం చెప్పలేదు. స్వామిని వ్యతిరేకించి ఇక్కడ్నించి బయటపడలేం మనం! ఇక్కడ ప్రతి కాటేజిలోనూ అవినీతికే ప్రోత్సాహం."