"ఏం సార్?"
"ఇతనిని లోపలకు తీసుకెళ్ళి శరత్ కుమార్ తో చెప్పు ---సహాయం చేయమని? అతనిక్కావలసిన ఇన్ ఫర్మేషన్ ఇస్తే అతను వెళ్ళిపోతాడు కదా."
"అలాగే సార్"
"ఇంకొక విషయం నూకరాజూ! ఇలా మంచీ చెడు తెలుసుకోకుండా అమాయకుల మీద నువ్ చేయి చేసుకోవటం నాకు నచ్చలేదు. ఇంకోసారి ఇలాంటిది జరక్కుండా చూసుకో."
"సరే సార్ ! తప్పయిపోయింది."
ఈశ్వర్ వర్మ కార్లో కూర్చున్నాడు.
"థాంక్యూ సార్" అన్నాడు సృజన్ కృతజ్ఞతతో.
అతడు అభయం ఇస్తున్నట్లు చేయి ఊపాడు. కారు వేగంగా వెళ్ళిపోయింది.
"పద లోపలకు" అన్నాడు నూకరాజు సృజన్ తో.
సృజన్ అతని వెనుకే నడిచాడు.
కళ్ళజోడు వ్యక్తీ ఇద్దరినీ చూసి కొంచెం కంగారు పడ్డాడు.
"ఏమయింది?" అడిగాడతను.
"దొరగారు చెప్తున్నారు - ఇతనికి హెల్ప్ చేయమని."
"రండి! కూర్చోండి" అన్నాడతను సృజన్ వేపు మర్యాదపూర్వకంగా చూస్తూ.
సృజన్ అతని పక్కనే కూర్చున్నాడు.
"ఏం కావాలి మీకు?" అడిగాడతను.
జరిగినదంతా చెప్పాడు సృజన్. అంతా సావకాశంగా విన్నాడు.
"మీ అన్నయ్య ఈశ్వర్ ఫార్మాన్యుటికల్స్ లో ఉద్యోగం చేశాడా లేదా అనేది ముందు తెలుసుకోవాలి! అంతేకదా?" అడిగాడతను.
"అవును"
అతను వెంటనే ఫోన్ తీసుకుని రింగ్ చేశాడు. అవతలి వేపు ఎవరో ఫోన్ ఎత్తారు.
"హలో! నేను శరత్ ని మాట్లాడుతున్నాను."
"నమస్తే! ఆఫీస్ నుంచేనా?"
"యస్! యస్! బాస్ కి అర్జెంటుగా ఓ ఇన్ ఫర్మేషన్ కావాలట"
"ఏమిటది?"
"శ్రీధర్ అనే అతను మన సేల్స్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఇంటర్ వ్యూ కొచ్చాడట----పది రోజుల క్రితం. ఒకసారి ఇంటర్ వ్యూ ఫైల్ చూసి అతను ఏ రోజు ఇంటర్వ్యు కొచ్చిందీ , ఇంటర్యు లో అతను సెలక్టయిందీ లేనిదీ, అన్నీ చెప్పండి------"
అయిదు నిమిషాల తర్వాత జవాబు వచ్చిందతనికి.
"ఆ పేరుతో ఎవరూ ఇంటర్ వ్యుకి రాలేదు."
"థాంక్ యూ" అంటూ ఫోన్ పెట్టేశాడు శరత్.
"ఇంటర్వ్యు కి ఎవరూ ---------- ఆ పేరు గలవాళ్ళు రాలేదని చెప్తున్నారు" అన్నాడు సృజన్ తో.
సృజన్ కేం చేయాలో తోచలేదు.
అది అసంభవం అనిపిస్తోంది. ఏ సంబంధమూ లేకుండా అన్నయ్య హోటల్ వైజాగ్ సీవ్యులో ఉండడు. అతని సూట్ కేస్ రహస్య అరలో ఆ కాప్యుల్స్ స్ట్రిప్ పెట్టుకోడు.
అతను లేచి నిలబడ్డాడు "థాంక్యు" అనేసి బయటకు నడిచాడు.
ఇల్లు చేరుకునే సరికి భారతి తో పాటు సీతా, శంకు కూడా అతని కోసమే ఎదురు చూస్తున్నారు.
"ఎక్కడి కెళ్ళావ్ బాబాయ్ -- ఇంతసేపూ."
"కొంచెం పని ఉందమ్మా? అందుకని ఆలస్యం అయిపొయింది. "మీరంతా భోజనం చేశారా?" అడిగాడతను.
"ఇందాకే చేశాం బాబాయ్! నువ్ వచ్చాకే తింటామని అన్నాం కానీ అంటీ వద్దంది."
"మీరెందుకు తినలేదు?" భారతిని అడిగాడు.
"ఇంకా అంత స్వార్ధపరురాలీని కాలేదులెండి! పదండీ భోజనం వడ్డిస్తాను."
"ఎక్కడిది ? కారియర్ తెచ్చారా? కారియర్ లేదుగా మనకు?"
"నేనుండగా ఇంకా హోటల్ భోజనం ఎందుకు? నేనే వండేశాను."
"మైగాడ్! మీకు అప్పుడే శ్రమ మొదలా?" నొచ్చుకుంటూ అడిగాడు.
"ఇందులో శ్రమేమీ లేదులెండి! పదండి" అంటూ లోపలకు నడిచిందామే. హాల్లోకి వస్తూనే లైట్ వెలుగులో అతనిని చూసి గాబరా పడిందామే.
"ఏమిటది? ఆ పెదాల మీద రక్తమేమిటి?" భయంగా అడిగింది.
"ఓ చిన్నసైజు యుద్ధం జరిగింది అవసరం మనది కదా ! అందుకని ఎడురుతిరక్కుండా బుద్దిమంతుడిలా దెబ్బలు తిన్నాను....."
"ఏమిటి బాబాయ్! పహిటింగయిందా?" ఆత్రుతగా వచ్చి అతనిని చూస్తూ అడిగారు సీతా, శంకూ.
"అవునమ్మా! విలన్స్ వచ్చి ఎటాక్ చేశారు."
"మరి నువ్ ఎదురు తిరిగి కొట్టలేదా బాబాయ్?"
"ఎలా కొట్టనురా! ఆ విలన్ గాడు ఇంత లావున ఇంత పొడుగున వున్నాడు కదా?"
"ఉంటే ఏమయింది బాబాయ్! చిరంజీవి సినిమాల్లో బోలెడు మందిని ఒకేసారి చావగొట్టడం లేదూ?"
"అది సినిమారా! బయట అలా చేస్తే మనల్ని పచ్చడి కింద కొడతారు........."
"ఛీ- పో బాబాయ్! అంతా వట్టిదే"
"ముందు మీరు వెళ్ళి పెదాలు కడుక్కుని రండి! నేను కాటన్ తో క్లీన్ చేస్తాను" అంది భారతి.
అతను బయటకు వెళ్ళి ముఖం కడుక్కుని లోపలికొచ్చాడు.
అతను వద్దంటున్నా వినిపించుకోకుండా భారతి అతని గాయాన్ని డేటాల్ తో క్లీన్ చేసింది. తర్వాత ఇద్దరికీ భోజనం వడ్డించిందామే.
"ఎక్కడున్నారు ఇంతసేపూ?" అడిగిందామె.