Previous Page Next Page 
సుహాసిని పేజి 50


    "అప్పుడే జబ్బు తగ్గిందని అనుకోకండి" అన్నాడు స్వామి.

    ఆయన చెప్పినప్రకారం హాస రోజూ ఆశ్రమంలోని వ్యక్తులకు సేవ చేయాలి. ఎవరికి సేవచేయాలో స్వామి నిర్ణయిస్తాడు. సేవ చేసే మనిషి మనసు నొప్పించకూడదామె. మానవ సేవయే మాధవ సేవయై ఆమెను కాపాడుతుంది.

    "మరి మందులేమీ ఇవ్వరా?" అన్నాడు గౌతం.

    "మూలికావైద్యం జరుగుతుంది. ప్రతిరోజూ నేను మీ కాటేజికి అయిదు స్టీలు డబ్బాలు పంపుతాను. అందులో ఒకదానిలో మాత్రం అసలయిన మందు వుంటుంది. ఈమె ఇంకా పది కాలాలపాటు బతకాలన్నది భాగవన్నిర్ణయమైతే అసలయిన డబ్బా తీసుకుంటుంది. సేవాధర్మంలో, ఉత్తమ ప్రవృత్తిలో తన ఔన్నత్యాన్ని నిరూపించుకుంటే ప్రతిరోజూ ఈమె సరయిన మందునే ఎన్నుకుంటుంది. అంతా దైవనిర్ణయం" అన్నాడు స్వామి.

    "అసలయిన మందును మీరే ఎన్నిక చేసివ్వలేరా స్వామీ!" అన్నాడు గౌతమ్.

    "ఇది భగవన్నిర్ణయంపై నెలకొల్పబడిన ఆశ్రమం. భక్తిమార్గ ప్రచారం దీని ఆశయం. నేనూ భగవత్స్యరూపుణ్ని. భగవన్నిర్ణయాన్ని నేను వ్యతిరేకించకూడదు. అమలు జరపాలి. ఇది ఆశ్రమ నియమం" అన్నాడు స్వామి.


                          *    *    *    *


    కాటేజిలో పెద్ద హాలు, పడకగది, వంటగది ఉన్నాయి. వంట చేయడానికి వేరే మనిషున్నాడు. గదులు నీటుగా మంచి హోటల్లోని మామూలు గదుల్లా వున్నాయి. మొత్తమంతా అదోరకమైన మధుర పరిమళంతో నిండి ఉంది.

    కాటేజి చుట్టూ చిన్న పూలతోట.

    ఎవరో మొత్తం ఆ ప్రాంతమంతా రోజూ శ్రద్ధగా మెయింటైన్ చేసి వెడుతున్నారు.

    హాస, గౌతమ్ ఎంతో ఉత్సాహంగా వున్నారు. వాళ్ళు పరిసరాలను బొత్తిగా పట్టించుకోవడం లేదు.

    "ఇదే నేను కోరుకున్న జీవితం" అంది హాస.

    "ఇదే అంటే?"

    "అయిన వాళ్ళెవరికీ తెలియని ప్రశాంత వాతావరణంలా ప్రేమించిన దేవతా పురుషుడితో ఏకాంతంగా...." ఆగింది హాస.

    "కానీ యివి నీ చివరి రోజులు...."

    "ఆ విషయం గుర్తు చేయకు. ఉన్న సమయాన్ని అది గుర్తుచేసుకోవడంలో వృధా చేసుకుంటామా?" అంది హాస.

    "అయితే ఏం చేద్దాం?"

    హాస నవ్వింది.

    గౌతమ్ ముగ్ధుడయి ఆమె నవ్వు చూస్తూండి పోయాడు.

    "నేను నవ్వుకుంటాను. నువ్వు చూస్తూండు. అదే మనం చేసేది! అంది హాస.

    "అయితే నీ నవ్వు ఆపకు...." అన్నాడు గౌతమ్.

    "గౌతమ్! నా జీవితంలో ఇలాంటి రోజుంటుందని నేనుకోలేదు. నవ్వుతూ పుట్టాను, నవ్వుతూ పెరిగాను, నవ్వుతూ బ్రతకాలనుకున్నాను. నాలో విప్లవ భావాలు లేవు. విపరీతమైన కోర్కెలు లేవు. నా చుట్టూ ఉన్నవాళ్ళను తృప్తిపరుస్తూ సామాన్యంగా జీవితం వెళ్ళబుచ్చేయాలనుకున్నాను. కానీ నాకు పదహారేళ్ళ వయసొచ్చేసరికి ఎవరో అసాధారణ పురుషుడు నన్ను కలలో పలకరించి వెడుతూండే వాడు. అతడి ముఖం అస్పష్టంగా ఉండేది. మా తాతగారు నా జాతకం వేసి అలనాటి శకుంతల దీనిదీ ఒక ఇతిహాస కళ్యాణం మవుతుంది. భరత వర్దాన్నుద్దరించే మహానుభావుడికి తల్లి అవుతుంది అంటూండేవారు. ఆ మాటలే నన్ను ప్రబహవితం చేశాయేమో తెలియదు. ఆ అసాధారణ పురుషుడెవరో తెలుసుకోవాలని కలలు కనేదాన్ని. అతను కనిపించేవాడు కానీ ఎవరో తెలిసేది కాదు. కొంతకాలం నుంచి నా చెవిలో నీ పలుకులు వినిపించడం ప్రారంభించాయి. అది సత్యమో, భ్రమో తెలియకపోయినా అపూర్వాను భూతిగా ఉండేది. రమణ ఆ అసాధారణ పురుషుడేనని భ్రమించాను కానీ తొందరగా ఆ భ్రమ తొలగిపోయింది. మొదటిసారి నిన్ను చూడగానే....వెంటనే నిన్ను గుర్తుపట్టేశాను. ఎంతోకాలంగా నా కలల్లో కనిపిస్తూ, చెవుల్లో వినిపిస్తూ నన్నారాట పెడుతున్న ఆ అసాధారణ పురుషుడివి నువ్వేనని తెలిసింది. నీకు నిజంగా ఓ రూపముందనీ, ఇలా కనబడతావనీ అనుకోలేదు. ఈ జీవితానికిది చాలు...."

    "చాలదు" అన్నాడు గౌతమ్.

    హాస నవ్వింది. "ఆ మాట నీ ప్రేమకు చెప్పు...."

    "చెప్పాను. అది నిన్ను దక్కించుకుంటానంటోంది...."

    "ఈ క్షణంలోనే గాంధర్వ వివాహం చేసుకుని నువ్వు నన్ను దక్కించుకోవచ్చు...."

    "లేదు హాసా! క్షణికానందం కోసం నేను నిన్ను ప్రేమించడం లేదు. నీ గుండె చప్పుడు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. ఆ గుండె చప్పుడాగిపోతే నా గుండె కూడా ఆగిపోతుంది. అప్పుడు భూతల స్వర్గం నుంచి మనమిద్దరం స్వర్గం చేరుకుని శాశ్వతానందం పొందవచ్చు."

    "నాకు తెలియని స్వర్గం నాకెందుకు? ఈ స్వర్గమే నాక్కావాలి."

    "నీ నిర్ణయం అదే అయితే మనకు గాంధర్వ వివాహం కర్మేం పట్టింది? పెద్దల సమక్షంలో జూన్ ఏడున ముహూర్త నిర్ణయం చేయిద్దాం" అన్నాడు గౌతమ్.

    "అంతవరకూ....? చిలిపిగా చూసింది హాస.

    "ఒకరినొకరు అర్ధం చేసుకుందాం. మూడు వారాల ఏకాంతం మన ప్రేమ భౌతికం కాదని రుజువు చేయగలిగితే నా జీవితానికి అంతకు మించిన ఆశయ సాధన మరొకటి లేదు" అన్నాడు గౌతమ్.

    "మానవుడికీ, దానవుడికీ ఉండే తేడా అదే!" అంది హాస.


                            *    *    *    *


    కాటేజిలో ఒక బీరువా నిండా రకరకాల దుస్తులున్నాయి. స్నానం చేశాక హాస వాటిలోంచి చీరనే ఎన్నుకుంది.

    ఆకాశం రంగు చీరలో, నల్ల మబ్బుల్లాంటి కురుల మధ్య వెలిగే చంద్రబింబం వంటి ముఖమండలంతో ఆమె గౌతమ్ కు తను ఆకాశం పక్కనే ఉన్నాడన్న భ్రమను కలిగించింది.

    "నువ్వు హాసవు కాదు. ఆకాశపు" అన్నాడు గౌతమ్.

    అప్పుడే ఓ యువకుడు వచ్చి వారి ముందు ఐదు చిన్న స్టీలు డబ్బీలుంచాడు.

    హాస వాటిలో ఒకటి తీసుకుంటుంటే ఆమె చేయి సన్నగా వణికింది. గౌతమ్ మాత్రం నిలువెల్లా వణికాడు.

    ఆ యువకుడు వెళ్ళిపోయాక హాస డబ్బీ తెరిచింది. అందులో ముందుగా చిన్న చీటీ....

    కాటేజి నెంబరు 76. ప్రతిరోజూ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ ఏకాంతసేవ" అని వ్రాసి వుందందులో.

    "ఇందులో మోసమేమీ ఉండదు గదా!" అన్నాడు గౌతమ్.

    "రోగిష్టి దాన్ని. నా రోగమే నాకు శ్రీరామరక్ష! అంది హాస.

    "ఏ రోగమూ నీ అందాన్నీ, లావణ్యాన్నీ తగ్గించడం లేదు. మనుషుల్లో రాక్షసులుంటారు. ఆ రాక్షసులు కాటేజీల్లో వుండరని గ్యారంటీలేదు" అన్నాడు గౌతమ్.

    "గౌతమ్! నువ్వు నీ ప్రేమను నమ్ముకో. భయపడకు...."

    "మరి నువ్వు....."

    "నేనూ నీ ప్రేమనే నమ్ముకున్నాను. నాకు భయం లేదు...."

    డబ్బీలో చీటీ అడుగున చిన్న కాగితం పొట్లాముంది. అందులో ఎర్రటి పొడి వుంది.

    హాస మంచినీళ్ళతో ఆ మందు మింగేసింది.

    "దేవుడా! నువ్వంటూ ఉంటే ఈ మందు పనిచేస్తుంది" అనుకున్నాడు గౌతమ్.


                                                                    *    *    *    *


    సాయంత్రం నాలుగు.

    కాటేజి నెంబరు 76.

    హాస, సురేంద్రరావు.

    "నువ్వెక్కడున్నావో నీకు తెలుసు! ఎందుకున్నావో తెలియదు." అన్నాడు సురేంద్రరావు.

    "మీరు చెప్పండి."

    "ఇక్కడ ఆశ్రమంలో మూలికా వైద్యానికి కాటేజిలో ఉన్నవారు రోజుకి అయిదు వేలు చెల్లించాలి. నీ తరపున స్వామికి నేను డబ్బు చెల్లిస్తున్నాను. నీ సేవలో ఈ మానవుణ్ని మాధవుణ్నిగా మార్పు" అన్నాడు సురేంద్రరావు సూటిగా.

    "మనిషిని దేవుణ్ని. చేసే సేవ నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి మసలు కుంటాను...." అంది హాస నెమ్మదిగా.

    అతడు సోఫాలో కూర్చున్నాడు.

    ఆమె నేలమీద కంబళిపై కూర్చుంది. తను సేవకురాలు కాబటి యజమానితో సరిసమంగా సోఫాలో కూర్చోనని ముందే ఆమె చెప్పింది.

    "నీలో భయం, బెదురు లేవు. కనిపించేటంత అమాయకురావి కాదనుకుంటాను" అన్నాడు సురేంద్రరావు.

    "మనిషి కౄర జంతువులకి భయపడతాడు. ప్రాణం పోతుందని! బ్లడ్ కాన్సర్ అనే క్రూర జంతువు నుంచి నేనెలాగూ తప్పించుకోలేను_ ఇక ఎవరికి భయపడను?" అంది హాస.

    సురేంద్రరావు ముఖ కవళికలు మారాయి, "నిజంగా నీకు బ్లడ్ కాన్సరుందా?" అన్నాడు.

    "నా బ్లడ్ కాన్సరు నిజం కాకపోతే మీకంటే ఎక్కువ నేనే సంతోషిస్తాను.... అసలు మీకా అనుమాన మెందుకొచ్చింది?" అంది హాస.

    "ఈ ఆశ్రమంలో ప్రవేశించడానికి నేనూ ఓ రోగం చెప్పాను. ఇక్కడుండడానికి ప్రతి మనిషికీ ఏదో ఓ భయంకర రోగాన్నాశ్రయించక తప్పదు...." అన్నాడు సురేంద్రరావు నిట్టూర్చి.

    "అయితే నా అడ్రసిస్తాను. నా వాళ్ళను కంటాక్టు చేసి నా జబ్బు అబద్ధమేమో కనుక్కోండి. అది నిజంగా అబద్దమయితే వెంటనే ఆశ్రమాన్ని విడిచిపోతాను" అంది హాస. 

 Previous Page Next Page