కళ్ళజోడు వ్యక్తికీ కోపం వచ్చినట్లు తెలుస్తూనే ఉంది. అయితే అతని ప్రవర్తన మాత్రం ఇంకా చాలా నెమ్మదిగా కూల్ గానే ఉంది.
"మిస్టర్! మీరు ఇక్కా ఉండటానికే వచ్చినా, ఇక్కడ ఆహ్వానించే వారెవరూ లేరు. దయచేసి వెళ్ళిపొండి."
"నేను చెప్పను కదా! నాక్కావలసిన వివరాలు దొరికేవరకూ వెళ్ళను!" ఖండితంగా చెప్పాడతను కళ్ళజోడు వ్యక్తీ తన టేబుల్ మీద కుడి చేతి వేపున్న ఎర్ర బటన్ నొక్కాడు. రెండు నిముషాల్లో కాకీ దుస్తులు తొడుక్కున్న ఓ వ్యక్తీ లోపల్నుంచి వచ్చాడు.
"పిలిచారా సార్?' అడిగాడతను వినయంగా. అతనిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు సృజన్. చాలా లావుగా , పొడుగ్గా భయంకరంగా ఉన్నాడు చూడ్డానికి.
"ఇతనిని పంపించేయ్! పని అయిపొయింది."
అతను వచ్చి సృజన్ పక్కనే నిలబడి వంగి చెవిలో మాట్లాడాడు.
"బయటకు వెళదాం పద.....! ఇక్కడ ఇంతమందిలో నిన్ను కుక్కలా ఈడ్చుకెళ్ళటం నాకిష్టం లేదు."
"నాకిష్టమే" చిరునవ్వుతో చెప్పాడు సృజన్.
"సరే, నీ ఇష్టం" అంటూనే అమాంతం అతనిని ఒకే ఒక్క ఊపులో కిందపడేసి కాళ్ళు పట్టుకుని మెలిపెట్టి బయటకు ఈడ్చుకెళ్ళడు. అక్కడ ఘుర్ఖాలిద్దరూ అతనికి సాయం వచ్చారు. గేటు అవతలి వరకూ ఈడ్చుకెళ్ళక వదిలేశాడతను.
"ఇంకోసారి ఇక్కడికొచ్చి గొడవ చేశావో ఇంకా చాలా అసహ్యంగా ప్రవర్తించాల్సి వస్తుంది జాగ్రత్త" అన్నాడతను. సృజన్ లేచి నిలబడ్డాడు. సిమెంట్ నేలమీద మట్టి మీద ఈడ్చబడడంతో ఈపంతా తొక్కురేగిపోయి మంటలు పుడుతోంది.
"నువ్వేంచేసినా సరే నేనిక్కడే ఉంటాను------ఈశ్వర్ వర్మతో మాట్లాడేవరకూ.
అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది.
"అయితే మంచి మాటలతో వెళ్ళవన్నమాట ....." మీదకోస్తూ అడిగాడు.
"వెళ్ళను"
మరుక్షణం అతని పిడికిలి బలంగా ముఖం మీద తగిలింది.... సృజన్ ఎగిరి కిందపడ్డాడు ఆ బలానికి.....అతికష్టం మీద లేచి కూర్చున్నాడు. పెదాల మీద నుంచీ రక్తం కారుతోంది.
"వెళతావా లేదా?" మళ్ళీ మీదకు రాసాగాడతను.
సృజన్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు.
"నన్ను చంపినా సరే! నేను ఈశ్వర్ వర్మగారితో మాట్లాడాలి" మొండిగా అన్నాడతను.
మళ్ళీ కొట్టబోయి ఆగిపోయడతను.
అప్పుడే బయటకు వెళుతున్న కారుని చూసి చేయి దించేశాడు.
సృజన్ కి అర్ధమయింది. కార్లో ఎవరో ముఖ్యమైన వ్యక్తీ ఉన్నాడు. అందుకే అతను తనను కొట్టటం ఆపేశాడు. ఒకవేళ ఆ కార్లో ఈశ్వర్ వర్మ ఉన్నాడేమో!
పరుగుతో వెళ్ళి కారుకి అడ్డంగా నిలబడ్డాడతను చేయి ఊపుతూ.
కారు సడెన్ బ్రేకుతో ఆగిపోయింది.
మరుక్షణం బాక్ డోర్ తెరచుకుంది. అందులోనుంచి దిగి నిలబడ్డాడు ఆజానుబాహుడయిన ఓ వ్యక్తీ......ఖద్దరు దుస్తుల్లో హుందాగా ఉన్నాడతను.
అతని ముఖం చూస్తూనే నీతీ, నిజాయితీ ఉట్టి పడుతున్నాయ్. ముందు సీట్లో నుంచి ఓ సన్నటి వ్యక్తీ పరుగుతో వచ్చి అతని పక్కనే నిలబడ్డాడు. అతని చేతిలో రివాల్వర్ సిద్దంగా ఉంది.
"ఏమిటి గొడవ?" గంభీరంగా అడిగాడు ఖద్దరు వ్యక్తీ.
సృజన్ ను కొట్టబోయిన వ్యక్తీ వినయంగా మాట్లాడాడు......."
"ఎవడో చిల్లరగాడు సార్....! మనాఫీసులో ఏదో గొడవ చేస్తున్నాడని తెలిసింది."
ఖద్దరు వ్యక్తీ సృజన్ వేపు చూశాడు . అతని పెదాల దగ్గిరనుంచీ కారుతోన్న రక్తం చూశాడు.
"ఏం కావాలి నీకు?" అడిగాడతను.
"ఈశ్వర వర్మ గారితో మాట్లాడాలని అడిగితే బయటకు గెంటుతున్నారు.
"ఏం మాట్లాడాలి ఈశ్వర్ వర్మతో?"
"ఆయనతోనే మాట్లాడాలి! అయన సహాయం కావాలి నాకు------ఓ ముఖ్యమయిన విషయంలో."
"నేనే ఈశ్వర్ వర్మను."
సృజన్ ఆశ్చర్యపోయాడు.
"రెండు నిమిషాలు టైమిస్తే మీతో అంతా చెప్తాను సార్."
"అల్ రైట్! ఇక్కడ అడుగు! ఫర్లేదు."
"సంగతేమిటంటే మా అన్నయ్య మీ ఫార్మానుటికల్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగం కోసం వచ్చాడండీ........! ఆ తరువాతే జరిగిందో తెలీదు. వారం రోజుల క్రితం హెవీ ప్లేట్స్ అండ్ వేపెల్స్ ఫాక్టరీ బయట మెయిన్ రోడ్ మీద ఎవరో చంపిపారేశారు మా అన్నయ్యను."
"అయితే ఇప్పుడేమంటావ్?"
"మా అన్నయ్యకు మీ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారా, ఇస్తే ఉద్యోగం చేశాడా, అతనిని ఎవరో చంపారో లేక అతను ఎవరికయినా తననేవరయినా చంపబోతున్నారని చెప్పాడా -ఈ వివరాలు తెలుస్తాయే మోనని మీ ఆఫీస్ లకు తిరిగాను గానీ ఎవరూ ఏమీ చెప్పటం లేదు. ఇంక అవి తెలుసుకునే మార్గం లేక మీ దగ్గరికొస్తే వీళ్ళూ నన్ను కొట్టి బయటికి గెంటుతున్నారు" అలా చెప్తుంటే అతని కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయ్.
"నూకరాజూ" ఆ లావుపాటి వ్యక్తిని పిలిచాడతను.