Previous Page Next Page 
సుహాసిని పేజి 49


    రమణకు నా కృతజ్ఞతలు చెప్పు. తమ్ముడు, నాన్నగారు, బామ్మ, తాతగారు.... అందర్నీ అడిగినట్లు చెప్పు.

    మనం మళ్ళీ కలుసుకుంటామనే నమ్మకం నాకు. ఒకవేళ అలా జరక్కపోతే నా చివరి గుర్తుగా ఈ ఉత్తరం దాచుకోండి.

    ఎక్కడున్నా నేను చాలా సంతోషంగానూ, నవ్వుతూనూ వుంటానని మాత్రం గుర్తుంచుకోండి....

                                                                          సెలవు.

                                                                                                          నీ
                                                                                                        హాస"

    ఉత్తరం చదివి ఘొల్లుమంది సుభద్ర.

    మ్రాన్పడిపోయాడు రమణ.

    అతడి మెదడులో జూన్ ఏడు మెడులోతోంది.

    ఎంతో కష్టపడి హాసను పట్టాడు తను. గెలిచినట్లే భావించాడు. కానీ వాడెవరో ఎగరేసుకుపోయాడు. జూన్ ఏడుకు తీసుకు వస్తానంటున్నాడు. అంటే వాడికీ హాస గురించి తెలిసే వుంటుంది.

    ఎవరు వాడు?

    ఎలాగుంటాడో తెలియదు. ఎక్కడుంటాడో తెలియదు. వాడెవరో ఎలో తెలుసుకునేది?

    తననో గంధర్వుడు రక్షిస్తున్నాడని చెప్పేది హాస. ఆ పేరుతో కొన్ని అద్భుతాలూ చేసింది. ఇప్పుడా గంధర్వుడే ఆమెను తీసుకుపోయాడా?

    వాడామెను ఏం చేస్తాడు? గంధర్వలోకానికి తీసుకుపోతాడా? మానవలోకంలో అద్భుత వైద్యం చేయిస్తాడా?

    రమణ ఆలోచిస్తున్నాడు.

    సుభద్ర ఇంకా ఏడుస్తూనే వుంది.

    రమణ దుఃఖం ఆమె దుఃఖానికి వెయ్యి రెట్లని ఆమెకు తెలియదు.

    "ఏదో ఒకటి చేయాలి. జూన్ ఏడు లోగా తిరిగి హాసను సాధించాలి" అనుకున్నాడు రమణ దుఃఖాన్ని చిక్కబట్టుకుని.


                                            32


    అది సర్వభాషానందస్వామి ఆశ్రమం!

    కాశ్మీర్లో నాగరికులకు దూరంగా నూరెకరాల విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో వున్న ఆశ్రమమది.

    అందులో సుమారు రెండు వందల కాటేజీలున్నాయి. అందమయిన పార్కుంది. చిన్న సరోవరముంది. ఫలవృక్షాలున్నాయి.

    ఆశ్రమం గురించి ఎందరికో తెలియదు. తెలిసిన వారికది అందుబాటులో వుండదు.

    మూలికావైద్యం పేరిట ఆ ఆశ్రమం వెలసింది. కానీ అది రోగులకు కాక ధనిక భోగులకు విలాస మందిరం. స్వామీజీ ప్రబోధించే మధుర భక్తియోగం ఎందరో దేశ, విదేశ భాగ్యవంతులకు మనశ్శాంతినే, సంతృప్తినీ ఇస్తోంది.

    ఆశ్రమానికి వచ్చేవాళ్ళు రోగులు కారు. కానీ రోగం పేరుతోనే వస్తారు. స్వామీజీ వారిని పరీక్షించి మూలికా వైద్యం నిర్ణయిస్తాడు. రోగికి కాటేజి యివ్వబడుతుంది. కాటేజిలో రోజుకు అయిదువేల రూపాయల చొప్పున ఎంత కాలమివ్వగలడో అంతకాలమూ రోగి మూలికావైద్యం చేయించుకోవచ్చు.

    ఆశ్రమం పదేళ్ళ క్రితం ప్రారంభించబడింది. ఇప్పుడు దానికి దేశ మంతటా బ్రాంచిలున్నాయి.

    ఆశ్రమానికి ఆదాయం పెరగ్గానే చాలామంది దృష్టి దానిపై బడింది. అవినీతిని ప్రోత్సహించే ఆశ్రమమని కొందరు నిరసించారు. ధైర్యమున్న జర్నలిస్టులు ఆశ్రమం గురించిన వివరాలను కూడా సేకరించి ప్రకటించారు.

    అప్పుడు ఆశ్రమానికి కొందరు రాజకీయ నాయకుల మద్దతు అవసరమయింది. అవసరానికిలాంటి వారిని ఆడుకోవడంలో మన రాజకీయ నాయకుల్ని మించినవారు లేరు. ఆశ్రమం పేరిట కొన్ని అనుబంధ సేవాసంస్థలు కూడా వెలిశాయి. మన దేశంలో సేవాసంస్థలు అవసరం ఎక్కువగా ఆడవాళ్ళకే కాబట్టి ఇవీ అందుకే ఉపయోగపడుతున్నాయి. అనాధలు, నిరాధారలు, విధవలు అయిన మహిళలకు ఉపాధి కల్పించే ఈ సేవాసంస్థలు ఆశ్రమ నిర్వహణకు అవసరపడే పడతులను సరఫరా చేయడంద్వారా నిజంగానే అనుబంధ సంస్థలయ్యాయి.

    అయిదేళ్ళ క్రితం సేవాసంస్థలు ప్రారంభమయ్యాయి.

    ఆశ్రమం అందరికీ అందుబాటులో లేదన్న అపవాదు తొలగించడానికి ఆర్నెల్లక్రితం మూలికా వైద్యం గురించిన ప్రచారం ప్రారంభమైంది. వాటి గురించి పత్రాలు పంచిపెట్టబడుతున్నాయి. అవి చదివి ఆశ్రమానికి వెళ్ళేవారికి రోగనివృత్తి జరక్కపోయినా భక్తిజాడ్యం పట్టుకుంటుంది. వేదాంతసారం తెలుస్తుంది. మట్టిలోంచి బంగారం పండించగల రైతును మించి సామాన్యుణ్ని తన సంపాదనగా మార్చుకోవడం స్వామీజీకి తెలుసు.

    అందులోనూ ఆయన సర్వ భాషానందస్వామి. అన్ని భాషలూ అనర్గళంగా మాట్లాడగలడు.


                                                                 *    *    *    *


    సర్వభాషానందస్వామి కాషాయాంబరధారి. ఆజానుబాహుడు. గెడ్డం మీసాల వెనుక ముఖ సౌందర్యం మరుగు పడిందేమోకానీ తేజస్సు దాగడం లేదు.

    గౌతమ్ ఆయనకు చేతులు జోడించి నమస్కరించాడు.

    హాస ఆయనకు పాదాభివందనం చేసింది.

    స్వామి చేతులెత్తి ఆమెను దీవించాడు.  

    గౌతమ్ ఆయనతో- "ఈమెకు బ్లడ్ కాన్సర్. డాక్టర్లు అన్ని ఆశలూ వదిలేశారు. ఏ క్షణంలోనయినా ఈమెను మృత్యువు కబళించవచ్చు. ఈ మూలికా వైద్యానికిదో పరీక్ష" అన్నాడు.

    స్వామి దిగులుగా ఆమెవంక చూశాడు.

    ఆ పుత్తడిబొమ్మకు జీవముంది, ఆయువు లేదు.

    "తప్పు నాయనా! పరీక్ష మానవులకే....భగవంతుడి కుండదు...." అన్నాడు స్వామి.

    "స్వామీ! ఈమెకు నయమౌతుండంటారా?"

    "అంతా ఆ భగవంతుని కృప....ముందు నీవు నేనడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి...." అన్నాడు స్వామి.

    "అడగండి స్వామీ!"

    "ఈ ప్రపంచం దేవుడి సృష్టి. దేవుడు మనరేమిచ్చాడూ అవికాక దేవునికి మనమేమివ్వగలమా అని ప్రశ్నించుకోవాలి....ఈమెను మనిషి రక్షించలేడు. దేవుడే రక్షించగలడు. అందుకు ప్రతిఫలంగా నువ్వు దేవునికేమివ్వగలవు?"

    "ఈ ప్రశ్నకు జవాబు నేనేం చెప్పగలను? స్వార్ధం నన్ను ఏమీ యివ్వలేనని చెప్పమంటుంది. లౌక్యం ఏదయినా చిన్న మొత్తం చెప్పమంటుంది. అవసరం అబద్ధం చెప్పమంటుంది. కానీ నిజం దేవుడికి తెలుస్తుంది. ఆయనకు నేనేమివ్వగలననుకుంటే అది నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. స్వామీ! నా నెలజీతం పదహారు వందలు. నా బ్యాంకు నిల్వనంతా కరిగించి కొందరు స్నేహితులతో కాశ్మీరొచ్చాను. ప్రస్తుతానికి నా వద్ద రెండు వందల రూపాయలు మాత్రం మిగిలాయి. నా స్నేహితులు వెళ్ళిపోయారు. ఈ డబ్బు మీరు తీసుకోండి. ఈమె జబ్బు నయమయ్యాక వారసత్వంగా నాకు ఆస్థిలో నాకు వచ్చే వాటా మీకే ఇచ్చుకుంటాను. జీవితాంతం మిమ్మల్ని సేవించుకోమంటే సేవించుకుంటాను" అన్నాడు గౌతమ్.

    స్వామి అతడి మాటలు వింటూ ఆమెను చూస్తున్నాడు.

    ఆమె ముఖంలో జీవకళ ఉట్టిపడుతోంది. అటువంటి అందగత్తె ఆశ్రమంలోనే లేదు.

    "ఇది డబ్బొచ్చే కేసు కాదు. కానీ డబ్బు చేసుకునే మార్గాలుండకపోవు.

    స్వామి బుర్ర తీవ్రంగా పనిచేస్తోంది.

    గౌతమ్, హాస ఆత్రుతగా ఆయనవంక చూస్తున్నారు.

    వారికి కాస్త వెనుకగా ఉన్న యిద్దరు వ్యక్తులు స్వామిని ఆత్రుతగా చూస్తున్నారు. స్వామి వారిని గమనించేక గౌతమ్ వంక చూసి- "కాసేపు మీరిద్దరూ పక్క గదిలో విశ్రాంతి తీసుకోండి. దైవనిర్ణయం చెబుతాను" అన్నాడు.


                          *    *    *    *


    గౌతమ్, హాసలకు కాస్త వెనుకగా ఉన్న వ్యక్తి ప్రముఖ రాజకీయ నాయకుడు సురేంద్రరావు. తెలుగునాట పరిమితమైన అతటి కిటీవలే దేశ వ్యాప్తంగా పేరొచ్చింది. ఢిల్లీలో పోలీసులు సమ్మెచేయబోతే దాన్ని ఎంతో చాకచక్యంగా ఆపాడతడు.

    సురేంద్రరావు ఇండిపెండెంటు ఎంపీ. ఇప్పుడు మూడు ప్రముఖ రాజకీయ పక్షాలతడి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఆ ఒత్తిడులకు తట్టుకోలేక తాత్కాలిక మనశ్శాంతి కోసం స్వామి ఆశ్రమానికి వస్తే అతడికి హాస కనిపించింది అంతే, మనసు చలించింది.

    స్వామి వారికాశ్రయ మివ్వడేమోనని అతడి భయం.

    సురేంద్రరావు పక్కనున్న వ్యక్తి స్వామి ఏజెంటు. తన బాధను అతనికి చెప్పుకున్నాడు సురేంద్రరావు. అప్పుడు ఏజంటు చూపుల్తో స్వామితో మాట్లాడేడు. స్వామి ఆ భాషనర్ధం చేసుకుని హాసనూ, గౌతమ్ నీ పక్క గదిలోకి పంపాడు.

    వాళ్ళ ఖర్చులు పూర్తిగా సురేంద్రరావు భరిస్తానని స్వామికి వెంటనే హామీ ఇచ్చాడు.


                           *    *    *    *


    "మీ యిద్దరికీ ఓ కాటేజి ఇమ్మని దైవనిర్ణయం" అన్నాడు స్వామి.

    గౌతమ్, హాసల సంతోషానికి అవధులు లేవు. ఇద్దరూ ఒకేసారి ఆయనకు సాష్టాంగపడ్డారు.    

 Previous Page Next Page