వాడు గబగబా మాధవరావు చేతిలోంచి గుడ్డ తీసుకుని మోటారు సైకిల్ ను తుడవబోయాడు.
"చర్మం వోలుస్తానంటే భయం వేసిందేం.....రేపట్నుంచి తుడవమన్నాను....ఈరోజు కాదు" అన్నాడు మాధవరావు.
"ఈరోజు శ్యాంపిల్ గా వాత పెట్టు బాబాయ్. రేపు వాడికి గుర్తుంటుంది" అంది జయంతి.
"ఏరా! అమ్మాయి చెప్పినట్లు చేయమంటావా!" అన్నాడు బండి స్టాండ్ తీస్తూ.
"అయ్యబాబోయ్...వద్దు అయ్యగోరు! రేపట్నుంచి తప్పకుండా తుడుస్తాను" అన్నాడు వెంకటేశం.
మాధవరావు నవ్వుకుంటూ మోటార్ సైకిల్ ను బయటకు తీసుకు వెళ్ళాడు.
"బాబాయ్! నన్ను రోడ్డువరకు తీసుకెళ్ళవా?" అన్నాడు జయంతి తమ్ముడు రాము.
"రారా ఎక్కు! మళ్ళి అక్కడ నుంచి పట్నం వస్తానని గోల చేయకూడదు.....సరేనా?" అన్నాడు మాధవరావు.
"సరే బాబాయ్! రోడ్డువరకు చాలు, రేపు పట్నం వస్తా..." అన్నాడు రాము నవ్వుతూ.
"వోరిబడవా నీకు ఎన్ని తెలివితేటల్రా" అన్నాడు మాధవరావు.
"రామూ! జాగ్రత్తగా పట్టుకుని కూర్చో" అంది జయంతి.
"ఓ నాకేం భయమా....ఇప్పటికి ఎన్నిసార్లు ఎక్కానో" అన్నాడు రాము.
"సరే పద...." అంటూ రాము ఎక్కిన తరువాత మోటారు సైకిల్ సస్టార్ట్ చేశాడు మాధవరావు.
జయంతి ఇద్దరికీ టాటా చెప్పి వీధి తలుపు మూసి లోపలికెళ్ళింది.
* * * *
"పిన్ని...పచ్చీస్ అట ఆడుకుందాం పిన్ని" అంది గిరిజ దాక్షాయణితో.
"పార్వతి ఏంచేస్తుంది? పడుకుందా?" అంది దాక్షాయణి.
"లేదు పిన్ని! తను కూడా ఆడుతుందట, నిన్ను అడిగి రమ్మంది" చెప్పింది గిరిజ.
"అలాగే రమ్మను, జయంతిని కూడా పిలువు...." అని మాట పూర్తీ చేయకముందే దాక్షాయణి గదిలోకి వచ్చింది జయంతి.
"ఏంటి పిన్ని నన్ను పిలవమంటున్నావ్> దేనికి?" అంది నవ్వుతూ .
"పచ్చీస్ అడదామే" అంది గిరిజ.
"ఓ నేను రెడీ! మరి పందెం ఎంత?" అంది జయంతి.
"పందెమా ఓడిపోయినవాళ్ళు సాయంత్రం వంట ఒక్కరేచేయాలి మేమెవరం సాయపడం" అంది దాక్షాయణి.
"భలే....భలే! అలాగే చేద్దాం. ఇదే పందెం ఏం జయంతి రెడినా>" అంది గిరిజ.
"నేను రెడి....కాకపోతే వంట చేయటానికి నాకేం అభ్యంతరం లేదుగానీ....బాబాయ్ లు తింటారో లేదో పిన్ని ఆ విషయం ఆలోచించుకోవాలి" అంది జయంతి.
"కొంటెపిల్ల.....నువ్వు వంటచేస్తే తినటానికేనా?" జయంతిని మురిపంగా చూస్తూ అంది దాక్షాయణి.
"అందుకే మరి నేను చెప్పింది....అదికాదుగానీ ఓడినవారు సాయంత్రం లవకుశ సినిమాకి తీసుకెళ్ళాలి సరేనా?" అంది జయంతి.
"అరె....లవకుశ సినిమా వచ్చిందా మన ఊరికి?" అంది దాక్షాయణి ఆసక్తిగా.
"అవును పిన్ని, ఈరోజునుంచేనట....వెంకటేశం చెప్పాడు..." అంది జయంతి.
"ఈ పందెం బాగుంది. అలాగే చేద్దాం పిన్ని" దాక్షాయణి బ్రతిమాలుతూ అంది గిరిజ.
"సరే.....అలాగే చేద్దాం. కంట్రాక్టరుగారి పెళ్ళాన్ని పిలవండి ముందు" నవ్వుతూ చెప్పింది దాక్షాయణి.
"నేను పిలుచుకువస్తా, ఈలోపు మీరు అన్ని సిద్దం చేయండి..." అంటూ పార్వతి గదివేపు పరుగుతీసింది జయంతి.
"చింతపిక్కలు వున్నాయా గిరిజ" అడిగింది దాక్షాయణి.
"ఇప్పుడేతెస్తా పిన్ని! అన్నీ వున్నాయి....క్షణంలో వస్తా" అంటూ లోపలికి వెళ్ళింది గిరిజ.
"ఏంటక్కా! లవకుశ సినిమా వచ్చిందా?" అంటూ పార్వతి వచ్చి దాక్షాయణి పక్కనే కూర్చుంటు అడిగింది.
"అవును పార్వతి! జయంతే చెప్పింది. అన్ని వార్తలు మోసుకొచ్చేది మన జయంతేకదా....పందెం కూడా చెప్పిందా?" అడిగింది దాక్షాయణి.
"చెప్పాను పిన్ని, మేమిద్దరం ఒక జట్టు, నువ్వు గిరిజక్కా ఓ జట్టు సరేనా?" అంది ఉత్సాహంగా జయంతి.
అంతలో దూరంగా మైకులోంచి "జయజయరాం...శ్రీరామ పరందామా......జయరామ పరందామా" అంటూ పాట వినిపించింది.
"అదిగో పిన్ని మ్యాట్ని అట మొదలుపెడుతున్నారు. పాట విన్పిస్తోంది" అంది జయంతి.
"అవునే....సాయంత్రం కాదులేగాని మీ బాబాయ్ వచ్చాక చెప్పి రేపు మ్యాట్ని ఆటకు వెళ్దాంలే" అంది దాక్షాయణి.
"బాబాయ్ కి చెప్పకుండా ఏ పని చెయ్యదు పిన్ని....చీమ చిటుక్కు మన్నా ఏమండీ చీమ చిటుక్కుమందండి" అంటుంది కాబోలు అంది ఉడికిస్తున్నట్లు జయంతి.
"ఏయ్ రౌడిపిల్లా....రేపు నీకు పెళ్ళయినా అంతే చేస్తావ్" అంది దాక్షాయణి.
"ఏంకాదు....అసలు నేను పెళ్ళే చేసుకోను" బింకంగా అంది జయంతి.
"ఓయబ్బో ఇప్పుడంతే అంటావు గానీ రెండేళ్ళుపోనీ ...పిన్ని....పిన్ని నాకు పెళ్ళి చేయమని చెప్పవా అమ్మతో అంటావు" అంది ఏడిపిస్తూన్నట్లు పార్వతి.