Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 4

 

    "దాంన్దేముందీ! రేపట్నుంచి ఓ చెంబు పాలు పోయించుకోండి కరణంగారూ. అదేమంత భాగ్యం?" అన్నాడు రామశేషు.

    "అయ్యో! నేనేదో మాటవరసకి అన్నానండి, మీరు నన్ను మరి ఇబ్బంది  పెట్టేస్తున్నారు, సరే పోయించుకోకపోతే మీ మనసు బాధపడుతుంది. రేపట్నుంచి మా అమ్మాయిని పంపుతానమ్మా కస్తూరి. తప్పుతుందా రామశేషుగారి వాక్కు బ్రహ్మవాక్కు...: అన్నాడు కరణం.

    "అలాగే అన్నయ్యా! వాసంతిని పంపండి" అంది కస్తూరి.

    "ఈ ఏడాది ధాన్యం ఎన్ని బస్తాలు వచ్చాయన్నయ్యా?" అడిగాడు సర్వోత్తమరావు. అయన వ్యవసాయం గూర్చి ఏమి పట్టించుకోడు. ఉమ్మడిపోలం అంతా కలిపి ఓ ఇరవై ఎకరాలవరకు మాగాణి వుంది పొలం పనులన్నీ అన్న రామశేషు, అక్క కొడుకు సురేంద్ర ఇద్దరూ చూసుకుంటారు.

    "వంద బస్తాలవరకు వచ్చాయిరా. రేపు మిల్లుకు తోలాలి" అన్నాడు రామశేషు. చుట్ట వెలిగించుకుంటు.

    "రేటు బాగానే వుందనుకుంటా" అన్నాడు సర్వోత్తమరావు.

    "ఆ ఏం రేటులే....రెండేళ్ళనుంచి ధాన్యం రేటు పడిపోయింది. ఏదో మన చాకిరీపోను, ఇంట్లోకి ధాన్యం సరిపోను వస్తున్నాయి. మిగిలితే ఓ పదివేలు మిగుల్తాయి" అన్నాడు రామశేషు.

    "ఏమో అన్నయ్య! ఆ వ్యవహారాలన్నీ పాపం నువ్వొక్కడివే చూడటం బాగాలేదు. నాకా ఈ కాంట్రాక్టు పనులతోనే సరిపోతుంది. తమ్ముళ్ళీద్దరూ వ్యాపారాలే చూస్తున్నారు" అన్నాడు సర్వోత్తమరావు.

    దాంన్దేముందిలేరా! నేను కష్టపడేది ఏముంది, కులిలతో చేయించటమేగా....ఏదో తలో వ్యాపారం చేసుకోబట్టే ఈ మాత్రం తినగలుగుతున్నాం. కాకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాస్త జాగ్రత్తగా వుండటం మంచిది" అన్నాడు రామశేషు.

    "అలాగే అన్నయ్యా! ఆడపిల్లల పేరుమీద కాస్త దాచి వుంచితే సరిపోతుంది." అన్నాడు సర్వోత్తమరావు.

    "అన్నయ్యా! రేపు మనం ఆ బడి ప్రహరి గోడ కట్టించాలి కదా, కూలీలను మాట్లాడవా?" అన్నాడు సోమసుందరం అప్పుడే అక్కడికి వచ్చి. సోమసుందరం సర్వోత్తమరావు కంట్రాక్టు పనుల్లో సాయపడుతూ వుండటంతో ప్రత్యేకంగా మరే వ్యాపారంగాని, వ్యవసాయం గాని చేయటంలేదు.

    "పొద్దుటే ఆ పెంచలయ్యకు చెప్పాన్లే.....కూలీలను తీసుకొస్తానన్నాడు" అన్నాడు సర్వోత్తమరావు.

    "మొత్తానికి మీ ఇద్దరూ కలిసి కాంట్రాక్టు పనులు బానే చేస్తున్నట్లుందే....మన ఉళ్ళో కాంట్రాక్టు పనులు ఎముంటాయిరా. పట్నంలో పనులు కూడా తీసుకుని చేయండి" అన్నాడు రామశేషు.

    "ఈ ఏడాదిలో అలానే చేద్దామనుకుంటున్నాను అన్నయ్యా! వీడు సుందరం కూడా నాకు చేదోడు వాదోడుగా వుంటున్నాడుకదా....నేను పైపైన పనులు చేస్తుంటే, మిగిలినవి వాడు చూసుకుంటున్నాడు." అన్నాడు సర్వోత్తమరావు.

    "అలాగని భాద్యతంతా వాడిమీద వేసి నువ్వు పట్టించుకోకుండా వుండబోకు...ఎంత తమ్ముడైనా లెక్కలు లెక్కలే. తేడా రాకూడదు" అన్నాడు రామశేషు.

    సుందరం పెద్దన్నయ్యవేపు చురుగ్గా చూశాడు.

    "అలా ఎందుకు చేస్తానన్నయ్యా...పసివాడు వాడికేం తెలుసు. ఏదో సొంతవాడు వున్నాడనే ధైర్యం నాకు అంతే" అన్నాడు సర్వోత్తమరావు.

    "మంచిది" అన్నాడు రామశేషు క్లుప్తంగా.

    "ఏమండీ@ పొద్దుపోయింది ఇక పడుకోరాదండి, పాపం బావగారు పొద్దుట నుంచి నడుం వాల్చలేదు" కస్తూరి కేక వేసింది.

    "అలాగే అలాగే....అన్నయ్యా! నువ్వు పడుకో, నేను వెళ్తూన్నాను. పొద్దుపోయింది." అన్నాడు సర్వోత్తమరావు.

    "అలాగే! పిల్లలందరూ పడుకున్నారా?" అడిగాడు రామశేష

    "ఆ పడుకున్నారు బావగారూ! ఇవిగోండి మంచినీళ్ళు" అంటూ చెంబుతో నీళ్ళు అందించింది కస్తూరి.

    "మంచిదమ్మా.....మీరు కూడా పడుకోండి. పాపం పొద్దుటినుంచి చాకిరియే. విశ్రాంతి లేకుండా పిండివంటలు, భోజనాలు తయారుచేసి అలసిపోయారు" అన్నాడు రామశేషు.

    "అలాగే బావగారూ..." అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది కస్తూరి.
                                              3

    "అమ్మా జయంతి! కాస్త ఇటు రా తల్లీ" కేకవేశాడు మాధవరావు.

    "ఏంటి బాబాయ్..." అంటూ వచ్చింది కంగారుగా జయంతి.

    "ఏముందంమ్మా! నువ్వు ఎదురు రాందే మీ బాబాయ్ బయటకు అడుగు పెట్టడు కదా" అంది దాక్షాయణి నవ్వుతూ.

    పచ్చని పట్టులంగా, ఎర్ర పరికిణి, పసుపుపచ్చ జాకెట్టు మేని రంగులో కలిసిపోగా కుందనపు బొమ్మలాగా వున్న జయంతిని మురిపెంగా చూసుకుంటూ "కాస్త ఆ వాకిలి ముందునుంచి ఎదురురామ్మా" అన్నాడు మాధవరావు.

    జయంతి నవ్వుకుంటూ వీధి వాకిలి దగ్గరకు వెళ్ళి బాబాయ్ కి ఎదురు వచ్చింది.

    "దాక్షాయణి నేను వెళ్ళి వస్తా మరి...." అంటూ టిఫిన్ బాక్స్ వున్న సంచిని చేత్తో పట్టుకుని బయలుదేరాడు మాధవరావు.

    "అలాగే! సాయంత్రం పెందలాడే రండి" అంది దాక్షాయణి.

    మాధవరావు నవ్వుకుంటూ గొడ్లసావిట్లో వున్న మోటార్ సైకిల్ ను తీసి గుడ్డతో శుభ్రంగా తుడుస్తూ.

    "అరేయ్ వెంకటేశం! నీకెన్నిసార్లు చెప్పాలిరా బండి శుభ్రంగా తుడిచి పెట్టమని" అన్నాడు కోపంగా.

    "అయ్యా చిత్తం....ఈరోజు పని వత్తిడివల్ల చేయలేకపోయాను. రేపట్నుంచి చేత్తాను అన్నాడు తల గోక్కుంటూ.

    "ఈమాట నేను బండి కొన్నప్పట్నుంచి వింటున్నాను....రేపట్నుంచి బండి తుడవకపోతే నీ చర్మం వొలిచి నీకే చెప్పులు కుట్టిస్తాను." అన్నాడు సీరియస్ గా నవ్వుతూ.

 Previous Page Next Page