Read more!
Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 1

                                 


                               గజ్జె ఘల్లుమంటుంటే   
                                                                                  - శారదా అశోకవర్ధన్


                                                  అంకితం
    'చిల్లరదేవుళ్ళును' తరిమికొట్టినా, 'మోదుగుపూలను' రాల్పించినా ఇతిహాసాలను గర్వింపజేసినా, 'జనపథం'లోకి చొచ్చుకుపోయినా యెదగదిని తెరిపించి ప్రజారోదనను ప్రత్యేక బాణీలో పలికించిన నేర్పరి, నవలాకారుడు, కుటుంబమిత్రుడు, సాహితీ బంధువు, శ్రేయోభిలాషి.
          శ్రీ దాశరథి రంగాచార్యగారి శారదా అశోకవర్ధన్
                                     ఒక్కక్షణం!
    నవల మూలంలో కథ ఉంటుంది. ఆ కథ కాల్పనికమై ఉంటుంది. కాని అది చెప్పేది వాస్తవం. అంటే నవల మానవ జీవితానికి సంబంధించిన కాల్పనిక కథ. వాస్తవాన్ని వాస్తవంగా చిత్రిస్తే అది కథకాదు, చరిత్ర అవుతుంది. నవలాకారుడు వస్తువును సమాజం నుంచి స్వీకరిస్తాడు. తన కల్పనాపటిమతో ఆ వస్తువును పఠనీయంగా, వినోదాత్మకంగా ఆవిష్కరిస్తాడు కథను ముందుకు నడిపించడానికి సంఘటనలనూ, పాత్రలనూ సృష్టిస్తాడు. పాఠకుడికి ఆ పాత్రలు తనకు తెలిసిన మనుషుల్లాగే కన్పిస్తాయి. అవి ఏడిస్తే తనూ ఏడుస్తాడు. అవి బాధపడితే తనూ బాధపడ్తాడు జాలిపడ్తాడు. అవి అన్యాయాలకూ, అక్రమాలకూ పాలుపడితే కోపగించుకుంటాడు. అలా కాని పక్షంలో ఆ పాత్రలు ఈ లోకానికి సంబంధించినవి కావని భావించాలి. పాఠకుడు నేలవిడిచి సాముచేసే పాత్రలను ఆశ్చర్యంగా చూస్తాడే కాని వాటి సుఖదుఃఖాలకు స్పందించడు.
    ఒక్కమాటలో చెప్పాలంటే నవల జీవితానికి వ్యాఖ్యానం. ఈ చరాచరజగత్తు నవలలో ఒదిగినట్టుగా మరే సాహితీ ప్రక్రియలోనూ ఒదగలేదు. అందువల్లనే నవల బహుజనపాత్రమైంది.
    నవలా రచయిత ఒక విషయం విస్మరించరాదు - నవలలు విజ్ఞానార్జనకొరకు ఎవరూ చదవరు. అందుకు వేరే గ్రంథాలు ఉన్నాయి. ఈ పోటీ ప్రపంచంలో రోజంతా వళ్ళువంచి పనిచేసే మనిషికి విశ్రాంతి కావాలి. అది కళ్ళు మూసుకొని మంచంలో ముడుచుకొని పడుకుంటే లభించదు. మనసుకు నూతన ఉత్తేజాన్నీ ఉల్లాసాన్నీ కలిగించే కళలద్వారా మానసిక విశ్రాంతి లభిస్తుంది. అందుకే రోజంగా పడిన శ్రమను మర్చిపోవడానికీ, తలను బద్దలు కొట్టే ఆలోచనలనుంచి బయటపడడానికీ నవలలు చదువుతారు. అందుకే నవల ప్రధానంగా వినోదాత్మకంగా వుండాలి. మనసుకు ఉల్లాసాన్ని కలిగించాలి. అంతేకాని నీతులు వల్లించే బోధకుడిగా రచయిత పాఠకుడి ముందుకు రాకూడదు. రచయిత చెప్పదల్చుకున్న సందేశం అంతర్లీనంగా వుండాలి. పానకంలో మిర్యాలకారంలా, రచయిత లక్ష్యం వినోదంలో మిళితమై ఉండాలి.
    నవలకు ముఖ్యంగా ఉండవలసింది చదివించే గుణం. భాష తేలిగ్గా వుండి కథ సాఫీగా నడవాలి. శైలి సరళంగా వుండాలి. శిల్పం కొరకు రచన వుండకూడదు. పాఠకుడు కష్టపడి నవల చదవకూడదు. కథ పాఠకుడ్ని ఊపిరి తీసుకోనివ్వకుండా ముందుకు లాక్కెళ్లాలి. నవలచదివి ముగించాక కనీసం కొన్ని నిముషాలైనా పాఠకుడు ఆలోచనలో పడిపోవాలి.
    శారదా ఆశోకవర్ధన్ రచించిన ఈ నవలకు చదివించే గుణం వుంది. సరళమైన శైలి, తేలికభాష. చదివి పుస్తకం మూశాక కొద్ది నిముషాలైనా పాఠకుడు ఆలోచిస్తాడు. అంటే ఒక మంచి నవలకు ఉండాల్సిన ముఖ్యమైన గుణాలన్నీ వున్నాయి ఈ నవలకు.
    బహుముఖ ప్రతిభావంతురాలైన శారద ఇప్పటివరకు 16 నవలలు రాశారు. అన్నీ దారావాహికంగా వివిధ పత్రికల్లో ప్రచురించబడినవే. అందులో 8 నవలలు పుస్తకాలుగా వెలుగుచూశాయి. ఇది 9వ నవలగా పాఠకులకు అందబోతున్నది.
    నవలరాయడం ఒక ఎత్తు - దానికి తగిన ఆకర్షణీయమైన పేరు పెట్టడం మరో ఎత్తు. పుస్తకాలకు పేర్లు పెట్టడంలో శారద మహా దిట్ట. "గజ్జె ఘల్లుమంటుంటే........" అని చదవగానే మీగుండె ఝల్లుమన్నది కదా?
    పూర్ణచంద్రుడి దర్శనంతో సముద్రుడి హృదయపేటికలో నుంచి అలలు ఉవ్వెత్తున లేచి మధురగీతాన్ని ఆలపిస్తాయి. అలాగే నాట్యమయూరి కాలిగజ్జె ఘల్లుమంటే, రసహృదయం ఆ మధురనాదస్పర్శకు ఝల్లుమంటుంది. శరీరం మైమరచిపోతుంది. ఈ పేరు పెట్టడంలోనే శారద కళాహృదయం కళ్లకు కట్టినట్టవుతుంది.
    ఈ నవలా నాయిక రాగిణికి నాట్యం ప్రాణం. నాట్యం ఊపిరి. ఆమె చేసిన తప్పల్లా కళే జీవితం అనుకోవడం. కళ జీవితంలోని అతిముఖ్యమైన ఒక భాగం మాత్రమేనని ఆమె గుర్తించలేకపోయింది. ఆమెలోని ఆ కళాతృష్ణను సంతృప్తి పరచడానికి ఏ ఒక్క స్నేహ పూరిత హస్తం ముందుకువచ్చి చల్లని పానీయాన్ని అందించలేదు. గజ్జె ఘల్లుమంటుంటే - ఆ మధుర ధ్వని, మంత్రదండంలా మైమరపింపచేస్తుంటే - ఎండమావులకేసి వెర్రిగా పరుగులు తీసింది. చివరకు అవి జలాశయాలు కావు, ఎండమావులు అని తెలుసుకుంది. కాని అప్పటికి ఆమెకు జీవితంలో ఏమీ మిగల్లేదు.
    ఈ నవల విశిష్టత - కథ, కధానాయిక చుట్టూ కాక, ఆమె కూతురు శిల్పచుట్టూ తిరగడం. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని ఒక పసిమనసు ఎలా బిగిసిపోయి మూగపోతుందో ఆర్ద్రంగా చెప్పారు రచయిత్రి. మానవమనస్తత్వ నిశితపరిశీలన నవలంతా కన్పిస్తుంది. పసిమనసుల లోతుల్ని కొలవగల కళ్ళు ఉన్నాయి శారదకు. చైల్డ్ సైకాలజీని ఎంతో నేర్పుగా చిత్రించారు.
    ఈ నవలలో రచయిత్రి రెండు విషయాలను ప్రధానంగా ఆవిష్కరించారు.
    ఒకటి - ఈ పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ, ముఖ్యంగా ఒక కళాకారిణి, ఎలా వివక్షకూ, దోపిడీకి గురి అవుతుందో చెప్పడం. రచయిత్రి మాటల్లోనే చూడండి - "కళను అణగదొక్కడం అంటే ఎగిరేపక్షికి రెక్కలు కోసెయ్యడమో, పాడేపిట్టకు గొంతు నులిపెయ్యడమోలాంటిది కదూ?". అవును ఆమెను! కట్టుకున్న భర్త రెక్కలు కోసేస్తే, సినిమారంగం గొంతు నులిపేసింది.
    రెండు. ఒక మాతృమూర్తి, తన బాధ్యతల్ని విస్మరించి కన్నబిడ్డనే మానసిక వ్యధకు గురిచేస్తే ఎలాంటి పరిణామాలకు తలుపులు తెరుచుకుంటాయో చెప్పడం. మైనం ముద్దలాంటి ఒక పసిపిల్లమనసు ఎంత చిత్రహింసకు గురి అయిందో చదువుతూవుంటే గుండె చిక్కబట్టినట్టుగా అవుతుంది. ఒక పసిబిడ్డ రాగద్వేషాలను ఎంతో నేర్పుగా చెప్పారు రచయిత్రి.
    ఈ పోటీయుగంలో నానాటికీ తరిగిపోతున్న మానవసంబంధాల విలువలు గురించి కూడా ఆలోచించారు రచయిత్రి. అందుకే మహోన్నత మానవత్వానికి ప్రతీకలుగా రెండు పాత్రలను సృష్టించడం జరిగింది. అందులో ఒకటి కోటయ్య పాత్ర, రెండవది సిస్టర్ ఫెర్నాండిస్ పాత్ర.
    ఆమె రచనలో శిల్ప నైపుణ్యం, శైలీ విన్యాసం పుష్కలంగా కన్పిస్తాయి. ఉదాహరణకు - మాతృప్రేమకోసం అహరహం పరితపించిన ఒక పసి హృదయం, మొదటిసారిగా తల్లి ఆర్తిలో గుండెలకు హత్తుకున్నప్పుడు పొందిన ఆనందానుభూతిని చెప్పడం తేలిక కాదు. పేరాలకు పేరాలు చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పలేకపోయామనిపిస్తుంది. కాని శారద ఆ అనుభూతిని ఒక్కవాక్యంలో ఎంత బాగా చెప్పిందో చూడండి - "శిల్పకు ఆకాశంలోని చందమామను అరచేతిలోకి అందుకున్నట్టుగా వుంది." ఒక పసిదాని ఆనందాన్ని ఇంతకంటే గొప్పగా చెప్పడం ఎలా? ఏ దేశంలోని పిల్లలకైనా, చందమామకంటే ప్రియమైనవస్తువు మరొకటి వుండదు. శ్రీరామచంద్రుడే చిన్నప్పుడు చందమామ కావాలని ఏడ్చాడట. అద్దంలో చూపించి చంద్రుడ్ని కిందకు దించి అందించిన భ్రమ కలిగిస్తేకాని ఏడుపు మానలేదట.
    శారద రచనా శిల్పాన్ని గురించి చెప్పాలంటే ఇలాంటి ఉదాహరణలు చాలా చూపించవచ్చును ఈ నవలలో.
    ఈ నవలలో కొట్టవచ్చినట్టు కన్పించే లోపం, నవల తొందర పడి హడావిడిగా ముగించినట్టుగా ఉండడం.
    ఒక మంచి నవలను తెలుగు పాఠకులకు అందించిన శారదను అభినందిస్తూ, ముందు ముందు ఇంకా మంచి నవలలు రాసి, తెలుగు నవలా సాహిత్యంలో తనదైన ఒక స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. ఆకాంక్షిస్తున్నాను.             

                                                   హైదరాబాద్     - వాసిరెడ్డి సీతాదేవి
                                                    20-6-96   

Next Page