"మనబ్బాయి..... కాలేజీకి.... ఎం.కాంలో చేరటానికి వెళుతున్నాడు..... ఆ మాత్రం కారు లేకుండా ఎలా?"
"రెంట్ కారు. అంటే చాలా ఖర్చయిపోతుంది" అన్నాడు సోమరాజు గుండెలమీద చెయ్యేసుకుంటూ.
"పదికిలోమీటర్లకు పదిలక్షలై పోతుందా" అడిగింది సూర్యాంబ చిరాకుపడిపోతూ.
"అవదా?" అన్నాడు సోమరాజు విసుగ్గా.
"నాకా మాత్రం తెలివితేటలు లేవని మీరనుకోవద్దు. అల్లరి అల్లుడు సినిమాలో వాణిశ్రీ లాంటిదాన్ని..... అవసరమైతే.... నేను డాన్సులు కూడా వెయ్యగలను."
"నీకీ వయసులో డాన్స్ లేవిటి.....? కోట శ్రీనివాసరావు అన్నమయ్య వేషం వేసినట్లు?" చికాకు పడ్డాడు సోమరాజు.
సరిగ్గా అదే సమయంలో లోపలి నుంచి వచ్చాడు ఏకైక సుపుత్ర రత్నం మధు.
"డాడీ! నన్ను ఆశీర్వదించండి. నేను ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో ఎం.కాంలో చేరటానికి వెళుతున్నాను."
'నా కొడుకు' అని చాలా గర్వంగా ఆ సమయంలో కొడుకు మధు గురించి అనుకున్నాడు.
'నా తండ్రి' అని అదే సమయంలో చాలా ప్రేమగా అనుకున్నాడు మధు.
సోమరాజు కుర్చీలో కూలబడి, గేటువేపు చూశాడు. అప్పుడే గేట్లోంచి ట్రాక్టర్ లోపలికి వస్తోంది. వేళకాని వేళ ట్రాక్టర్ రావడం ఏంటి? అని మనసులోనే మణిరత్నంలా అనుకుని-
"ఎవడ్రా.....ట్రాక్టర్ తెస్తోందీ....." అని అనబోయాడు. ఆ వెనక తన పాతకాలపు స్టాండర్డ్ కారును చూసి-
"ట్రాక్టరుకి తాడుకట్టి కారుని తీసుకుని వస్తున్నారా...... ఎందుకు?" అని భార్యవేపు తిరిగాడు భీమవరం సోమరాజు.
"మన స్టాండర్ట్ కాదు."
"మన స్టాండర్డే..... నాక్కూడా తెలుసు..... ఎందుకని?"
"ఎందుకో మీకు తెలీదా? మన బాబు ఏలూరు వెళుతున్నాడు గదా ఎం.కాంలో చేరటానికి."
"ఆ కారులో ఏ వుందని? ఇంజనుందా? హరనుందా? బ్రేకులు వున్నాయా? దాని టైర్లు చూశావా? ఆ మధ్య పాడైపొతే, ట్రాక్టరు టైర్లు వేయించాను. అందుకే అది ట్రాక్టర్ అంత పొడవుంది"
"మొదటి రోజైనా కారులో బాబుని కాలేజీకి పంపకపోతే బావోదు. బొచ్చెడు ఆస్తి వుంది. ఓక్ కొడుకు. పోయేటప్పుడు కట్టుకెళ్ళిపోతామా? మీ డబ్బుల లెక్కలకి నేను కాబట్టి తట్టుకొని సంసారం చేస్తున్నాను. ఇంకొకరైతే ఆ బిల్ గేట్స్ ఇండియా వచ్చినప్పుడు వాడితో లేచిపోయేవారే. మీ పద్ధతేం బాగోలేదు."
"ఏం బావోదూ? నేను కారులో వెళ్ళి చదువుకున్నానా? ఎడ్లబండిలో వెళ్ళాను. అయిదో క్లాసు...... ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ లో ప్యాసయ్యాను" గర్వంగా, మీసాలు మెలేసుకుంటూ అన్నాడు భీమవరం సోమరాజు.
"టాపిక్ మారిస్తే బావుంటుంది....." గట్టిగా అని, "ఒరేయ్ దసరా బుల్లోడా..... నీకు
డ్రయివింగ్ వచ్చా?" అని అడిగింది సూర్యాంబ - మొగుడి మాటల్ని లెక్కలేనట్లుగా తీసిపారేస్తూ.
"వచ్చండీ.... లూనా నడిపాను. తమకు తెల్సుకదా...." చాలా వినయంగా అన్నాడు దసరాబుల్లోడు.
"అమ్మా! మీ గొడవలు నాకనవసరం. నన్ను ఆశీర్వదించండి....." అంటూ తల్లి సూర్యాంబ కాళ్ళకు నమస్కరించాడు మధు.
"బాబూ! వెళ్ళిరా.....! బాగా చదువుకుని, మీ అత్యాశ నాన్న కోరిక తీర్చడం కోసం ధనవంతురాలైన అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్ అయిన పిల్లని పెళ్ళి చేసుకుని, ఇండియాకు రా....." చాలా ప్రేమతో అంది సూర్యాంబ. ఆమె మాటల్లో మొగుడిమీద వెటకారం ధ్వనించింది.
"ఆ ఇండియా నుంచి మానూరికి తీసుకుని రావడం ఏమిటి? ఇండియా అంటే మనం ఉన్నదే కదూ!" విసుక్కుంటూ అన్నాడు మధు.
"ఇండియా..... అంటే భారతదేశం.... సింధు దేశం. హిందూ దేశం. ఇండియాలో కొన్ని రాష్ట్రాలున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అంధ్రప్రదేశ్ లో పెదపాడు ఒకటి. అందుచేత ఇండియా నుంచి మనూరికి తీసుకొస్తాను అనగూడదు" భర్తమీద చిరాకు పడుతూ అంది సూర్యాంబ.
"నా దగ్గర మాప్ లేదులే, అందువల్ల తప్పు మాట్లాడాను. నువ్వు బాగా చదువుకుని..... కానీసం కానిస్టేబులన్నా అవ్వు..... కొన్ని కేసులు కోర్టులో వున్నాయి...." అని అన్నాడు సోమరాజు కొడుకుకేసి గర్వంగా చూసుకుంటూ.
తల్లీ కొడుకులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని విస్తుపోయారు.
నాన్నా! వెళ్ళొస్తాను...... నన్ను ఆశీర్వదించండి" తండ్రి వ్యవహారం బాగా తెలిసిన మధు వేగంగా కాళ్ళకు నమస్కరించి కారెక్కాడు- మరొక్కక్షణం కూడా వృథా చేయకుండా.
ఆ కారు ఆ ఊరు దాటకుండానే ఆగిపోయింది.
అప్పుడు-
సూట్ కేస్ తో రోడ్డెక్కిన మధుకి, ఏలూరు వెళ్ళే బస్సు దొరికింది.
తెల్లవారుజామున నలుగుగంటల ప్రాంతంలో ఏలూరు బస్టాండ్ లో దిగాడు మధు.
* * *
ఏలూరులో, వంతెనకు అరకిలోమీటరు దూరంలో వుందా వీధి. ఆ వీధిలో ఆ ఇల్లు బావుంటుంది.
ఉదయం ఏడున్నర గంటల సమయం-
అటూ ఇటూ నడుస్తున్నాడు నారాయణ. నారాయణ పూర్తిపేరు మైదానం నారాయణ.
ఏలూరు పవర్ పేట దగ్గర నుంచి పట్టాల మీద నడుచుకుంటూ చాలా దూరం వచ్చేశాడు నారాయణ.
'పట్టాల మీద నడిచే రైలెక్కితే డబ్బులడుతారు. డైరెక్ట్ గా ఆ పట్టాల మీద నడిస్తే రెండు రూపాయల ఆదా అయ్యాయి. ఎవరికీ టికెట్ అడిగే హక్కు అధికారం, రెండూ లేవు. ఏమి హాయిలే హలా.....' అని అనుకుని సంబరపడిపోయాడు నారాయణ.
దూరంగా ఎండిపోయిన చెరువు, ఆ పక్కన పాడుబడిన బిల్డింగ్- ఆ వెనక తాటిచెట్లు..... తుప్పలు, డొంకలు, వాటికి దూరంగా పూరిపాక.
ఆ పాకవేపు వెళ్ళి ఎత్తయిన గట్టుమీద కూర్చున్నాడు నారాయణ. ఎవరో ఆడమనిషి పరిగెత్తుకుని వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు. 'ఎవరదీ' అని అనుకున్నాడు.
సడన్ గా నారాయణకి చలం రాసిన మైదానం నవల అందులో రాజేశ్వరి కేరక్టరు, సాయిబు కారెక్టరూ గుర్తుకొచ్చాయి. చలం మైదానం ఇక్కడే ఏలూరులో వుండగానే రాశాడట. అప్పుడు డి.ఇ.ఒ.గా ఇక్కడే వుండేవాడట. అదిగో తుప్పలూ, డొంకలు, ఆ పక్కన గుడిసె.
ఆ గుడిసెలోనే రాజేశ్వరి వుండేది.
రాజేశ్వరి.....
రాజేశ్వరి లాంటి పెళ్ళాం వుండాలి. కానీ ఎవడితోనూ లేచిపోకూడదు. లేచిపోతే మళ్ళీ ప్రమాదం.
అందుకే తను అసలు పెళ్ళే చేసుకోకూడదనుకున్నాడు. పెళ్ళి చేసుకుంటే లేచిపోయి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. కాని కుదరలేదు. బలవంతంగా తనకు తండ్రి పెళ్ళి చేశాడు. ఆడవాళ్ళు లేచిపోతారు గానీ, మగవాళ్ళు లేచిపోతారా?..... మగవాళ్ళు లేచిపోకూడదు.
'మైదానం'
మగాళ్ళూ, ఆడాళ్ళూ కలిసికట్టుగా లేచిపోయి, ఊరు శివార్లలో గుడిసెలు గట్రా వేసుకుని ఇసుకలో పొర్లుతూ, నీళ్లలో తడుస్తూ ప్రేమించుకోవాలి.
అదే నిజమైన ప్రేమ.....
ప్రేమంటే తనకు బాగా తెలుసు కాబట్టి, ఎవ్వరూ తనని ప్రేమించకుండా జాగ్రత్తపడ్డాడు.
తెలియకపొతే ప్రేమ పెద్దబావిలాంటిది. అందులో పడిపోవటం ఖాయం.
జీవితం కొయ్యగుర్రం లాంటిది అంటాడు చలం.
ఆడాళ్ళు చలనంలేని కొయ్యబొమ్మలు ప్రాణం పొయ్యాలి.
ప్రేమకోసం పరితపించే వారికి తను హెల్ప్ చేయాలి.
చలం చేసినట్టు.
అందుకే ఈరోజు నుంచితనకి మైదానం ఆదర్శం.
ప్రేమ మైదానంలా విశాలంగా ఉండాలి.
హృదయం మైదానంలా వుండాలి.
ఇవాల్టి నుంచి తన పేరు 'మైదానం నారాయణ.'
మైదానం నారాయణ గట్టిగా అనుకుని మెల్లగా నవ్వాడు.
ఈ సమయంలో తనిలా గుట్టల్లో ఒక్కడే కూర్చుని నవ్వుకుంటే, ఈ దృశ్యాన్ని కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే 'పిచ్చివాడు' అని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి......
వెళ్ళిపోవాలి అనుకున్నాడు.
మళ్ళీ పట్టాలమీంచి నడుచుకుని వూళ్ళో కొచ్చాడు.
మళ్ళీ రెండు రూపాయల రైల్వేవాళ్ళకి నష్టాన్ని కలుగజేసినందుకు హాయిగా ఆనందించాడు.
గుమ్మం ఎక్కుతున్నప్పుడు మధు అతని కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు.
"ఏమయ్యా..... నువ్విప్పుడా రావడం? అరగంట లేటు" అన్నాడు మైదానం నారాయణ.
"అరగంట లేటంటే..... మా నాన్నగారు మీకు టెలిగ్రామ్ కొట్టారా సార్?" అడిగాడు మధు.
"టెలిగ్రామ్స్ కొట్టడం ఏమిటి..... చాదస్తంగా? నువ్వు వస్తున్నావని నాకు కలొచ్చింది. కలలో వాచ్ కనబడింది. అంతే...... ఆ మాత్రం టైమ్ సెన్స్ లేదనుకున్నావా?" చాలా కోపంగా అడిగాడు మైదానం నారాయణ.
అదే సమయంలో 'బాబూ!' అనే ఆత్మీయమైన పిలుపు వినబడింది. పాతికేళ్ళ వయసులో కనబడింది.
"అక్కయ్యా! నేను ఫలానా....." అని చెప్పబోయాడు మధు.
"నేను మీ అక్కయ్యనేమిటి....... అసహ్యంగా....." అంది ఆ అమ్మాయి.
మధు ఆవిడని చూసి ఆ మాట అనగానే లెక్చరర్ మైదానం నారాయణగారి కూతురి 'ఈవిడ కాదు' అని అనుకుని, ఎలా పిలవాలో తెలీక-
"క్షమించమ్మా..... నేను మాస్టారి దగ్గర ....." ఏదో అనబోయాడు.
"మాస్టారా...... పాడా.... నా జీవితాన్ని పాడుచేశాడు" అని అంది ఆవిడ.
నారాయణ చాలా దీనంగా చూశాడు. మధు కూడా 'జన్మభూమి' టైపులో ఇంప్రింట్ లా మహాదీనంగా వున్నాడు.
"మధూ....!నేనూ, మీ నాన్న, ఆ పిసినారి వెధవ చిన్నప్పుడు ఫ్రెండ్స్. నాదగ్గర కాపీకొట్టి వాడు ఐదోక్లాసు పాసయ్యాడు. ఆ విషయాన్ని నా జీవితంలో నేనెప్పుడూ మార్చిపోలేను. అందుకే స్నేహం గొప్పదని నేనంటాను. ఉన్న ఊరు, కన్నతల్లి చాలా గొప్పది. మేరాపల్లెటూరు మహాన్ హై..... తప్పుగా అనుకోకు...... ఇంతకీ విషయం ఏంటంటే- ఇందాక వచ్చిన అమ్మాయి నా కూతురు కాదు. మా ఆవిడ........ రెండో ఆవిడ. ఎప్పుడో ప్రేమించాను. మూడు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నాను. కొంచెం వయసులో చిన్న నేనేదో సరిపెట్టుకుంటున్నాను. నువ్వు వేరేగా ఆలోచించకు. మీ నాన్నకు, నాకూ మధ్య స్నేహం చెడిపోతుంది" అన్నాడు మధుకేసి అనుమానంగా చూస్తూ.
"నాకు తెలీదు సార్..... క్షమించండి సార్! నాకు ఏ విషయం తెలీకుండా మా అమ్మ పెంచింది సార్..... సార్! ఒక్క విషయం చెపుతాను వింటారా సార్?" అడిగాడు మధు.
"చెప్పు" అన్నాడు నారాయణ.
"సార్! అమెరికాలోని ఓరగాన్ సిటీ ప్రాంతానికి చెందిన పల్లెటూళ్ళలో ఒక వ్యాపారం వుంది. అక్కడ ఆవులు, గేదెలు చాలా ఎక్కువగా వుంటాయి. పాల వ్యాపారం ఎక్కువ. ఆ పాలు మన పాలు మాదిరి తెల్లగా వుండవు సార్..... నీళ్ళలా వుంటాయి సార్!"
"పాలు నీళ్ళలా వుంటాయా...... చాలా ఆశ్చర్యంగా వుందే...... నీకు చాలా విషయాలు తెల్సినట్టున్నాయే?"