Previous Page Next Page 
సుహాసిని పేజి 48


    వాళ్ళక్కణ్ణించి బయల్దేరబోతుండగా బోట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది. హాస కులాసాగానే ఉందనీ, తాము బయల్దేరబోతున్నామనిగానీ గౌతమ్ వారికి చెప్పాడు.

    అతడు ఫోన్ పెట్టేశాక_ "మనం బోట్ హౌస్ కు కాదు వెడ్తూంట." అంది హాస.

    "ఎక్కడికీ మరి?"

    "నీకు తెలుసు"


                           *    *    *    *


    చిన్న గది. సదుపాయాలు ఫరవాలేదు.

    హాస, గౌతమ్ నేలమీద ఒకరికొకరు ఎదురుగా....

    "మీ అమ్మగారు కంగారు పడతారు" అన్నాడు గౌతమ్.

    "నన్ను కంగారు పెట్టిన మనిషి తను కూడా కంగారుపడనీ"

    "ఆవిణ్ణి తప్పుపట్టకు...."

    "భూతల స్వర్గం అని ఇక్కడకు వస్తే ఇక్కడ రాక్షసుల్ని చూడాల్సొచ్చింది. నాకు ప్రాణభయం లేదు. కానీ రాక్షసుల్ని చూడాల్సి రావడం కోరుకోతగ్గ అనుభవం కాదు"

    "నువ్వు చూసిన రాక్షసుల్లో ఒక్కడి క్కూడా రమణ అన్న పేరు వుండకూడదు...."

    "ఉంటుంది...." పట్టుదలగా అంది హాస.

    "రమణ మంచివాడే కాదు, మహాత్ముడు"

    "ప్లీజ్! మహాత్ముడన్న పదాన్ని కించపరచకు...."

    "హాసా! అసలు విషయం నీకు తెలియదు__"

    "ఏమిటా అసలు విషయం?"

    "ఏమిటంటే....?" అని ఆగిపోయాడు గౌతమ్"

    "నాకు బ్లడ్ కాన్సరు...." పూర్తి చేసింది హాస.

    "ఎవరన్నారు?"

    "మా అమ్మ నీకు నా జబ్బు గురించి చెప్పగానే నువ్వు నన్ను తల్చుకుని పడ్డ ఆక్రోశమంతా నాకు వినిపిస్తుందని నీకు తెలియదా?"

    గౌతమ్ దెబ్బతిన్నాడు.

    అవును, తను హాస దగ్గర రహస్యమెలా దాచగలడు? తనదాకా రాగానే హాస రహస్యం హాసకు తెలిసిపోయింది.

    "నాకు బ్లడ్ కాన్సరని తెలియగానే నాకు నన్ను వదిలి పెట్టడానికి బదులు, అంతా కలసి నన్ను రోజూ చంపుతున్నారు...." అందామె.

    ఆమె గొంతు విని ఏడుస్తుందేమోనని అనుమానించి ఆమెవంక చూశాడు గౌతమ్. ఆమె కళ్ళలో సుడులై తిరిగే నీళ్ళు, ఆమె హాస అని గ్రహించడం వల్లనేమో ఆనంద భాష్పాలుగా మారిపోయాయి.

    "ఇవి ఆనందభాష్పాలే! నీవంటి ప్రియుడు నాకున్నందుకు నా శరీరం సంతోషంతో ఉప్పొంగి పోతోంది ప్రియా! ఇంతకాలం నువ్వు నన్నెందుకు కలుసుకోలేదు?"

    అతను మాట్లాడలేదు.

    "నీవు నాతో మాట్లాడేటప్పుడు నీ మాటలూ వినిపించేవి, నీ హృదయభావాలూ తెలిసేవి. నీవు త్యాగమూర్తివి. నీ ప్రేమలో స్వార్ధం లేదు. నిజంగా నేను జీవించి మనకు కళ్యాణమయితే అది ఇతిహాస కళ్యాణమే అవుతుంది...." అవుతుంది.

    "హాసా! వున్నట్లుండి నన్నింతగా పొగడకు. నేను చాలా సామాన్యుణ్ణి...."

    "తను సామాన్యుడినని గుర్తించడమే మహాత్ముల మొదటి లక్షణం"

    "నిజం చెబుతున్నాను. మహాత్ముడంటే రమణ...."

    "రమణ కదేమిటో నాకు తెలియదు. కానీ నిజం నేనూ చెబుతున్నాను. అతడిలో నేను రాక్షసుణ్ని చూశాను. అదీ ఈ రాత్రి ఎనిమిది గంటలకు క్షణకాలం పాటైనా రాక్షసుడిగా మారగలిగిన వ్యక్తి ఎన్నటికీ మహాత్ముడు కాలేడు...."

    గౌతమ్ నిట్టూర్చాడు.

    "బ్లడ్ కాన్సర్....ఇది ఎంత మందికి రావడం లేదు! ఎంతమంది దీనితో పోవడం లేదు! వాళ్ళలో నేనూ ఒకతిని. దీనికి మావాళ్ళింత హడావుడి చేయాలా? పోయేలోగా పెళ్ళి చేసుకుని తీరాలనుందా?" గొణుక్కుంటున్నట్లుంది హాస. 

    "ఇక బోట్ హౌస్ కి వెడదామా?" అన్నాడు గౌతమ్.

    హాస తల అడ్డంగా ఊపి, "అంతగా వాళ్ళు కంగారు పడతారన్న భయం నీకుంటే వాళ్ళకు ఫోన్ చేసి విషయం చెప్పు" అంది.


                                                                          *    *    *    *


    ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు చూశాడు గౌతమ్.

    అక్కడ బల్లమీద పెట్టి ఉన్నాయి దొంతరగా. అచ్చు వేసిన కాగితాలు. నెంబరు దొరికేలోగా ఓ కాగితం తీసి యధాలాపంగా చదివి ఉలిక్కిపడ్డాడతడు.

    "ఏమందుకూ లొంగని భయంకర వ్యాధులకి మూలికా వైద్యం! అన్ని ఆశలూ వదులుకుని మృత్యు ముఖంలో కూర్చుని రోజులు లెక్కించే అభాగ్యులను నూరేళ్ళాయుష్షు పోసే సర్వభాషానందస్వామి ఆశ్రమం వివరాలు తెలుసుకోండి!" అని ఇంగ్లీషులో వ్రాసి వుంది.

    ఆ వివరాలు చదువుకుని కాగితాన్ని జేబులో పెట్టుకున్నాడు గౌతమ్.

    ఈలోగా లైన్ దొరికింది. హాస మానసిక పరిస్థితి చెప్పి, ఆమెకిప్పుడందరి మీదా కోపంగా వుంది. నేనామెకు నచ్చజెబుతాను. మీరు మాత్రం కంగారు పడకండి. మళ్ళీ రేపు వుదయం ఫోన్ చేస్తాను" అన్నాడు గౌతమ్.


                             *    *    *    *


    గౌతమ్ వెళ్ళేసరికి హాస నిద్రపోయింది. పసిపాప ముఖంలా ఎంతో ప్రశాంతంగా వున్న ఆమె వదనారవిందాన్ని చూసి గౌతమ్ పరవశించి పోయాడు.

    "భగవంతుడా, నేనేం తప్పు చేశాను? ఈమె ఏం తప్పు చేసింది? మమ్మల్నెందుకిలా పరీక్షిస్తున్నావు?" అనుకున్నాడతడు.


                           *    *    *    *


    గౌతమ్ నిద్ర లేచేసరికి ఏడయింది. అప్పటికి హాస స్నానం అయిపోయింది. రాత్రి బట్టలే వేసుకున్నప్పటికీ ఆమె మంచులో తడిసిన పువ్వులా మెరిసిపోతోంది.

    "బాగా నిద్ర పట్టిందా?" అన్నాడు గౌతమ్.

    "నువ్వున్నావుగా, ఇక నాకే చింతా లేదు" అంది హాస.

    "నేను....నేను నీకేమవుతానని?" అన్నాడు గౌతమ్.

    "అన్నీ అవుతావు...."

    "ఎలా?"

    "నా తలిదండ్రులు,వాళ్ళు, నాకోసం పరితపించే వాళ్ళు.... ఎవ్వరూ సాధించలేనిది నా విషయంలో నువ్వు సాధించావు...."

    "హాసా! నేను నీకు నచ్చానా?"

    "అలా అడక్కు. నా చివరిరోజులు నీతోనే గడపాలని అనుకుంటున్నా"

    గౌతమ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి, "నీకు జన్మనిచ్చిన వాళ్ళు నీకిచ్చిన ప్రేమను మరిచిపోకు. ఈ చివరిరోజులు వాళ్ళకోసం కేటాయించడం నీ కర్తవ్యం...."

    "ఇప్పుడు నాకు వాళ్ళని చూస్తే ఏడుపొస్తుందని భయంగా ఉంది. ఎన్నో ఏళ్ళుగా తెలిసిన వాళ్ళకంటే కొన్నాళ్ళుగా నాతో మాట్లాడుతున్న నీ సమక్షంలోనే నేను నవ్వగలననిపిస్తోంది, ఎందుకో నిన్ను చూస్తూంటే నాకు త్వరగా చావు రాసిపెట్టుందనిపించడం లేదు"

    గౌతమ్ మాట్లాడకుండా వింటూంటే ఆమె కొనసాగించింది.

    "దొంగ ప్రమాదాన్ని సృష్టించి సుమతిని పంపి నన్నోసారి ప్రమాదం నుంచి రక్షించావు, దొంగ పోలీసుల్ని పంపి రాక్షసులని తరిమి నన్ను మళ్ళీ రక్షించావు. మళ్ళీ ఏ దొంగ వైద్యుడిని సృష్టించి నా రోగాన్ని కూడా నయం చేయించి నన్ను శాశ్వతంగా నీదాన్ని చేసుకోలేవూ? ఆగిందామె.

    "నా చేతనైతే ఆ పనే చేసేవాడిని...." 

    "ఎందుకు చేత కాదు? నీ ప్రేమబలం అపూర్వం. అది ఎంత దూరంలో వున్నా మనని సన్నిహితుల్ని చేస్తోంది.... నా కాన్సర్ సెల్సుని బద్దలుకొట్టి నా రక్తాన్ని శుద్ధిపరచలేదా?" ఆవేశంగా అంది హాస.

    గౌతమ్ విషాదంగా నవ్వి ఊరుకున్నాడు.

    "నిజం చెబుతున్నాను గౌతమ్! నాలో ఇప్పుడు కొత్త శక్తి వచ్చింది. చెవిలో వినబడే నీ రూపం నాకిలా కనబడుతుందని నేనూహించలేదు. అసలు నీకో ఆకారమున్నదనీ, నువ్వో ప్రాణమున్న మనిషివనీ నేను నమ్మలేదు. కానీ అలా జరిగితే బాగుండునని చాలాసార్లు కోరుకున్నాను.... నా కోరిక నీకు రూపాన్నిచ్చిందేమోమరి!"

    మాట్లాడావన్నా గౌతమ్ కి మాటలు రావడం లేదు.

    "గౌతమ్! మనం మన కోసమే పుట్టాం. అందుకే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు మనమే ఇక్కడ కలుసుకున్నాం...."

    "బహుశా ఇంకెక్కడా కలుసుకోమేమో!" అన్నాడు గౌతమ్.

    "గౌతమ్! నన్ను సర్వభాషానందస్వామి ఆశ్రమంలో జేర్పించవూ!" అంది హాస.

    గౌతమ్ ఉలిక్కిపడి "ఆ ఆశ్రమం గురించి నీకు తెలుసా?" అన్నాడు.

    "నాకంటే ముందే నీకు తెలుసు. నీ జేబులోంచి క్రిందపడ్డ కాగితం ఈ రోజుదయమే నేను చదివాను" అంది హాస.

    "కానీ అవన్నీ వట్టి బూటకాలు...." అన్నాడు గౌతమ్.

    "ఈ ప్రపంచంలో బూటకం కానిదేమిటి? దేవుడు మాత్రం బూటకం కాడా? ఏ దారీ లేని వాళ్ళకే ఇలాంటి నమ్మకాలు...." అంది హాస.


                                                                 *    *    *    *


    "అమ్మా!

    నేనెక్కడున్నానని వెతకొద్దు. నా కోసం కంగారుపడొద్దు. నువ్వు నమ్మే ఆ భగవంతుణ్ని మించిన ప్రేమమూర్తి సంరక్షణలో వున్నాను. అన్నీ సక్రమంగా జరిగితే జూన్ ఏడున అనగా నా పుట్టిన రోజున మనింట్లో కలుసుకుంటాను. నేను లేకుండా కాశ్మీర్ నుంచి వెనక్కు వెళ్ళాల్సొస్తుందన్న భయంతో నువ్విక్కడికొచ్చావు. అలాగే వెళుతున్నావు.... ఎటొచ్చీ నేను మళ్ళీ కనిపిస్తానన్న ఆశ నీలో వుంటుంది. 

 Previous Page Next Page