Previous Page Next Page 
సుహాసిని పేజి 47


    "హమ్మయ్య! ఏడుస్తావేమోనని భయపడ్డాను...." అన్నాడు రమణ.

    "ఏడుపు నాకు చేతకాదు...."

    రమణ ఆమె చేయి పట్టుకున్నాడు.

    హాస తన శక్తినంతా క్రీడీకరించి అతణ్ణి విదిలించుకుంది.

    ఆమెలో అంత బలాన్నూహించని రమణ దూరంగా వెళ్ళి పడ్డాడు.

    హాస అతన్ని సమీపించి చేయి అందించింది.

    వెల్లకిలా పడ్డ రమణకు లేవడం కాస్త కష్టంగానే వుంది. అతడామె చేయందుకుని లేచి నిలబడ్డాడు.

    "ఇది నా చెయ్యి వదులు" అందామె.

    "నువ్వందించిన చేయి ఇది. దీన్ని నేను వదలను" అన్నాడతను.

    "బోట్ హౌస్ లో నాకు విషం పెట్టిన వ్యక్తి నన్నీ ప్రపంచానికి దూరం చేయడం ఇష్టంలేక నిజం చెప్పి, సమయానికి నన్ను రక్షించాడు. అది నువ్వు కల్పించిన కట్టుకథ కాకపోతే ఇప్పుడు నువ్వు నా చేయి వదిలి అతడిలాగే ఉన్నతుడివనిపించుకుంటావు...."

    రమణ ఆమె చేయి వదిలాడు. అతడిలో అంత త్వరగా మంచి మార్పు వచ్చిందని ఆమె ఆశ్చర్యపడేలోగా రమణ నేలకొరిగాడు.

    "ఏమయింది?" అందామె.

    రమణ మాట్లాడలేదు. కానీ గది తలుపులు తెరుచుకున్నాయి.

    గది గుమ్మంలో ముగ్గురున్నారు. వారిలో దేవేంద్రను హాస గుర్తుపట్టింది.

    "ఎవరు మీరు?" అందామె కంగారుగా.

    "నిన్ను రమణనుంచి రక్షించింది మేమే.... ....దూరాన్నుంచి మత్తుమందు షూట్ చేశాం" అన్నాడు రవీంద్ర.

    "చాలా థాంక్స్...."

    "థాంక్స్ వద్దు. వేటగాడి బారినుంచి లేడిని తప్పించి వేటాడ్డం మా హాబీ! అందులో మొదటి స్టెప్పు పూర్తయింది. రెండో స్టెప్పు మొదలు_"

    "అంటే!"

    "నువ్వు_మేము ముగ్గురం ఈ రాత్రి....అన్నీ కలిపి ఓ వింత అనుభవం. ఆ అనుభవం నీకూ మంచిది. ఎందుకంటే ఇదే నీకు ఆఖరు రాత్రి"

    "ఎందుకని?"

    "బోట్ హౌస్ లో విషప్రయోగం తప్పించుకున్నావు. ఇప్పుడిక తప్పించుకోలేవు. అసలు నిన్ను వెంటనే ఫినిష్ చేసి పోవాలి. కానీ ఇక్కడి ఏర్పాట్లు చూసేక వీటిని ఉపయోగించుకోవాలనిపించింది. పోయే ముందు నీకూ ఆ అనుభవం మంచిదే కదా!" అన్నాడు రవీంద్ర.

    "నన్ను చంపడం వల్ల మీకేం ప్రయోజనం!"

    "చెప్పను. ఎందుకంటే అది తెల్సుకోవడంవల్ల నీకే ప్రయోజనమూ లేదు...." అన్నాడు రవీంద్ర.

    ఆమె మనోహరంగా నవ్వింది.

    "ఇప్పుడు నవ్వుతున్నావా? అయితే నీకిష్టమేనన్న మాట!"

    "ఈ ప్రపంచంలో ఏ సంఘటనా ఒకరి యిష్టాయిష్టాలతో నడవదు. ఆ భగవత్సంకల్పం ఎలాగుంటే అలా జరుగుతుంది...."

    "అయితే నువ్వు ప్రతిఘటించవన్న మాట...." అన్నాడు రాజేంద్ర.

    ఆమె తల అడ్డంగా వూపింది.

    రవీంద్ర జేబులోంచి చిన్న పుస్తకం తీసి- "ప్రతిఘతిస్తే వేట, లేకుంటే ఆట" అని పుస్తకం మూసేసి జేబులో పెట్టేసుకున్నాడు.

    అప్పుడు ఆమె చెవిలో- "హాసా! నేను....అక్కడేం జరిగింది? నీ గుండె వేగంగా కొట్టుకుంటుందేం?" అన్న మాటలు వినిపించాయి.

    "అరే! నీ సంగతే మర్చిపోయాను. నువ్వు దగ్గరలోనే ఉన్నావా? వుంటే వచ్చి నన్ను కాపాడు. ముగ్గురు దుర్మార్గులు రమణకు స్పృహ పోగొట్టి నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు" అందామె.

    "ఎవరితో మాట్లాడుతున్నావు?" అడిగాడు రాజేంద్ర.

    "అయామ్ ఇన్ స్పెక్టర్ హాస! హెడ్ క్వార్టర్స్ తో మాట్లాడుతున్నాను__"

    "షటప్!" అన్నాడు రవీంద్ర.

    అంతలోనే ఆమె చెవిలో- "హాసా! పోలీసులు బంగళాను చుట్టుముట్టారని చెప్పు" అన్న మాటలు వినిపించాయి.

    "పోలీసులు బంగళా చుట్టూ వున్నారు. కావాలంటే వెళ్ళి చూసుకోండి" అందామె.

    ఆమె మాటలు పూర్తికాకుండానే హాల్లో పోలీస్ విజిల్ వినిపించింది.

    రవీంద్ర బృందం కలవరపడ్డారు. వాళ్ళు ముందు గదిలోంచి పారిపోయారు. వాళ్ళను పోలీసు యూనిఫామ్ లో వున్న యిద్దరు వ్యక్తులు తరిమారు.

    గౌతమ్ హాస గదిలో అడుగుపెట్టాడు.

    హాస అలాగే నిలబడి వుంది. జరిగిందంతా ఆమెకు కలలా ఉంది.

    "హాసా! నా స్నేహితులు వాళ్ళను తరుముతున్నారు. నిన్ను క్షేమముగా నీ హౌస్ బోటులో చేరుస్తాను" అన్నాడు గౌతమ్.

    హాస అతన్నే చూస్తోంది. అతడినామె గుర్తించిందో లేదో తెలీదు. తనకు ప్రమాదం తప్పిందన్న విషయం ఆమెకు తెలిసిందో లేదో తెలీదు.

    గౌతమ్ కు ఆత్రుతగా వుంది....తనను తనుగా ఆమెకు పరిచయం చేసుకోవాలని!

    హాస అతన్నే చూస్తూ కుప్పకూలిపోయింది. ఆమె మెంటల్ గా షాక్ తిన్నదని గౌతమ్ కు అప్పుడర్ధమయింది.


                                         26


    గౌతమ్ హాసను హాస్పిటల్లో చేర్చి తను బోట్ హౌస్ కు వెళ్ళి సుభద్రకు జరిగింది చెప్పి- "సమయానికి నేను లేకపోతే హాస బ్రతుకు అన్యాయమయుండేది. ఓ అపరచితుణ్ని మీరంతా ఎలా నమ్మారో నాకర్ధం కావడంలేదు...." అన్నాడు.

    సుభద్ర హాసకు ప్రమాదం లేదని రూఢి చేసుకుని రమణ గురించి అడిగింది.

    "అతన్ని పోలీసుల కప్పగిద్డామనుకుంటున్నాను" అన్నాడు గౌతమ్.

    "బాబూ! నువ్వెవరివో నాకు తెలియదు. నువ్వా రమణని అపార్ధం చేసుకున్నావు. అతడు సామాన్యుడు కాడు....మహాత్ముడు__" అంది సుభద్ర.

    రమణ మహాత్ముడెలాగయ్యాడో తెలుసుకున్న గౌతమ్ షాక్ తిన్నాడు.

    హాసకు బ్లడ్ కాన్సరా?"

    ఒక్కసారి గౌతమ్ నరనరాలూ కంపించిపోయాయి.

    "ఔను బాబూ! రోజుల్లో ఉన్న పిల్లను పెళ్ళి చేసుకుందామనుకుంటున్న ఆ లక్షాధికారి ప్రేమను ఎలా విలువకట్టాలో తెలియడం లేదు. నువ్వనవసరంగా ఆ మహానుభావుడికి అనుమానించావు" అంది సుభద్ర.

    "నావల్ల పొరపాటే జరిగింది" అన్నాడు గౌతమ్.

    "బాబూ! అమ్మాయి దగ్గరకు వెడదామా?" అంది సుభద్ర.

    "హాసా! నిన్నెలా చూడగలను? నిన్నిక ఎన్నాళ్లో చూడలేనని తెల్సి ఎలా నిన్ను చూడగలను? ఇలా ఎందుకు జరిగింది? నువ్వు సుఖంగా ఉంటే చాలనుకున్నను తప్ప నిన్ను కోరుకులేదే! నా కోరికలో ఏదయినా తప్పు వుందా? నా ఆలోచనలో ఏదయినా తప్పుందా? నూరేళ్ళు జీవించాల్సినదానివి. ఇరవై నిండకుండా నీకు బ్లడ్ కాన్సరా? ఏమిటిది హాసా?" అతడి మనస్సు ఆక్రోశించింది.

    గౌతమ్ చటుక్కున అక్కడే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చాడు.

    "ఎందుకు బాబూ ఏడుస్తావు?" అంది సుభద్ర ఆశ్చర్యంగా. "కన్నవాళ్ళం మేమే గుండె రాయి చేసుకుని వుంటున్నాం. పద, వెళ్ళి దాన్ని చూసి ఇక్కడికి తీసుకొద్దాం."

    "ఇప్పుడు టైము పదకొండు దాటింది. బయట చలిగా ఉంది. మీరెందుకు? హాసను నేను చూసుకుంటాను. ఆమెకొచ్చిన భయమేం లేదు. అనుమానం కలిగినప్పుడల్లా మీరు హాస్పిటల్ కి ఫోన్ చేయొచ్చు" అని గౌతమ్ ఆమెకో నంబరిచ్చాడు.   

    "హాస్పిటల్ మంచిదేనా? అక్కడ దానికేం ప్రమాదముండదు కదా?" అంది సుభద్ర.

    "ఆ హాస్పిటల్లో ప్రస్తుతం రాజకీయ నాయకుడికా ట్రీట్ మెంటవుతోంది. అక్కడ పోలీసు, మిలటరీ రక్షణ వుంది. అందుకే అక్కడ చేర్చాను. మీకేం భయలేదు__" అంటూ బయలుదేరాడు గౌతమ్.

    "బాబూ! చిన్న మాట__దానికి జబ్బు గురించి చెప్పొద్దు" హెచ్చరించింది సుభద్ర.

    తలూపి వెళ్ళిపోయాడు గౌతమ్.

    అతను కనుమరుగవగానే సుభద్ర హౌస్ బోట్ యజమానిని పిలిచి వచ్చీరాని ఇంగ్లీష్, హిందీ కలగలిపి, సౌంజ్ఞలు చేసి జరిగింది చెప్పి గౌతమ్ ఇచ్చిన నంబర్ కు ఫోన్ చేయించింది.

    ఆ హాస్పిటల్లో హాస అనే అమ్మాయి అడ్మిటయిందనీ, యింకా స్పృహ రాలేదనీ, కానీ భయపడాల్సింది లేదనీ జవాబు వచ్చింది.


                          *    *    *    *


    హాస కళ్ళు తెరిచేసరికి ఎదురుగా గౌతమ్.

    ఎంతో కాలంనుంచి ఎరిగున్న దానిలా హాస అతణ్ణి చూసి నవ్వింది.

    ఆ నవ్వుకు గౌతమ్ పులకరించిపోయాడు. అలాంటి నవ్వు కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని అతనికి అనిపించింది.

    "హాసా!" అన్నాయతడి పెదాలు. 

    ఆ పెదాల కదలిక శబ్దంగా మారి ఆమె చెవిలో వినిపించింది.

    "ఊఁ" అందామె.

    అతడామెకు బాగా దగ్గరయ్యాడు.

    హాస లేచి కూర్చుని- "పద, పోదాం" అంది.

    "ఎక్కడికి?" అన్నాడతను.

    "నువ్వెక్కడుంటావో అక్కడికి!"

    గౌతమ్ ఆశ్చర్యంగా_ "ఏమిటి నువ్వనేది?" అన్నాడు.

    "అన్నీ తర్వాత చెబుతాను. ముందు నన్నిక్కడినించి తీసుకుపో"

 Previous Page Next Page