Previous Page Next Page 
షా పేజి 47

 

    "ఆయామ్ సారీ!" అన్నాడతను. "ఈ విషయం నాకు తెలీదు. నీ బాధ నేను అర్ధం చేసుకోగలను......."
    సృజన్ నిశ్శబ్దంగా వుండిపోయాడు.
    "ఇన్ స్పెక్టర్ రాహితో చెప్తాను. ....నిన్ను హరేస్ చేయవద్దని- సరేనా?"
    "అంతే కాదండీ! వాళ్ళ పరిశోధనలో నా సహాయం తీసుకోమని కూడా చెప్పాలి."
    "నువ్వేం సహాయం చేయగలవ్?"
    "నాకు కొన్ని క్లూ" లు దొరికాయ్.........వాటి ఆధారంగా కొంత ఊహించడానికి అవకాశం ఉంది."
    "ఏమిటా 'క్లూ' లు?" కుతూహలంగా అడిగాడు యస్పీ.
    "అన్నయ్య దిగిన వైజాగ్ సీషోర్ హోటల్లో ఇదిగో ఈ న్యూస్ పేపర్ దొరికింది. విజయవాడ ఎడిషన్ ఉదయం పేపరది" అంటూ తన బాగ్ లోనుంచి న్యూస్ పేపర్ తీసి అతనికి చూపించాడతను.
    "చూశారా! ఇదిగో! ఈ ఉద్యోగ ప్రకటన దగ్గర రైట్ మార్క్ ఉంది చూశారా? అన్నయ్య ఏదయినా ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలంటే ఇలాంటి మార్క్ వేస్తాడు. పచ్చ యింక్ పెన్ తో......! అంటే అన్నయ్య ఈ ఉద్యోగం కోసం వైజాగ్ వెళ్ళి ఉండవచ్చు......"
    యస్పీ పేపర్ పరీక్షగా చూసాడు.
    "అయితే ఏమంటావ్?"
    "ఈ ఉద్యోగంలో చేరి ఉంటాడని నాకు నమ్మకంగా ఉంది. ఒకవేళ చేరివుంటే ఆ ఆఫీస్ లో ఎవర్నయినా ప్రశ్నిస్తే ఎంతో కొంత ఇన్ఫర్ మేషన్ దొరకవచ్చు......"
    "ఉద్యోగం దొరికి ఉండవచ్చు....దొరక్కపోయి ఉండవచ్చు."
    "దొరికిందనటానికి నాకింకో ఆధారం ఉందండీ......."
    "ఏమిటది?'
    "అన్నయ్య సూట్ కేస్ లో దొరికిన ఒక కాప్యుల్స్ స్ట్రిప్! ఆ ప్లాస్టిక్ స్ట్రిప్ లో పది క్లాప్యుల్స్ ఉన్నాయ్. దాని పేరు "డాక్సీ సైక్లిన్ విత్ విటమిన్ సి"
    యస్పీ ముఖంలో ఏదో మార్పు కనిపించింది సృజన్ కి.
    "అయితే? అదెలా ఋజువవుతుంది?"
    "ఆ కాప్యుల్స్ ఈశ్వర్ ఫార్మాన్యుటికల్స్ కంపెనీ తయారుచేసింది.
    "చేస్తే?"
    "అన్నయ్య ఇంటర్యు కొచ్చింది కూడా ఈశ్వర్ ఫార్మా సేల్స్ ఆఫీసర్ ఉద్యోగానికే"
    యస్పీ ఆలోచించాడు కొద్ది క్షణాలు.
    "ఆ కాప్యుల్స్ నీ దగ్గరుందా?" అడిగాడతను.
    "ఉంది సార్" అంటూ తన బాగ్ లోనుంచి కాప్యుల్స్ స్ట్రెప్ తీసి అతని కిచ్చాడు. యస్పీ అది తన చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూసాడు.
    "ఇదేక్కడ దొరికింది నీకు?"
    "మా అన్నయ్య సూట్ కేస్ లో వుంది."
    "ఎక్కడ? వైజాగ్ సి వ్యూ హోటల్లోనా?"
    "అవున్సార్"
    "ఆ గది పోలీస్ సీల్ లో ఉంది కదా?"
    "ఉందండీ"
    "మరి నువ్వెలా వెళ్ళావ్ లోపలకు......"
    "నా ప్రయత్నాలు నేను చేసి వెళ్ళగలిగాను--------"
    "అంత పకడ్భందీగా ఉందన్నమాట మా డిపార్ట్ మెంట్........?" అన్నాడు తలపంకిస్తూ.
    సృజన్ ఏమీ మాట్లాడలేదు.
    "కానీ మావాళ్ళు అవన్నీ పూర్తిగా వెతికారు కదా! ఈ స్ట్రిప్ ఎందుకు దొరకలేదప్పుడు?" అడిగాడతను.
    సృజన్ చెప్పాలా వద్దా అని ఓ క్షణం ఆలోచించాడు. యివన్నీ చెప్పావ్ ఇంకా ఆ కాస్తా దాచడం అనవసరం అనిపించిందతనికి.
    "మా అన్నయ్య సూట్ కేస్ లో ఒక సీక్రెట్ అర ఉంది సార్! అందులో దొరొకింది నాకిది. అందుకే మీకు దొరికి వుండదు."
    "ఓ అయ్ సి"
    "ఇంకో విషయం కూడా నాకు వైజాగ్ సిషోర్ హోటల్లో తెలిసిందండీ! దానిని బట్టి కూడా అన్నయ్య ఈ ఉద్యోగం కోసమే వచ్చాడని తెలుస్తోంది."
    "ఏమిటది?"
    "వైజాగ్ సిషోర్ హోటల్ కూడా ఈశ్వర్ వర్మ దేననీ తెలిసింది. మా అన్నయ్య అయన పనిమీదే ఆ హోటల్లో ఉన్నట్లు ఆక్కడుండే అమ్మాయిలు చెబుతున్నారు."
    యస్పీ నిర్ఘాంతపోయాడు గానీ వెంటనే కోలుకున్నాడు.
    "నువ్ మా డిపార్టుమెంటులో ఉండాల్సింది! చాలా బాగా షైనయ్యే వాడివి."
    "థాంక్యూ ! నాకా ఆసక్తి లేదు. మీ డిపార్టుమెంటు గురించి నా అభిప్రాయాలు అంత బావుండలేదు.'
    యస్పీ ముఖం కోపంతో ఎర్రబడింది.
    "ఎందుకని?"
    "ఇన్ స్పెక్టర్ రాహి లాంటివాళ్ళు హోటల్ వైజాగ్ సీవ్యు లాంటి హోటళ్ళూ నాకా అభిప్రాయం కలిగించాయ్"
    "సరే! నువ్వింక వెళ్ళవచ్చు --" తన చేతిలోని ప్లాస్టిక్ స్ట్రిప్ అతని కిచ్చేస్తూ అన్నాడు యస్పీ.
    "అంటే మీ పోలీస్ డిపార్టుమెంటు నన్ను యిబ్బంది పెట్టదని ప్రామిస్ చేస్తున్నారా?"

 Previous Page Next Page