Previous Page Next Page 
షా పేజి 46

 

    "అవును! రాత్రే అయిపోయిందది కానీ పాపం మా బాబాయిని చూస్తేనే జాలి వేసింది. నేనంటే ప్రేమ. తన దగ్గరే ఉండాలని వుంది. కానీ పిన్ని అంటే భయం! నగిలిపోయారు."
    "ఇంక మనం బయల్దేరదామా మరీ?" అనడిగిందామే.
    "నేను రడీ! పిల్లకాయలు కూడా లేచి కాఫీ ఫలహారాలు చేస్తే - వెళ్ళిపోవచ్చు-"
    "వాళ్ళను నేను రెడీ చేస్తానులెండి" అంటూ వెళ్ళి పిల్లలను చక్కిలిగిలి పెట్టి లేపిందామే. ఇద్దరూ నవ్వుతూ లేచి కూర్చున్నారు. మరోగంట సేపట్లో గది ఖాళీ చేసి అద్దె ఇంటికి చేరుకున్నారు వాళ్ళు. నాలుగు సూట్ కేస్ లు, ఓ గొనె సంచి వంట సామాగ్రి ఓ పక్కన పడేస్తే ఇల్లంతా ఖాళీగానే ఉండిపోయింది.
    "నాకు ఆఫీస్ కి టైమవుతోంది. ముందు మీరు వెళ్ళి పిల్లలకయినా ఓ పరుపు కొనుక్కురండి' అందామె.
    "సరే--" అన్నాడతను.
    "ఇవాళ ఏం చేస్తున్నారు మీరు?"
    "యస్పీ దగ్గర కేళదామనుకుంటున్నాను."
    "ఎందుకు?"
    "ఇన్ స్పెక్టర్ రాహి గురించి మాట్లాడటానికి."
    "ఆ తర్వాత "
    "వీళ్ళిద్దరినీ ఈ చుట్టూపక్కలేమయినా స్కూల్ ఉంటె చేర్పించాలి."
    "అదే నేనూ చెప్దామనుకుంటున్నాను. రేపట్నుంచి వాళ్ళు స్కూల్ కెళ్ళాటం మొదలుపెడితే వాళ్ళని కనిపెట్టుకుని కూర్చోవాల్సిన అవసరం వుండదు."
    ఆమె ఆఫీస్ కెళ్ళిపోగానే తనూ బయల్దేరాడతను.
    "మీ ఇద్దరూ తలుపు గొళ్ళెం వేసేసుకొని లోపలే వుండండి. నేను వచ్చేవరకూ తలుపు గొళ్ళెం తీయవద్దు."
    "అలాగే బాబాయ్-"
    ఇద్దరినీ ముద్దు పెట్టుకుని తను యస్పీ బంగాళాకు బయల్దేరాడతను. ఓ పోలీస్ స్టేషన్లో అడ్రస్ కనుక్కొని బంగాళా చేరుకున్నాడు.
    బయట కాపలా వున్న రిజర్వ్ కానిస్టేబుల్ అతను చెప్పినదంతా విని తల అడ్డంగా తిప్పాడు.
    "ఇప్పుడు చూడటం కుదరదు. విజిటర్స్ సాయంత్రం పూటే ఆఫీసులోనే కలుసుకోవాలి" చెప్పాడతను.
    సృజన్ ఇక చేసేదీమీ లేక అక్కడి నుంచి తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ స్కూలుకి చేరుకున్నాడు. పిల్లలని తీసుకొస్తే వాళ్లకు టెస్ట్ పెట్టి ఆదే రోజు చేర్చుకుంటానని చెప్పింది హెడ్ మిస్ట్రెస్ వెంటనే ఆటోలో ఇల్లు చేరుకొని పిల్లలను తీసుకొచ్చాడు. అప్పటికప్పుడే వాళ్ళ ఫీజులు కట్టడం, రెడీమేడ్ యునిఫారం పుస్తకాలు కొనటం జరిగిపోఆయింది. ముగ్గురూ హోటల్లో భోజనం చేసి ఇల్లు చేరుకున్నారు.
    అప్పటికే టైం మూడయిపోయింది. వెంటనే యస్పీ ఆఫీస్ చేరుకున్నడతను.
    "తను పెరూ, వచ్చిన పని వివరాలూ ఓ కాగితం మీద రాసి లోపలకు పంపించాడు.
    నలభై నిమిషాల తర్వాత అతనికి పిలుపొచ్చింది.
    లోపలకు నడిచాడు సృజన్.
    యస్పీ అతనిని చూస్తూనే "ఏం కావాలి నీకు?' అనడిగాడు.
    "నీకు" అని సంభోదించటం సృజన్ కి చాలా కోపం తెప్పించింది కానీ ఆ డిపార్టుమెంటులో తనలాంటివి పట్టించుకోకూడదని నిశ్చయించుకున్నాడతను.
    జరిగినదంతా చెప్పాడు సృజన్.
    "రాహి ఆలా చేయటం తప్పే గానీ నువ్ అలా పోలీస్ అధికారులతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కూడా తప్పే. మేము చేస్తున్న పరిశోధన గురించి ఎవరికీ ఏమీ చెప్పకూడదు. దాని వల్ల పరిశోధనకు అంతరాయం కలిగే అవకాశాలున్నాయ్. అంచేత అందులో ఇంటర్ ఫియర్ అయ్యే అవకాశం , అధికారం మీకు లేవు.'
    "కానీ హత్య జరిగి వారం రోజులయినా ఇంతవరకూ హంతకుడిని పట్టుకోలేదు మీరు!"
    "వారం రోజులే కాదు. ఇంకో సంవత్సరం కూడా పట్టవచ్చు. పోలీస్ డిపార్టుమెంటు ఉన్నది మీ ఒక్కరి కేసే పరిశోదించెందుకు కాదు."
    సృజన్ కి ఆవేశం ఎక్కువయిపోయింది.
    "అవును సార్! హత్యకు గురయింది ఏ మంత్రి గారి కుటుంబసభ్యులో. లేక ఏ యస్పీ గారి బంధువులో అయితే గంటల్లో హంతకుడు దొరుకుతాడు. రోజుల్లో కేస్ కోర్టులో కొస్తుంది. మీ అన్నయ్య వదినా కూడా కేవలం ఒక వ్యక్తీ వల్ల చనిపోయి వుంటే మీ కుటుంబమంతా చిన్నాభిన్నమయిపోతే, మీ పిల్లలు అనాధలుగా మిగిలిపోతే అప్పుడు తెలుస్తుందేమో మీకు మా బాధ!"
    యస్పీ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.
    "మీ వదిన చనిపోయిందా?"
    "అవును! అన్నయ్య మరణం భరించలేక ఆత్మహత్య చేసుకుంది......."
    "ఆత్మహత్యా?"
    "అవును! ఏం! అది కూడా నేరమని ఎవర్నయినా అరెస్ట్ చేస్తారా"

 Previous Page Next Page