"అలసట కాదు, భయం."
"భయమెందుకు?"
"పులి...." అమాయకంగా పులిబొమ్మను చూపించింది ఆమె.
"అది నిజం పులి కాదు, బొమ్మ...."
"కానీ అది జీవం నింపుకుంటే?" భయంగా కళ్ళు రెపరెపలాడించిందామె.
"పద, గదులు చూద్దాం!" అన్నాడు రమణ.
హాలు చుట్టూ గదులు.
ముందు వాళ్ళు కిచెన్, డైనింగ్ హాలు చూశారు. అవి కాక మూడు పడకగదులున్నాయి. అవి చూడకుండానే....
"ఇలాంటిల్లోకటి ఊళ్ళో మనం కట్టించుకుందాం...." అంది ఆమె.
"అసాధ్యమైన కోర్కెల్లో అదొకటి!"
"ఎందుకని? ఊహించని ఈ సమాధానానికి ఆమె ఆశ్చర్యపడింది.
"కాశ్మీర్లో కాశ్మీర్ పౌరులు మాత్రమే స్థిరాస్తులకు అర్హులు."
"ఇదేమన్యాయం? మనదేశంలో మనకి హక్కులేదా?"
"ఇది అన్యాయం కాదు రాజకీయం....!" అని "పద, ఆ మూడు గదులూ చూద్దాం!" అన్నాడు రమణ.
ఒకటో గది, రెండోగది చూడ్డం అయ్యేక__
"మూడో గది చూస్తే థ్రిల్లయి పోతావు...." అన్నాడు రమణ.
"ఏమిటందులో ప్రత్యేకత?" అంది ఆమె.
"చూసి తెలుసుకో...."
హాల్లో గోడ గడియారంలోంచి కోయిల బయటకు వచ్చి ఎనిమిది సార్లు "కుక్కూ కుక్కూ" అని లోపలకు వెళ్ళి తలుపు మూసుకుంది.
దగ్గరగా వున్న తలుపులు తీసి గదిలో ప్రవేశించిన హాస ఉలికిపడింది. గదిలో ప్రత్యేకతంటే ఏమిటో అనుకుంది.
రమణ ఇంతకు తెగిస్తాడనుకోలేదామె!
గది మధ్యలో మంచం.... పూలమాలలతో అలంకరించబడి ప్రణయరథంలా వుంది.
అది మామూలు గది కాదు. శోభనం గది.
తన వెనుకే తలుపు మూసుకున్న చప్పుడై వెనక్కు తిరిగింది ఆమె.
అక్కడ రమణ వున్నాడు.
అతణ్ణి చూడగానే టీపాయ్ మీద పులిబొమ్మ జీవం నింపుకున్నట్లే వుంది.
* * * *
గౌతమ్ ఆ యింటికెంతో దూరంలో లేడు.
ఓ పథకం ప్రకారం రమణ ఆమెను వశపర్చుకునేందుకు ప్రయత్నించి తన కారణంగా విఫలుడయ్యాడు. మనిషి రక్తం చవిజూసి, దెబ్బతిన్న పులి రమణ! అతడు హాసను వదుల్తాడా?
అతడు హాసను ప్రేమించాడు. ఆమె అతడ్ని పెళ్ళి చేసుకుందుకొప్పుకుంది. ఈ లోగా ఏమిటీ అత్యాచారం....? ఇందులో ఏదో దురూహ వుంది. అమాయకురాలు హాస కదేం తెలియదు.
ఆమె పెళ్ళికి ఒప్పుకోకపోతే అతడెందుకిలా బలవంత పెడతాడు? ఆమెకు లేని పెళ్ళి తొందర అతడికెందుకు?
ఎక్కడో ఏదో తిరకాసుంది. అది తనకు తెలియడంలేదు.
కానీ అతడు ఆమె మనసును వెన్నంటే వుంటున్నాడు. ఆమెలో రేగే ఉద్వేగం, ఉద్రేకం అన్నీ అతడికి తెలుస్తూనే వున్నాయి. కానీ అతడామెను పిలవడం లేదు. ఆమెకు వీలయినంత దగ్గర్లో వుంటున్నాడు.
ఇప్పుడు హాస మనసులో అత్యాచార భయం.
అతడికామె గుండె చప్పుడు వినిపిస్తోంది.
* * * *
"ఏమిటి నీ ఉద్దేశ్యం?" అంది హాస తీవ్రంగా.
"గాంధర్వ వివాహం" అన్నాడు రమణ.
"నా యిష్టం లేకుండానే?"
"నీ కయిష్టం లేదని తెలుసు...."
"ప్లీజ్! మనం వెళ్ళిపోదాం! అమ్మ కంగారు పడుతుంది."
"ఇందుకు అత్తయ్య ఆశీర్వాదముందని ఈ పాటికే నీ కర్దమయుండాలి. అందుకే ఆమె మనిద్దర్నీ వదిలి వెళ్ళిపోయారు."
ఆమె తెల్లబోయింది. అమ్మ ఇందుకెలా ఒప్పుకుంది? చరిత్రలో ఏ కన్నతల్లయినా ఇలాంటిపని చేసి ఉంటుందా?"
"హాసా! నువ్వు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణ స్త్రీవని నిన్నటి సంఘటన ఋజువు చేసింది. సుమతి అడ్డు రాకపోతే మన గాంధర్వవివాహం నిన్ననే జరిగి వుండేది. అందుకే ఈ రోజు ఏ సుమతీ అడ్డుకోలేని చోటుకు నిన్ను తీసుకొచ్చాను. ఈ ఉపాయం మీ అమ్మగారే చెప్పారు. రేపు సశాస్త్రీయంగా మన వివాహం జరుగుతుంది."
"నువ్వు దుర్మార్గుడివి__" అంది ఆమె.
"సుమతి వచ్చే ముందు నిన్న నీ మానసిక పరిస్థితి ఎలాగుందో గుర్తు చేసుకో! అదే నాకీ రోజున ఈ ధైర్యాన్నిచ్చింది" అన్నాడు రమణ.
"దాన్నిబట్టే నీ కర్ధమయుండాలి. నీకూ నాకూ మధ్య ఏదో అపూర్వ వ్యతిరేక శక్తి పనిచేస్తోందని!" అంది ఆమె.
"నాటకంలో మొదటి రిహార్సల్ నిన్న అయింది. ఒక రిహార్సల్ ఫెయిలయితే అదే అంతం కాదు, ఈ వేళ కూడా ఏ అపూర్వశక్తి అయినా అడ్డుపడుతుందేమో చూద్దాం__" అన్నాడు రమణ.
"ఏ తప్పయినా సరే జీవితంలో ఒకసారే చేస్తాను. ఏ పరిస్థితుల్లో నా మనసెలా చలిస్తుందో నాకు తెలిసిపోయింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చలించకుండా దానికి నిన్న రాత్రంతా శిక్షణ యిచ్చాను" అంది హాస.
"పోనీ నీ శిక్షణ బలాన్ని పరీక్షిద్దాం__" రమణ ఓ అడుగు ముందుకేశాడు.
"నా శిక్షణ బలమైనదే! కానీ నీ కున్న బలం నాకు లేదు"
"అది తెలుసు కాబట్టి ప్రతిఘటించకు. సహకరించు. ఇది అత్యాచారం కాదు. పెద్దలు దగ్గర్లేకుండా జరుగుతున్నా వారి దీవెనలతో జరిగే గాంధర్వవివాహం."
"నాకు తెలుసు__నేను నిన్న మాటలతో మాత్రమే ప్రతిఘటించగలను."
"ఇప్పుడు నేను నీ మాటలు వినేస్థితిలో లేను." అతడు మరో అడుగు ముందుకేశాడు.
* * * *
"వెళ్ళు! అంది గౌతమ్ మనసు.
"ఎందుకు వెళ్ళాలి?" అన్నాడు గౌతమ్.
"ఆమెపై అత్యాచారం జరుగుతోంది."
"అది అత్యాచారం కాదు, గాంధర్వ వివాహం."
"అది రమణ అభిప్రాయం. ఆమెది కాదు."
"ఆమె కూడా అతడి అభిప్రాయాన్ని ఖండించలేదు."
గౌతమ్ మనసులోని సంఘర్షణకు అంతం లేకుండా వుంది.
పెద్దలు, వధూవరులు అంగీకరించిన ఈ పెళ్ళికి తానెందుకు అడ్డుపడాలి? హాస పెళ్ళి వద్దనడం లేదు. తొందరొద్దంటోంది. అది వారిద్దరి వ్యక్తిగత వ్యవహారం.
నిన్న తను కలగజేసుకోకపోతే ఆమె అతడికి లొంగిపోయేదే! పైగా అతడామెను నగ్నంగా చూశాడు.
చెప్పాలంటే రమణ ఉత్తముడు. హాస వంటి అమ్మాయి దగ్గర అతడు చెప్పుకోదగ్గ సంస్కారం ప్రదర్శించాడు.
"భయపడుతున్నావా?" అంది మనస్సు.
"భయమెందుకు?"
"ఎందుకేమిటి? రమణకు డబ్బుంది. పలుకుబడి వుంది. అతన్ని ప్రతిఘటించగలనా అని నీ భయం."
"కాదు, నాకు భయం లేదు"
"అయితే తటపటాయిస్తావేం? వెళ్ళి ఆమెను రక్షించు...."
"రక్షించడానికి ఇప్పుడామెకొచ్చిన ప్రమాదమేముంది? నేను కలగజేసుకుంటేనే అనవసరంగా వాళ్ళ పెళ్ళి వాయిదా పడుతుంది. అలా జరిగితే ఆ రమణకు మతి చెడి, మనస్సు పాడై నిజంగా దుర్మార్గుడు కావచ్చు. సహనానికి హద్దుంటుంది కదా!"
"అయితే హాసను ఎప్పటికీ వదులుకుంటున్నావా?"
"హాసను నేను వదులుకోవడమేమిటి? ఆమే నాకు అందడం లేదు...."
"ఇప్పుడు వెళ్ళు. నీకు అందుతుంది...."
"నీ ప్రయత్నం లేకుండానే ఆమె నీదెలాగవుతుంది?"
"నా ప్రయత్నం లేకుండానే ఆమె నాకు పరిచయమయింది. ఇప్పుడు నేను కలగజేసుకుంటే నా స్వార్ధం కోసం రమణకూ - ఆమెకూ చెడగొట్టినట్లవుతుంది. ఆమెకు రమణంటే యిష్టమని నాకు తెలుసు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమీ చేయలేను. భగ్నవత్సంకల్పమెలాగుందో చూద్దాం"
"ఆమెకు హాని జరగడమే భగవత్సంకల్పమైతే!"
"భగవంతుడు హాసకు హాని సంచల్పించలేడు. ఆమెకు హాని సంకల్పించినవాడు భగవంతుడు కాడు.
గౌతమ్ మనసు నిట్టూర్చి వూరుకుంది.
* * * *
"అడుగు ముందుకెయ్యకు" అంది హాస వెనుకడుగు వేస్తూ.
"నీ వెనకడుగు ఆగేదాకా నా ముందడుగు కొనసాగుతుంది" అని అన్నాడు రమణ.
ఆమె వేగంగా వెనకడుగు వేసింది.
"గుడ్! మంచంవైపే వెళుతున్నావు" అన్నాడు రమణ.
ఆమె వెనక్కు తిరిగింది.
అప్పుడామె మంచానికి దగ్గర్లో వుంది. పరువుల మీద పూల దుప్పటి పరిచినట్లుంది.
"ఆగు! నేనొచ్చేలోగా మంచంమీద వాలకు. నువ్వూ ఆ పూలతో కలిసిపోతే వెతుక్కోవడం కష్టం...." అన్నాడు రమణ.
హాస ఆగింది.
అతడామెను సమీపించాడు, "భయపడుతున్నావా?"
ఆమె తల అడ్డంగా వూపి నవ్వింది.