సాయింత్రం వరకూ నాలుగిళ్ళు చూశాడతను. ఒక్క ఇల్లు మాత్రం సెపరేట్ గా ఉండటం వల్ల కొంచెం అద్దె ఎక్కువయినా తీసుకోవాలనిపించిందతనికి. అలా సెపరేట్ గా ఉంటేనే చుట్టుపక్కల వాళ్ళు తనూ భారతి అవివాహితులై ఉండి ఇంట్లో ఉంటున్నారన్న విషయం అంత త్వరగా తెలుసుకోలేరు. తెలుసుకుని గొడవచేసి ఇల్లు ఖాళీ చేయమనే లోపల కొద్ది రోజులు గడిచిపోతాయి. అదీ గాక ఒకసారి ఇంట్లో దిగాక ఇంక ఇల్లు ఖాళీ చేయటం తమ ఇష్టప్రకారం జరుగుతుంది గానీ ఇంటి ఓనరు ఇష్టప్రకారం జరగదు. అద్దె అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఆ ముసలాయన అడిగాడు.
"ఎంతమంది మీ కుటుంబం?"
"మీమిద్దరం - మా అన్నయ్య పిల్లలిద్దరూ" కావాలనే అబద్దమాడతను.
"ఓ! అలాగా! అయితే సరే--"
అక్కడి నుంచి హోటల్ చేరుకునేసరికి భారతి అప్పటికే తన కోసం చూస్తోంది.
"ఏమయింది? ఇల్లు దొరికిందా!" ఆత్రుతగా అడిగిందామె.
"ఆ! అద్దె అడ్వాన్స్ ఇవ్వటం కూడా జరిగిపోయింది. మీరెప్పుడంటే అప్పుడే ఇంట్లో దిగిపోవచ్చు" నవ్వుతూ అన్నాడు.
"అయితే రేపోద్దున్నే దిగిపోదాం! నేను ఉదయాన్నే నా సూట్ కేస్ తీసుకుని ఇక్కడికొచ్చేస్తాను" అందామె ఉత్సాహంగా.
"సరే - అలాగే! ఇంతకూ ఇప్పుడు నాకు కాఫీ గానీ, టీ గానీ ఏమయినా ఇప్పిస్తారా ?" అడిగాడతను.
ఆమె బెల్ బటన్ నొక్కింది. బాయ్ వచ్చాడు గదిలోకి.
"అర్జెంట్ గా - రెండు కాఫీ తీసుకురా" ఆర్డర్ చేసిందామె.
"కానీ ఓ చిన్న సమస్య వచ్చిపడింది" అన్నాడతను నెమ్మదిగా ."
"ఏమిటది?"
"చాలామంది తమ ఇళ్ళు ఇలా మనలాగా - భార్యాభర్తలు కాని వాళ్ళకు ఇవ్వమని చెప్పారు. అందుకని ఇప్పుడు మనం దిగబోతున్న ఇంటి ఓనర్ కీ మనం భార్యాభర్తలం కాదని చెప్పలేదు-"
ఆమె ఆశ్చర్యంతోనూ, సిగ్గుతోనూ అతని కళ్ళల్లోకి చూసి చూపులు దించుకుంది.
"మరేమని చెప్పారు?" కిందకు చూస్తూనే అడిగింది.
"అసలేమీ చెప్పలేదు గానీ వాళ్ళు మాత్రం మనని భార్యభర్తలు గానే అర్ధం చేసుకుంటారు."
"అంటే - మనం -- " ఆ తరువాత మాట్లాడలేకపోయిందామే.
"అవునండీ! ఎవరికీ అనుమానం రాకుండా కొద్దిరోజులు గడపగలిగితే ఆ తరువాత మన గురించి ఎవరూ పట్టించుకోరనుకుంటాను."
బేరర్ కాఫీ తీసుకొచ్చాడు.
ఇద్దరూ చెరో కప్పు అందుకున్నారు.
"అలా చెప్పకపోతే ఇల్లు దొరకడం కష్టమవుతుందని నేనూ అనుకున్నాను -----"అందామె.
"థాంక్ యూ! నాకు లోలోపల భయంగా ఉంది ఇంతసేపూ --- మీరు నన్ను అపార్ధం చేసుకుంటారేమోనని" తెలికపడ్డ మనసుతో అన్నాడతను.
"బాబాయ్ కొత్త ఇంటికి వద్దు బాబాయ్ ! ఇక్కడే బాగుంది ఇక్కడే ఉండిపోదాం" అంది సీత.
"అవునా!"
"ఇంకా నేను వెళ్లిరానా?" అడిగిందామె.
"అప్పుడేనా! మీరు మళ్ళీ వెళ్లిపోతే మళ్ళీ నా మనసంతా అన్నయ్య వదినెల మీద కెళ్ళిపోతుంది. మీరు పక్కనుంటే కొంతవరకయినా ఆ ఆలోచనల్నుంచి తప్పించుకోవచ్చు."
"ఇవాళోక్కరోజే కదా! నేను నా బట్టలూ, ఇతర సామాగ్రి అంతా సర్దుకోవాల్సి ఉందింకా! అదీగాక మా పిన్నితో ఎలాగో పెద్ద పైటింగ్ అవుతుందేలాగూ" నవ్వుతూ అందామె.
ఆమె వెళ్ళిపోయాక తన సూట్ కేస్ లో నుంచి ఆ కాప్యుల్స్ స్ట్రిప్ తీసుకుని మరోసారి చూశాడు. వాటి సైజు ఎందుకనో చాలా పెద్దదిగా కనిపించిందతనికి. అసలవి మింగేందుకు వీలు పడతాయా లేదా అనేది కూడా తెలీటం లేదు. ఇంత పెద్ద సైజ్ కాప్యుల్స్ తానెప్పుడూ చూళ్ళేదు. ఇవి అన్నయ్య దగ్గరెందుకున్నాయ్? ఏదయినా అనారోగ్యం వస్తే డాక్టర్ వాడమన్నాడా? అయితే మరి ఒక్కటయినా ఎందుకు వాడలేదు ?
లేచి గదిలో పచార్లు చేయసాగాడతను.
ఇన్ స్పెక్టర్ రాహి మీదకు మళ్ళినాయ్ అతని ఆలోచనలు. అతను తనమీద అలా పగబట్టకపోయినట్లయితే తనకు చాలా సహాయం లభించి ఉండేది. వాళ్ళ పరిశోధన ఎంత దూరం వెళ్ళిందీ, ఏమేమి వివరాలు తెలుసుకున్నదీ, ఎవరేవరినీ అనుమానిస్తున్నదీ అన్నీ తెలిసేవే! కానీ అతని మూర్ఖత్వం వల్ల తనకు ఎటు ప్రయాణించాల్సిందీ తెలీటం లేదు. ముందు తను యస్పీనీ కలుసుకుని రాహీ గురించి కంప్లెయింట్ చేస్తే గానీ అతని నుంచి సహకారం లభించదు. మర్నాడు యస్పీని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడతను. ఉదయం ఆరుగంటలకే డోర్ బెల్ మోగటంతో మెలకువ వచ్చిందతనికి. తలుపు తెరిచేసరికి రెండు సూట్ కేస్ లతో లోపలికొస్తూ కనిపించింది బారతి.
"మీ పిన్నిగారితో ఫైటింగ్ చేసేశారా?"