Previous Page Next Page 
సుహాసిని పేజి 45


    "అంతా హాస యిష్టం" అంది సుభద్ర.

    శ్రీనగర్ లోనే ఉండి ఏం చేయాలో ముగ్గురూ కాసేపు చర్చించుకున్నారు.

    అంతా కలిసి బోటు షికారు చేయాలని నిర్ణయమయింది. ఇందుకు హాస అంత సుముఖంగా లేకపోవడం గమనించి, "ఏం మళ్ళీ నావ మునుగుతుందని భయపడుతున్నావా? నేనుండగా నీకేమీ భయం లేదు" అన్నాడు రమణ.

    "పక్కనే మా అమ్ముంటే నావ కూడా మునగదని నాకు తెలుసు" అంది ఆమె. ఆ మాటల్లో వ్యంగ్యం రమణ కర్దమయింది.

    "నీకు నా మీద అనుమానంగా ఉంది కదూ!" అన్నాడు రమణ.

    "అనుమానం కాదు, నమ్మకమే! అందుక్కారణం గంధర్వుడు" అంది ఆమె నవ్వి.

    "ఎవడో ఈ గంధర్వుడు?" అనుకున్నాడు రమణ. గుల్మార్గ్ లో జరిగిన అపూర్వ సంఘటన అతడికింకా తెగకుండా ఉంది. ఆమె ఏదో ట్రిక్ చేసిందనుకుంటే ఎలా చేసింది?"

    "బోటు షికారెంతసేపేమిటి?" అంది సుభద్ర.

    "కనీసం నాలుగ్గంటలు...."

    "నాలుగ్గంటలే....అంతసేపు నీళ్ళ మీదేం తిరుగుతాం?"

    "భలేవారే! దాల్ సరస్సంటే మామూలు నీళ్ళు కాదు. అదో పెద్ద బిజినెస్ కాంప్లెక్స్. మనం తిరుగుతూంటే మసాలా పొడుల దగ్గర్నుంచి మణిమాణిక్యాల వరకూ నా వల్లో తిరుగుతూ అమ్మే వాళ్ళుంటారు. వీటిని ఫ్లోటింగ్ మార్కెట్స్ అంటారు. మనకు పెద్ద బజార లో పేవ్ మెంటు మీద నడుస్తున్నట్లుంటుందీ షాపుల వ్యవహారం. అలాగే ఇక్కడ నీళ్ళలోనే కూరలు పండిస్తారు. ఆ ఫ్లోటింగ్ గార్డెన్సు చూడొచ్చు. మధ్యలో సరదాగా ఐస్ క్రీంలూ, మరేవయినా కొనుక్కోవచ్చు ఫ్లోటింగ్ హోటల్స్ లో"

    "చాలా తమాషాగా ఉంది" అంది సుభద్ర.


                           *    *    *    *


    షికారాలో వాళ్ళు నలుగురు, అది నడిపేవాడు.

    ఎనిమిదింటికి బయల్దేరారంతా!

    బోటు హౌస్ యజమాని వారికి చెప్పి పంపాడు. నాలుగు గంటల విహారం తర్వాత భోజనాలు చేసి, మరో రెండు గంటలు విహారం చేసి బోట్లోకి వచ్చేయమని.

    టైము తొమ్మిదయ్యేలోగా రెండు నావలు వాళ్ళని సమీపించాయి. ఒకదాని నిండా ఆల్మండ్స్ ఉన్నాయి. రెండో దానిలో ఉన్ని దుస్తులు. తమకీవీ వద్దన్నాడు రమణ హాస మూడ్ చూసి.

    తొమ్మిదింటికి షికారావాడు, "ఖానాకబ్ ఖాయేగా" అన్నాడు.

    "ఇప్పుడేం భోజనం, పన్నెండింటికి" అన్నాడు రమణ.

    షికారావాడు మాట్లాడలేదు.

    టైము పదయ్యేలోగా వారి దగ్గరకో ఐస్ క్రీం నావ, రకరకాల కత్తులమ్మే మరో నావ వచ్చాయి. అంతా ఐస్ క్రీంలు తిన్నారు. తన తమ్ముడు గిరిధర్ కోసం హాస పదిరూపాయలు పెట్టి ఓ చాకు కొంది. దాని పిడిమీద పూర్వకాలపు నగిషీ పనితనముంది.

    పదిహేను రూపాయల చాకు బెరమాడితే పదికొచ్చింది. అమ్మినవాడు హాస వంక చూసి, "యూ ఆర్ శాటిస్ ఫైడ్ బేబీ...." అన్నాడు ఇంగ్లీషులో.

    "ఊఁ" అంది ఆమె.

    "తో ఖుష్ కరో" అంటూ చేయి చాచాడు.

    వాడికో రూపాయి యివ్వక తప్పలేదు.

    "చిత్రమయిన ఊరు. అమ్ముకునే వాళ్ళకి బక్షీసేమిటో?" అంది సుభద్ర.

    "ఏమైతేనేం నాకిప్పుడు కోడికూత రహస్యం తెలిసిపోయింది" అంది హాస.

    "ఏమిటమ్మా అది?" అన్నాడు పురోహితుడు కుతూహలంగా.

    "కోడి మొదట కాశ్మీర్ లో పుట్టింది.... అక్కడ్నించి క్రమంగా ప్రపంచానికి వ్యాపించింది. ఇక్కడే పుట్టిందిగా, అందుకని ఖుష్ కరో కరో" అని అరిచేది. దాన్నే మనం కొక్కొరకో అనుకుంటున్నాం" అంది ఆమె.

    ఇది విని రమణ పడిపడి నవ్వాడు.

    అతడంతలా నవ్వడం అరుదు. అంతా అతడి వంక చూస్తూంటే రమణ సిగ్గుపడి నవ్వాపేశాడు.

    ఖానా కబ్ ఖాయేగా" అన్నాడు షికారావాడు.

    "టైమింకా పదయింది. భోజనాలు పన్నెండు తర్వాత...." అని విసుక్కున్నాడు. షికారావాడ్ని రమణ.

    దాల్ సరస్సుమీద వారి విహారం కొనసాగుతోంది. అంతా మధ్యలో కనిపించే చిరుద్వీపంలో దిగారు. అక్కడ పెద్ద విశేషాలేం లేవు. ఓ పెద్ద హోటలుంది మధ్యలో. దాన్నిండా విదేశీ యాత్రికులు.

    "ఖానా కబ్ ఖాయేగా!" అన్నాడు షికారావాడు.

    అప్పటికి టైము పదిన్నరే అయింది. పదకొండయ్యేలోగా మరో రెండు సార్లడిగాడు వాడదే ప్రశ్న.

    "ఇన్ని సార్లడుగుతాడేం? ఏమిటి వాడి బాధ?" అంది హాస.

    అదే రమణ వాడినడిగి తెలుసుకుని. "మన భోజనంలోనే వీడికీ వాటా ఉందట. పొద్దుట్నించీ ఏమీ తినలేదుట. ఆకలిగా వుందిట" అన్నాడు.

    హాస గతుక్కుమని, "మన ప్రోగ్రాం గురించి ముందే తెలుసు గదా, భోజనం ఆలస్యమవుతుందని తెలిసీ ఏమీ తినకుండా ఎందుకొచ్చాడు" అంది.

    షికారావాడు మామూలుగా తినేది సామాన్యమయిన భోజనం.... యాత్రీకులకు బోట్ హౌస్ సరఫరా చేసే భోజనం అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా యాత్రికులాట్టే తినరు. తిన్నంత తిని మిగతాది పారేస్తారు. ఎంత మిగిలితే అంతా తినగలగడం కోసం వాడు కడుపు ఖాళీగా ఉంచుకుంటాడు.

    హాస షికారావాడ్ని చూసింది.

    మనిషి ఆరోగ్యంగా వున్నాడు. ఉత్సాహంగా వున్నాడు. తృప్తిగా కడుపు నింపుకోవడానికి వాడు కడుపు ఖాళీగా ఉంచుకున్నాడు. పొద్దున్నించీ ఏమీ తినకుండా తనతో కలిసి అయిదుగురు మనుషులున్న షికారాని తన చేతులతో ముందుకు నడుపుతున్నాడు.

    "అమ్మా! మనం భోంచేసేద్దాం" అంది హాస.

    "తిన్న బ్రెడ్డు, తాగిన పాలు ఇంకా గొంతులోనే వున్నాయి. ఏం తింటామే యిప్పుడు...." అంది సుభద్ర.

    "మనమిప్పుడే తినేస్తే ఈ షికారా వాడికింకాస్త ఎక్కువ మిగులుతుంది" అంది హాస.

    పురోహితుడు, రమణ ఉలిక్కిపడ్డారు.

    హాసలో వారికి మూర్తీభవించిన మానవత్వం కనబడింది.


                                                              *    *    *    *


    పన్నెండున్నరకల్లా అంతా బోట్ హౌస్ చేరుకున్నారు.

    "అప్పుడే వచ్చేశారే?" అన్నాడు యజమాని ఆశ్చర్యంగా.

    హాస ముందుగా మరీ మరీ హెచ్చరించడంవల్ల రమణ బోట్ హౌస్ యజమానికి షికారావాడు తమను విసిగించేడన్న విషయం చెప్పలేదు.

    మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి అయ్యేక వాళ్ళు షికారాలో అవతల ఒడ్డుకు చెరి కాలినడకన లాల్ చౌక్ బజారుదాకా నడిచారు. దారిలో వారు కొంత షాపింగ్ చేశారు. హాస తన స్నేహితురాండ్రకోసం చిన్న పర్సులు, కొయ్య బొమ్మలు, ఇత్తడి బొమ్మలు కొంది.

    సాయంత్రం ఆరయ్యేసరికి వాళ్ళకు బాగా ఆకలి వేసింది.... ఓ హోటల్లో పరోటాలు తిని, బాదంపాలు పుచ్చుకున్నారు. అందరికీ శక్తీ, ఉత్సాహం వచ్చాయి.

    "రేపు మనం ఊళ్ళోకి మారిపోదామనుకుంటున్నాను...." అన్నాడు రమణ.

    "అవును బోట్ హౌస్ బోరు కొడుతోంది" అంది సుభద్ర.

    "మంచి హోటల్స్ చూసుకుందాం, ఇప్పుడే...." అన్నాడు రమణ.

    "కానీ మనం బోట్ హౌస్ వారం రోజులకు బుక్ చేసుకున్నాం" అంది హాస.

    "అది నేను చూసుకుంటాను" అన్నాడు రమణ.

    సుభద్ర తానిక తిరగలేనంది. ఆమెకు పురోహితుణ్ణి తోడిచ్చి ఓ టాక్సీలో ఎక్కించి, "మా బోట్ హౌస్ యాస్మిన్. వీళ్ళను షికారిలో జాగ్రత్తగా ఎక్కించు" అని టాక్సీవాడికి చెప్పాడు రమణ.


                                                              *    *    *    *


    టాక్సీ ఓ యింటి ముందాగింది.

    "ఇది హోటల్లాలేదే!" అంది హాస.

    "ఇది హోటలు కాదు, ఇల్లే! దీన్నే ఈ పళంగా అద్దెకిస్తారు. ఇందులో మనం స్వంతింట్లోలా ఉండొచ్చు. వండుకోవచ్చు! వండించుకోవచ్చు. కావాలనుకుంటే ఎంత మందైనా వచ్చి సేవించుకుంటారు. వద్దనుకుంటే ఎక్కడా దొరకని ఏకాంతం."

    టాక్సీ వెళ్ళిపోయింది.

    "ఇది నిజంగా ఏకాంత ప్రదేశం. ఇంట్లో ఇప్పుడెవరైనా ఉన్నారా?"

    "ఇంటి తాళం నా దగ్గరుంది. నీకు చూపించి నచ్చితే రేపు ప్రవేశిద్దాం. లేకుంటే తాళం వెనక్కిచ్చేస్తాం."

    ఊళ్ళోంచి విసిరేసినట్లున్న ఆ బంగళా ఎంతో అందంగా వుంది. రమణ తాళం తీసి తలుపులు తెరిచేక హాస తడబడుతూనే అందులో అడుగు పెట్టింది.

    చిన్న హాలు, మధ్యలో సోఫాలు.

    నేలనిండా కాశ్మీర్ కంబళ్ళు పరిచి ఉన్నాయి.

    ఆమె నాలుగడుగులు ముందుకేసి సోఫాలో కూర్చుంది.

    మధ్యలో టీపాయ్. దానిమీద జీవకళ ఉట్టిపడే పులిబొమ్మ.

    "హాసా! అలసటగా వుందా?"

    ఆమె తలెత్తింది.

    టీపాయ్ పక్కనే నిలబడ్డాడు రమణ.

 Previous Page Next Page