Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 45


    "మనిషిని పోలిన మనుషులుంటారు గదూ?"
    "ఉంటారు. కాని చాలా అరుదుగా."
    "ఒక తల్లి బిడ్డలైతే- అదీ కవలలైతే- అలా ఉంటారు. కాని...."
    అన్నపూర్ణమ్మ ముఖం చూసి ఆగిపోయింది ఇందుమతి. ఆమె ముఖంలోకి చూస్తూనే ఉండిపోయింది.
    అన్నపూర్ణమ్మ ముఖం పూర్తిగా పాలిపోయింది. ఆ చూపులు సుదూరంగా శూన్యంలో దేన్నో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి!
    ఇందుమతి ఆలోచనలో పడింది.
    "ఆంటీకి మరొకడున్నాడని కచ్చితంగా తెలుసు. అంటే ఆ రాత్రి తను చూసింది గౌతమ్ ను కాదు_ మరొకణ్ణి. సినిమాహాల్లో కూడా అతణ్ణే చూసింది. ఆఫీసువాళ్ళు కూడా ఆ మరొకడిని చూసే గౌతమ్ గా భ్రమపడ్డారు.
    అతడెవరు? ఎవరు?
    ఆంటీ ముఖం ఎందుకలా పాలిపోయింది?
    అంటే ఆ మరొకడు ఆంటీ కొడుకేనన్న మాట! అతడే ఇవన్నీ చేస్తున్నాడని ఆంటీకి తెలుసు. మరి తెలిసి ఎందుకు మౌనంగా ఉండిపోయింది?"
    "ఆంటీ! ఆ మరొకడు ఎవరు?"
    అన్నపూర్ణమ్మ మాట్లాడలేదు.
    "చెప్పండి, ఆంటీ!"
    "నాకు తెలియదు."
    "అంటే గౌతమ్ నిరపరాధి అని తెలిసీ మీరు అతడికి శిక్ష పడుతుంటే చూస్తూ ఉండిపోతారా?"
    అన్నపూర్ణమ్మ మాట్లాడలేదు.
    "అతడెవరో చెబితే మీ జీవిత రహస్యం ఏదో బయట పడుతుందని భయమా?"
    "ఇందూ?"
    "అవును! అంతే! నాకూ తెలుసు మరొకడు ఉన్నాడని. నేనే రెండుసార్లు స్వయంగా చూశాను. అయినా గౌతమ్ ను అనుమానించాను. ప్లీజ్! ఆంటీ! ఎవరతడు? అతడి పేరేమిటి? ఎక్కడ ఉంటున్నాడు.
    "ఇందూ!" దాదాపు అరిచినట్లే అన్నది అన్నపూర్ణమ్మ.
    ఇందుమతి చివ్వున లేచింది.
    అన్నపూర్ణమ్మను తన రెండు చేతులతో ఊపేస్తూ "చెప్పండి ఆంటీ!" అతడి పేరు ఏమిటి! అతడెక్కడుంటాడు?
    అన్నపూర్ణమ్మ ఇందుమతి చేతుల్ని బలంగా తోసేసింది.
    "అధిక ప్రసంగం చెయ్యకు. వెళ్ళు."
    "ఏమిటమ్మా?"
    రవి కంఠం వెనకనుంచి వినిపించింది. ఇందుమతి గిర్రున వెనక్కు తిరిగి చూసింది.
    "అన్నపూర్ణమ్మగారూ! నా అనుమానాన్ని తీర్చుకోవాలనే వచ్చాను. నా మనసును కమ్మిన మబ్బులు తొలగిపోయాయి. మీరు చెప్పకపోయినా ఆ మరొకడు ఎక్కడున్నాడో నేను తేల్చుకుంటాను" అనేసి గబగబా దాదాపు వాకిట్లో నిల్చుని ఉన్న రవిని తోసేసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఇందుమతి.


                                                                17


    ఆటో దిగి లోపలకు వస్తున్న కూతుర్ని పరిశీలనగా చూసింది సునంద. కూతురి రూపాన్ని చూసిన సునంద గుండె చెరువైంది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఇందుమతి జీవితంలో సర్వస్వాన్నీ కోల్పోయినట్టు కనిపించింది సునంద కళ్ళకు.
    ఇందుమతి తిన్నగా లోపలకు తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎదురుగా వరండాలో కూర్చుని ఉన్న తల్లిని చూసింది. కాని ఇందుమతికి తల్లి కూడా ఆ గదిలో ఉన్న కుర్చీలూ, బెంచీలలాగే కనిపించింది. ఇందుమతి కళ్ళు చూస్తున్నా, వాటిని వెంటనే గుర్తుపట్టే స్థితిలో లేవు. ఆమె మనసు ఎలాంటి అనుభూతిని అందుకొనే స్థితిలో బొత్తిగా లేదు.
    సునంద కూతురు వెళ్ళిన వైపే కొద్ది నిముషాలు చూస్తూ ఉండిపోయింది. దీర్ఘంగా నిట్టూర్చింది.
    ఇందు మరీ ఇంత ఇదిగా డీలా పడిపోతుందని తను అనుకోలేదు. తను పెంచిన పిల్ల జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటుందని తన నమ్మకం. కష్టాలను ధైర్యంగా ఢీకొంటుందని తన విశ్వాసం. కాని.... ఇదేమిటింతగా ఢీలాపడిపోయింది ఇందు?
    న్యాయం కోసం, ధర్మం కోసం, కర్తవ్య నిర్వహణ కోసం తన గురించి ఆలోచించకూడదనేది తన సిద్దాంతం.
    కాని తన సిద్ధాంతాలను తను పెంచిన పిల్ల మీద రుద్దాలని ఎక్కడుంది?
    అవును! తన ఆశయాలకు అనుగుణంగానే తను ఇందును పెంచింది. ఇందు గుండె నిబ్బరం మీద, వివేకం మీద తనకు విశ్వాసం ఉంది.
    "కాని.... కాని.... మనిషి జీవితంలో ప్రేమ అన్నిటికంటే ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమిస్తుందా? కాదు__ అది మనిషి బలహీనత. ప్రేమ జీవితం కాదు. జీవితంలో ఒక ప్రధాన భాగం! అంతే!
    నిన్న ప్రొసెషన్ కు నాయకత్వం వహించి, ముఖ్యమంత్రికి రిప్రెజెంటేషన్ ఇచ్చింది. గౌతమ్ ను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేసింది. ఇవ్వాళ ఉదయమే అరెస్ట్ చేశారని కూడా తనకు తెలిసింది.
    తీరా గౌతమ్ అరెస్టు అయ్యాడని తెలిశాక తను చేసిన దానికి పశ్చాత్తాప పడుతోందా?
    "నో! నో! తన ఇందు పశ్చాత్తాప పడటమా?
    బహుశా ఆ పని తనే చెయ్యాల్సి వచ్చిందని బాధపడుతుందేమో! అది సహజమే!
    సునంద లేచి ఇందుమతి గదిలోకి వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యానికి అవాక్కయి నిలబడిపోయింది.
    ఇందుమతి మంచంమీద బోర్లా పడుకొని దిండులో తలదూర్చి వెక్కివెక్కి ఏడుస్తోంది. తల దిండుపైన అశాంతిగా కదులుతోంది. వీపు ఎగిరెగిరి పడుతోంది.
    సునందకు గుండె పిండినట్టుగా అయింది. మంచంమీద ఇందు తల దగ్గరగా కూర్చుని, తలమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది. ఇందుమతి ఒక్కసారిగా తలెత్తింది. తల్లి చేతులకు చుట్టుకుపోయింది. బావురుమన్నది.
    ఇందుమతిని ఎలా ఓదార్చాలో అర్థంకావడంలేదు సునండకు. ఇందు ఇంత బేలగా ప్రవర్తిస్తుందని ఊహించని సునంద అయోమయంలో పడిపోయింది.
    సునంద కూతురి తల నిమరడం తప్పించి ఇంకేమీ మాట్లాడలేకపోయింది.
    ఇందుమతి కళ్ళు తుడుచుకుంది. మంచం దిగింది. సింకు దగ్గిరకెళ్ళి ముఖం కడుక్కుంది. మెల్లగా గది బయటకు వచ్చేసింది సునంద.
    ముఖం కడుక్కుని బొట్టు పెట్టుకొని డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చుంది. కూతురికి కాఫీ కప్పు అందించింది తల్లి.
    ఇందు కాఫీ సిప్ చేస్తూ కూర్చుంది.
    తల్లి కూతుర్ని జాలిగా చూస్తూ ఉండిపోయింది.
    ఇందుమతి ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టింది. తల్లి ముఖంలోకి చూసింది. అదోలా నవ్వింది.
    "సారీ, మమ్మీ!" సిగ్గుపడుతున్నట్టుగా అన్నది.
    "ఇందూ!" సునంద కంఠం గరగరలాడింది.
    ఇందుమతి ప్రశ్నార్థకంగా చూసింది.
    "నువ్వు గౌతమ్ ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసమ్మా!"
    ఇందుమతి మౌనంగా ఉండిపోయింది. నేలచూపులు చూసింది.
    "గౌతమ్ ఎంత ఘోరానికి పాల్పడ్డాడో నీకు తెలుసు."
    "ఇక్కడే మనం పొరపాటు పడ్డాం."
    "అంటే?" చివ్వున తలెత్తి చూసింది.
    "గౌతమ్ ఎలాంటి ఘోరం చెయ్యలేదు."
    సునంద ఇందు ముఖంలోకి విస్మయంగా చూసింది.

 Previous Page Next Page