Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 44


    పదిహేను నిమిషాల్లో ఆటో వచ్చి శంకర్రావు ఇంటిముందు ఆగింది.
    ఇందుమతి ఆటోకు బాడుగ ఇచ్చి గబగబ ఇంట్లోకి నడిచింది.
    ఆ ఇల్లు బావురుమంటున్నట్టుగా తోచింది.
    'నౌకర్లంతా ఎక్కడున్నారో' అనుకుంటూ హాల్లో ప్రవేశించింది.
    రాము తడిబట్టతో గచ్చు తుడుస్తున్నాడు. ఇందుమతిని చూసి లేచి నిల్చున్నాడు.
    "అమ్మగారు ఎలా ఉన్నారు?"
    "ఫర్వాలేదమ్మా! బాగానే ఉన్నారు. ఇవ్వాళ చిన్నయ్యగారు దగ్గర కూర్చుని టిఫిన్ కూడా తినిపించారు."
    "అలాగా?" అంటూ లోపలకు వెళ్ళింది.
    అన్నపూర్ణమ్మ పడక కుర్చీలో కూర్చుని భగవద్గీత చదువుతూంది.
    పుస్తకం పైనుంచి తలెత్తి ఇందుమతిని చూసింది. ఇందుమతికి ఆమె ముఖం శ్రావణమాసపు ఆకాశంలా కనిపించింది. ఆమె కళ్ళలో శ్రావణ మేఘాలు కదులుతున్నాయి.
    "ఆంటీ, ఎలా ఉన్నారు?"
    "కూర్చో!" అన్నది నిర్లిప్తంగా.
    ఇందుమతి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది.
    అన్నపూర్ణమ్మ చూపులు పుస్తకం మీదకు తిప్పింది. ఇందుమతి మనసు చివుక్కుమన్నది.
    ఆంటీకి తను రావడం ఇష్టం లేదా? తనమీద కోపంగా ఉందా? ఈ మూడ్ లో తను కోరిన సమాచారం ఈమె ఇస్తుందా? తను ఎంత డెలికేట్ విషయం మాట్లాడబోతున్నది! అసలు ఆ విషయం ఎలా ఆమె ముందు ఎత్తాలా అని ఆటోలో కూర్చున్నంతసేపూ ఆలోచించింది. ఇప్పుడు ఈ మూడ్ లో ఉన్న ఈమె దగ్గిర తను ఆ విషయం ఎలా ఎత్తడం? ఎలా మొదలుపెట్టడం?"
    ఇందుమతి అన్నపూర్ణమ్మను చూసింది.
    అన్నపూర్ణమ్మ ఎదురుగా మరో మనిషి ఉనికినే గమనించనట్టు భగవద్గీత చదువుకుంటూంది.
    "ఆంటీ!" ఇందుమతి జంకు జంకుగానే పిలిచింది.
    అన్నపూర్ణమ్మ కళ్ళెత్తి ఇందుమతి ముఖంలోకి నిర్లిప్తంగా చూసింది.
    "ఆంటీ! నా మీద కోపంగా ఉందా?"
    "నీ మీద కోపమా? ఎందుకూ?"
    "అదే....నేను అలజడి చేసి గౌతమ్ ను మళ్ళీ అరెస్టు చేయించినందుకు."
    అన్నపూర్ణమ్మ వేదాంతిలా నవ్వింది.
    "ప్లీజ్, ఆంటీ! మీరలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. గౌతమ్ ను నేను ఎంతగా ప్రేమించానో మీకు తెలియదా ఆంటీ?"
    "కేవలం ప్రేమించడమే చాలదమ్మా. ప్రేమించినవాడిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతడి వ్యక్తిత్వాన్ని గురించిన అవగాహన ఉండాలి."
    "అవేవీ నాకు లేవంటారా?"
    "ఉంటే ఆ పని చెయ్యవుగా?"
    "ఆంటీ! మీరూ అలాగే ఆలోచిస్తారా? ఆడదానికి అన్యాయం జరిగిందంటే మీరు ఎంత ఉద్రేకపడేవారు? అరుణకు అన్యాయం జరిగిందని తెలిసి మీరెంత పట్టుపట్టి రవితో వివాహం చేయించారూ?"  
    "ఇప్పుడూ అదే చేస్తాను. వాడు- అరుణ శీలం దోచుకోవడానికి ప్రయత్నించినవాడు- ఎవడైనా సరే, ఆఖరుకు నా కన్నకొడుకైనా సరే కటకటాల వెనుక చూట్టానికి ప్రయత్నిస్తాను" అన్నపూర్ణమ్మ ఆ మాటలు ఆవేశంగా అనలేదు. నిర్లిప్తంగా తాపీగా అన్నది.
    ఇందుమతి ఆమె ముఖంలోకి ఓ క్షణం అయోమయంగా చూసింది.
    "మరి నేను చేసిందాన్ని ఎందుకు సమర్ధించలేకపోతున్నారు?"    
    "నువ్వు ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రించావు." ఈసారి ఆమె కంఠంలో ఆవేదన పలికింది.
    ఇందుమతి వెర్రిచూపులు చూసింది.
    "గౌతమ్ అంత నీచానికి ఒడిగడతాడని ఎలా అనుకున్నావు?" నిలదీసినట్టు ప్రశ్నించింది.
    ఇందుమతికి నాలుక పిడచకట్టుకుపోతున్నది.
    పెదవులు తడారిపోతున్నాయి.
    "అదేమిటి, ఆంటీ! స్వయంగా అరుణ చెప్పింది."
    "అరుణ గాబరాలో ఒకర్ని మరొకరుగా భావించి ఉండొచ్చును."
    "మా వంటమనిషి....!"
    "వంటమనిషి కూడా పొరపాటు పడి ఉండొచ్చును."
    ఇందుమతికి జుట్టు పీక్కోవాలనిపించింది.
    ఇద్దరూ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయారు.
    ఇందుమతి లేచివెళ్ళి ఫ్రిజ్ తెరిచి మంచినీళ్ళ బాటిల్ తీసుకుంది. బాటిల్ నీళ్ళూ గటగటా తాగేసింది. మరో బాటిల్ తీసుకొని అన్నపూర్ణమ్మ గదిలోకి వచ్చింది.
    "మంచినీళ్ళు కావాలా, ఆంటీ?"
    "నాకొద్దులే. అక్కడుంచు. మళ్ళీ నీకే అవసరం కావచ్చు."
    ఇందుమతి అన్నపూర్ణమ్మ ముఖంలోకి బిత్తర చూపులు చూసింది.
    అన్నపూర్ణమ్మ నీరసంగా నవ్వింది- చల్లగా నవ్వింది.
    "ఆంటీ వాళ్ళు ఎవర్నో చూసి గౌతమ్ గా పొరపాటుపడ్డారంటారా?"
    అన్నపూర్ణమ్మ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది.
    "గౌతమ్ నిరపరాధి అని మీ నమ్మకమా? మళ్ళీ ఇందుమతి అడిగింది.
    అన్నపూర్ణమ్మ కళ్ళెత్తి ఇందుమతి కళ్ళలోకి సూటిగా చూసింది.
    "నువ్వు అతడు అపరాధి అనే భావిస్తున్నావుగా!"
    "అవును. మనకో న్యాయం, మరొకరికో న్యాయం నాకు నచ్చాడు. ఒక ఆడపిల్ల మీద ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డవాడెవడైనా సరే, నేను సహించను. అతడికి శిక్షపడాలి. మాగ్జిమమ్ శిక్షపడాలి." ఆవేశంగా అన్నది ఇందుమతి.
    అన్నపూర్ణమ్మ మౌనంగా ఇందును చూసింది. ఆ చూపుల్లో ఉన్న శక్తి ఏదో ఇందుమతి ఆవేశంమీద చన్నీళ్ళు చల్లింది.
    "ఆంటీ?"
    "ఏమిటీ?"

 Previous Page Next Page