"అతడు నిరపరాధి."
సునంద కూతుర్ని పిచ్చిదాన్ని చూసినట్టుగా చూసింది.
"నేను ఆ పని చేయాల్సింది కాదు."
"ఇందూ!"
"అవును. నువ్వూ తొందరపడ్డావ్ పోలీసు రిపోర్టు ఇచ్చి."
సునంద మనసు చివుక్కుమన్నది.
"మన ఆశయాలూ, ఆదర్శాలూ పరాయి వాళ్ళకోసమేనా ఇందూ? మనకు కావాల్సిన వాళ్ళెంత నీచానికి పాల్పడినా మనం చూడనట్టే ఉండిపోవాల?" తీవ్రంగా పలికింది సునంద.
"మమ్మీ! నేను నీ కూతుర్ని మమ్మీ! నువ్వు కనకపోయినా సొంత కూతురి కంటే మిన్నగా పెంచావు. నీ ఆశయాలకు అనుగుణంగా నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దావు. నేను ముమ్మూర్తులా నీ కూతుర్ని!" నిబ్బరంగా అన్నది.
"మరి!" ఏదో అడగాలనుకుంది. కాని ఏం అడగాలో తోచక ఊరుకుంది సునంద.
"మనం మన ఆదర్శాలతో పాటు ఒక రకమైన ఈగోను కూడా పెంచుకున్నాం" అని ఆగి తల్లి ముఖంలోకి చూసింది.
సునంద తృళ్ళిపడినంత పని అయింది.
"క్షమించమ్మా! నేను నిన్ను బాధ పెడుతున్నాను. ఆదర్శాల పేరుతో ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రించాం."
సునంద అయోమయంగా చూసింది.
"అతణ్ణి ప్రజల ముందు నిలబెట్టాం. పత్రికలకు ఎక్కించాం. అతడి వ్యక్తిత్వాన్ని పిచ్చికుక్కలు చింపిన విస్తరి చేశాం."
"ఇందూ! నీకు నిజంగానే మతిపోయింది."
ఇందుమతి తల్లి మాట వినిపించుకోలేదు. తన ధోరణిలోనే చెప్పుకుపోసాగింది.
"ఇలా నువ్వూ, నీలాంటి సోషల్ వర్కర్సూ అపరాధుల్లా ప్రజల ముందు నిలబెట్టిన వారిలో ఎందరు నిరపరాధులు ఉన్నారోనని...."
"ఇందూ?" కోపంగా అరిచింది సునంద.
"అవునమ్మా! పదిమంది అపరాధులకు శిక్షలు పడకపోయినా కొంపలేం మునిగిపోవు. కాని ఒక్క నిరపరాధికి శిక్ష పడటం.... చాలా....చాలా...."
"ఇందూ! నీకు పిచ్చెక్కింది."
"అవునమ్మా! మనం చేసే ఈ యజ్ఞంలో ఒక్క నిరపరాధిని కూడా బాలి చెయ్యకూడదమ్మా! స్త్రీల హత్యలు, ఆత్మహత్యల మీద మనం సేకరించే సమాచారం మనకు సంతృప్తి కలిగించాకనే మనం అలజడి ప్రారంభించాలి."
"ఇందూ! నాకు నీతులు చెపుతున్నావా?"
"నిజం చెప్పటానికి జంకరాదనే నమ్మకాన్ని నాలో నూరిపోసింది నువ్వేనమ్మా!"
"ఇన్నిటికి నువ్వనేదేమిటి? గౌతమ్ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం తప్పనేగా?"
"అవును."
"ఎందుకని? గౌతమ్ నా కాబోయే అల్లుడనా?"
ఇందు అదోలా నవ్వింది.
"కాదు. అతడు నిరపరాధి కనక. మనం తొందరపడ్డామంటున్నాను."
"గౌతమ్ నిరపరాధి కాడు."
"అవును మమ్మీ! అతడు అపరాధి కాడు."
"ఇందూ! నిజంగానే నీకు మతిపోయింది."
"నేను నిజం చెపుతున్నానమ్మా!"
"దేన్ని బట్టి అతడు నిరపరాధి అంటున్నావ్? అతడు అలా చెప్పాడా?"
"నో మమ్మీ! గౌతమ్ అలాంటివాడు కాడు. తను చెయ్యని అపరాధాన్ని కూడా మౌనంగా భరిస్తున్నాడు."
"నీ మాటలు వింటూంటే నాకు మతి పోతున్నది. ఆ చెప్పేదేదో సరిగా చెప్పు."
"గౌతమ్ అరుణ మీద అఘాయిత్యం చెయ్యలేదు."
"అరుణ అబద్ధం చెప్పిందంటావా?"
"అలా అనటం లేదు. అరుణ నిజమే చెప్పింది. వంటమనిషి చెప్పిందీ నిజమే!"
సునంద కూతురి మొఖంలోకి భయం భయంగా చూసింది. దీనికి నిజంగా మతిపోలేదు గదా?
"వాళ్ళు నిజమే చెప్పారు? అయినా గౌతమ్ నిరపరాధా? ఏమిటమ్మా! నీకేమైనా మతిపోయిందా?"
"వాళ్ళు నిజం చెప్పారంటే_ నా ఉద్దేశం అతణ్ణి చూసి వాళ్ళు గౌతమ్ అనే అనుకున్నారని...."
"ఎవర్నో చూసి గౌతమ్ అనుకోవడం ఏమిటి?" విసుగ్గా అన్నది సునంద.
"అవును మమ్మీ! అతడు అచ్చం గౌతమ్ లాగే ఉంటాడు."
సునంద కూతురి ముఖంలోకి లోతుగా చూసింది. ఆ ముఖంలో మతి చలించిన లక్షణాలేమీ కనిపించలేదు.
"ఏమిటి మమ్మీ అలా చూస్తావ్?" ఇంకా నాకు మతి పోలేదు."
"నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నీకు మతి పోయిందేమోనని నాకు అనుమానంగా ఉంది."
"నేను నిజం చెపుతున్నాను మమ్మీ!"
"నిజం చెపుతున్నావా? అయితే గౌతమ్ గా కామరూపాన్ని ధరించి వచ్చిన ఆ మాయల ఫకీరు ఎవరు?"
"ఇందులో మాయలూ లేవు, మంత్రాలూ లేవు" తల్లి ధోరణికి చిన్నబుచ్చుకుని అన్నది ఇందుమతి.
సునంద చూస్తూ ఉండిపోయింది.
"అతడు అచ్చంగా గౌతమ్ లాగే ఉంటాడు" తనకుతనే చెప్పుకుంటున్నట్టుగా అన్నది.
"ఎవరు చెప్పారు?"
"నేనే చూశాను."
తల్లి కూతుర్ని విస్మయంగా చూసింది.
"నువ్వు చూశావా?"
"అవును. ఇంతకుముందే నీకు చెప్పాను. కాని నువ్వు నమ్మలేదు."
"అవును, చెప్పావు. కాని వాటికి ఆధారాలు దొరక్క గౌతమే ఇద్దరిలా నటిస్తున్నాడని నీకు అనుమానం వచ్చిందిగా? ఇప్పుడు అతడు వేరూ ఇతడు వేరూ అని రుజువులు నీకు దొరికాయా?"
విక్రమ్ చెప్పిన విషయాన్ని తల్లిగా వివరంగా చెప్పింది ఇందుమతి.
అంతా విని సునంద ఆలోచనలో పడింది. ఆమె బుర్రలో అనేక సందేహాలు....
"విక్రమ్ చెప్పింది నమ్మావు. అంతేగా? అంతకంటే నీకు వేరే రుజువులు ఏమీ లేవు అవునా?"
"నమ్మడం కాదు. నేను చూసింది అదే రెండు సందర్భాలు చెప్పాను గుర్తుందా_ గౌతమ్ ను కాదు. అతడి పోలికలున్న వాడిని."
సునంద కూతురి మాటలు వింటూ నవ్వాలో, ఏడవాలో అర్థంకానట్టు ముఖం పెట్టింది.
ఒకోసారి మన మనసు వాస్తవాలను అంగీకరించడానికి ఇష్టపడదు. కొంచెం ఆధారాలు లాంటివి కనిపిస్తే, వాస్తవానికి మసిపూసి మరో రూపంలో చూడటం జరుగుతుంది.
"అతడి రవితో చేతులు కలిపి ఈ కుట్రంతా చేస్తున్నాడని నా నమ్మకం."
ఇందుమతిలో నివేచనా శక్తి పూర్తిగా పనిచెయ్యడం మానేసిందనిపించింది సునందకు.
"ఇందూ! నువ్వు చాలా తెలివైనదానివి. అసంభవాలను సంభవాలుగా మనం ఊహించుకుంటే చాలదు."
"అసంభమా? ఇద్దరూ ఒకలా ఉండటం అసంభవమా? అరుదు కావచ్చు. కాని అసంభవం కాదు."
"ఇద్దరూ కవలలు అయితే....?"
"అన్నదమ్ములైనా కావడానికి అవకాశం ఉంది."
"కావచ్చు. కాని ఎవడో అచ్చం గౌతమ్ లా ఉన్నాడనడం...."