శకుంతల నవ్వి "నీ కెందుకంత భయం? నీకేం ఫర్వాలేదు నిజంగా నీకే ఆపదా రానీయను" అంది.
ముఖం వేలాడేసుకుని వెళ్ళిపోయింది శామి.
పది కాగానే శామి తన దగ్గరకు వస్తుంది అనుకుంది శకుంతల. రాలేదు నిద్రపోతోందనుకుని తనే శామి గదిలోకి వెళ్ళింది. శామి నిద్రపోవటంలేదు. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
శకుంతల దాని భుజంమీద చరిచి "లే మొద్దూ! ఏమిటాలోచిస్తున్నావ్? పద" అంది.
ఉలిక్కిపడి లేచింది. ఇద్దరూ రమేష్ ఇంటికి చేరుకున్నారు.
ఆ రోజు డ్రింక్స్ ముందు రమేష్ ఒక్కడే కూర్చున్నాడు.
శకుంతలను చూడగానే అతని ముఖం వికసించింది.
"వచ్చావా! రా అమ్మా! కూర్చో" అన్నాడు. అతడికళ్ళు ఎర్రగా ఉన్నా మాట నిలకడగానే ఉంది. ఈ అభిమాన ప్రకటనని శకుంతల పట్టించుకోలేదు.
"ఇక్కడికి ప్రభాకర్ తో మాట్లాడటానికి వీళ్ళ గురువుగారు వస్తున్నారని శామి చెప్పింది. నిజమేనా?"
"నిజమే!"
"ఎక్కడున్నారు వాళ్ళు?
"లోపలి గదిలో ఏవో విశేషాలు రహస్యంగా చర్చించుకొంటున్నారు-వస్తావా?"
"రావచ్చుగా?"
"నా యింట్లో నీకు అభ్యంతరమేముంది? రా!"
శకుంతల రమేష్ వెంట నడిచింది. ఒకగదిలోనుంచి క్రిందకు మెట్లున్నాయి. అవి దిగేసరికి మరొక విశాలమైన వరండాలోకి వచ్చింది. ఆ వరండా కిటికీలోంచి దట్టమైన అడవి కనిపిస్తోంది.
రమేష్ ఇంటికి ఒకవైపు ఊరూ, - మరొకవైపు అడవీనా? అక్కడ ప్రభాకర్ ఒక్కడే వున్నాడు.
కూర్చోండి!" అన్నాడు మర్యాదగా.
"రా.....గురువుగారు లేరా?"
"అతడు మీకు బాగా తెలుసా? అతని పేరుకూడా తెలుసా?"
"అతనెక్కడ?"
మీకు పిచ్చా? అలాటి గూండాలతో నేనెందుకు స్నేహంచేస్తాను?"
"మరి నన్నెందుకు రమ్మన్నారు?"
"నేను చెప్తాను" కంగారుగా అన్నాడు రమేష్?
"నువ్వెంత కాదన్నా నువ్వు నాకూతురివి నువ్వు ఏ సంబంధమూ లేని ఆ శర్మగాడి భుజాలు పట్టుకు వేలాడుతూ తిరుగుతోంటే నేనుసహించలేకపోతున్నాను. తండ్రిగా నీ బాధ్యత నాకుంది. ప్రభాకర్ తో నీ పెళ్ళి జరిపించాలని నిన్ను పిలిచాను"
"ఎంత మోసం, శామీ!"
రమేష్ నవ్వి, "శామి నీతో రాలేదు. బయటే ఉంది. ఈ గదికి దారికూడా తనకి తెలియదు. ఈ గదికి, ముందు గదులకి సంబంధంలేదు.
ఇది నా ప్రైవేటు రూం!" అన్నాడు.
మోసం జరిగిందని అర్ధమయిపోయింది శకుంతలకు. ఇందులో శామికి భాగం ఉంది. తనను ఎందుకింత మోసంచేసింది? ఏ ప్రభావంతో?
ధైర్యం తెచ్చుకుంది.
"నేను ప్రభాకర్ ని పెళ్ళి చేసుకోను."
ప్రభాకర్ లేచి నిలబడ్డాడు. "థేంక్ యు! ఇప్పట్లో పెళ్ళీ సంసారమూ ఇలాంటి బంధాలు వద్దని నేను రమేష్గారిని ఎన్నోవిధాల బ్రతిమాలాను. ఆయన వినలేదు. స్నేహం కొద్దీ గట్టిగా ఆయన మాట కాదనలేకపోయాను. ఈ కార్మిక జనానికి సేవ చెయ్యటమే నా జీవిత లక్ష్యం కానీ, ఒక్క విన్నపం చేసుకోనియ్యండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను." కొద్దిగా ముందుకు వంగి ఇంగ్లీ షుపద్దతిలో స్టెయిల్ గా నమస్కారంచేసి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు.
రమేష్ ముఖంలో మాత్రం చిరునవ్వు లేదు.
శకుంతలా! నీ ఆగడాలు ఇన్నాళ్ళూ సహించాను. ఇక సహించను. నేను నీ తండ్రిని నువ్వు నాదగ్గిర ఉండవలసిందే! ప్రభాకర్ చదువుకున్న వాడు, ఉత్తముడు ముందు ముందు మంత్రి కాగల సామర్ధ్యమున్నవాడు. అతడిని పెళ్ళిచేసుకుంటే, నువ్వు సుఖపడతావు. ప్రభాకర్ భార్యగా మాత్రమే నువ్వు ఈ గదినుంచి బయటికి రాగలవు. ఆలోచించుకో!" చర చర లేచిపోయాడు.
శకుంతల తనూ వెళ్ళబోయింది. కానీ, ఆ గదిలోంచి పక్క గది లోకీ, ఆ తరువాత మరోగదిలోకీ, అక్కడినుంచి తానున్న గదిలోకీ గుడుగుడు గుంచం తిరగగలిగిందితప్ప, అక్కడినుండి బయటకురాలేకపోయింది.
కిటికీగుండా కారడవి-ఎక్కడకు తీసుకుపోతాయో తనకు తెలియని సన్నని కాలిబాటలు! పోనీ, ఆ అడవిలోకే పోదామన్నా, ద్వారమేమిటో తెలియటంలేదు. గోడలన్నీ ఫుడ్ కలర్ టేకులతోనే ఉన్నాయి. తడిమితడిమి చూసినా తలుపెక్కడో తెలియటంలేదు. తనుబందీనని అర్ధమయిపోయింది. నిరాశతో చుట్టూ చూసింది. రోజ్ వుడ్ కాట్ పైన యూ-ఫోమ్ బెడ్, ఫ్రిజ్..ఫ్రిజ్ లో రకరకాల పళ్ళూ, స్వీట్సూ, పెద్ద గాడ్రేజ్ బీరువా-దాని నిండా చీరలూ, జాకెట్లూ, నైటీలూ వగైరా, డ్రెస్సింగ్ టేబిల్, దానిముందు రక రకాల అలంకరణ సామాగ్రి.... ....రెండు రాక్స్ నిండా రకరకాల పుస్తకాలూ, అన్ని సదుపాయాలూ ఉన్నాయి. ఇదంతా ముందుగా ఆలోచించు కొని చేసిందా? తనకు తండ్రినని చెప్పుకొనే రమేష్, ఇంత నీచుడా?
తలదిమ్మెక్కినట్లుకాగా మంచంమీద పడుకొంది. పైన సేఫ్ గిరగిర తిరుగుతున్నట్లే ఆలోచనలు గిరగిర తిరుగుతున్నాయి. భారంగా నడుస్తోన్న కాలం ఎలాగో రాత్రిని తెల్ల వార్చింది.
రమేష్ వచ్చి "గుడ్ మార్నింగ్!" అన్నాడు బేలగా చూసింది.
"త్వరగా ముఖం కడుక్కో! బ్రేక్ ఫాస్టు తీసుకుందాం!" అన్నాడు.
అలసటగా లేచింది.
"నీకేం కావాలో చెప్పు. నన్నిలా ఎందుకు బంధించావు?"
"నాకేమీ అక్కరలేదు. నువ్వు నా కూతురివి. నా కళ్ళముందు ఉండటం కావాలి అంతే!"
"బలవంతాన అభిమానాన్ని పొందగలవా?"
"చిన్నపిల్లలకు నయానో భయానో చెప్పవలసిందే!"
"నేను చిన్నపిల్లనుకాను."
నాకు చిన్నపిల్లవే! శకుంతలా! మీ అమ్మని నేను మోసం చెయ్యలేదు. నాదగ్గరకు పిలిపించుకోవటంలో కాస్త ఆలస్యం అయింది. ఇక్కడ నిలదొక్కుకునే నా ప్రయత్నంలో వెంటనే వెళ్ళలేకపోయాను. ఈలోగా తను మరొకళ్ళని పెళ్ళి చేసుకోవటం అన్యాయం కదూ!"
ఈ కథలన్నీ వినివిని వేసారిపోయింది శకుంతల. ఈ విషయంలో వాదన పెంచుకోవటం చాలా అసహ్యం అనిపించింది ఆమెకి.
"ఇప్పుడింతకూ, ఏం చేయాలని నీ ఉద్దేశ్యం?"