"ఏముందీ? నిన్ను నేనే ప్రేమగా పెంచుకోవటమే!"
"ఎంతకాలం?"
"ఆడపిల్లని ఎంతకాలం పెంచుతారు? పెళ్ళిచేసి అత్తవారింటికి పంపేవరకూ."
"నాకిష్టంలేని పెళ్ళి చేస్తావా?"
"చెయ్యను ప్రభాకర్ ని చేసుకోమని బలవంతం చెయ్యడంలేదుగా! పోనీ, నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు!"
శకుంతల మాట్లాడలేదు.
"గురూగారంటది శామి! అతడెవరు? నీతో అతనికెలాంటి పరిచయం?"
మళ్ళీ మౌనమే!
అలాంటి పరిచయాలు పెంచుకోకు. ఎప్పటికైనా ప్రమాదమే!"
శకుంతల లేచి బాత్ రూం లోకి వెళ్ళిపోయింది. ఆమె వచ్చేవరకూ టిఫెన్ తీసుకోకుండా పేపర్ చదువుతూ కాచుకున్నాడు రమేష్, అతనితో కలిసి ఫలహారం చెయ్యకూడదనిపించింది ముందు. ఆ తరువాత మంచిగా ఉంటేనే, ఎలా అయినా తప్పించుకొనే మార్గం ఆలోచించాలనుకొంది. టేబిల్ మీద ఇడ్లీ, దోసె ఉన్నాయి. ఎవరో మళయాళం కుర్రాడు వడ్డిస్తున్నాడు. ఏసగా తెలుగు మాట్లాడుతున్నాడు. వాళ్ళతల్లిదండ్రులు బాకీల్లో ఉంటే, రమేష్ వాళ్ళకు అప్పిచ్చి, ఈ కుర్రాడిని తనతో తెచ్చుకున్నాడు. బానిస వ్యాపారం మాసిపోయిందని ఎవరన్నారు? వెట్టిచాకిరీ రద్దయిందని ఎవరు అపోహపడ్తున్నారు? చదువుకొని వృద్దిలోకి రావలసిన ఈ పిల్లవాడు, ఇంత పసితనంనుంచీ, చాకిరీకి అంకితమయిపోయి శ్లేష్మంలో పడ్డ ఈగలాగ కొట్టుకుంటున్నాడు. వీడేకాదు, ఎందరో పసివాళ్ళు భావి భారత పౌరులు ఇలా మగ్గిపోతూనే ఉన్నారు.
సంభాషణ పెంచకుండా టిఫిన్ ముగించి పుస్తకం ఒకటితీసి చేత్తో పట్టుకుంది కళ్ళముందు అక్షరాలున్నా, మనసులో ఒకటే ఆలోచన-ఎలా తప్పించుకోవాలా అని. శర్మకు వర్తమానం అందితే తనను తప్పకుండా విడిపిస్తాడు. కానీ ఎలా అందుతుంది?
దీనమైన రోదన ధ్వనికి ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఏమీ కనబడటంలేదు. మాటలు వినిపిస్తున్నాయి.
"నా సొమ్మంతా నీ దగ్గరే దాచిపెట్టిన గదయ్యా! ఇప్పుడు లేదంటావు నాయనా? ఓరయ్యో! ఇట్టా మాలాంటోళ్ళ పొట్టలు గొడితే నీకు నీ బిడ్డలకీ మేలవుతాదయ్యా?"
"ఏయ్! పోనువ్వు నా దగ్గర డబ్బు దాచావా? అవతలికి ఫో! లేని పోని అబద్దాలాడావంటే, పళ్ళు రాలగొడతాను."
అధి రమేష్ గొంతు.
"ఓరయ్యో! అంతమాటనకయ్యా, బిడ్డడిని చదివిస్తున్నాన్నయ్య నా డబ్బు నా కియ్యయ్య....."
ఏడుపు __ దీనాతి దీనమైన ఏడుపు__ "ఏయ్! ఫో! మర్యాదగా పోకపోతే మెడపట్టి గెంటుతా!" మరెవరిదో కర్కశమైన గొంతు ఈ గొంతు రమేష్ కుడిభుజమైన గూండాది కాబోలు!
కాసేపు నిశ్శబ్దం____ మళ్ళీ గోల__ అరుపులు.
"కాలియి, వెండి కడియాలు, పదితులాలయి పెట్టినా నాయి నా కియ్యి - లేదంటే ఒప్పను."
"ఏయ్! నీ యిష్టం వచ్చినప్పు డొచ్చి ఇయ్యమంటే ఎవరిస్తారు? గడువు కాలం ఎప్పుడో తీరిపోయింది ఆ కడియాలమ్మేసాను."
"ఆరి నీ జిమ్మడో! పాతిక రూపాయలకి__ పాతికంటే పాతిక్కి పది తులాల కడియాలు మింగుతవురో!_
ఏడుపులు - శాపాలు!
"ఏయ్! పో! పో!_ పిచ్చి పిచ్చి వేషాలేశావంటే, మక్కెలిరుగుతయి" గూండా గొంతు.
శకుంతల రక్తం మరిగిపో సాగింది. అంతకు ముందే రమేష్ అక్కడికి ఎలా వచ్చాడో, అంతవాడు ఎలా అయ్యాడో కథలుగా వింది, ఇప్పుడు చెవులారా వింటోంది.
శకుంతల అక్కడికి వచ్చి వారం రోజులు గడిచి పోయాయి. ఈ వారంలోనూ, పుస్తకాలలో చదివిన దానికంటే ఎక్కువగా చదివింది. అనునిత్యమూ వినపడుతున్న శోకాల నుంచి, శాపాలనుంచి ప్రతిరోజూ ఆ పాపాత్ముడితోనే భోజనం చెయ్యవలసి వస్తోంది ఒక్కొక్కసారి అమాంతం అతడి మీద పడి పీక నొక్కాలనిపించేది. కానీ, ఆ తొందర పాటు మంచిది కాదని లోలోపల విజ్ఞత హెచ్చరిస్తే బలవంతాన తనను తాను నిగ్రహించుకొనేది. తను ఇక్కడున్నట్లు రాజుకి కాని, శర్మకి కాని, తెలిస్తే..... ఎలా తెలుస్తుంది? తను ఎన్నాళ్ళిక్కడుండాలి? పోనీ, ప్రభాకర్ ని మంచి చేసుకుంటే? లాభంలేదు, అతడు రమేష్ కంటె నాలుగాకులెక్కువ చదివినట్లున్నాడు అతడు ముందు ముందు మంత్రి కాబోయే కార్మిక నాయకుడట! ఆ పరిచయం చాలు- అతడి విశ్వరూపం తెలియజేయటానికి మనసులు మరిగి పోతుండగా ఆ అభాగ్యులు పెడ్తున్న ఆ శాపాలేవీ ఈ రాక్షసుడికి తగలవా?
కలత నిద్రలో ఏవేవో కలలతో మెలకువ వచ్చింది. మంచంమీద లేచి కూర్చుంది. తన గది తలుపులు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి.
ఎంతోమంది మనుష్యులు? ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కాకీ బట్టల్లో, చేతిలో తుపాకులతో.... ఎవరో తనపెడరెక్కలు విరిచికట్టారు. మరొకడు కళ్ళకు నల్లగుడ్డ కట్టారు. "పద" అన్నారు. ఏం జరిగిందో అని ఆశ్చర్యపడుతూ వాళ్ళు నడిపించినదారిలో నడిచింది. నిశ్శబ్దంలో వినిపించిన మృగాల అరుపులనుబట్టి, కాళ్ళకు గుచ్చుకొంటున్న రాళ్ళను బట్టి అడివిదారిలో వెళ్తున్నట్లు గ్రహించి చిత్రంగా భయం వెయ్యటానికి బదులు సంతోషం కలిగింది. ఏదో అడగబోయింది. "ఉష్!" అన్నా రెవరో. తుపాకి మొన వీపుకి గుచ్చుకుంది. మళ్ళీ మాట్లాడలేదు. చాలా దూరం నడిచినట్లనిపించింది. కాళ్ళు లాగసాగాయి. ఎంతో సేపటికి "ఆగు" అన్నారు. కళ్ళగంతలు విప్పారు. చుట్టూ కాగడాల వెలుగు. తుపాకులతో, కాకీ ప్యాంట్లతో స్త్రీ - పురుషులు, తన ప్రక్కనే తన లాగే చేతులు వెనక్కి విరిచి కట్టబడిన రమేష్ ను చూచి ఆనందంతో "హమ్మయ్య! ఈ రాక్షసుడ్ని బంధించారా?" అంది తనున్న పరిస్థితి మరిచి.
అక్కడివారు ఒకరి ముఖాలు మరొకరు చూచుకున్నారు.
శకుంతల నెమ్మదిగా అందరినీ చూసింది. రెండో వరసలో నిలబడి వున్నాడు రాజు- అతడి పక్కనే తన తల్లి! రాజు చెయ్యి తన తల్లి భుజం మీద ఉంది_ ఓదారుస్తున్నట్లు. రాజును చూడగానే గట్టిగా పిలవబోయింది. అంతలో ఆవేశం అణచుకొంది.
భయం కంటె కుతూహలమే ఎక్కువకాగా చుట్టూచూసి, "నన్ను మీరు ఎందుకు బంధించారో నాకు తెలియదు కానీ, నిజం చెప్తున్నాను! నేను మీ మనిషిని మీ మేలు కోరేదాన్ని" అంది.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
"విచారణ పూర్తయేవరకూ ఈవిడ చేతులను కట్టినకట్లు విప్పండి" అన్నారెవరో.
మరొకరు వచ్చి కట్లు విప్పేశారు.
విచారణ అనేమాట వింతగా తోచింది శకుంతలకి. కుతూహలంగా ఎదురు చూడసాగింది.