Previous Page Next Page 
షా పేజి 44

 

    రంగా, స్వరూప్ కలిసి రాత్రి తొమ్మిదిగంటల లోపల ఇంట్లోని సామానంతా చుట్టుపక్కల వాళ్ళకు అమ్మేశారు. వంటసామాను, పిల్లల బట్టలూ, మాత్రం రెండు పెట్టెల్లో పాక్ చేసి ఉంచారు.
    మర్నాడు రిజిస్ట్రార్ ఆఫీసు కార్యక్రమం అంతా పూర్తయి పోయింది.
    సామాను , స్కూటర్ అన్నీ లారీ ట్రాన్స్ పోర్టులో బుక్ చేసి బస్ లో బయల్దేరారందరూ.


                                                        *     *    *    *

    వైజాగ్ లోని ఓ హోటల్లో దిగారందరూ.
    "నేను మా ఇంటి కేళతానిక! సాయింత్రం ఆఫీస్ నుంచి ఇటు వస్తాను మళ్ళీ" అంది భారతి.
    "మీ కోసమే ఎదురు చూస్తుంటామండీ! కనీసం రోజూ కాసేపైనా మీరు మాతో గడపకపోతే మేము ముగ్గురం భోజనం చేయలేము" అన్నాడతను దిగాలు పడి.
    "నాకు తెలుసు" అంది భారతి. "అయినా మీరు త్వరగా ఓ ఇల్లు వెతుక్కోవడం మంచిది. రోజుకి వంద రూపాయలు చొప్పున ఎంతకాలం కడతారు అద్దె! నేనూ మా ఆఫీసు వాళ్ళనడిగి ట్రై చేస్తాను. మీరూ పిల్లల్ని గదిలో ఉంచి ఎక్కడయినా ఉంటాయేమో చూసిరండి. "చెప్పిందామె. వీలయితే మా ఇంటికి సమీపంలోనే చూడండి?"
    "సరే"
    ఆమె వెళ్ళిపోయింది.
    కాఫీ ఫాలహారాలయాక ఇల్లు వెతకడానికి బయల్దేరాడతను. లిప్ట్ లో కిందకు దిగేసరికి ఎదురుగ్గా భారతి కనిపించిందతనికి. ఆశ్చర్యపోయాడతను.
    "ఏమిటి? అప్పుడే వచ్చేశారు?"
    "రూములోకి పదండి చెబుతాను" అందామె పాలిపోయిన మొఖంతో.
    ఇద్దరూ లిప్ట్ లో మళ్ళీ రూము కి చేరుకున్నారు.
    "ఏమయింది?" కుర్చీలో చిరాకుగా కూలబడ్డ ఆమెను చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడతను.
    "ఇంట్లో మా పిన్ని పెద్ద సీన్ చేసేసింది. అందామె తలవంచుకుని.
    ":ఏం జరిగింది?"
    "నేనిలా యిష్టమోచ్చినట్లు తిరిగివస్తే వాళ్ళింట్లో ఉండటానికి వీల్లేదట....."
    "మీరే మన్నారు?" ఆత్రుతగా అడిగాడతను.
    "అలా అయితే ఆ ఇంట్లో ఉండనని చెప్పేశాను.
    సృజన్ కలవరపడ్డాడు.
    "అదేమిటి?" అలా ఎందుకన్నారు?"
    "ఇంకెలా అనను! నన్నలా అవమానపరుస్తే నేనెందుకు ఊరుకోవాలి! నా మంచేదో చెడేదో తెలుసుకోలేని వయసా నాది?" ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్.
    సీతా, శంకూ ఆశ్చర్యంగా చూస్తుండి పోయారామెని.
    సృజన్ ఆమె దగ్గరగా నడిచి ఆప్యాయంగా ఆమె భుజం మీద చేయి వేశాడు.
    "భారతీ! మీరేడుస్తే మా అందరికీ బాధగా ఉంటుంది. దయచేసి  ఏడవకండి" అన్నాడతను.
    భారతి తన కర్చీఫ్ తో కన్నీరు తుడిచేసుకుంది.
    "మీరు ఇల్లు ఎలాగూ వెతుకుతున్నారు కదా! కనుక కొంచెం పెద్ద ఇల్లు వెతకండి! నేనో గదిలో వుంటాను" అందామె రోషంగా.
    సృజన్ నివ్వెరపోయాడు.
    "అంటే వాళ్ళింట్లో నుంచి నిజంగానే వచ్చేస్తారా?"
    "ఏం రాకూడదా?" కొంచెం కోపంగా అడిగిందామె.
    "అదికాదు భారతిగారూ నావల్ల మీదు మీ బాబాయి పిన్నిలతో పోట్లాడి బయటకు రావటం నాకు గిల్టీగా అనిపిస్తోంది. అందుకే అలా అంటున్నాను గానీ వేరే కారణం లేదు" నొచ్చుకుంటూ అన్నాడతను.
    భారతి కుర్చీలో నుంచి లేచి నిలబడింది.
    "సారీ! మీ మీద కోపం కాదు. ఇదంతా మా పిన్ని మీద కోపం! అయినా ఇది మీవల్లే జరిగిందని మీరీమీ బాధపడకండి. ఏదొక రోజూ జరగక తప్పదది. మీవల్ల కొంచెం త్వరగా జరిగింది. బాబాయ్ ఎప్పుడూ అంటూనే వుంటాడు! దీని నోరు మంచిది కాదమ్మా! ఎప్పుడయినా భరించలేననిపిస్తే ఎలాంటి సంకోచం లేకుండా వర్కింగ్ వుమెన్ హాస్టల్ కెళ్ళిపో అని. కాని హాస్టల్ లైఫ్ హైదరాబాదు లో  ఓసారి అనుభవించాను కదా అందుకే ఎలాగోలా భరిస్తూ ఇక్కడే ఉండిపోయాను. కానీ ఇప్పుడు మీరెలాగూ తోడు ఉండనే ఉన్నారు. ఇంకెందుకు ఆ యింట్లో ఉండాలి నేను?"
    "ఒకే భారతిగారూ! మీ ఇష్టం! మీరెలా చెప్తే అలా! ఇవాళే ఏదో ఒక ఇల్లు సంపాదిస్తాను వెతికి! సరేనా?"
    ఆమె ఆనందంతో తలూపింది.
    "అయితే మీరింక ఆఫీస్ కెళ్ళాండి. సాయంత్రానికల్లా ఇల్లు వెతికి ఉంచుతాను."
    ఆమె సీతనూ, శంకూ నీ ముద్దు పెట్టుకుని టాటా చెప్పి వెళ్ళిపోయింది.
    సృజన్ ఇంటి వేట మొదలుపెట్టాడు. ఆటోలో చాలాసేపు తిరిగాక ఓ ఇంటిముందు "టులెట్" బోర్డు కనిపించింది. పక్క నున్న ఇంటి వాళ్ళనడిగి ఓనర్స్ అడ్రస్ తీసుకుని వాళ్ళింటికి చేరుకున్నాడతను. భారతి కూడా తనతోనే అదే ఇంట్లో ఉంటుందన్న సంగతి వినగానే అంతవరకూ మర్యాదగా మాట్లాడినవాళ్ళు ఇల్లు అతనికివ్వటం కుదరదని చెప్పేశారు.

 Previous Page Next Page