"రజనీ! మేము ఇవ్వాల్సిన లక్షరూపాయలగురించి గట్టిగా అడిగావుట. నిఖిల్ చాల బాధపడ్డాడు" అంటోన్నది మంజుభార్గవి.
"నాకిప్పుడు డబ్బు అవసరం వచ్చింది. అందుకని అడిగాను. ఇన్నాళ్ళు మెదలకుండా వూరుకున్నాను కదా!"
"రజనీ! నీకు డబ్బు కావాలంటే మాకిచ్చిన ఎమౌంటే కావలసి వచ్చిందా? నువ్వు మారావు. నీలో ఏదో మార్పువచ్చింది. నువ్వు నాకు నగలుకాని, ఇంకేదైనా ఖరీదైన బహుమతి కాని కొనిపెట్టి ఎన్నాళ్ళయింది?"
"నీకు నేను కొనిపెట్టాలా మంజు? నీ హజ్బెండ్ వుండగా నేనెందుకు కొనిపెట్టాలి?"
"ఎందుకంటే నీకు నాకు వున్న ఫ్రెండ్ షిప్ అలాంటిది గనుక."
"ఫ్రెండ్ షిప్ ఆ పేరుతో నా దగ్గర చాలా గుంజాడు. వాడు... అదే నీ హజ్బెండ్ అయిదొందలు, ఆరొందలు చేబదుళ్లుగా తీసుకుని మళ్ళీ ఆ ఊసే ఎత్తకుండా మరచిపోయినట్లు ఊరుకునేవాడు. అవన్నీ చూసీ చూడనట్లు ఊరుకోలేదా? ఇది పెద్ద ఎమౌంట్, అవసరమొచ్చింది."
"నువ్వు నా హజ్బెండ్ గురించి చీప్ గా మాటలాడుతున్నావు."
"అబ్బో! ఎన్నడూ లేనిదీ వాడినేమిటి ఇలా వెనకేసుకొస్తున్నావు?"
"రజనీ! అధికంగా మాట్లాడకు. అతను నా భర్త చీప్ చీసి మాట్లాడితే నేనూరుకోను."
అతనాశ్చర్యంగా ఆమెముఖంలోకి చూశాడు.
ఆమెతో తాను ఎంత చనువుగానైనా వుండనీ, ఎంత విశృంఖలంగానైనా వర్తించనీ, ఎన్ని మధురాతి మధురమైన సంఘటనలన్నా - ఇరువురి మధ్య జరగనీ, ఆమె అంత పరాయిదో అవసరమైనప్పుడు ఇతర బంధాలన్నీ పక్కకు పెట్టి భర్తకే ఎంత విలువ ఇస్తుందో, ఎంత తేలిగ్గా అవతలివాడిని పరాయివాడిగా, గడ్డిపోచగా తీసివేస్తున్నదో అర్ధమైంది. ఆ క్షణంలో ఆమెలో అతనికి కొత్త స్త్రీమూర్తి కనిపించింది.
ఇన్ని సంవత్సరాల దీర్ఘస్నేహంలో మధ్య మధ్య వాళ్ళిద్దరి మధ్యా అనేక కీచులాటలు జరిగాయి. మధ్య మధ్య తగాదాలాడుకొనేవారు. కొంతకాలం మాట్లాడుకోవటం మానేసేవారు. వారం పదిరోజులకల్లా మళ్ళీ రాజీపడి కలిసిపోయేవారు.
ఇక్కడో చిత్రముంది. అతనితో ఎంత క్లోజ్ గా వున్నా, ఇరుగుపొరుగు, ఇతర పరిచయస్థులు తమ గురించి ఎన్ని విధాల అనుకుంటున్నా మంజుభార్గవి మాత్రం ఏ ఒక్క సందర్భంలోనూ అతన్ని గురించి మాటల్లో తేడా రానీయలేదు.
"మా రజని మా రజని" అంటూ అతనిని ఆత్మీయుడైన ఫ్యామిలీ ఫ్రెండ్ గా చిత్రీకరిస్తూ వుండేది.
నలుగురి మధ్య వున్నప్పుడు అతనితో మాట్లాడే విధానంలోగాని, ఆమె చూపుల్లోగాని వట్టి స్నేహభావమే కనిపించేది కాని ఎలాంటి తేడా గోచరించేది కాదు.
ఆమె ప్రవర్తన కృత్రిమంగా కాకుండా అత్యంత సహజంగా వుండేది.
భర్తగురించి ఎక్కడైనా టాపిక్ వచ్చినప్పుడు కూడా 'నా హజ్బెండ్ నా హజ్బెండ్' అని ఎంతో గౌరవం ప్రదర్శిస్తూ మాట్లాడేది. అంతేకాదు ఏ చిన్న సమస్య వచ్చినా "నిఖిల్ కు ఇలాంటివంటే ఇష్టం వుండవు. అమ్మో! నిఖిల్ కు తెలిస్తే చంపేస్తాడు" అని హడలిపోతున్నట్లు మాట్లాడేది.
అంతేకాదు....ప్రత్యక్షంగా వున్నప్పుడూ, అతనితో ఏకాంతంగా వున్నప్పుడు కూడా ఎంతో ప్రేమను ప్రదర్శిస్తూ, అనురాగం కురిపిస్తూ మాట్లాడేది. అతని అవసరాలు తీర్చటంలో, భోజనాల విషయాల్లో చాలా శ్రద్ద కనబరుస్తూ వుండేది.
అతనెప్పుడైనా రాత్రుళ్ళు ఆలస్యంగా వచ్చినా, క్యాంప్ వెళ్లి అయిదారు రోజులదాకా రాకపోయినా విలవిల్లాడిపోయేది.
ఆమెకళ్ళలో నీళ్ళుకూడా తిరిగేవి.
అందుకే నిఖిలేశ్వర్ ఆమెను చూసి గర్వపడుతూ వుండేవాడు. "అయామ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్" అని ఛాతీ విరుచుకుని చెప్పుకొనేవాడు.
"మంజూ! ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గులేదూ? ఇన్నాళ్ళు నాకు ఇంచుమించు ఓ పెళ్ళాంలా ఉపయోగపడి..."
"షటప్" అంది మంజుభార్గవి కళ్ళురిమి చూస్తూ.
"మంజూ! నీకు అహం మితిమీరిపోయింది. ఆ చవటాయిగాడిలో ఏమి చూశావు? వాడు నా డబ్బు తిన్నాడు. డబ్బుకోసం నన్నవసరానికి వాడుకొన్నాడు. విషయం తెలిసీ చూసీచూడనట్లు వూరుకున్నాడు."
"నిఖిల్ కాలిగోటికి పనికిరావు. అతన్ని విమర్శించేంత మొగాడివా నువ్వు. రజనీ! మా అబ్బాయికూడా పెద్దవాడు అయ్యాడు. నువ్విలా చీటికీ మాటికీ రాకపోకలు సాగిస్తుంటే చూడ్డానికి బావుండదు. ఇంకెప్పుడూ యీ ఇంటిఛాయలకు రాకు" అంది మంజుభార్గవి చాలా కఠినంగా.
ఒక్కక్షణం... ఒక్కక్షణంలో భర్త అనే స్థానం ఎంత శక్తివంతమైనదో గ్రహించాడు రజనీకాంత్. తర్వాత "అలాగా?" అని తలపంకించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
సరాసరి బార్ కి వెళ్ళాడు.. గబగబా మూడుపెగ్గులు తీసుకున్నాడు. తర్వాత బయటికొచ్చి నిఖిలేశ్వర్ ఆఫీస్ కెళ్ళాడు.
అతన్ని చూసి నిఖిలేశ్వర్ సీట్లోంచి లేచి బయటికి వచ్చాడు.
"ఏమిటి?" అన్నాడు డబ్బుగురించి తామిద్దరిమధ్య కొంత వాదోపవాదాలు జరిగాయి కనుక కొంత సీరియస్ గా వున్నాడు.
"నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి."
"మాట్లాడు."
"ఇక్కడేనా?"
"ఆ, ఇక్కడే"
"నీకు ఇన్నాళ్ళూ ధారాళంగా డబ్బు ఎందుకు ఖర్చుపెడుతున్నాననుకొన్నావు?"
"ఫ్రెండ్ షిప్ లో ఖర్చుపెట్టుకున్నాం. నువ్వేమిటి? నీతోబాటు సమానంగా నేనూ ఖర్చుపెట్టాను."
స్నేహం పరాకాష్టదశకు చేరుకొని విడిపోయేస్థితికి వచ్చినప్పుడు సంభాషణ అలాగే సాగుతుంది.
"నువ్వు ఖర్చుపెట్టావా?"
"పెట్టకపోతే నీ సొమ్ము తింటూ కూచోడానికి బేవర్స్ గాడిననుకున్నావా?"