రజనీకామత్ నిరుత్తరుడయినట్లు చూశాడు. సంవత్సరాల తరబడి నిద్ర పోతున్నట్లు కనిపించిన అసలుందా లేదా అన్నట్లు కనిపించిన అతని వ్యక్తిత్వం వెయ్యితలలతో గద్దించినట్లయింది.
అతనిలో యుక్తా యుక్తజ్ఞానం నశించినట్లయి, ఉద్రేకంతో ఆ క్షణంలో పశువులా మాట్లాడాడు.
"నిఖిల్! ఇన్నాళ్ళూ నువ్వు ఏమీ తెలీనట్లు నటించి ఆఖరికి నీ వైఫ్ తో సంబంధం వున్న సంగతికూడా చూసీ చూడనట్లు..."
"షటప్" అన్నాడు నిఖిలేశ్వర్.
"ఏ ఆయుధమూ దొరక్కపోతే చివరికి నువ్వీ అస్త్రం ప్రయోగిస్తావని తెలుసు. నా వైఫ్ తో నీకా? నువ్వెంత? నీ బ్రతుకెంత...?" అంటూ నవ్వాడు.
"సోషల్ గా వుండి చివరకు ఏ దారీ లేకపోతే ఇలాంటికూతలు కూస్తావని నాకు తెలుసు. నీలాటి రోగ్స్ మాటలు విని నా వైఫ్ ని అపార్ధం చేసుకునేంతటి అప్రాచ్యుడ్ని కాను. గెటవుట్ ఫ్రమ్ హియర్. ఇంకెప్పుడూ నా కళ్ళకి కనిపించకు."
"నా డబ్బు..."
"డబ్బూ లేదు, గిబ్బూ లేదు ఏమి చేసుకుంటావో చేసుకో."
రజనీకాంత్ అతనివంక నిస్సహాయంతో కూడిన ఉగ్రంతో చూసి, మొహం వ్రేలాడేసుకొని బయటికి వెళ్ళిపోయాడు.
* * *
ఆ సాయంత్రం అతను ఇంటికి వెళ్ళేసరికి మంజుభార్గవి అంతవరకూ ఏడ్చివున్నట్లు, మొహం నిగారించి కనిపించింది.
"మంజూ! ఏమి జరిగింది?" అన్నాడు.
ఆమె దిగులుగా ఎర్రబడి వున్న కళ్ళతో అతని వైపోసారి చూసి అంతలోనే తలవాల్చేసుకుంది.
"ఆ రాస్కెల్ ఇక్కడికి కూడా వచ్చాడా?"
మంజుభార్గవి నిశ్శబ్దంగా వూరుకుంది.
అతను ఆమె భుజాలచుట్టూ చేతులువేసి దగ్గరికి తీసుకున్నాడు.
"మంజూ! ఈ కొక్కిరాయులు ఎన్ని కూతలు కూసినా నీ గురించి నేను అపార్ధం చేసుకోను. నన్ను నమ్ము" అన్నాడు.
ఆమె అతని గుండెలమీద తలవాల్చి "చాలండీ! నామీద మీకా నమ్మకముంటే చాలు" అన్నది.
19
కిరణ్మయి బస్టాపుదగ్గర నిలబడింది. ఓ ఇరవై రెండేళ్ళ, ఇరవైమూడేళ్ళ యువకుడు కొంతదూరంలో నిలబడి ఆమెను గమనిస్తున్నాడు.
అతన్ని ఇంచుమించు పదిహేను రోజులబట్టి చూస్తోంది. ఎక్కడ్నుంచో కారు డ్రైవ్ చేసుకొంటూ వస్తాడు. దూరంగా ఒక సందులో పార్కు చేస్తాడు. బస్టాపు దగ్గరకొచ్చి తనని గమనిస్తూ నిలబడతాడు.
తెల్లని శరీరపురంగు, ఉంగరాల జుట్టు, నల్లగా మెరిసే అమాయకమైన కళ్ళు...
అతనలా చూస్తుంటే ఆమెగుండె గబగబ కొట్టుకొనేది.
తన ఫ్రెండ్స్ లో చాలామందికి బాయ్ ఫ్రెండ్సుంన్నారు. వాళ్ళు ఉత్తరాలు రాసుకుంటూ వుంటారు. కలిసి హోటల్స్ కూ, సినిమాలకూ వెడుతూ వుంటారు. ఎడతెరిపి లేకుండా ఫోన్స్ చేసుకొని గంటలకి గంటలు మాట్లడుకొంటూ వుంటారు.
చాలా రిచ్ గా, సోఫిస్టికేటెడ్ గా జీవించే తమ కాలేజీ అమ్మాయిలు చాలామంది తెలుసు.
తనకి గుర్తున్నంతవరకూ తన చిన్నతనం లో చాలా ఖరీదైన జీవితమే గడిపింది. తమకూ ఓ కారు వుండేది. చాలా హోదాలో వుండే తండ్రి వుండేవాడు.
తర్వాత ఏమి జరిగిందో తెలీదు. వున్నట్లుండి జీవితంలో మార్పు వచ్చింది.
తల్లి తనను తీసుకొని దూరంగా వచ్చేసింది. తానెంతో ప్రేమించిన డాడీ, జీవితంలో మళ్ళీ తారసపడలేదు.
మొదట్లో ఎన్నోసార్లు తల్లిని అడిగేది. ఆమె ఏవేవో సమాధానాలు చెప్పి మాట మరిపించేసేది.
క్రమక్రమంగా గతమంతా విస్మృతిలో పడిపోయింది.
అప్పట్నుంచీ తాము చాలా సామాన్యమైన జీవితమే గడుపుతున్నారు.
* * *
ఆ యువకుడు అటూ ఇటూ చూసి ఆమె దగ్గరకొచ్చాడు.
కిరణ్మయికి భయమేసింది. ఏదో తప్పుచేసినట్లు గుండె గబగబ కొట్టు కుంటోంది. ముఖం ఎర్రబడిపోయింది.
అతనివంక చూడనట్లు గమనిస్తూ మొహం ప్రక్కకి త్రిప్పుకుంది.
"ఒక్కమాట..."
ఆమె తలత్రిప్పి చూడలేదు.
"మిమ్మల్నే."
ఆమె విధిలేనట్లు అతనివైపు చూసింది.
"మిమ్మ్లల్నో ప్రశ్న అడగాలని వచ్చాను."
"ఏమిటి?" అన్నట్లు చూసింది ప్రశ్నార్ధకంగా.
"పదిహేను రోజులబట్టి మీకోసం పడిగాపులు కాయడం దొంగచాటుగా గమనిస్తూనే వున్నారు కదా కొంచెమైనా కనికరించరేం."
ఆమె ధైర్యం తెచ్చుకుంది. "ఇలాంటి రౌడీవేషాలంటే నాకసహ్యం" అంది.
"రౌడీ వేషాలా?"
"కాకపోతే ఇలా వెంటపడటం, ఒంటరిగా వున్న ఆడపిల్లను పలకరించటం ఇవన్నీ ఏమిటి?"
"అందమైన ఆడపిల్లను చూసి ఆకర్షణను అరికట్టుకోలేకపోతే రౌడీయే అయివుండాలా? మంచి అబ్బాయిక్కూడా ఆకర్షణ వుంటుంది. ఇంకో ముఖ్యమైణ పాయింటేమంటే నాకు రౌడీలంటే భయం, అసహ్యం కూడా."
"మంచిదే" అన్నది కిరణ్మయి.