ఆమె ఆ ఆఫీసులో ఇంకా పనిచేస్తూనే వుంది. అతనిప్పుడు చాలా పెద్ద హోదాలో వున్నాడు. వాళ్ళిద్దరి మధ్యవున్న సంబంధం ఆఫీసులో అందరికీ తెలుసు. చాలాసార్లు ఆమెను ఉద్యోగం మానెయ్యమని చెప్పాడు. ఆమె నవ్వి "ఉండాలి నా సేఫ్టీకోసం" అనేది. అతనూ బలవంతం చేసేవాడు కాదు.
వాళ్ళిద్దరిమధ్యా జరిగిన ఓ విశేషం అంటే రెండు మూడుసార్లు జరిగిన విశేషం అతనికి తెలీకుండా, అతని దృష్టిలోకి రాకుండానే జాగ్రత్తపడి తప్పించేసింది.
అతనివల్ల ఆమెకు మూడుసార్లు నెలతప్పింది.
మూడుసార్లు కూడా అతనికి తెలీకుండా ఎబార్షన్ చేయించేసుకుంది.
"నో! ఈ బంధం శాశ్వతమైంది కాదు. కలిసి జీవిస్తున్నామంతే. శాశ్వతమైన గుర్తులూ, చిహ్నాలూ... మా ఇద్దరిమధ్యా వుండకూడదు అంతే."
ఎప్పుడైనా, ఎక్కడైనా, పసిపాపలు తటస్థపడితే గుండెలు ఉప్పొంగి అంతలోనే కళుక్కుమనేవి.
కళ్ళలో నీళ్ళు తిరిగేవి.
"ఊహూ! బాధపడకూడదు" అని అంతలోనే మనసును త్రిప్పేసుకునేది.
"తనూజా!"
"ఊ..."
"ఇవాళెందుకో పరధ్యానంగా కనిపిస్తున్నావేం?"
"మీ గురించి ఆలోచిస్తూ అలసిపోయాను."
బెడ్ మీద ఆమెప్రక్కన పడుకుని కరిగిపోతున్నప్పుడు అశాశ్వతంలోని శాశ్వితత్వాన్ని తనివితీరా పొందగలిగాడు.
18
ఉదయం తొమ్మిదిన్నరయింది. కిరణ్మయి కాలేజీకి వెళ్లిపోయింది. చిన్మయి గబగబ ఇంట్లో పని పూర్తిచేసుకుని ఆఫీస్ కు వెళ్ళే హడావుడిలో వుంది.
బయట కారాగిన చప్పుడయింది. కాని పనితొందరలో వుండి పట్టించుకోలేదు.
లోపలికెవరో వచ్చినట్టు అలికిడయితే తలెత్తి చూసింది.
రజనీకాంత్!
"నువ్వా!" అంది ఆశ్చర్యంగా.
"చిన్మయి! చాలా సంవత్సరాల తరువాత నిన్ను చూశాను ఇక్కడికి వచ్చి కలుసుకోవాలన్న కోరిక ఆపుకోలేకపోయాను."
చిన్మయి అతనివంక అసహ్యంగా చూస్తోంది.
"చిన్మయి! నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను."
"నాకు ఆఫీసుకు టైమయింది. తీరికలేదు" అంది చిన్మయి.
"నువ్వెక్కడ పనిచేస్తున్నావో నాకు తెలుసులే. అంతగా టైమయితే నా కారులో డ్రాప్ చేస్తాను."
"నువ్వు నన్ను డ్రాప్ చేయనక్కరలేదుగాని, విషయమేమిటో చెప్పు."
ఆమె కూర్చోమనకుండానే అతను చొరవగా అక్కడున్న ఫేముకుర్చీలో కూర్చున్నాడు.
"చిన్మయి! మొదట్నించి నీ అందచందాలు నాకు నచ్చాయి. గుప్తంగా దాచుకున్న నీ అందాలు నాలో కోరికల్ని రేపుతూ వుండేవి. అందుకనే నీ వెంట పడ్డాను. నన్ను కాదని ఓ అనామకుడితో తప్పుచేశావు. నీ హజ్బెండ్ వట్టి సెంటిమెంటల్ ఫూల్ అదో పెద్ద నేరంగా పరిగణించి నిన్నొదిలేశాడు. తానుమాత్రం తనూజ అనేదానితో తిరుగుతున్నాడనుకో అది వేరే విషయం."
"ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు దేనికెత్తుకొస్తున్నావు?"
"చిన్మయి! నా జీవితంలో చాలామంది ఆడవాళ్ళని చూశాను. కాని నువ్వు కవ్వించినట్లుగా ఏ ఆడదీ కవ్వించలేదు. ఎందుకో అప్పుడప్పుడు నువ్వు గుర్తొండేదానివి నిన్ను మరిచిపోలేకపోయాను."
చిన్మయికి వళ్ళంతా జలదరించినట్లుగా వుంది ఏం చెయ్యాలో తెలీక విధిలేక ఆలకిస్తోంది.
"చిన్మయి! నా వైఫ్ చనిపోయి రెండేళ్ళయింది. ఒక్కడే కొడుకు. బయట ఎన్ని తిరుగుళ్ళున్నా ఇంట్లో ఆడదిక్కులేకపోతే దుస్సహంగా వుంది. నువ్వింకా మంచివయసులో వున్నావు. ఆ మాటకొస్తే మునుపటికన్నా ఇప్పుడే అందంగా వున్నావు. అసలు నువ్వు జీవితంలో ఏం అనుభవించావని? నిన్ను పెళ్ళి చేసుకుంటాను. నీ కూతురికి పెళ్లిచేసే బాధ్యత, ఆమె భవిష్యత్తు అన్నీ నేను చూసుకుంటాను. ఆ పిచ్చి ఉద్యోగం మానెయ్. నాతో వచ్చేసెయ్. నీవు జీవితంలో కనీవినీ ఎరుగని స్వర్గసుఖాలు చూపిస్తాను."
"చెప్పటం అయిందా?" అనడిగింది చిన్మయి.
అతను తలవూపి జవాబుక్సోం ఎదురుచూస్తున్నట్లు చూశాడు.
"ఇంకెప్పుడూ ఈ ఛాయలకు రాకు లే గెటవుట్."
రాజనీకాంత్ ఉలిక్కిపడలేదు. అది ఎదురుచూస్తున్న జవాబులా తలఆడించి, ఒక్కనిముషం మెదలకుండా కూర్చుని బయటకు వెళ్లిపోయాడు.
అతను వెళ్ళిపోయాక చిన్మయి చేతుల్లో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది.
భర్తకు దూరమైన ఆడది అనుభవించే అనుభవాలు ఆమెకు కొత్తకాదు. భర్త వుంటేనే అవకాశమొస్తే రాయి వెయ్యడానికి అనేక కోణాలనుంచి వావి వరసలు కూడా చూడకుండా ఎదురుచూస్తుంటుంది లోకం. అతను లేకపోతే ఆడడానికి ఆడదే శత్రువు. వంటరిగా వున్న స్త్రీమీద మొదట నాలుగురాళ్ళూ వేసేది తోటి స్త్రీయే. అపార్ధాలకు, వదంతులకు గురిచేసేది కూడా స్త్రీయే అన్నీ వుండి సంఘంలో మంచిస్థానంలో వున్న దశలోనే భర్తను పోగొట్టుకుంటే భర్త దూరమైతే ఆడది ఎన్నో ఇబ్బందులకు లోనవుతుంది. ఆర్ధికంగా అతి నేలబారుగా లాగబడి జీవితంలో ఇదివరకు ఊహించని పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇక వల్లో వేసుకోవటానికి రకరకాల ఎత్తులు వేసేవాళ్ళు. నాటకాలాడే వాళ్ళు... వాళ్ళందరినీ ఛేదించుకుంటూ రావాలి.
చిన్మయి అయిదునిమిషాలు అలా వుండిపోయి తర్వాత తేరుకుని, ముఖం చన్నీళ్ళతో కడుక్కుని ఇల్లు లాక్ చేసి ఆఫీస్ కి బయలుదేరింది.
* * *
ఆ సాయంత్రం ఆరుగంటలవేళ రజనీకాంత్ మంజుభార్గవి ఇంట్లో కూర్చుని వున్నాడు. అతని మొహం ఎర్రబడి వుంది. ఇద్దరిమధ్యా కొంతవరకు తీవ్రమైన చర్చ జరిగినట్లు ఛాయలు కన్పిస్తున్నాయి.