ఇప్పుడు నీకు స్పృహ వచ్చింది. నీవు నిస్సహాయురాలివి కాదు. కాబోయే నా భార్యవు. జాప్యం యిష్టంలేక భగవంతుడే మనకీ అవకాశం కల్పించాడు. ఇప్పుడే మన పెళ్ళి! నలుగురి కోసం రేపు పురోహితుడి పెళ్ళి చేసుకుందాం" అన్నాడు రమణ.
హాస బదులివ్వలేదు. ఆమె వణుకుతున్న అతడి శరీరాన్నీ, అదురుతున్న పెదవుల్నీ, కళ్ళలో ఆవేశాన్నీ చూస్తోంది.
రమణ మంచం మీద ఆమె పక్కనే కూర్చున్నాడు.
అప్రయత్నంగా హాస పక్కకు జరిగింది.
చేయి జాపి రొజాయితో సహా ఆమెను దగ్గరగా లాక్కుని, "ఈ పూట నాకు దూరంగా వెళ్ళకు హాసా!" అన్నాడు రమణ.
హాసకు ఏమనాలో తెలియలేదు.
అతను తనకు నచ్చిన వరుడు. మంచివాడు. సంస్కారవంతుడు_ అన్నీ వున్నవాడు. అయినవాళ్ళు మెచ్చుకున్నవాడు.
పెళ్ళికి తను వాయిదా వేస్తున్నదే తప్ప అతడి ఆలస్యం లేదు.
నిజానికి తలిదండ్రులతడిని అల్లుడిగానే భావిస్తున్నారు.
కానీ పెళ్ళికి ముందే....
"మనం తప్పు చేయడం లేదు. అందుకే నేను నీ అనుమతి కోసం ఎదురుచూడను. ఈ రోజు నువ్వు నన్నాపలేవు. కానీ ఒక్కటే మనవి.... అత్యాచారం చేస్తున్నానన్న అనుభూతి నాలో కలగనివ్వకూడదు నువ్వు...." అంటూ రమణ మంచం మీద వాలాడు.
"ప్లీజ్...." అంది హాస.
"ఏమిటి?" అన్నాడు రమణ.
"ఇప్పుడు నువ్వీ గదిలోంచి వెళ్ళిపో. సరిగ్గా పావుగంట తరువాత రా...."
"ఎందుకు?"
"నవ్వును నమ్ముకుని బ్రతికేదాన్ని. ఏ తప్పూ చేయలేదన్న నమ్మకంతోనే నవ్వగలుగుతున్నాను. ఇప్పుడు తప్పు చేసి నా నవ్వుకు దూరం కాలేను."
"కానీ నేను నిన్ను వదలను" నిక్కచ్చిగా చెప్పాడు రమణ.
"తెలుసు అందుకే పావుగంట వ్యవధి కావాలి. పావుగంట ఏకాంతంలో యిది తప్పు కాదని నా మనసుకు నచ్చచెపుతాను."
రమణ చటుక్కున లేచి మంచం మీదనుంచి క్రిందకు దూకి ఆమెను దీక్షగా చూస్తూ "అది సాధ్యమా?" అన్నాడు.
హాసలో మనసుకీ, వయసుకీ మధ్య సంఘర్షణ జరుగుతోంది.... అందులో వయసెప్పుడో గెలిచిందనీ, తాత్కాలికంగా వాయిదా వెయ్యడానికి ప్రయాస పడుతోందనీ ఆమె ముఖం చూడగానే రమణ గ్రహించాడు.
తన పథకం ఫలించింది. పిట్ట దారిలో పడింది.
ఈ రోజు హాస తనది! ఆపైన ఆమె వివాహానికి అంగీకరించక తప్పదు.
అయితే తనామెపట్ల తాత్కాలిక మొహాన్నే తప్ప శాశ్వత ప్రేమను పెంచుకోకూడదు- "అలా మనసుకు శిక్షణనివ్వడానికి నాకూ కావాలి పదిహేను నిముషాల వ్యవధి!" అనుకున్నాడతను.
* * * *
ఆమె పావుగంట వ్యవధి అడిగింది. కానీ అప్పటికే అతడికి లొంగిపోవడానికి నిశ్చయించుకుంది. అందుకు కారణం ఒక్కటి కాకపోవచ్చు.
వెతుక్కుంటూ వచ్చిన వరుడు రమణ. తనకంటే ఎన్నో విధాల అధికుడై ఉండీ తనకు పాదాక్రాంతుడయ్యాడు. అతణ్ణి తను ఆటలు పట్టి వినోదిస్తోంది. అన్నీ సహించాడు. తనచెంత పురుషోత్తముడిలా ప్రవర్తించాడు.
ఆడతనంలో సహజంగా వుండే జాలి, కరుణ ఆమె వయసుకు తోడై ఒకే మార్గానికి ప్రోత్సాహించాయి.
ఆమె ఆలోచించడంలేదు. మనసు చిక్కబట్టుకోవడం లేదు. అంకెలు లెక్కపెడుతోంది. క్షణమొక యుగంలా గడుస్తోందామెకు.
అప్పుడెవరో "హాసా!" అని పిలిచారామె చెవుల్లో.
"ఊఁ" అందామె అప్రయత్నంగా.
"నేను, హాసా!!"
"ఊఁ" అంది ఆమె.
"నీ మనోభావాలు నాకు తెలుస్తున్నాయి. నిన్నెప్పుడూ ఇంత ఉద్రేకంలో చూడలేదు నేను. ఈ నవ్వుల రాణి శృంగార వీణలు మ్రోగించగల జాణ అని నాకిప్పుడర్దమౌతోంది."
మరో మనిషి తన అవస్థను కనిపెట్టాడని తెలియగానే ఆమెలోని ఉద్రేకం సగం దిగజారిపోయింది. ఆమె గౌతమ్ కి తన పరిస్థితి చెప్పుకుంది.
"నేను నిన్ను రక్షించాలా, వదిలిపెట్టాలా?" అన్నాడు గౌతమ్.
"రక్షించ గలిగితే రక్షించు. కానీ రమణను నొప్పించకు."
"సరే....నిర్భయంగా, నిశ్చింతగా వుండు. కానీ నా గురించి రమణకు చెప్పకు...."
"ఊఁ"
* * * *
పావుగంట గడిచింది. రమణ లోపలకు రాలేదు.
ఆమె అసహనంగా ఎదురు చూస్తోంది.
గోడ గడియారం మరో పావుగంట గడిచేసరికి కిర్రుమంటూ తలుపు తెరుచుకుంది.
ఆమెకు గుండె అదిరినట్లయింది.
ఏం జరుగుతుందిప్పుడు?
మెత్తగా అడుగుల చప్పుడు....
అటు చూడ్డానికే భయపడుతోంది ఆమె.
"నీ పేరు హాస కదూ?" తెలుగులో వినబడ్డ కోమల స్వరం విని ఉలిక్కిపడి అటు చూసింది ఆమె.
వచ్చింది రమణ కాదు....
పూర్ణ యౌవనంలో ఉన్న ఓ యువతి! నీటికి తడిసి వంటికతుక్కుపోయిన దుస్తులు ఆమె వంపు సొంపుల్ని కళాకారుల కోసం ప్రదర్శిస్తున్నాయి.
"ఊఁ నువ్వెవరు?"
"నా పేరు సుమతి. నాదీ నీలాంటి కేసే...."
"అంటే?"
సుమతి వివరించింది.
ఆమె, ప్రియుడు పడవ మునిగి నీళ్ళలో తడిశారు. ఇద్దరూ యీదుకుంటూ యీ ద్వీపం చేరుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్ లో ఓ రూమ్ దొరికింది. అక్కడ యిద్దరికీ మనసు చలించింది. కానీ పెళ్ళికి ముందే నీతి తప్పడం యిష్టం లేదు. వాచ్ మన్ ని అడిగితే యిలా నీటిలో తడిసిన మరో జంటకింకో రూమిచ్చినట్లు చెప్పాడు. వాళ్ళకూ పెళ్ళి కాలేదని తెలిసి-ఆడవాళ్ళు ఆ గదిలో, మగవాళ్ళు ఈ గదిలో వుండేలా యేర్పాటు చేసుకుందామనుకున్నారు. సుమతి ప్రియుడు గది బయటనే ఉన్న రమణతో మాట్లాడేడు.
"మా కేసు మీకు లాంటిది కాదు. మేము రేపే పెళ్ళి చేసుకోబోతున్నాం. పెళ్ళికి ముందు మా యిద్దరికీ యిలా ఏకాంతంగా గడపాలని వుంది" అన్నాడు రమణ.
సుమతి తను వెళ్ళి ఆమెతో మాట్లాడతానంది.
"నీకు చాలా థాంక్స్" అంది ఆమె.
"ఎందుకు?"
"మనిషి ఎంత సులభంగా తప్పు వైపు మళ్లుతాడో అర్ధమయింది నాకు. నువ్వు నాకు కనువిప్పు కలిగించావు" అంది హాస.
"మంచి మనిషి తన సత్ప్రవర్తనక్కూడా కారణాలు వెతుక్కుంటాడు. నువ్వు తప్పు చేయాలనుకుంటే యిప్పటికీ చెయ్యగలవు. నువ్వు తప్పు చేయలేవు. నీ ముఖం చూసి నేనా మాట చెప్పగలను" అంది సుమతి.
* * * *
ఏ తప్పూ జరక్కుండానే రాత్రి పదింటికి బోట్ హౌస్ చేరుకున్నారు రమణ, హాస.
ఆమె ఉల్లాసంగానూ, ఉత్సాహంగానూ ఉంది. రమణ మాత్రం జీవచ్చవంలా వున్నాడు. సుభద్ర అది గమనించి కారణ మడిగింది.
వాళ్ళిద్దర్నీ డైనింగ్ హాల్లో మాట్లాడుకుందుకు వదిలి ఆమె తన గదికి వెళ్ళిపోయింది.
"ఏదో అపూర్వశక్తి నాకు వ్యతిరేకంగా పని చేస్తోంది" అన్నాడు రమణ.
"అసలేం జరిగింది?"
కాబోయే అత్తగారికి చెప్పగలిగినంత సభ్యమయిన రీతిలో జరిగింది చెప్పి, "ఇప్పుడు నాకే సందేహమూ లేదు. ఈ రోజు మరో జంట అక్కడికి చేరుకొని వుండకపోతే మా పెళ్ళి అయిపోయుండేది రేపు" అన్నాడు రమణ.
పరిస్థితి సుభద్ర కర్దమయింది. "నువ్వూ మా కోసం చాలా కష్టపడుతున్నావు నాయనా" అందామె.
"మీ కోసం కాదు, నా స్వార్ధం కోసం...."
"నీకు నేను సాయపడాలి. అపూర్వమైన ప్రేమను స్వార్ధమని చెప్పుకునే వినయం నీలో వుంది."
"కానీ నాకు మీరెలా సాయపడగలరు?"
"నేను సాయపడితే ఈ రోజు నీకీ శ్రమ ఉండేది కాదు" అంది సుభద్ర.
ఆమె తనకెలా సాయపడదల్చుకుందో తెలిసేక రమణ తెల్లబోయాడు.
* * * *
"ఈ రోజు మనం సోనామార్గ్ వెడుతున్నాం" అన్నాడు రమణ.
"ఎక్కడికీ వద్దు. నాకు మూడ్ లేదు. హాయిగా శ్రీనగర్ లోనే ఉందాం" అంది హాస.