రామకృష్ణ చూశాడు. కాళ్ళూ, చేతులూ ఆడలేదు. మనసు ఆగలేదు.
దయార్ద్ర హృదయురాలు స్త్రీ- కఠిన పాషాణ హృదయుడు పురుషుడు అని చాలా పుస్తకాలలో కవులు ఘోషించారు. ఒక కవి మాత్రం 'జాలిలేనివారు ఈ ఆడువారు' అన్నాడు. ఆ కవి ఏ సందర్భంలో అన్నా ఇప్పుడు మాత్రం నిజం. సీత పెట్టె సర్దుకుని వెళ్ళిపోతున్నది.
'స్త్రీ క్షమాధరిత్రి అని ఎవడు అన్నది?' అని రామకృష్ణ ఆలోచిస్తూ కూర్చోలేదు. పేపరు అవతల పారేసి సీత దగ్గరకు వచ్చాడు. "ఏమిటి సీతా యిది?" అన్నాడు.
సీత పెట్టె తాళం చెవి మంగళసూత్రాల తాడుకి కట్టుకుంది. అంతేగాని అదేమిటో చెప్పలేదు.
మంగళసూత్రాల తాడువల్ల వుపయోగాలు...... తాళం చెవులు కట్టుకోనుటకు..... పిన్నీసులు పెట్టుకొనుటకు...... డబ్బా మూతలు తీసుకొనుటకు యు...... అని మరొకసారి అయితే రామకృష్ణ జోక్ చేసేవాడే. ఇది జోకులకు అనువైన సమయం కాదు మరి.
సీత మాట్లాడకపోయేసరికి "ఇది అన్యాయం సీతా!" అన్నాడు రామకృష్ణ బాధగా.
"నేను అడ్డులేకపోతే హాయిగా తాగి తందనాలు ఇంట్లోనే ఆడవచ్చు." గాంభీర్యంగా అని, సూట్ కేసు పట్టుకుని వాకిట్లోకి వెళ్ళిపోయింది సీత.
రామకృష్ణ సీత వెనుకనే వాకిట్లోకి వచ్చాడు.
సీత స్టేషనుకి రిక్షా మాట్లాడుకుని రిక్షా ఎక్కటం వరకు రామకృష్ణ చూసి రయ్యిన ఇంట్లోకి వచ్చి ప్యాంటులో దూరిపోయాడు. క్విక్ గా యింటితాళం వేశాడు. స్కూటర్ మీద ధన్ మని కూర్చుని ముందుకు దూసుకుపోయాడు.
రిక్షా కన్నా ముందే స్కూటర్ స్టేషన్ కి వెళ్ళింది. సీత రిక్షా దిగిం తరువాత రామకృష్ణ పెట్టె అందుకోబోయాడు. సీత పెట్టెని గుంజుకుంది. రామకృష్ణ ఓ వెధవ నవ్వు నవ్వి, స్టయిల్ గా సీతపక్కనే నడిచాడు.
సీత ఏ వూరికి టిక్కట్టు తీసింది గమనించాడు.
"అమ్మయ్య! సీత ఎక్కడికీ వెళ్ళటం లేదు. పుట్టింటికి వెళుతున్నది. కనుక భయపడాల్సింది ఏమీ లేదు. ఓసారి వచ్చి వెళ్ళమని తల్లీ తండ్రీ లెటర్ రాసినా - ఇక్కడ మావారికి ఇబ్బంది. ఏదో ఒక పండక్కి ఇద్దరం కలసి వచ్చి పదిరోజులు వుంటామని తిరుగు టపాలో లెటర్ కొట్టింది. ఇప్పుడు సీత వెళ్ళటం వల్ల వాళ్ళూ సంతోషిస్తారు- సీత అక్కడ నాలుగురోజులు వున్నట్లూ వుంటుంది. నాలుగు రోజులు అయేసరికి సీత చల్లబడుతుంది" అని రామకృష్ణ సంతోషించాడు.
సీత టిక్కెట్టు తీసుకున్న తర్వాత, బండి ఎప్పుడొస్తుందో కనుక్కుంది.
మరో అయిదు నిమిషాలలో నెంబరు టు ప్లాట్ ఫాం కి వస్తుందని చెప్పాడు అతను.
సీత బుకింగ్ దగ్గర నుంచి కదిలింది. ఓరగా ఓ చూపు చూసింది. పక్కన రామకృష్ణ లేడు. ప్లాట్ ఫాం అంతా కలయచూస్తున్న దానిలా పెట్టె పుచ్చుకుని నడుస్తూ అటూ యిటూ, ఆ తర్వాత నలువైపులా చూసింది.
రామకృష్ణ పరిసరాల్లో లేడు.
రామకృష్ణ ఏమన్నా నల్లపూస - కనపడకపోవటానికి ఆ దరిదాపుల్లో లేడు. అంతే.
"హ్హూ! వెళ్ళిపోయారు యింటికి. తను ఏవూరు వెళ్ళేది తెలుసుకోటానికన్నమాట తన వెనకనే వచ్చింది! అబ్బ, ఏం తెలివి! తెలివితేటలు అంత ఎక్కువ కాబట్టే తాగి, కట్టుకధలు చెప్పటం దాకా వచ్చారు."
సీత ఆలొచిస్తూ కోపంగా అడుగులు వేస్తూ రెండో నెంబరు ప్లాట్ ఫాం కి వచ్చింది. ఓ వేళ రామకృష్ణ తనకన్నా ముందే వచ్చి అక్కడ వున్నాడేమో అని చూసింది.
రామకృష్ణ లేడు.
"నేను పిచ్చిదాన్ని. నా భ్రమ కాకపోతే వారు ఇక్కడ ఎందుకుంటారు? ఈసరికి ఇంటికి వెళ్ళి వుంటారు." అలా అనుకుంది సీత.
రామకృష్ణ వెళ్ళిపోవటం వల్లనేమో - సీతకి పుట్టెడు నీరసం వచ్చింది.
అదొక ధియరీ వుంది మరి.
ఒకడికి మరొకడు శత్రువు. ఆ నెంబర్ వన్ గాడికి నెంబర్ టు గాడిని చంపుదామని వుండేది. ఓరోజు నాలుగు వుతికి చంపుదామని నెంబర్ వన్ గాడు వచ్చేసరికి, నెంబర్ టు గాడు బస్సు యాక్సిడెంట్ లో చచ్చివున్నాడు. అది చూసి నెంబర్ వన్ గాడు భోరు మన్నాడు. "అతను మీ బంధువా?" నెంబర్ వన్ ని అడిగారు ఎవరో. కాదు- అన్నాడు నెంబర్ వన్ యింకా ఘోరంగా ఏడుస్తూ. "మరెందుకయ్యా అంత ఏడుపు?" అని అడిగితే - చచ్చినవాడు నా శత్రువు - అని చెప్పాడుట. "మరి చచ్చిపోయాడు కదా! పీడా వదిలిందని సంతోషించక ఈ ఏడుపెందుకయ్యా?" అంటే - "వాడిని స్వయంగా నా చేతులతో నేను చంపుదామనుకున్నాను కాని వాడు చచ్చాడు" అని అసలు రహస్యం చెప్పి బేర్ మన్నాడు.