Previous Page Next Page 
హిమసుందరి పేజి 43

    ఇప్పుడు సీతని సముదాయించాలా!

    ఊరుకున్నంత ఉత్తమం లేదని నోరుమూసుకోవాలా!

    రామకృష్ణ ఆలోచించాడు- రెండోదే బెటర్ గా అనిపించింది. ఊరుకున్నంత ఉత్తమం - బోడిగుండు అంత సుఖం మరొకటి లేదన్నారు పెద్దలు.  వాళ్ళయినా అనుభవంతో చెప్పిన నగ్నసత్యాలే కదా!

    రామకృష్ణ పెద్దవాళ్ళ మాటలకి విలువిస్తాడు.

    అందుకే -

    రామకృష్ణ బెల్లంకొట్టిన రాయిలా - పెదవులు రెండూ కలిపి కుట్టేసుకున్న వాడిలా మిన్నకుండిపోయాడు.

    కాసేపు జలజల కన్నీరు కారుస్తూ, వలవల ఏడిచింది సీతామనోహరి.

    ఉన్నట్లుండి -

    వాతావరణంలో ఏదో అసహజం చోటుచేసుకున్నట్లు సీతకి తోచింది. ఏడిచే కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసి, తీవ్రంగా ఆలోచించింది.

    సీతకి అర్ధం అయింది.

    రామకృష్ణ కళ్ళు మూసుకుని, నడిమంచం మీద బాసిపెట్లు వేసుకుని కూర్చుని కొంగజపం చేస్తున్నాడు.

    సీతకి ఒళ్ళు మండింది. ఎంత మండిందీ అంటే- నడి ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఒళ్ళంతా బ్లేడుతో గీసుకుని గుంటూరు ఎండుమిరపకాయల కారం దానిమీద వేసి, కొబ్బరిపీచుతో పామినంతగా.

    తను గుండెలు పగిలేలా ఏడుస్తుంటే అదేం అనాల్సింది పోయి - ఊరడించాల్సింది పోయి - సానునయంగా దగ్గరకు తీసుకోవాల్సింది పోయి - ఏడుస్తే ఏడువు. నీ ఖర్మ..... మగాడిని - నాకేంటి? అన్న నిర్లక్ష్య ఫోజుతో కళ్ళు మూసుకుని కూర్చుంటాడా! అమ్మో! తాగుడు ఎంత చెడ్డది! అప్పుడే వారు మారిపోయారు. ఆఫ్ ట్రాల్ ఆడది- భార్య అంటే అణిగిమణిగి పడివుండేది అనే కదా!

    సీత అలా ఆలోచించి, ఏడవటం తనకి తెలియకుండానే మానేసింది. భర్త నిర్లక్ష్య  వైఖరి గురించి ఉక్రోషంతో ఆలోచించటం మొదలుపెట్టింది.

    రామకృష్ణ మాట్లాడకుండా పడుకున్నాడు.

    హ్హూ! నేనేనా తక్కువ తింది! - అనుకుంది సీత తనూ పడుకుంది - అదే మంచంమీద ఆ చివరగా జరిగి.

    మరో అరగంట తర్వాత-

    ఎవరిదోవన వారు హాయిగా నిద్రపోయారు.



       
                                                                            18


    ఉదయం -

    ఏడూ పది నిమిషాలు!

    రామకృష్ణ, సీతామనోహరి ఎవరిదోవన వాళ్ళు అంత క్రితమే లేచి ఎవరి ముఖం వాళ్ళే కడుక్కున్నారు.
    సీత పెద్దగ్లాసుడు పాలలో నాలుగు చెంచాల బూస్ట్ వేసి చిక్కగా కలుపుకుని, వేడి వేడిగా, హాయి హాయిగా తాగి బాత్ రూమ్ లోకెళ్ళి తలుపు వేసుకుంది.

    రామకృష్ణ చూశాడు. సీత కాఫీ కాచే ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్కడా కనపడలేదు. గ్లాసు, చెంచా లాంటివి చప్పుడు కావటం, ఆ తర్వాత బూస్ట్ వాసన, ఆ తర్వాత సీత బాత్ రూమ్ లో దూరటం గమనించి, నెమ్మదిగా వంట గదిలోకి వెళ్ళాడు.

    కాగిన పాలు, ఖాళీ చేసిన బూస్ట్ తాగిన గ్లాసు దర్శనమిచ్చాయి. అమ్మాయిగారి కోపం తగ్గలేదు. అయ్యగారికి కాఫీ లేవు. ఏం చేస్తాం - చేసుకున్నవారికి చేసుకున్నంత! అనుకుంటూ రామకృష్ణ పెద్దగ్లాసేడు బోర్నవీటా కలుపుకుని తాగాడు.

    ఆ తర్వాత -

    రామకృష్ణ పేపరు తిరగేస్తూ కూర్చున్నాడు.

    సీతామనోహరి లక్స్ సుప్రీం సోపుతో స్నానం చేసి సినీ తారలా మెరిసిపోతూ బాత్ రూమ్ లోంచి బైటపడింది. ఆ తర్వాత విమల్ వారి టేరికోసా చీర ధరించి అందంగా ముస్తాబయి, చిన్న వి.ఐ.పి. సూట్ కేసులో చీరలు, లంగాలు, జాకిట్లు వగైరా సర్దుకుంది.

 Previous Page Next Page