Previous Page Next Page 
హిమసుందరి పేజి 45

    అలాగే -

    రామకృష్ణ వుండకూడదనుకుంది సీత. అతను నిజంగా కనపడకపోయేసరికి నీరసం, కోపం వచ్చాయి అసలు విషయం- ఏ మూలనో మనసులో రామకృష్ణ వుంటే బాగుండునని వుంది సీతకి.

    ట్రైన్ దడ దడ చప్పుడు చేస్తూ వచ్చింది.

    సీత మరోసారి ప్లాట్ ఫాం అంతా కలయ చూసి, ట్రైన్ ఎక్కింది. కిటికీ దగ్గర సీటులో కూర్చుంది.

    "ఎక్కడికమ్మా వెళ్ళేది?" ఎదుటి సీట్లో ఆవిడ సీతని అడిగింది.

    సీత చెప్పింది.

    "మీ వాళ్ళేవరయినా నీతో వస్తున్నారా?"

    సీత ఏదో గొణిగింది.

    ఆమెకి అర్ధం కాలేదు.

    సరీగా అప్పుడే రామకృష్ణ ఓ చేత్తో వాటర్ బాటిల్, మరో చేత్తో బరువుగా వున్న ప్లాస్టిక్ సంచీ పట్టుకుని శ్రీమహావిష్ణువులా ప్రత్యక్షమయ్యాడు.

    సీతకెందుకో ఆనందం వేసింది. కాని, కావాలని కోపం తెచ్చుకుని ముఖం పక్కకు తిప్పేసుకుంది.

    రామకృష్ణ కిటికీలోంచి చెయ్యి లోపలికి పెట్టి, సీత పక్కనే వాటర్ బాటిల్, సీత ఒడిలో ప్లాస్టిక్ సంచీ పెట్టాడు. ఒంటరిగా వున్నా మరోసారి అయినా అయితే సీత వాటర్ బాటిల్ ని, ప్లాస్టిక్ సంచిని అవతలికి తోయటమో, కిటికీలోంచి బైటికి విసిరేయటమో చేసేదే. కాని చెయ్యలేదు.

    ఎదుటి సీట్లో కూర్చున్న ఆవిడ మిడిగుడ్లు వేసుకుని వీళ్ళనే చూస్తున్నది. అలాగే పక్క సీట్లో వున్న కొంతమంది కూడా కాలక్షేపంగా వీళ్ళనే చూస్తున్నారు.

    వాళ్లకి మరింత కాలక్షేపంగా వుండటానికి ఓ కొత్త సీను సృష్టించదల్చుకోలేదు సీత. పైగా పదిమంది చూస్తే సిగ్గుచేటు.

    సీత వాటర్ బాటిల్ ని, సంచీని తీసి పక్కగా పెట్టుకుంది.

    తను తెచ్చినవాటిని విసిరి ముఖాన కొట్టనందుకు రామకృష్ణకి చాలా సంతోషం కలిగింది.

    "సీతా!" అన్నాడు నెమ్మదిగా.

    సీత ఊ అనలేదు గాని, ముఖం దించుకుని, గోళ్ళు గిల్లుకుంటూ వుండిపోయింది.

    సీతా! ట్రైన్ ఇక్కడే అరగంట లేటు. ఇలా జోగుతూ వెళ్లిందంటే ఎలా చూసినా రెండవుతుంది. నీవసలే ఆకలికి ఆగలేవు. యాపిలు, ద్రాక్ష, చక్రకేళి తెచ్చాను. నీకు చాలా ఇష్టం కదా అని జామ్ బ్రెడ్, ఫ్రూట్ బ్రెడ్, కారంగా తినటానికి సోమాసీలు, చిప్స్ కూడా తెచ్చాను. అన్నీ సంచిలో వున్నాయి. నామీద బెంగతో తినటం మనేసేవు సుమా!" చిలిపిగా చెప్పాడు రామకృష్ణ.

    సీత ముఖం కోపంతో ఎర్రబడింది. రామకృష్ణని నమిలి మింగేలా చూద్దామని చివ్వున తలయెత్తింది.

    రామకృష్ణ అల్లరిగా నవ్వుతూ చిలిపి కృష్ణుడిలా చూశాడు.

    సీత ఠకీమని తల వాల్చేసుకుంది.

    వీళ్ళిద్దరినీ చూస్తున్నవాళ్ళు - పెళ్ళానికి సిగ్గు, భర్తకి సరదా ఎక్కువ - లాంటి అర్దాలతో ఆలోచిస్తున్నారు.

    "అత్తయ్యని, మామయ్యగారిని అందరిని అడిగానని చెప్పు. అన్నట్లు- రెండు రోజులలో లెటర్ రాయటం మర్చిపోకేం" అన్నాడు రామకృష్ణ.

    "సిగ్గు లేకపోతే సరి!" అనుకుంది సీత.

    అంతలోనే ఏదో గుర్తుకొచ్చిన వాడిలా రామకృష్ణ అటు పరుగెత్తాడు.

    అంత కంగారుగా రామకృష్ణ అటువేపు ఎందుకు వెళ్ళాడో సీతామనోహరికి అర్ధం కాలేదు. కిటికీ చువ్వలకి తల ఆన్చి చూస్తే కొంతవరకే ప్లాట్ ఫాం కనపడింది. కనపడినంతలో రామకృష్ణ కానరాలేదు.

    రామకృష్ణ ఎక్కడికీ వెళ్ళినట్లు?

 Previous Page Next Page