"నాకు హిపోక్రసీ నచ్చదు." కంచులా మోగింది అతడి కంఠం.
ఇందుమతి త్రుళ్ళిపడింది లోలోపలే. 'తను హిపోక్రాటా?'
"ఎందుకలా అన్నారు? మీకు అలాంటి భావం కలగడానికి కారణం?" ఆమె కంఠం చురుగ్గా ఉంది.
"వినడానికి ఇష్టంలేనట్లుగా ముఖంపెట్టి ఎటో చూడటం, చెవులు మాత్రం రిక్కించి శ్రద్ధగా వినటం-దీన్నేమంటారో మీరే చెప్పండి." నిలదీసినట్లుగా అన్నాడు.
ఇందుమతి తడబడింది. ఏంచెప్పాలో తనకు అర్థంకాలేదు. అతడి మాటల్లో పూర్త సత్యం లేకపోయినా అర్థసత్యం అయినా ఉందనిపించింది.
"కూర్చోండి. చెప్పండి."
'అలా రా దారికి' మనసులోనే అనుకొన్నాడు విక్రమ్.
"సారీ! మిమ్మల్ని బాధపెట్తే!"
"ఫర్వాలేదు చెప్పండి." ముభావంగా అన్నది.
విక్రమ్ మళ్ళీ చెప్పసాగాడు.
ఇందుమతి ఈసారి దిక్కులు చూడలేదు. నేలచూపులు చూస్తూ కూర్చుంది.
అతడు చెప్పటం పూర్తి అయింది.
ఆమె తలెత్తి అతడి ముఖంలోకి అదోలా చూసింది.
ఆ చూపుల్లో ఎన్నో సందేహాలూ, అపనమ్మకం కనిపించాయి విక్రమ్ కు.
'ఈమె తను చెప్పింది నమ్మలేదా?'
అంటే గౌతమ్ అపరాధి అని పూర్తిగా నమ్ముతున్నదన్నమాట.
ప్రేమించినవాణ్ణి ఇంతేనా ఆమె అర్థం చేసుకున్నది? ఇందుమతి చాలా తెలివైనదని తన నమ్మకం. అంతేకాదు, ఏ విషయాన్నయినా విజ్ఞతతో ఆలోచించి, ఉదాత్తంగా అర్థం చేసుకోగలదనే నమ్మకం తనకు ఉండేది.
ఈ ఆడవాళ్ళంతా ఇంతేనా? ఒకసారి అనుమానం వస్తే చాలు. వాళ్ళ మనసులకు తాళం పడిపోతుంది. మరో ఆలోచన అందులోకి దూరదు.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
"మీ గురించే." సూటిగా ఇందుమతిని చూశాడు.
'ఏమిటలా చూస్తాడు అవసరం అయితే ఆడపిల్లను భుజాన వేసుకెళ్ళే హీరోలాగా?' తన ఆలోచనకు తనే నవ్వుకుంది ఇందుమతి.
"నా గురించా?"
"అవును. మీ గురించే- మీ ఆడవాళ్ళ గురించే...."
ఇందుమతి ముఖం కోపంతో ఎర్రబడింది.
"ఇక మీరు వెళ్ళొచ్చు."
"ఓహో! బాగుంది మీ వరస. వెళతానన్నప్పుడు కూర్చోమన్నారు. నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. ఇప్పుడు వెళ్ళమంటున్నారు. అందరిముందూ అన్నీ మీ ఇష్టాలే చెల్లవని తెలుసుకోండి." ఖచ్చితంగా పలికింది అతడి గొంతు.
"మీరు చెప్పాల్సింది చెప్పారుగా? అందుకే...." కొంచెం తడబడింది ఇందుమతి.
"నేను చెప్పాను. మీరు విన్నారు. ఇప్పుడు మీరు మీ అభిప్రాయం చెప్పాలి." మొండిగా అన్నాడు విక్రమ్.
"చెప్పకపోతే"
"ఇక్కడే కూర్చుంటాను."
అతడి మొండితనానికి ఇందుమతికి నవ్వొచ్చింది. అతణ్ణి గౌతమ్ తో చాలాసార్లు చూసింది. చాలాసార్లు మాట్లాడింది కూడా. అతనిలో ఇంత మొండితనం ఉందని తనకు తెలియదు. ఇంత కచ్చితమైన వ్యక్తిత్వం అందంగా కనిపించే అతడిలో దాగిఉందని తను భావించలేదు.
"చెప్పండి."
"ఏమిటి?"
"ఇప్పుడేం చేద్దాం?"
"ఆ చేసేదేదో మీరే చెయ్యండి. మీకు కథలు చెప్పడంలో నేర్పరితనం ఉంది. అదే రేపు కోర్టులో చెప్పి జడ్జిని నమ్మించండి" విసురుగా అన్నది ఇందుమతి.
"అంటే నేను చెప్పిందంతా కట్టుకథేననా మీ అభిప్రాయం?"
"నా అభిప్రాయం ఏమిటి? అక్షరాలా అది కట్టుకథే."
"ఇందుమతిగారూ?" తీవ్రంగా అంది విక్రమ్ కంఠస్వరం.
ఇందుమతి హేళనగా నవ్వింది.
ఆమె గుండెలో అగ్నిపర్వతం భగభగమంటోంది. ఏ నిమిషంలోనైనా బద్దలు కావచ్చు. గౌతమ్ అలాంటివాడు కాడనే దృఢనమ్మకంమీద గొడ్డలి దెబ్బపడింది. గౌతమే ఇదంతా చేస్తున్నాడనే నమ్మకం మొదటి నమ్మకాన్ని గట్టిగా అణిచిపెట్టింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇందుమతి ఊపిరి పీలుస్తున్నా టైమ్ బాంబులా ఉంది. తింటూ తిరుగుతున్న టైమ్ బాంబులా ఉంది.
విక్రమ్ ను గౌతమే తన దగ్గరకు పంపించాడనే భావం అతడ్ని చూడగానే ఆమెకు కలిగింది.
"నేను చెప్పింది కట్టుకథ కాదు."
ఇందుమతి నిరసనగా విక్రమ్ ను చూసింది.
"నా చెల్లెలు ఎవణ్ణో నమ్మి అమాయకంగా లేచిపోయిందని అబద్ధం చెప్పేంత వ్యక్తిత్వం లేనివాడ్నికాదు. నేనే కాదు. ఎవడూ తన చెల్లెలిమీద అంత అభాండం వెయ్యడు."
ఇందుమతి చివ్వున తలెత్తింది.
"నీతికీ నిజాయితీకి ప్రతిరూపం అని మిమ్మల్ని మీరే భావించుకుంటూ ఎదుటివారు చెప్పేవన్నీ అబద్దాలని ఎద్దేవా చెయ్యడం మీ అహంకారానికి పరాకాష్ఠగా నేనూ భావిస్తున్నాను."
ఇందుమతికి కోపంతో మాటలు గొంతులోంచి పెగల్లేదు.
"మీరు మొన్న ఆ ఊరేగింపుకు ఎందుకు నాయకత్వం వహించారు? మీరెంత నీతిమంతులో చాటి చెప్పుకోవడానికేగా? మీరు ప్రేమిస్తున్నవాడినే అరెస్టు చెయ్యమని ప్రొపెషన్ నడిపించటం. ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వటం...." కొంచెం ఆగి "ఓహో! ఎంత ఈగో శాటిస్ ఫాక్షన్! ఎంత కీర్తి? మీ నిజాయితీకి ఎంత ప్రచారం." అన్నాడు.
"మిస్టర్ విక్రమ్" దాదాపు అరిచినట్లే అన్నది ఇందుమతి.