'అతనికి మనకు సరిపోదు. నీవింకేం ఆలోచించకుండా చెప్పేయ్. ఏదో మన అల్లుడి ఫ్రెండ్ అని వస్తుంటే మర్యాద చేశాం కాని, అతనిలాంటి ఆలోచన పెట్టుకున్నాడనుకోలేదు. వెంటనే చెప్పేయ్. నీకు చెప్పడానికి మొహమాటం అయితే మీనాన్నగారే చెప్తారు' అంది తల్లి ఖచ్చితంగా.
'వద్దులే తననే చెప్పనీ, మనదాకా ఎందుకు ఈ వ్యవహారం....' అన్నారు తండ్రి.
తల్లిదండ్రుల మాటలు విన్నాక అంతవరకు కాస్త సందిగ్ధతలో వూగిసలాడిన ఆమె స్థిర నిర్ణయానికి వచ్చింది-తను పుట్టి పెరుగుతున్న వాతావరణం వేరే అతనితో నెల జీతంతో సర్దుకు బతకడం కుదరనిది. అసలింతకీ అతనిపట్ల తనకే ఫీలింగ్స్ లేనపుడు అతనడిగాడని వప్పుకోడం ఏమిటి- అంత సర్దుకోవాల్సిన 'ఖర్మ తనకేమిటి?'
మర్నాడు తనే ఫోను చేసింది. ఫోను జయంతి ఎత్తింది. మనీషా గొంతు గుర్తుపట్టింది. దివాకర్ ని అడగగానే బటన్ ప్రెస్ చేసి ఫోను పెట్టేసింది. ఫోనులో మాట్లాడుతున్న అతని హావ భావాలు గమనించసాగింది. ప్రతిసారిలా అతను ఉత్సాహంగా మాట్లాడటం లేదు. మనీషా ఏమందోగాని అతని మొహం కళ తప్పిందనిపించింది జయంతికి. అతను ఏదో అన్నాడు. అతని మొహంలో నిరాశ, నిస్పృహలు జయంతి దృష్టిని దాటిపోలేదు. ఫోను పెట్టేసి చాలాసేపు కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాడు. జయంతికి సంగతి అర్ధం కాకపోయినా మనీషా ఏదో అన్నది అతనికి అప్రియం అన్నది అర్ధమైంది. ఓ పావుగంట తరువాత దివాకర్ లేచి బయటికి వెళ్ళాడు. ఇద్దరూ ఏదో దెబ్బలాడుకున్నారేమో. ఆవిడ్ని ప్రసన్నురాలిని చేసుకోడానికి వెళ్ళినట్టున్నాడు జయంతి ఉక్రోషంగా అనుకుంది. దివాకర్ ని చూసి మనీషా అప్రసన్నంగా మొఖం పెట్టింది. 'సారీ టూ డిస్ట్రబ్ యూ... కానీ, మీతో ఒక్కనిముషం మాట్లాడాలి. మనీషా నీవు చెప్పింది విని ఎంతషాక్ అయ్యానో తెలుసా, ఎంత డిసపాయింట్ అయ్యానో....ఇలాంటి జవాబు నీనించి ఆశించలేదు. మనీషా ప్లీజ్ మరోసారి ఆలోచించమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను' చాలా ఆరాటంగా సర్వం పోగొట్టుకున్నవాడిలా దీనంగా అన్నాడు.
మనీషా మొహం తిప్పుకుంది 'సారీ దివాకర్ జీ. నేను బాగా ఆలోచించే, మా వాళ్ళతో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంక ఆలోచించడానికి ఏముంది. ప్లీజ్ ఫర్ గివ్ మి. మీ మనసుకి కష్టం కలిగిస్తే....' ఇంకేం చెప్పడానికి లేదన్నట్టు చూపుతిప్పుకుంది. మనీషా మొహం చూశాక ఆమె నిర్ణయం మారేది కాదని అతనికి అర్ధమైంది. ఒక్క క్షణం ఇంకా మనీషా ఏదన్నా చెపుతుందేమోనని ఆగి ఆమె ఏమి అనకపోవడంతో 'థాంక్స్....మనీషా ....ఇన్నాళ్ళు మంచి కంపెనీ అందించినందుకు.... గుడ్ ఆఫ్టర్ నూన్ అండ్ గుడ్ బై....' అంటూ బయటికి నడిచాడు.
మనీషా పర్వం ముగిసింది అనుకున్నాడు కారులో వెడుతూ.
* * *
వారం రోజుల తరువాత ఓ ఆదివారం సాయంత్రం దమయంతి, గోపాలకృష్ణ చాలా సంతోషంగా వచ్చి జయంతితో దివాకర్ పెళ్ళికి అంగీకరించాడన్న వార్త మోసుకువచ్చారు. నిన్న దివాకర్ నాతో మాట్లాడాడు-' జయంతిని పెళ్ళి చేసుకోవడానికి తనకేం అభ్యంతరం లేదని, మీ వాళ్ళని మా వాళ్ళకి రాయమనండి అని చెప్పాడు దివాకర్.....'అంటూ సంబరంగా చెప్పాడు గోపాలకృష్ణ.
'అతనికభ్యంతరం లేకపోవచ్చు. కానీ నాకభ్యంతరం ఉంది' జయంతి మొహం మాడ్చుకుని అంది కఠినంగా. గోపాలకృష్ణ చెప్తున్నప్పుడే ఆమెకి అర్ధం అయింది దివాకర్ ని మనీషా అంగీకరించలేదన్నది. అందుకేనన్నమాట ఆ రోజు అతని మొహం మాడిపోయింది. మర్నాడు ఓ రెండు రోజులవరకు మొహం వేల్లాడేసుకుని ఆఫీసుకి వచ్చాడు. ఆవిడగారు చేసుకోను ఫో అంటే అప్పుడు తను కనిపించిందన్నమాట. అందుకే అపుడు ఇంకా ఆలోచించలేదు. చూద్దాం అంటూ దాటేశాడు. ఇదేదో తేల్చుకున్నాక తన గురించి ఆలోచించొచ్చని అవును కాదు అని చెప్పకుండా నాన్చాడు.
జయంతికి పౌరుషం తన్నుకొచ్చింది. తనంత పనికి మాలినదనుకుంటున్నాడా ఆయనగారు అవతల మనిషి కాదంటే తనని చేసుకుంటాననగానే ఎగిరి గంతేసి వప్పుకుంటుందనుకున్నాడు గాబోలు, అదర్ ప్లాన్స్ అంటే మనీషా వప్పుకుంటుందో లేదో నన్న సందేహం అన్నమాట! జయంతి వంక అందరూ దిగ్భ్రమంగా చూశారు. ఏం వచ్చింది దీనికి దివాకర్ లాంటి వాడిని కాదనడానికి, ఆవిడ కోరుకునే అందం, ఉద్యోగం అన్నీ వున్నా కాదంటుందేం ఇది. పిచ్చిగాని పట్టిందా-ఇంకా మారింది ఫరవాలేదనుకుంటున్నాం అనుకొన్నారు. గోపాలకృష్ణ ఏదో చెప్పబోతూంటే జయంతి కటువుగా 'మీ ఫ్రెండ్ కి చెప్పండి, ఆ మనీషా వద్దన్న తరువాత ఇప్పుడు నేను కనిపించానా అని అడిగానని చెప్పండి. నేనూ అంత గతిలేని దాన్ని కానని చెప్పండి' అంది. అంతా తెల్లపోతూ చూశారు.
'మధ్యన మనీషా గురించి మాట్లాడతావేమిటి జయంతీ? దమయంతి ఏదో అనబోయింది. 'నీకు తెలియదులే, ఈ దివాకర్ ఇన్నాళ్ళు మనీషా చుట్టూ తిరిగాడు. హోటళ్ళకీ, లంచ్ లు డిన్నర్లు తిప్పాడు ఆవిడ్ని యింప్రెస్ చేయడానికి-ఆవిడ అందానికి యీయనగారి మతిపోయి దాసోహం అయి ఇన్నాళ్ళు ఆశలు పెంచుకున్నాడు-ఇప్పుడు పెళ్ళి ప్రసక్తి తెచ్చివుంటాడు. ఆవిడ చేసుకోననేసరికి సర్లే పోనీ అన్నట్టు నాతో సరిపెట్టుకుంటున్నాడన్నమాట-అపుడు అడిగినపుడు ఐహావ్ అదర్ ప్లాన్స్ అన్నవారు, మనం అడిగామని సరే అన్నాడు గాబోలు- అతన్ని వదులుకుంటే అతను మహారాజులా యింకో సంబంధం చేసుకుంటాడు...'దమయంతి నచ్చచెప్పబోయింది.