'మహారాజులా చేసుకొనీ ఎవరొద్ధన్నారు', జయంతి ఇగో దివాకర్ ప్రవర్తనతో చాలా హర్ట్ అయింది. మొదట్లో తనతో స్నేహంగా వుండి హఠాత్తుగా మనీషా కనిపించగానే తనని వదిలేసిన అతనిపట్ల కసి కోపం పెంచుకుంది. మనీషా వద్దనగానే మళ్ళీ తనకోసం వచ్చిన అతన్ని తనూ ఛీ ఫో అని కసి తీర్చుకోవాలని వుంది అంతా మొహాలు చూసుకున్నారు.
"ఈ సంబంధం తప్ప మీరెవర్ని తెచ్చినా చేసుకుంటాను" అంటూ జయంతి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది.
'ఫర్ గెట్ యిట్. స్పష్టంగా చెప్పేసింది కదా. ఇంకా ఆశ ఎందుకు, తన వ్యూపాయింట్ లో చూస్తే తనన్నదీ ఓ విధంగా రైటే' గోపాలకృష్ణ సమర్ధించాడు.
'ఏమిటో దానికా కళ్యాణఘడియ యింకా రాలేదనుకుంటాను-నోటిదాకా వచ్చిన ముద్దజారిపోవడం అంటే యిదేగాబోలు' అంది పద్మావతి దిగులుగా.
'సరేలెండి యీసారి ఏ సంబంధం తెచ్చి నా చేసుకుంటానందిగా - పేపర్లో చూడు దమయంతి, మంచిది ఏదన్నా కనిపిస్తే చెప్పు-' అన్నాడు గోపాలకృష్ణ.
* * *
గోపాలకృష్ణ జయంతి తిరస్కరించింది అని కారణం చెప్పగానే దివాకర్ మొహం నల్లబడింది. కోపం తన్నుకొచ్చింది. 'ఏదో పోనీ నీవడిగావు కదా, కాస్త పరిచయం ఉన్న అమ్మాయిగదా అని సరే అన్నాను. ఈ మాత్రం అందగత్తెలు నాకు దొరక్కకాదు- మా వాళ్ళు పంపిన ఫోటోల్లో అమ్మాయిలు ఇంతకంటే బాగున్నవాళ్ళున్నారు. ఫ్రెండ్ వి అడిగావు అని సరే అన్నాను-నాదే తప్పు. ఈ జయంతికి ఎంత పొగరో తెలిసికూడా సరేననడం" ఉడుక్కుంటూ అన్నాడు. గోపాలకృష్ణ కి నిజంగానే బాధగా వుంది-నిజంగా జయంతికి పెళ్ళియోగం లేదా అనిపిస్తుంది. ఏదో విధంగా సంబంధాలు తప్పిపోతున్నాయి అనుకున్నాడు.
కానీ, జయంతికి పెళ్ళియోగం దగ్గిరపడింది. టైము వచ్చింది అన్నట్టు ఆ ఆదివారం పేపర్లో రెండుమూడు సంబంధాలు జయంతికి సరిపోయేవి టిక్ పెట్టింది దమయంతి. అందులో ఒకటి హైదరాబాదు ఫోను నెంబరు ఇచ్చారు. గోపాలకృష్ణ ఆ నెంబరుకి ఫోను చేశాడు. స్వయంగా పెళ్ళికొడుకే మాట్లాడి వివరాలు చెప్పాడు.
అతను ఏదో కంపెనీలో పర్సనల్ మేనేజర్ ఉద్యోగం, ముఫ్ఫై మూడేళ్ళు, ఇల్లు ఉంది, ఒక పెళ్ళయిన చెల్లెలు, పెళ్ళికావల్సిన చెల్లెలు తమ్ముడు ఉన్నారు. తండ్రిలేడు. పేరు శేషగిరి, ఫోన్ లో వివరాలు అతనికి నచ్చి దమయంతితో మాట్లాడి ఆదివారం అతనింటికి వెళ్ళివచ్చాడు. తమలాగే మిడిల్ క్లాస్ సంసారం-శేషగిరి రూపానికి బాగానే వున్నాడు. పొడుగ్గా, రంగుతో వున్నాడు. జయంతి అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదనుకున్నాడు-ఇంటికెళ్ళి వెంకటేశ్వరరావు, పద్మావతికి చెప్పాడు ముందు-తరువాత జయంతికి చెప్పారు. ఆమె సరే అన్నాక పెళ్ళి చూపులకు పిలిచారు.
'ఏమిటో పాపం ఈ అబ్బాయి యింత తాపత్రయపడ్తున్నాడు దీని పెళ్ళికోసం. ఎంత మంచివాడు. మనలో కలిసిపోయాడు. నా యిద్దరళ్ళుళ్ళు మంచివాళ్ళు దొరికారు- పద్మావతి గోపాలకృష్ణని పొగిడింది. జయంతి ఈసారి మనస్ఫూర్తిగానే అంగీకరించింది గోపాలకృష్ణ మంచితనాన్ని.
పెళ్ళిచూపులకి శేషగిరి, తల్లి వచ్చారు. శేషగిరి ఉద్యోగంలో చేరినపుడే హార్ట్ ఎటాక్ తో తండ్రిపోయారు. ఇల్లుంది. ఆయన పెన్షనువస్తుంది. శేషగిరికి బరువు బాధ్యతలున్నాయి చెల్లెలు, తమ్ముడు సెటిల్ అయ్యేవరకు, శేషగిరి ఏమీ దాచకుండానే తన బాధ్యతలు చెప్పాడు. అతని రూపం నచ్చింది జయంతికి-స్మార్ట్ గానే వున్నాడు. ఉద్యోగమా మంచిదే అనుకుంది. పెళ్ళివారు వెళ్ళాక 'మాకు నచ్చింది సంబంధం, జయంతి సరే అంటే చెయ్యొచ్చు' అన్నారు వెంకటేశ్వరరావు- "ఏమంటావు అక్కయ్యా' అంది దమయంతి-తలవూపింది జయంతి-జయంతి లోపలికి వెళ్ళాక నెమ్మదిగా.
'ఇంట్లో అత్తగారు, ఆడపడుచుల మధ్య యిది వుండగలదంటావా-ఈవిడకున్న పొగరుకి ఇది అందరి మధ్య కాపురం చేస్తుందా-పెళ్ళయ్యాక అత్తగారు ఇలా అంది, అలా అంది, అని తగవులు పెట్టకుంటే...' పద్మావతి నెమ్మదిగా అంది.
దమయంతి 'ఆడపడుచు, మరిది ఎన్నాళ్ళుంటారు-అత్తగారుంటే దీనికే లాభం- ఇది ఉద్యోగం చేస్తే ఇంటిపట్టున వుండి అన్నీ చూసుకునేందుకు ఆవిడుంటుంది. ఇలా మనం అన్నీ ముందే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అమ్మా...'
'నాకేం అభ్యంతరం లేదు-దాని బుద్ది తెల్సినదాన్ని కనుక అన్నాను' అంది పద్మావతి. 'ఇది కట్నం అడగరాదు అని చెప్పిందిట అతనితో దానికి వప్పుకుంటారో లేదో' సందేహంగా అంది. 'అతను దాని ఎదురుగానే చెప్పాడు. తన బాధ్యతలగురించి. వాళ్ళింట్లో వుంటారని అదీ విందిగా-అయినా అంగీకారం చెప్పిందిగా, అంటే దానికి అభ్యంతరం లేదనేగా-వెంకటేశ్వరరావు అన్నాడు.
శేషగిరి మర్నాడే తన అంగీకారం గోపాలకృష్ణకి చెప్పాడు. 'కట్నం అక్కరలేదుగానీ ఏవో కొన్ని లాంఛనాలు అడిగారు. పెళ్ళి రిసెప్షను అది అన్ని ఖర్చులు వీళ్ళే పెట్టుకోవాలని అడిగారు. దానికేముంది ఏ రాత్రి ముహూర్తం పెట్టుకుంటే డిన్నరు యిచ్చేస్తాంగా ఎలాగో, ఆ మాత్రం లాంఛనాలు వాళ్ళకి బట్టలు అవి అడగకపోయినా చేస్తాంగదా' అంది పద్మావతి.


