Previous Page Next Page 
మనసున మనసై పేజి 43


    'పోనీ ఇన్నాళ్ళు ఆలోచించలేదు.... ఇప్పుడు ప్రపోజ్ చేశాను కనక ఈ విషయం ఆలోచించండి....' ఆరాటంగా అన్నాడు. 'ఇప్పుడే జవాబు అక్కరలేదు. ఈ విషయం ఆలోచించి చెప్పండి-ఐ విల్ వెయిట్'
    మనీషా ఇబ్బందిగా చూసింది.... 'ఇంత తొందరగా.... నేనేం అసలు అనుకోలేదు ఇంకా...'అంది.
    'ఇప్పుడనుకోండి... కావలిస్తే మీ వాళ్ళతోనూ చెప్పండి... నన్ను మాట్లాడమంటే నేవచ్చి మాట్లాడుతాను'
    'వద్దు వద్దు.... మీరేం రావద్దు...నాకు ఆలోచించుకోవడానికి టైము కావాలి. మీరు ప్లీజ్ తొందరపెట్టకండి. నేను ఆలోచించి జవాబు చెప్తాను' అని మాత్రం అంది అప్పటికి తప్పించుకోవడానికన్నట్టు.
    'ప్లీజ్ మనీషా... పాజిటివ్ గా ఆలోచిస్తారని ఆశిస్తాను. నన్ను నిరాశపరచరని నమ్ముతున్నాను. రియల్లీ ఐ లైక్ యూ... అయ్ లవ్ యూ-మీరు అంగీకరిస్తే నా అంత అదృష్టవంతుడు లేడనుకుంటాను....' చాలా ఎమోషనల్ గా అన్నాడు.
    మనీషాకి నిజంగా ఇదంతా ఎంబ్రాసింగ్ గా అనిపించింది.... ప్రేమ, పెళ్ళి అన్న ఆలోచనే లేని ఆమెని దివాకర్ ఇలా తీసుకొచ్చి అడిగి ఇబ్బంది పెడ్తున్నాడనిపించింది. ఇంత చొరవ అతను తీసుకోవడం ఆ అమ్మాయికి నచ్చలేదు.
    'సరే నేను ఆలోచించి మీకు చెప్తాను- పదండి వెళ్ళాలి నేను...' అంది. దివాకర్ ఆమె మొహం చూసి ఇంకా మాటలు పొడిగించే సాహసం చెయ్యలేక కారు స్టార్ట్ చేశాడు.
    
                               * * *
    
    మనీషా రాత్రంతా ఈ విషయం ఆలోచించింది. ఆమెకి దివాకర్ పట్ల ప్రేమ, ఇష్టం పెళ్ళి చేసుకుంటే ఇతన్ని చేసుకోవాలనిగాని ఏ ఆలోచనా రాలేదు ఆమెలో అంతవరకు. అతనడిగాక కూడా ఆమె ఏ అభిప్రాయానికి రాలేకపోయింది.
    తన అక్క భావిక కులం మతం, భాష, ఏవి చూడకుండా చేసుకుందంటే అమెరికాలో వాళ్ళిద్దరూ ఒక చోట చదివిన పరిచయం, మూడు నాలుగేళ్ళ స్నేహం ప్రేమగా మారి చేసుకున్నారు పెళ్ళి-అమెరికాలో వుంటారు కనుక వాళ్ళ అలవాట్లు ఆచారాలు వేరయినా ఆ దేశంలో ఏమీ ఇబ్బంది వుండదు.
    ఇద్దరి ఫేమిలీలు దూరంగా వుంటారు గనక ఏ సమస్యలూ తలెత్తవు. తను ఇతన్ని చేసుకుని ఇక్కడ ఇమడగలదా-వీటన్నింటిని అధిగమించి అతన్నే చేసుకోవాలనిపించే ప్రేమ తనకేం లేదు. అసలు ఇంట్లో వాళ్ళు ఏం అంటారో చూద్దాం అన్నట్టు మధ్యాహ్నం అందరూ కల్సి భోజనం చేస్తుండగా విషయం బైటపెట్టింది.
    మనీషా తండ్రి మొహంలో ఒక్క క్షణం ఆశ్చర్యం కనిపించింది. ఆ వెంటనే ఆయన సర్దుకుని 'నీవేం జవాబిచ్చావు?' అన్నాడు.
    'నేనింకా ఏం జవాబివ్వలేదు. అసలు నాకా ఆలోచనే రాలేదు. అలోచించి చెబుతానన్నాను'.
    అతనేమిటి మన కులం, భాష, ఆచార వ్యహారాలు అన్ని వేరే వాళ్ళకి మనకి ఎలా సరిపోతుంది' తల్లి అందుకుంది.
    'భావిక తెలుగు వాడిని చేసుకుందిగా, అందుకని అనుకున్నదేమో-అక్కడ వాళ్ళిద్దరూ కలిసి మెలిసి చదివారు, తిరిగారు ప్రేమించుకున్నారు. అమెరికాలో అంటే సరిపోతుంది. ఇక్కడ అలా ఎలా కుదురుతుంది.
    'అదంతా తరువాత, ముందు నీ ఉద్దేశం చెప్పు. నీకు అతన్ని చేసుకోవాలనుందా తండ్రి సాలోచనగా అడిగాడు. మనీషా జవాబివ్వలేకపోయింది. 'దాడిఐయామ్ కన్ ఫ్యూజ్ద్' .... అతనిలా అడుగుతాడని నేను అనుకోలేదు. అసలీ విషయము నేనెప్పుడూ ఆలోచించలేదు.
    'అంటే ప్రేమ, దోమ ఏం లేవా అతని మీద' తమ్ముడు వేళాకోళంగా అన్నాడు. 'నీ చుట్టూ తిరుగుతూ లంచ్ లు, డిన్నర్ లు అని పిలుస్తుంటే నాకపుడే అనుమానం వచ్చింది'
    'చూడు బేటా, నీవు అతన్ని ప్రేమించానంటే అది వేరే విషయం. అపుడు దీని గురించి అందరం ఆలోచించాల్సిన అవసరం వుండేది. అదేం లేనప్పుడు మనవాళ్ళలోనే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు నిన్ను చేసుకుంటాం అంటూ కబుర్లు పెడుతున్నారు. అలాంటపుడు ఇతనిలో ఏం ప్రత్యేకత వుందని ఇతన్ని మనం ఎంచుకోవాలి. వాళ్ళు ఆంధ్రా బ్రాహ్మిన్స్ తిండి, భాష, ఆచార వ్యవహారం అన్నీ వేరు. అన్నింటిని మించి అతను సేలరీస్ క్లాసిక్ చెందిన వాడు. మనం బిజినెస్ కమ్యూనిటీ అతనికొచ్చే ఏ పదిహేనువేల జీతంతో నీవు ఎక్కడ ఎడ్జస్ట్ అవగలవు. నీ డ్రస్సులే ఒక్కోటి రెండు వేలు తక్కువలేవు. నీ సిస్టర్స్ వెయ్యి రూపాయలు. నీ అలవాట్లన్నీ కాస్ట్ లీ అలవాట్లు-మనం డబ్బు మధ్య పుట్టి పెరిగే వాళ్ళం- వాళ్ళు మిడిల్ క్లాస్ కి చెందినవారు. నెల జీతంతో సర్దుకుబతకగలవా? అంత ఖర్మ నీకేం పట్టింది. నీకోసం పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు పిల్లనిమ్మని అడుగుతున్నారు. డైమండ్ మర్చంట్ అగర్వాల్ తన మనవడికి నిన్ను చేసుకోవాలనుందని రెండుసార్లు అన్నాడు. బూల్ చందాని జ్యూయలర్స్ ప్రేమ్ చంద్ కి నిన్నడుగుతున్నారు. భావిక చేసుకుందంటే ప్రేమించింది. అమెరికాలో వున్నారు వాళ్ళు. అతనూ బోలెడు ఆర్జిస్తున్నాడు. ఇరువైపులా ఫేమిలీలకి దూరంగా వున్నారు ఏ సమస్యలూ రాకుండా. అంచేత భావిక విషయం వేరు. ఇంతమంది నీ కోసం అడుగుతున్నారు. వీళ్ళంతా మన ఆస్తి అంతస్థుకి సరిపోయేవాళ్ళు. లక్ష్మీపుత్రులు. వీళ్ళందరిని వదిలి బ్యాంక్ మేనేజర్ ని పెళ్ళాడే ఖర్మ నీకేమిటి. కారుల్లో తిరిగే నీవు, కాలు కింద పెట్టకుండా అన్ని చేతికందించే పని మనుష్యులున్నచోట పుట్టి పెరిగిన నీవు ఓ మిడిల్ క్లాస్ ఇంట్లో ఇమడలేవని నాకు తెలుసు. అతనేదో నీ అందం చూసి వెంటపడి చేసుకోవాలనుకోవచ్చు. నీకు అతన్నే చేసుకోవాలని కోరిక వుంటే నే చెప్పిన సంగతులన్నీ బాగా ఆలోచించి నిర్ణయించుకో నీకతని మీద అలాంటి అభిప్రాయం లేకపోతే ఫ్రాంక్ గా చెప్పేయ్. అనవసరంగా అతనికి ఆశలు కల్పించద్దు. దిసీజ్ మై అడ్వైజ్' అన్నాడాయన.

 Previous Page Next Page