Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 43


    
    "నాకు ఆ కోవలోకి చెందటమిష్టంలేదు."
    
    కొన్ని నిముషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి.
    
    "తనూజ!"
    
    "ఊ."
    
    "ఈ ఒంటరితనం ఎలా పోతుంది?"
    
    "పోదు."
    
    "పోదా?"
    
    "వంటరితనం మనిషిలో ఒకభాగం. ఒక రొటీన్ నుండి తప్పిపోయినప్పుడు మనిషి నలుగురితో వున్నా త్రాగుడు, పేకాట నిద్రబిళ్ళలు ఇలాంటి వ్యసనాలు ఎన్ని అలవాటు చేసుకున్నా అదో భ్రాంతియై మనిషిని ఇంకా ఇంకా కృంగదీస్తూ వుంటాయి గాని వంటరితనం విడిచివెళ్ళదు. ఒక పురుషుడికి జీవితంలో మహత్తరమైన ఆకర్షణ స్త్రీ మొదటిసారిగా ప్రభావంతో నింపేసిన స్త్రీ దూరమై నప్పుడు, తర్వాత ఎంత అన్వేషించినా అది యాంత్రికమైన పెనుగులాటే గాని సరైన రీప్లేస్ మెంట్ కాదు."
    
    "మరి ఎలా యీ సమస్య పరిష్కారం కావటం?"
    
    "కాదు."
    
    "అంతేనా?" అని రాజీవ్ కళ్ళు మూసుకుని నిరాశగా పడుకున్నాడు.
    
                                                                * * *
    
    తర్వాత ప్రతి వారంరోజులకూ ఒకసారి రాజీవ్ వచ్చి ఆమెతో కొన్నిగంటలు గడిపి వెళ్లిపోతూ వుండేవాడు.
    
    తనూజ చాలా హుందాగా ప్రవర్తించేది.
    
    ఒకరోజు అర్దరాత్రి రెండుగంటలకి వచ్చాడు. తనూజ వెళ్లి తలుపుతీసింది.
    
    రాజీవ్ చాలా నీరసంగా కనుపించాడు. మొహం పీక్కుపోయి, కళ్ళు లోతులకు పోయి ఎలాగో వున్నాడు.
    
    "తనూజా!" అంటూ ఆమె భుజాలమీద చేతులువేసి దగ్గరకు లాక్కున్నాడు.
    
    ఆమె మాట్లాడకుండా మెదలకుండా నిలబడింది.
    
    "తనూజా! నాకు భయంగావుంది. ఒక్కడ్నే వుంటే ఎవరో వెన్నాడుతూన్నట్టు తరిమి తరిమి కొడుతున్నట్లు అనుభూతి వుండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి."
    
    తనూజ అతని కౌగిలిలో వుండే ఇంకా మాట్లాడకుండా వూరుకుంది.
    
    "మాట్లాడవేం?"
    
    "నేను మీకు ఏ విధంగా కావాలి?"
    
    "అన్ని విధాలా. నిన్ను... నేను... పెళ్లి చేసుకుంటాను...."
    
    ఆమె ఆలోచిస్తూన్నట్టు మౌనంగా వుండిపోయింది మళ్ళీ.
    
    "చెప్పు తనూజ."
    
    "నేను మీదాన్ని కావటానికీ, మీకు అంకితం కావడానికీ అభ్యంతరం లేదుగానీ... పెళ్ళంటే మాత్రం ఆలోచించవలసి వస్తోంది రాజీవ్. మొదట్నుంచీ పెళ్ళంటే నాకు కొన్ని భయాలూ, అపోహలూ వున్నాయి రాజీవ్. పెళ్ళవగానే ఒకరిమీద ఒకరికి ఆంక్షలు, అధికారాలు వస్తాయి. మామూలు చిన్నతప్పు కూడా పెద్ద తప్పుగా మాగ్నిఫై చేయబడుతుంది. అక్కడినుండి కలతలు, మనస్తాపాలు, అపార్ధాలు రాజీవ్! సందర్భం కాకపోయినా ఇక్కడో విషయం చెప్పదలచుకున్నాను. నువ్వు అమెరికా వెళ్లి వచ్చావు. అక్కడి ప్రజల జీవిత విధానాన్ని చూసివచ్చావు. ఇక్కడ బాంబే మొదలైన నగరాల్లో జీవితం ఎంత ఫాస్ట్ గా వుంటున్నదో చూశావు. మన మనస్సులో ఏ మూలనో తప్పనుకునే దాన్ని గురించి ఆలోచించడానికి తీరిక లేనంత వేగంగా ముందుకి వెళ్లి పోతున్నాడు మానవుడు. ఒకరకంగా చూస్తే మనం నవలల్లోనూ, సినిమాల్లోనూ జీవితంకన్నా ఎంతో వెనుకబడి వున్నాం.
    
    ఎందుకంటే విచ్చలవిడితనం కన్నా, విశృంఖలత్వంకన్నా సెంటిమెంట్ నే... గుండెలు చిలికే విషాదాన్నే ఎక్కువగా లైక్ చేస్తారు. పాఠకులు, ప్రేక్షకుల జీవితంలో ఎంతో యాంటిసెంటిమెంట్ వుంది. అమాయకుల ఊహకు అందనంతటి పచ్చినిజాలు వున్నాయి. అవన్నీ సాహిత్యాల్లోకి సినిమాల్లోకి చొచ్చుకు రావటానికి రచయితల పిరికితనం, చాదస్తం, మోడెస్ట్ ఇవన్నీ అడ్డు వస్తున్నాయి. సరే ఇక మన విషయానికి వద్దాం.
    
    మీరంటే నాకు చాలా అభిమానం, ఆరాధన వున్నాయన్న సత్యం మీకు తెలుసు. తెలీబట్టే, ఎప్పుడు పడితే అప్పుడు నిస్సంకోచంగా నా దగ్గరకు రాగలుగుతున్నారు. ప్రస్తుతం మీరున్న స్థితి, స్త్రీ ఆకర్షణశక్తీ యీ రెండు నన్ను కోరుకునేలా చేస్తున్నాయి. నిజం చెబుతున్నాను. నాకేమీ అభ్యంతరంలేదు రాజీవ్. సంతోషంగా మీదాన్ని అవుతాను. నన్ను నేను మీకు సమర్పించుకుంటాను. మీకు సకలసుఖాలు అందచేస్తాను. కాని మనిద్దరిమధ్య పెళ్లి అనే బంధం వద్దు రాజీవ్ ఎందుకంటే మీ సున్నిత మనస్తత్వం నాకు తెలుసు. దాన్ని మరోసారి ఈ కఠినమైన నియమాలతో కూడిన పంజరంలోకి ఇరికించటం నాకిష్టంలేదు. మనిద్దరిమధ్యా ఆ ఒక్క బంధం వుండదు. మిగతావన్నీ వుంటాయి. ణ అపరిమ నిరంతరం మీకు పుష్కలంగా లభిస్తూ వుంటుంది. కాని నామీద ఎక్కువ నమ్మకం వుంచవద్దు రాజీవ్. ఎందుకంటే ఎన్నో తప్పుల తడికలతో కూడిన వికృతమైన, విచిత్రమైన ప్రపంచంలో నేనూ ఓ భాగాన్ని ఏ క్షణంలోనైనా నా మనసు మారవచ్చు. అంతేకాదు నామీద నాకే నమ్మకం లేదు. అందుకని.....అవసరమొస్తే, జరగరానిది జరిగితే ఏ క్షణంలోనైనా బాధలేకుండా విడిపోవటానికి మనం సిద్దంగా వుండాలి. అప్పటిదాకా అన్నివిధాలా ఒకరికొకరు ఆదుకునే ప్రాణస్నేహితులం. అంతే...."
    
    రాజీవ్ ఆమె మొహంలోకి చూశాడు. అతనికి కోపం రాలేదు. ఆ సమయంలో ఎంతో ఉన్నతమూర్తిగా, ప్రతిభావంతంగా గోచరించింది. నవ్వి ఆమెను ఇంకా.... ఇంకా దగ్గరకు తీసుకున్నాడు.
    
                                                             * * *
    
    పదకొండు పన్నెండేళ్ళు ఇద్దరిమధ్యా ఏ కలతలూ లేకుండా గడిచిపోయాయి.
    
    ఆ రాత్రి...
    
    ఊరినుంచి రాగానే అతను షాంపూతో తలారాస్నానం చేశాడు. తర్వాత హాల్లో కూర్చుని తనూజతో కబుర్లు చెబుతూ రెండు పెగ్గులు డ్రింక్ తీసుకున్నాడు.
    
    ఆమెతో కూర్చుని కబుర్లు చెబుతూ డ్రింక్ చెయ్యడమంటే అతనికి చాలా ఇష్టం.

 Previous Page Next Page