Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 44


 

   ఇక తనేమీ చేయలేననిపించి స్కూలు కెళ్ళింది.

 

    సాయంకాలం తిరిగొచ్చేసరికి ధాన్య పెళ్ళికూతురిలా ముస్తాబై వుంది.

 

     ఆకుపచ్చ రంగు పట్టుపావడా, ఓణీలో ఆమె అచ్చు పంటచెలులూ పచ్చ పచ్చగా వుంది. తలమీద పెట్టుకున్న సూర్యవంక, చంద్రవంక ఆభరణాలు ఆ చేలమీద వాలిన బంగారు గువ్వల్లా వున్నాయి. జడ కుచ్చులున్న జడ నీటికాలువలా అద్భుతంగా వుంది. నడుముకున్న వడ్డాణం బంగారు తీగలతో పంటచేల చుట్టూ వేసిన కంచెలా వుంది. పాపిట మీద నుంచి  సాగి ముఖంమీదకి జారిన పాపిటబిళ్ళ, బావినుంచి నీళ్ళు తోడడానికి వేసిన బంగారు ఏతాంలా వుంది. కాళ్ళకున్న వెండిగజ్జెలు చేస్తున్న శబ్దాలు, పొలాల్లో అలసటను మరిచిపోవడానికి కూలీలు పాడుతున్న జానపద గీతాల్లా విన్పిస్తున్నాయి.

 

    వర్షను చూస్తూనే ఆమె "వర్షా! రా!" అంటూ ఆహ్వానించింది.

 

    ఏమీ  మాట్లాడకుండా తన గదిలోని వచ్చింది వర్ష. అచ్చు పెళ్ళి కూతురిలా తయారైన దాన్యను చోడగానే ఏదో బాధ మనసును పిండు తూంటే అలానే తన బెడ్ మీద  వాలిపోయింది. అమ్మవారికి బలి ఇవ్వడానికి మేకను  అలంకరించిన దృశ్యం కళ్ళముందు కదలాడింది. మేకకు, ధాన్యకు ఏమీ బేధం కనబడడం లేదు. ఒకటి ప్రాణం పోగొట్టుకుంటే, ఇంకొకటి మానం కోల్పోతుంది తేడా అంతే.

 


                                           15

 

    చీకట్లు చిక్కబ్దే కొద్దీ చంద్రుడు అదే నిష్పత్తిలో వెలుగులు విరజిమ్ము తున్నాడు. లోకమంతా మల్లెపూలను పరిచినట్టుంది వెన్నెల.

 

    భోజనం చేశాక, కాసేపు రెస్ట్  తీసుకుని బయల్దేరింది ధాన్య.

 

    కొండ  దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు తడబడ్డాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.

 

    కొండ ఎక్కడం ప్రారంభించింది. రెండు అడుగులు వేసిందో లేదో తన ఓణీ దేనికో తగిలి వెనక్కి లాగినట్లు అనిపించడంతో ఠక్కున ఆగింది.

 

    వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగ్గా గోపాలకృష్ణ.

 

    చప్పున సిగ్గు ముంచుకొచ్చి తల వాల్చిందిగానీ, కళ్ళు మాత్రం  కిందకు  చూడడం లేదు. వెన్నెల్లో మెరిసిపోతున్న అతన్ని చూడాలన్న తహతహ కళ్ళను వాలనివ్వడంలేదు.

 

    "దండకం గొప్పతనం ఏమిటో తెలుస్తోంది. దేవత  ప్రత్యక్షమవగానే భక్తుడు దండకం ప్రారంభిస్తాడు. ఆ పదాలు చక్కటి సమాసాలు- అందులోని లయ- ఆ ఒడుపు చాలా వుంటాయి. భావోద్వేగాన్ని ప్రకటించేందుకు దండకం  మంచి ప్రక్రియ. అందుకే నాకిప్పుడు దండకం చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అచ్చు దేవతలా కనిపిస్తున్నావు కాబట్టి" అతను ఆమె చుబుకాన్ని పైకి లేపి చెప్పాడు.

 

    ఆ చిన్న పొగడ్త ఆమెలో పెద్ద సంచలనాన్నే కలిగిస్తోంది. అంతే కాకుండా అతని స్పర్శ ఆమె యవ్వనాన్ని మొదటిసారిగా నిద్ర లేపింది. ఏవో ప్రకంపనలు అలల్లా రక్తంలో కదులుతున్న భావన.

 

    ఆమె అలంకరణను కింద నుంచి పైవరకు ఓసారి పరిశీలించాక "ఈ అలంకరణలో నువ్వు దేవతలా వున్నా- ఇంత అలంకరణ ముందు ముందు ఇబ్బంది పెడుతుంది. శృంగారంలో మనమీద ఎంత తక్కువ బట్టలుంటే అంత ఎక్కువ సుఖం లభిస్తుంది" అని చిన్నగా నవ్వాడు.

 

    ఆమె ఏమీ మాట్లాడలేదు.

 

    "వస్తనంటే పడి ఛస్తాను కాళ్ళకాడ- అని ఆత్రేయ నీలాంటి పిల్లను చూసే రాసుంటాడని నాకనిపిస్తోంది"

 

    ఆమె పెదవుల మధ్య చిర్నవ్వు పాల నురగలా పొంగింది.

 

    "రా" అని చేయి పట్టుకున్నాడు.

 

    ఇద్దరూ కొండ ఎక్కారు.

 

    భవనానికి పక్కగా ఆరుబయల్లో వాళ్ళిద్దరికీ పడక ఏర్పాటు చేశాడు నరుడు. అతను అప్పటికే లోపల గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.

 

    ఇద్దరూ  వెళ్ళి పడకమీద కూర్చున్నారు.

 

    "అవునూ! ఇంతకీ మీ టీచర్ ఏముంటుంది?" అని అడిగాడు.

 

    అప్పుడు మరో స్త్రీ ప్రస్తావన రావడం ఇబ్బంది అనిపించలేదు ధాన్యకు. వర్ష గురించి డీటైల్స్ అనీ విన్నాక తను ఇంతవరకు ఎవరికీ చెప్పని సంఘటన గురించి అడిగాడు.

 

    ఇది కాస్త చెప్పేస్తే ఇక ఆలస్యం వుండదన్న ఆత్రుతతో ఆమె చెప్పడం ప్రారంభించింది.

 

    "ఈ సంఘటన మరొకరికి చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అందుకే ఎక్కడ నుంచి ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు" అని ఓ  క్షణం ఆగి తిరిగి కొనసాగించింది.

 

    "అప్పుడు నేను మద్రాసులో వుండేదాన్ని. డిగ్రీ చదవడానికి అక్కడికి వెళ్ళాను. కోడంబాకంలో మా మేనత్త వుండేది. ఆమెకు ఎవరూ లేరు. ఒక్కత్తే వుండేది. ఆమెతోపాటు వుండి చదువుకోవడనికి నిర్ణయం  జరిగింది రోజూ కాలేజీకి వెళ్లడం, తిరిగి రావడం ఇలా జరుగుతున్నాయి. రోజులు.

 

    ఓరోజు మా మేనత్త ఎవరో బంధువు చనిపోయాడంటే ఊరెళ్ళింది. నేనొక్కదాన్నే ఇంట్లో.

 

    సాయంకాలం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక బోర్ గా  అనిపించడంతో సాలెగ్రామ్ కు వెళ్ళాలనుకున్నాను. అక్కడ మా ఫ్రెండ్ వుంది. దాంతో పిచ్చాపాటీ వేసి ఏడుగంటలకల్లా తిరిగి ఇల్లు చేరుదామని నిర్ణయించుకుని బయల్దేరాను.

 

    సిటీబస్సులు మారి దానిల్లు పట్టుకునేటప్పటికి వీధిదీపాలు వెలిగాయి. ఆకాశం బాగా  మబ్బు పట్టడం  వాళ్ల అప్పుడే చీకట్లు ముసురుకున్నాయి.

 

    ఇంత కష్టపడి అక్కడికి వెళితే నా ఫ్రెండ్ లేదు. సినిమాకెళ్ళిందని చెప్పారు. ఉసూరుమంటూ తిరిగి బయల్దేరాను. వీధిలోకొచ్చేటప్పటికి ఓ వాన చుక్క నా ముక్కమీద పడి బ్రద్దలైంది.

 

    నాలుగు అడుగులు వేశానో లేదో చినుకులు ప్రారంభమయ్యాయి. వడివడిగా నడుస్తూ బస్సు టెర్మినల్ దగ్గరకొచ్చాను. మా కాలనీ బస్సు  కోసం  వెయిట్ చేస్తూ నిలబడ్డాను.

 

    నాకు అటుగా వున్న ఓ యువకుడు నన్ను అదేపనిగా చూస్తున్నాడు. నేను గమనించినా అతను చూపులను మరల్చుకోవడంలేదు. సిటీలో ఇలాంటివి మామూలే గనక నేను పట్టించుకోలేదు. కానీ అతను  మాత్రం  నన్ను తినేసేలా చూస్తుండటం క్రీగంట గమనిస్తూనే వున్నాను. అతని చూపులు ఎక్కడెక్కడ తగుల్తున్నాయో తలెత్తి చూడకపోయినా  తెలుస్తూనే వుంది.   

 Previous Page Next Page