Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 43


  

      తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి అలా పరాయి మగాడిమీద  వసంతం పోయడం అతను భరించలేకపోతున్నాడు. దీన్ని గమనించిన వెంకట్రామయ్య అతని భుజంపై బాధపడవద్దన్నట్లు చేత్తో చరిచాడు.

 

    పునర్వసు అలా గోపాలకృష్ణమీద  వసంతం  పోయడాన్ని మిగిలిన జనం బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు చప్పట్లు చరిచారు.

 

    ఆమె అటు వెళ్ళగానే మరో అమ్మాయి వసంతాన్ని అతనిమీద పోసింది. మళ్ళీ జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. అతను అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవడాన్ని చూసి పులిరాజు ఈర్ష్యతో ఉడికిపోతున్నాడు. ఊర్లో అతని డామినేషన్ చూసి వెంకట్రామయ్య కోపంతో ఊగిపోతున్నాడు. కోపం కంటే ఈర్ష్య డేంజరస్. అందుకే పులిరాజు నిలువెల్లా దహించుకుపోతున్నాడు.

 

    గోపాలకృష్ణకు నీళ్ళు పైన పడుతుండడం వల్ల ఊపిరి ఆడడం లేదు. కళ్ళల్లో సన్నటి మంట. అయితే దాన్ని లెక్క చేయకుండా మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వర్షవైపు చూస్తున్నాడు.

 

    అతను అలా తనవైపే చూస్తున్నాట్లు భ్రమిస్తోంది ధాన్య.

 

    "నా హీరో నావైపే చూస్తున్నాడు. అలా వెళ్లి కాసింత వసంతం చిలకరించి వస్తాను" అంది వర్షతో.

 

    "అలా  చేశావంటే నేను  వెళ్ళిపోతాను. ఆచారం పేరుతో ఆడపిల్లల్ని నాశనం చేసే అతను హీరోనా? తాతా ముత్తాతల పేరు చెప్పుకుని నయా పైసా పని చేయకుండా వేళకు షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగించే ఆ సోమరిపోతు నీ హీరోనా? నాన్సెన్స్...... నువ్వు వసంతం పోయడానికి వెళితే నేను ఇంటికి వెళ్ళిపోతాను..... అంతే" చివరగా బెదిరించింది వర్ష.

 

    "అయితే పోయానులే. నువ్వు వెళ్ళిపోయావంటే నాకు తోచదు" లోపల మనసు పడుతున్న కష్టాన్నంతా కళ్ళల్లో వ్యక్తపరుస్తూ చెప్పింది ధాన్య.

 

        
                                              13

 

    అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి గోపాలకృష్ణ మీద వసంతాలు పోస్తున్నారు నరుడు ఉత్సాహంగా గురువుగారికి జరుగుతున్న వసంతా భిషేకాన్ని చూస్తున్నాడు.

 

    అంతలో గోపాలకృష్ణకు ఓ కొంటె ఆలోచన వచ్చింది. దాన్ని  తలుచుకుంటుంటే తెలియని ఉత్సాహం  రక్తాన్ని ఊపేస్తోంది.

 

    అనాది ప్రేమికులంతా అతన్ని ముందుకు నెడుతున్నారు. అజ్ఞాత శక్తులు అతన్ని ప్రేరేపిస్తున్నాయి. ధైర్యం, అంతకంటే మించిన తెగువ మున్ముందుకు తోస్తున్నాయి. ఏదో  ఉద్రేకం విచక్షణాజ్ఞానాన్ని మింగేసింది.

 

    అంతే..... తనమీద  వసంతం  పోసి  ఎదురుగా  నిల్చుని నవ్వుతున్న అమ్మాయి చేతిలోని వెండి చెంబును లాక్కున్నాడు.

 

    అలా నిలబడి బుద్ధిగా వసంతాలు పోసుకోవడమే తప్ప, ఎన్నడూ వసంతాలు ఎవరిమీదా పోయాని గోపాలకృష్ణ మొదటిసారి చెంబు చేతుల్లోకి తీసుకోవడంలో జనం ఉత్కంఠతో నిలుచుండిపోయారు. ఆ తరువాత అతను ఏం చేయబోతాడోనని రెప్పలు వాల్చకుండా చూస్తున్నారు.

 

    గోపాలకృష్ణ నెమ్మదిగా నడిచి చెంబు ముంచాడు. ఎర్రటి వసంతం చెంబు నుంచి జారుతుండగా పైకి లాగాడు.

 

    తల పైకెత్తాడు తనమీద  పోయడానికే వసంతం  నింపుకున్నాడని అంతకు ముందు అతని మీద  వసంతాలు పోసిన స్త్రీలంతా ఎవరికి వారే  అనుకుంటూ టెన్షన్ గా నిలబడి చూస్తున్నారు.

 

    అయితే గోపాలకృష్ణ చూపులు ధాన్యవైపు ప్రసరించగానే జనం కీ  ఇచ్చిన బొమ్మల్లాగా అటువైపు తలలు తిప్పారు.

 

    ధాన్య అయితే చిన్నపిల్లలా కేరింతలు కొడుతోంది.

 

    అతను నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. ధాన్య మరికొంత ముందుకు వచ్చి నిలబడాలని అనుకుంది గానీ కాళ్ళు కదలడం లేదు.

 

    అతను మరింత దగ్గరయ్యాడు.

 

    వసంతం పోసుకోవడానికి ప్రిపేర్ అయిపోయిన ఆమె కళ్ళు  మూసుకుంది. జనం బిర్రబిగుసుపోయి చూస్తున్నారు.

 

    గోపాలకృష్ణ దాన్యను సమీపించి, పక్కకు ఓ అడుగువేసి చెంబు ఎత్తి వర్శపై కుమ్మరించాడు.

 

    ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఆమె కళ్ళు  మూసుకోక పోవడం వల్ల వసంతం కళ్లల్లో పడి మండింది. అయితే మంట కళ్ళల్లోనో, గుండెల్లోనో ఆమె తెలుసుకోలేకపోయింది.

 

    పంతులమ్మమీద గోపాలకృష్ణ అలా వసంతాలు పోయడంతో జనం మొదట నిశ్చేష్టులై, ఆ తరువాత తేరుకుని చప్పట్లు చరిచారు.

 

    ఈ శబ్దాలకు ధాన్య కళ్ళు తెరిచింది. తనమీద వసంతం పోయాలేదని గ్రహింపుకొచ్చి చుట్టూ చూసింది.

 

    పచ్చగా, పసుపు కొమ్ములా మెరిసిపోతున్న వర్షను చూడగానే జరిగింది ఆమెకు  తెలిసిపోయింది.

 

    చుట్టూ చేరి చప్పట్లు చరుస్తున్న జనాన్నంతా ఓసారి చూసి వర్ష పైటకొంగును నోటికి అడ్డం పెట్టుకుని అక్కడనుంచి పరుగెత్తింది.

 

    జీవితంలో మొదటిసారి ఆమె తన ప్రవృత్తికి విరుద్ధంగా అక్కడి నుంచి పారిపోయింది.

 

    తను వసంతం పోయడంతో సిగ్గు ముంచుకొచ్చి ఆమె వెళ్ళి పోయిందనుకుని జీవితంలో మొదటిసారిగా అతనూ తప్పు చేశాడు. మరి ఈ పరిణామాల పర్యవసానం ఏమిటో కాలమే నిర్ణయించాలి.

 

    
                                                14

 

    గోపాలకృష్ణ నుంచి పిలుపు రావడంతో ధాన్యకన్నా ఆమె తండ్రి సంబర పడిపోయాడు. ఇక తనింట్లో ధనధాన్యాలకు లోటుండదని ఉప్పొంగి పోయాడు. కాలంతోపాటు జారిపోయిన సిరిసంపదలను తిరిగి పొందుతామన్న ఆనందం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

 

    ఇక ధాన్య అయితే ఒక్క క్షణం నింపాదిగా వుండలేకపోయింది. ఏ పని ముందు చేయాలో, ఏది వెనక చేయాలో తెలియనంత కన్ ప్యూజన్ లో  పడిపోయింది. ఎప్పుడు రాత్రవుతుందా, గోపాలకృష్ణ కౌగిలిలో తన ఇరవై రెండేళ్ళ యవ్వనాన్ని ఆరపెడదామా అన్న ఆతృత ఆమెలో.

 

    ఆ పౌర్ణమిరోజున శివరామయ్య ఇంట్లో జరుగుతున్న హడావుడినంతా వర్ష ఆశ్చర్యంతో  గమనిస్తోంది.

 

    కేవలం ఓ మూఢనమ్మకంతో తమకు సిరిసంపదలు కలిసొస్తాయని పెళ్ళికాని తన కూతుర్ని పరపురుషుడితో రాత్రి  గడపమని పంపిస్తున్న శివ రామయ్యను చూస్తుంటే ఆమెకు జాలి కలిగింది. ఈ దురాచారాన్ని ఎలా రూపుమాపాలో తెలియడంలేదు. ఏదో పెద్ద ఉద్యమమో, దీర్ఘకాలిక ప్రణాళికో, లేక ఏదో జరగరానిది జరిగితేనో తప్ప దీనికి పుల్ స్టాప్ పెట్టడం కుదరదని కూడా ఆమెకు అర్థమైంది.

 

    అప్పటికీ ఉండబట్టలేక శివరామయ్యను పిలిచి ఇదంతా మూఢాచారం తప్ప మరేమీ కాడని చెప్పబోయింది. ఆమె నోరు తెరిచి చెప్ప బోయేంతలో ఆయన అడ్డు తగిలి- "నువ్వేమీ చెప్పకమ్మా! ఈరోజు వినే మూడ్ లేదు. రేపటినుంచి ఈ ఇంట్లో శ్రీలక్ష్మి కాలిగజ్జెల రవళి వినిపించబోతోంది. సిరిసంపదలు పొంది మమ్మల్ని ముంచెత్తబోతున్నాయి" అంటూ ట్రాన్స్ లో  వున్నట్టు మాట్లాడాడు.

 Previous Page Next Page