Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 45


    చినుకులు ఎక్కువయ్యాయి. జల్లు మీద  పడుతుండడంతో నేను మరి కాస్త వెనక్కి జరిగాను.

 

    వర్షానికి అక్కడ చాలామంది గుమికూడడం ప్రారంభించారు. బాగా రష్ గా వుంది.

 

    "ఛీ..... ఛీ..... వెధవ వాన" అని నాలో నేనే విసుక్కున్నాను. నా  పెదవుల కదలికలను కనిపెట్టి కాబోలు "మీరు తెలుగా?" అని అడిగాడు అతను.

 

    దూరంగా నిలుచున్నా అతను నా పక్కకు ఎప్పుడు చేరాడో నేను గమనించలేదు. నా పక్కన నిలబడడమే గాకుండా ఎంతో చనువుగా మేనత్త కూతుర్ని పలకరించినంత సునాయాసంగా మాట్లాడుతున్న అతన్ని చూసి నిజంగానే ఒక్కక్షణం భయమేసింది. అదే క్షణంలో కోపం కూడా వచ్చింది.

 

    నాలోని మార్పులను అతను గమనించినట్టు లేడు. "ఏ  ఊరు?" అతనే మళ్ళీ అడిగాడు.

 

    నేను అతనివైపు పరిశీలించి చూశాను. దాదాపు ఇరవై అయిదేళ్ళ వయసుంటుంది. తెల్లటి ఫ్యాంటుమీద గళ్ళ షర్టు టక్ చేసుకున్నాడు. లేత ముఖంలో ఏదో క్రూరత్వం తోడేలుపిల్ల పచ్చగడ్డిలో కదలాడుతున్నట్టు కనిపిస్తోంది.

 

    నేను సమాధానం చెప్పలేదు.

 

    నా చేతిలోని నవలను చూసి "అయ్యయ్యో! పుస్తకం తడిసిపోతోంది. ఇంతకీ ఏం  నవల?" అంటూ నా ముఖం మీదకి వంగాడు.

 

    వ్యవహారం శ్రుతిమించుతూ వుందని నాకు అర్థమైంది.

 

    "నవల పేరు చెప్పకపోతే పోనీలెండి- ఇంతకీ రేటెంత?" అని ప్రశ్నించాడు.

 

    "పాతిక" అన్నాను అతన్నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ.

 

    "పుస్తకం రేటు కాదు నీ రేటు?"

 

    ఒక్కసారిగా అతనిమీద పడి గొంతు కొరికేద్దామన్న ఆవేశం వచ్చింది. ఎలానో తమాయించుకున్నాను.

 

    "నువ్వు ఎంత పాతివ్రత్యం నటించినా అసలు విషయం నాకు తెలిసిపోయింది. నువ్వు రేతున్న మనిషివని నా సిక్తుసెన్స్ చెప్పింది."

 

    కోపంతో నేనెక్కడ పగిలిపోతానేమో ననిపించింది. ఆ సిక్తుసెన్స్ అనేపదం అంతే నాకు ఎలర్జీ. ఈ మధ్య చాలా నవలల్లో ఈ పదం దొర్లుతుండడం దానికి కారణం. వాడు అలాంటి చీప్ నవలలు చదివే ఆ పదం నేర్చుకుని వుంటాడని నా నమ్మకం.

 

    "ఎంతయినా ఫరవాలేదు. రాత్రికి అయిదు వందలయినా సిద్ధమే" అన్నాడు గొంతు తగ్గించి.

 

    వాడు జీవితంలో స్త్రీవైపు చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాను.

 

    "నేనలా అనిపిస్తున్నానా?" అని అడిగాను నవ్వును ముఖంలో పులుముకుంటూ.

 

    "ఖచ్చితంగా అలా కాదుగానీ ఫ్యామిలీ టైప్ అనుకున్నాను."

 

    "భలే కరెక్టుగా చెప్పారే."

 

    "అదే మరి  ఈ చిట్టిబాబు స్పెషాలిటీ. అర కిలోమీటరు దూరం నుంచి చూసైనా ఏ పిల్ల ఎలాంటిదో చెప్పగలను" కాలర్ ఎగరేశాడు.

 

    "మీ రేటుకు ఓ.కే. కానీ చిన్న రిక్వెస్టు. హోటల్ కు గానీ, మరెక్కడికిగానీ వద్దు. మా ప్లాట్ సేఫెస్ట్ ఫ్లేస్  ఓకేగదా" అన్నాడు.

 

    "అలానే"

 

    "అయితే అదిగోండి బస్సు" అంటూ కిందకు ఉరికాను.

 

    నా వెనకే వాడు చొంగకార్చుకుంటూ కుక్కలా వెనకపడ్డాడు.

 

    బస్సులో నాపక్కనే కూర్చోబోతే "వద్దు ఎవరైనా చూస్తే బాగోదు. అటెళ్ళి కూర్చో" అన్నాను.

 

    వాడు ఇబ్బందిగానే  పక్క సీటు దగ్గరికి కదిలాడు.

 

    మా కాలనీ రాగానే ఇద్దరం దిగాం.

 

    వాడి వివరాలడుగుతూ మా వీధిలోకి వచ్చాం. మరో పదడుగుల దూరంలో మా ఇల్లు వుందనగా వాడిని ఆపి "అదిగో ఆ ఎల్లో పెయింట్ వేసిన అపార్టుమెంటులోనే మా ఇల్లు నెంబర్ ఫైవ్. ఫస్ట్ ఫ్లోర్ రైట్ లో వేసిన అపార్టుమెంటులోనే మా ఇల్లు నెంబర్ ఫైవ్. ఫస్ట్ ఫ్లోర్ రైట్ లో ఉంటుంది. నేను వెళ్ళిన పావుగంటకు వచ్చేయి. నీకోసం తలుపులు తెరిచే వుంచుతాను" అని చెప్పాను.

 

    నా ప్లాట్ ను  చేరుకొని వాడు వచ్చేలోపు చేయాల్సిన కొన్ని పనులు పూర్తి చేశాను. స్నానం చేసి బట్టలు మార్చుకుని హాల్లోని సోఫాలో కూర్చున్నాను.

 

    ఖచ్చితంగా పావుగంట తరువాత వచ్చాడు.

 

    లోపలంతా చీకటిగా వుండడంతో వాడు తాత్కాలికంగా అంధుడై పోయాడు.

 

    "బాబూ" స్వీట్ గా పిలిచాను.

 

    "ఇదేమిటి ఏమీ కనిపించడం లేదు. కరెంట్ లేదా?"

 

    "ఆఁ మా ప్లాట్ లోనే కరెంట్  పోయినట్లుంది. మరేం ఫర్వాలేదు గానీ నేను చెప్పినట్లు అడుగులు వెయ్ నేరుగా హాల్లోకి వచ్చేస్తావు."

 

    వాడు ద్వారం దగ్గరే కదులుతున్నట్లు మసగ్గా కనిపిస్తున్నాడు.

 

    "అలానే ఒకడుగు ముందుకు వెయ్- ద్వారం దాటేస్తావు. ఆఁ అట్లాగే  ముందుకు వెరీ నైస్ బాయ్. ఆఁ ఆగు- పక్కకి తిరిగి జస్ట్ టూ స్టెప్స్."

 

    వాడు నేను చెప్పినట్లే అడుగులు వేశాడు.

 

    "అక్కడ చేత్తో తడుము కుర్చీ తగుల్తుంది. సిక్తుసెన్స్ ఉందన్నావు కదా నువ్వు ఈజీగానే ప్రొసీడ్ కాగలవు."

 

    వాడు గుడ్డివాడిలా చేతులతో తడిమి కుర్చీలో కూర్చున్నాడు.

 

    "ఇక్కడెందుకు మళ్ళీ? నువ్వెక్కడున్నావో చెబితే అక్కడికే వచ్చేస్తాను" అసహనంగా అన్నాడు.

 

    మళ్ళీ వర్షం మొదలయినట్లు చప్పుడు. ప్రపంచమే పెద్ద కాటుక దబ్బీలా వుంది.

 

    "అంత తొందరయితే ఎలా? శృంగారంలో స్పీడ్ పనికిరాదు. బొత్తిగా అనుభవం లేనివాడే తొందరపడేది. నువ్వు చాలా ఎక్స్ పీరియన్స్ వున్నవాడివి కదా. అందునా నువ్వు ఆడపిల్లను దూరం నుంచి చూసే ఫ్యామిలీ గర్లో, బిచ్చో చెప్పగలిగిన ప్రతిభావంతుడివి. నువ్వు నా మాట వినకుండా ముందుకు వచ్చావంటే అంతే సంగతులు. కిందంతా గాజు ముక్కలున్నాయి. అవి గుచ్చుకుంటే అంతా రసాభాసవుతుంది."

 

    "గాజుముక్కలా?"

 

    "ఆఁ ప్లవర్ వేజ్ ఇప్పుడే పగిలిపోయింది. భూదేవి అద్దాల చీర కట్టుకున్నట్లు అవి పరుచుకున్నాయి."

 

    "పెద్ద చిక్కే."

 

    "అవును. అందుకే నేను  లేవమన్నప్పుడు లేచి వచ్చేయి."

 

    వాడు ఏమీ మాట్లాడలేదు. అదోరకమైన యిబ్బందివల్లే వాడికి నోట మాట రావడం లేదని తెలుసు.

 Previous Page Next Page