Previous Page Next Page 
సుహాసిని పేజి 43


    సరిగ్గా అప్పుడే చాకలి బట్టలు తీసుకుని వచ్చాడు.

    "చార్జీలెలాగుంటాయో యిక్కడ?" అంటూ సుభద్ర బట్టలు లెక్క చూసుకుంది.

    రమణ ఎంతయిందో తెలుసుకుని చాకలికి డబ్బిచ్చాడు. చాకలి డబ్బు జేబులో పెట్టుకుని సుభద్రవంక తిరిగి "ఉతుకు బాగుందా?" అడిగాడు. సుభద్ర కర్ధంకాకపోతే రమణ అనువదించి చెప్పాడు.

    "చాలా బాగుంది" అంది సుభద్ర అనాలోచితంగా. రమణ చాకలికి అనువదించి చెప్పాడు. చాకలి వెంటనే "తో ఖుష్ కరో!" అంటూ చేయి జాపాడు.

    అప్పుడే హాస బాత్రూంలోంచి బైటకు వచ్చింది.


                           *    *    *    *


    అంతా రమణ అనుకున్నట్లే జరిగింది. ప్రకృతి సౌందర్యానికి పరవశించి హాసకు మానవనిర్మిత వనాలు మరీ అంతలా నచ్చలేదు. ప్రతిచోటా పరుగులాంటి నడకతో పూర్తి చేశారు. ఒక్క "చష్మాసాహి" లో కాసేపెక్కువ గడిపారు.

    "ఎందుకొచ్చిన హడావుడి?" అంది సుభద్ర ఓసారి విసుగ్గా.

    "మనమిక్కడ కూర్చుని గడపాలని రాలేదుకదా, చూడ్డానికొచ్చాం! ఎంతసేపని చూస్తాం! ఎంత చూసినా ఈ పూదోటల అందాలు తరగవు, పెరగవు" అంది హాస.

    ఒకచోట హాస పర్సు కొందామనుకుంది. బడ్డీ దుకాణంలా వున్నా అక్కడ చాలా రకాల పర్సులున్నాయి. అచ్చం చెవుల పిల్లి ఆకారంలో వున్న పర్సు హాసకు బాగా నచ్చింది. షాపువాడు ఇరవై రూపాయలు చెప్పాడు.

    విషయం తెలిసి సుభద్ర పది రూపాయలకు బేరమాడమంది. షాపు వాడు ఒప్పుకోలేదు. ఎంత బేరమాడినా వాడు పావలా కూడా తగ్గనన్నాడు.

    "బేరం లేకుండా ఎవరు కొంటారు?" అని విసుక్కుంది సుభద్ర.

    తనకు రాని భాషలో తననేమైనా అందేమోనన్న అనుమానంతో షాపువాడు రమణని- "ఏమంటోందావిడ?" అనడిగాడు.

    రమణ నవ్వి, ఆవిడ మాటలకర్ధం చెప్పాడు.

    అందరూ గార్డెన్ లోకి ప్రవేశించారు. అక్కడ హాస కాశ్మీరీ డ్రస్ లో ఫోటో తీయించుకుంది. ఆ సమయంలో ఎందరో యాత్రీకులామెను ఫోటో తీసుకున్నారు.

    "మా డ్రస్సుకీ అందాన్నిచ్చింది" అన్నాడు డ్రస్సులద్దెకు యిచ్చిన వాడు.

    అది అర్ధం చేసుకుని- "లో ఖుష్ కరో" అని నవ్విందామె.

    సుభద్ర ప్రకృతి సౌందర్యాన్ని ఎంజాయ్ చేయకుండా దారి పొడుగునా- "నీకా పర్సు మరీ ఎక్కువగా నచ్చేసిందేమిటే, పుచ్చుకోవల్సిందేమో" అని బాధపడుతూనే వుంది.

    "ఫరవాలేదమ్మా! యోగముంటే కొనుక్కుంటాం. లేకుంటే లేదు" అందామె.

    "ఇరవై రూపాయల పర్సుకు యోగందాకా వెళ్ళాలా?" అంది సుభద్ర. క్రిందకు దిగేక ఆమె ముందు దుకాణం వాడి దగ్గరకెళ్ళి?" ఆ పర్సెంత?" అని సైగచేసి అడిగింది.

    వాడు_"థర్టీ రూపీస్" అన్నాడు. తనకొచ్చిన హిందీని ఇంగ్లీష్ లో కలిపి_ "ఇందాక ఇరవయ్యే అన్నావుగా?" అంది హాస.

    "ఇప్పుడూ ఫరవాలేదు. బేరమాడి అంతకే తీసుకోండి" అన్నాడు షాపువాడు నవ్వి.

    వాడన్నది అర్ధమయ్యాక సుభద్రకు చాలా కోపం వచ్చింది. హాస మాత్రం నవ్వాపుకోలేక హేట్సాఫ్ అన్నట్లు సెల్యూట్ చేసి కాస్త నవ్వేసరికి దగ్గు వచ్చేసింది.

    సుభద్ర ఇరవై రూపాయలకు పర్సు కొంది.


                                                                     *    *    *    *


    మొఘల్ గార్డెన్స్ లో పరీమహల్ హాసకు బొత్తిగా నచ్చలేదు. దానికి బాగా ఎత్తెక్కవలసొచ్చింది. అక్కడ మొఘల్ వైభవానికి సంబంధించిన పురాతన కట్టడాలున్నాయి. పైనుంచి ఊరు కనిపిస్తుందని రమణ అంటే_"వూరు చూడ్డానికింత దూరం రావాలా? వూళ్ళోనే వుంటే సరిపోలా?" అందామె.

    అప్పుడు రమణ ఆమెకు దగ్గరగా వచ్చి- "అయితే నీకు ఆసక్తికరముగా వుండే విశేషం చూపిస్తాను. అదిగో-అక్కడ చూడు-ఆ దూరంగా నిలబడి వున్నాడూ, నల్ల ఓవర్ కోటు వేసుకున్నాడూ....వాడు పొద్దున్నించీ మనని వెన్నంటే వస్తున్నాడు" అన్నాడు.

    "బాగుంది. ఇది టూరిస్ట్ ప్లేసు. వాడిదీ, మందీ ఒకే ప్రోగ్రామేమో" అందామె.

    "అలా కాదు. వాడు గార్డెన్సు చూడ్డంలేదు. మనతోపాటు వచ్చి మనం చూడ్డం అయ్యేదాకా ఆగి మనం బయలుదేరగానే తనూ బయలుదేరుతున్నాడు హీరోహోండా మీద...."

    "అనుమానమయితే పలకరించి అడక్కూడదూ?" అందామె.

    "నీ గంధర్వుడికి చెప్పి వాడి గురించి తెలుసుకుంటావని!"

    "ఓహో! నా గంధర్వుణ్ణి పరీక్షించాలనుకుంటున్నావా? అది నిన్నైపోయింది...."

    "ముందే చెబుతున్నాను. తర్వాత వాడి వలన నీకేమైనా ప్రమాదం కలిగితే నా బాధ్యత లేదు...."

    హాస అదోలా అతడివంక చూసి_ "లేదన్నా, కాదన్నా నా బాధ్యత నీకు తీరిపోదు. నువ్వుండగా నాకే భయమూ లేదు" అంది.

    ఆ మాటలకు రమణ ఛాతీ ఉబ్బింది.

    "థాంక్స్ హాసా!" అన్నాడతడు.

    వాళ్ళు తిరుగు ప్రయాణమయితే వాళ్ళ కారుకు కాస్త దూరంలో హీరో హోండా కూడా అనుసరించడం రమణతో పాటు హాస కూడా గమనించింది.


                         *    *    *    *


    సాయంత్రం ఆరు.

    షికారాలో రమణ, హాస.

    అందమయిన దాల్ సరస్సు మధ్య అంతకంటే అందమైన కలువ పువ్వులా మెరిసిపోతోందామె.

    విరిసిన కలువ పువ్వులా వున్న ఆమెను చూసి కొందరు చంద్రోదయమైందేమోనని ఆకాశంలోకి చూస్తున్నారు. దీపకాంతులతోపాటు ఆమె తేజస్సు కూడా దాల్ సరస్సులో ప్రతిఫలిస్తోంది.

    ఆ అందాన్ని చూస్తున్నాడు రమణ.

    అతడి మనసులో సంచలనం చెలరేగుతోంది.

    ఈ మనోహర, సుందర, సుకుమార పుష్పాన్ని నిర్ధాక్షిణ్యంగా నలిపివేయబోతున్నాడు తను. అది భావ్యమా!

    "భావ్యాభావ్యాలకు తావులేదు. ఆలోచనలకు సమయంలేదు. లక్ష్యాన్ని మనసులో నింపుకో. గురిచూసి బాణంకొట్టు...." అంటోంది మనసు.

    "హాసా! అటు చూడు" అన్నాడు రమణ.

    ఆమె అటు చూసింది.

    ఒక బోటు తమను వేగంగా సమీపిస్తోంది. అందులో నల్లటి ఓవర్ కోటు వేసుకున్న యువకుడు....

    "ఏమిటి?" అని ఆమె అడగాలనుకుంది. అంతలోనే ఆ బోటు వచ్చి ఈ బోటును ఢీకొంది. హాస వంటివి సరస్సు నీరు చల్లగా స్పృశించింది.

    ఆమెకు స్పృహ తప్పింది.


                         *    *    *    *


    హాస కళ్ళు తెరిచేసరికి ఓ గదిలో పడుకొని వుంది. కళ్ళు విప్పగానే ఏదోలా కనిపించిందామెకు.

    అందుక్కారణం ఆమెకు వెంటనే తెలిసింది.

    తన వంటిమీద బట్టలు లేవు. పెద్ద రోజాయి కప్పబడి వుంది.

    అంటే తానిప్పుడు మంచం కూడా దిగి వెళ్ళలేని పరిస్థితి.

    ఏమయ్యాయి తన బట్టలు? ఎవరు విప్పారు వాటిని....?

    వెంటనే రమణ స్పురించాడామెకు. సిగ్గుతో ఆమె శరీరం కుంచించుకు పోయింది.

    ఓసారి చుట్టూ చూసింది.

    మరీ అంత పెద్ద గది కాదది. తను పడుకున్నది డబల్ కాట్ మంచం. గది గోడలకు శృంగార సూచకలో పోస్టర్లు.

    ఇక్కడిలా ఎంత సేపు?

    తలుపు కిర్రుమంది. లోపలకి రమణ ప్రవేశించాడు.

    అతడివేపు తిరిగిందామె,

    "హమ్మయ్య! నీకు స్పృహ వచ్చిందన్నమాట...." అన్నాడతను.

    "ఏం జరిగింది? నేనిక్కడికెలా వచ్చాను?" అంది హాస నీరసంగా.

    "పడవ మునిగింది. నిన్ను రక్షించుకోగలిగాను...." అన్నాడతను.

    "నా బట్టలు...."

    "ఆరుతున్నాయి....శింతటిక్కే కదా....ఇంకాసేపట్లో పూర్తిగా ఆరిపోతాయి. ఎటొచ్చీ లోపల బట్టలే...."

    "నా బట్టలెవరు విప్పారు?" అందామె.

    "అవన్నీ యిప్పుడాలోచించకు. ఆపద్ధర్మంగా ఏమో చేస్తాం...."

    "నువ్వు నన్ను.... చూశావా?" తడబడుతూ అడిగిందామె.

    "ఆ పని నేను కాకపోతే గెస్ట్ హౌస్ వాచ్ మెన్ చేయాలి. అయినా అప్పుడు నిన్ను రక్షించుకోవాలనే తాపత్రయంలో వున్నాను. అదృష్టవశాత్తూ అక్కడకు దగ్గర్లోనే చిన్న దీపం, అందులో గెస్ట్ హౌస్, అందులో ఓ గది ఖాళీ వుండడం జరిగింది...."

    "నువ్వు నన్ను....చూశావా?" హాస తన ప్రశ్న రెట్టించింది.

    ఆమె అంతరార్ధం అర్ధమయిందతడికి. తల దించుకుని__

    "అప్పుడు నీ వంటిమీద బట్టల్లేవు. కానీ నిజం చెబుతున్నాను. నీ వంటిమీద రొజాయి కప్పాలని ఆశపడ్డానే తప్ప నిన్ను చూడలేదు. ఇపుడు నువ్వు రొజాయి కప్పుకున్నావు. కానీ నిన్ను చూస్తున్నాను. చాలా స్పష్టంగా చూస్తున్నాను" అన్నాడు.

    ఆమె వళ్లు జలదరించింది.

    "హాసా! నువ్వు నా నిగ్రహాన్ని పరీక్షించావు. ఇందాకా నా నిగ్రహాన్ని కోల్పోయి వుంటే, ఏం జరిగేదో తెలియదు. కానీ నా సంస్కారం ఓ నిస్సహాయురాలిపై అత్యాచారం చేయకుండా ఆపింది.

 Previous Page Next Page