Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 42


    విశ్వం కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు.
    "పెట్రోల్ బంకు తాకట్టుపెట్టి పాతికవేలు సేఠ్  రామ్ లాల్ దగ్గర అప్పు తీసుకున్నావట."
    "అవును. వర్క్ షాపు సేఠ్  రామ్ లాల్ కు తాకట్టు పెట్టి మరో ఏభైవేలు తీసుకున్నాను" అన్నాడు గౌతమ్ తాపీగా.
    "ముందు మన ఒప్పందం ఇది కాదే?"
    "కాదు. కాని, మీ అన్నయ్య జైల్లో పడనంతవరకే నేను అందినంతవరకు రాబట్టుకోవాలి. ఆ తరవాత నాకు ఆ ఆస్థిలో చిల్లిగవ్వ రాదు. జైల్లో ఉన్న మీ అన్నయ్య స్థానంలో నేను పబ్లిక్ గా రాలేను."
    "అందుకని నన్ను పాపర్ ను చేసి వెళ్ళిపోతావా?"
    "నేను నీ అంత దుర్మార్గుణ్ణి కాను, రవీ. నాకు దక్కింది దక్కగా ఇంకా నీకు చాలా ఉంది.
    "అందులో సగం జైలుశిక్ష పూర్తయ్యాక అన్నయ్య వచ్చి క్లెంయించేస్తాడు."
    "చెయ్యడు"
    "ఎందుకు చెయ్యడు?"
    "మీ అన్నయ్య మంచివాడు. మనసున్న మనిషి. ఆభిమానధనం గలవాడు. జైలు నుంచి మళ్ళీ వెనక్కు వచ్చి తన ఆస్థి పంచుకోవడానికి ప్రయత్నించడు. అతడు గొప్పవాడు! అతడి భుజాల వరకు కూడా మనం జన్మంతా ప్రయత్నించినా ఎదగలేం!" ఆ మాటలు అంటున్నప్పుడు గౌతమ్ కళ్ళు మిలమిలలాడాయి.
    రవికి పిచ్చెక్కిందో, గౌతమ్ కు పిచ్చెక్కిందో, లేక తనకే మతిపోయిందో అర్థం కావడంలేదు విశ్వానికి.
    రవి మౌనంగా గౌతమ్ ను చూశాడు.
    "రవీ, నేను ఎక్కువ రోజులు ఈ ఊళ్ళో ఉండటం మంచిదికాదు."
    కేసు పూర్తి అయ్యేదాకా ఉండవా ఏడ్పు గొంతులో అన్నాడు.
    "అందువల్ల చాలా ప్రమాదం ఉంది. పోలీసులకు మీ అన్నయ్య పోలికలున్న మరొకడున్నాడనే అనుమానం వచ్చిందనుకో-హైదరాబాదులో వాళ్ళ దృష్టిని తప్పించుకుని తిరగడం కష్టం. నేను చిక్కితే మన ప్లానంతా తలకిందులే. ముగ్గురం కటకటాల వెనక్కు వెళ్తాం" అన్నాడు గౌతమ్.
    "అవునవును. నువ్వు వెంటనే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి." విశ్వం గాబరాగా అన్నాడు.
    గౌతమ్ విశ్వం ముఖంలోకి చూసి అదోలా నవ్వాడు.
    "నేను వెళ్ళాక నువ్వు రవిని వదలకూడదు. కష్టమైనా సుఖమైనా ఇద్దరూ కలిసే అనుభవించాలి."
    విశ్వం సమాధానం ఇవ్వలేదు.
    "మాట్లాడవేం?"
    "ఏమిటయ్యా నీ దబాయింపు?" అని అరవాలనిపించింది. కాని "అలాగే గౌతమ్!" అన్నాడు.
    "నేను ఎక్కడ ఉన్నా ఎప్పటికప్పుడు మీ విహయాలు తెలుసుకుంటూనే ఉంటాను. నువ్వు రవికి ద్రోహం చేశావని తెలిసిన మరుక్షణంలో నేను నీ ముందు ఉంటాను."
    "ఏమిటయ్యా నా వెంటపడ్డావ్? రవి నా ప్రాణ మిత్రుడు. రవిని నేనెందుకు మోసం చేస్తాను?" అక్కసుగా అన్నాడు.
    "ఆ మాట మీదే ఉండు."
    విశ్వం ముఖం కోపంగా పెట్టాడు.
    "నేనివ్వాళ సాయంత్రమే వెళ్ళిపోతున్నాను."
    "ఎక్కడికి?" రవి చివ్వున తలెత్తి అడిగాడు.
    "చెప్పను."
    "చెప్పకపోతే ఎలా? నీ అవసరం అయితే?" రవి నసిగాడు.
    "నేను ఎక్కడ ఉండేదీ చెప్పను. మిమ్మల్నెవరు నమ్మేది? పోలీసోడి లాఠీదెబ్బ ఒకటి చాలు మీ నుంచి నిజం కక్కించడానికి."
    "అందినంతవరకు దోచుకున్నావు. పత్తా లేకుండా పారిపోదామనుకుంటున్నావా?"
    "రవీ!" గౌతమ్ కంఠం తీవ్రంగా ఉంది.
    "నా సహనాన్ని పరీక్షిస్తున్నావు." రవిని తీవ్రంగా చూశాడు.
    రవికి నిజంగానే భయం వేసింది.
    "అది కాదు." నీళ్ళు నమిలాడు.
    "భయపడకు. నేను ఎక్కడ ఉన్నా ఎప్పటికప్పుడు మీ విషయాలు తెలుసుకుంటూనే ఉంటానని ముందే చెప్పాను. నా అవసరం ఉందనుకొన్నప్పుడు తప్పక వస్తాను. నేను దొరకినప్పుడే మీరు రిస్కులో పడతారు. అంతవరకూ మీకొచ్చిన ప్రమాదం ఏదీ లేదు" అన్నాడు గౌతమ్ ధైర్యం చెప్తున్నట్టుగా.
    "ఎప్పుడెళ్తున్నావ్?"
    "ఇవ్వాళే వెళ్తున్నాను."
    "కారుకు ఆర్డరిచ్చానన్నావ్?" విశ్వం అందుకున్నాడు.
    "నిన్ననే వచ్చింది. నా పేరుమీద కొనలేదు. అది ఈ ఊరుదాటి వెళ్ళిపోయింది నిన్ననే."
    రవి ఆశ్చర్యంగా గౌతమ్ ముఖంలోకి చూశాడు.
    "అవును బ్రదర్. ఇలాంటి పనులు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన మూవ్ మెంట్స్" అన్నాడు గౌతమ్.
    "అంటే నువ్వెక్కడి కెళ్ళేదీ చెప్పవన్నమాట."
    "చెప్పనని ఒకసారి చెప్పాను."
    "నేను ఆసుపత్రికి వెళ్ళాను. దాని రియాక్షన్ ఏమిటో తెలుసుకోండి" అన్నాడు గౌతమ్.
    "ఇందుమతి గౌతమ్ మీద రిపోర్టు ఇవ్వడానికి పోలీసు స్టేషన్ కు వెళ్ళింది."
    గౌతమ్ ఆశ్చర్యంగా చూశాడు.
    "నిజంగా!" విశ్వం విస్మయంగా అడిగాడు.
    "అవును. వెంటనే మళ్ళీ అరెస్టు చెయ్యకపోతే రేపు స్టూడెంట్స్ ప్రొసెషన్ నడిపిస్తుందట. ముఖ్యమంత్రికి అర్జీ ఇస్తుందట."
    "రియల్లీ గ్రేట్ గర్ల్!" ప్రశంసాపూర్వకంగా అన్నాడు గౌతమ్.
    "ఆ అమ్మాయి పట్టుకొంటే వదలదు. సాధించి తీరుతుంది. ఇలాంటి విషయాల్లో తన, పరాయి అంటూ భేదం లేదు. ఆమాట కొస్తే ఆమెను పెంచిన తల్లే గౌతమ్ మీద మొదటిసారిగా రిపోర్టు ఇచ్చింది." ప్రశంసాపూర్వకంగా అన్నాడు విశ్వం.
    రవికి విశ్వాన్ని చూస్తుంటే, అతడు మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు మండిపోతున్నది.
    "అయితే నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఇందుమతికి గౌతమ్ లాంటివాడే మరొకడున్నాడని, వాడే ఇవన్నీ చేస్తున్నాడని తెలిస్తే వదలదు." నవ్వుతూ అన్నాడు గౌతమ్.
    "అవును, మరిచిపోయాను. మీరు ఇందుమతితో నాకు పెళ్ళి కూడా జరిపిస్తానన్నారుగా?" గౌతమ్ ఉడికిస్తున్నట్టుగా అన్నాడు.
    "ఇప్పుడు ఆ అవసరం లేదు." రవి విసుగ్గా అన్నాడు.
    "దెన్ ఓ.కె. గుడ్ లక్!" గౌతమ్ లేచి ఒకరి తరవాత ఒకరికి చెయ్యి అందించాడు.


                                                            16


    విక్రమ్ చెప్పుకుపోతూ ఉన్నాడు. ఉద్రేకంగా చెప్తున్నాడు. ఆ ఉద్రేకంలో ఆవేదన కూడా ఉంది. ఇందుమతి మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. అయినా అతడు చెప్తున్న ప్రతివాక్యం శ్రద్ధగా వింటున్నది.
    "వింటున్నారా?"
    "చెప్పండి."
    "మీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటేనూ?" సాగదీసి అని ఆమె ముఖంలోకి తీవ్రంగా చూశాడు విక్రమ్."
    "అల ఎందుకనుకుంటున్నారు?"
    "వినడం ఇష్టం లేనట్టుగా ఎటో చూస్తుంటేనూ. అంత ఇష్టం లేకపోతే నేను చెప్పను. వెళ్తాను" అని లేచి నిల్చున్నాడు విక్రమ్.
    "అదేమిటి? వింటున్నానుగా? కూర్చోండి. చెప్పండి."

 Previous Page Next Page