Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 43

 

    ఇన్స్టిట్యూట్ వాళ్ళు తనలాంటి గ్రేట్ డైరెక్టర్ నీ, యాదగిరి లాంటి చాయ్ లమ్ముకునే వాడినీ ఒకే గాడిన కట్టటం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నాడు.
    తనెక్కడ ? వాడెక్కడ?
    చిన్నప్పటి నుంచీ వాటీజ్ డైరెక్షన్ -- వాటీజ్ స్క్రీన్ ప్లే అన్న పుస్తకాలన్నీ చదివి -- తను చూసిన ప్రతి సినిమాలోనూ దర్శకత్వ ప్రతిభను విశ్లేషిస్తూ వ్యాసాలు తయారు చేస్తూ -- "ఫిలిమ్ క్రిటేక్స్' అనే సంస్థ మీటింగ్స్ లో లెక్చర్స్ చదువుతూ ఇంతపేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే అప్టరాల్ ఒక చాయ్ బహూర్ వాలా చదువు సంధ్య లేని లోలేవల్ ఫెలో, తనకు పోటీగా అదే డైరక్షన్ కరేస్పండేన్స్ కోర్స్ చేయటమే కాకుండా -- చేతిలో పైసా లేకుండా నాగార్జునతో సినిమా ప్లాన్ చేస్తున్నానంటాడా?
    వాడు నాగార్జునతో సినిమా ప్లానింగ్ చేస్తున్నాడనే సరికి -- ఏమో ఏ పుట్టలో ఏ పాముందో -- అని -- వేషాల కోసం వాడి చుట్టూ మూగారు ప్లాట్స్ లోని వాళ్ళు కొంతమంది .
    ఇది హమీద్ మియాకి మరింత చిరాకు కలిగించింది.
    ఇలాంటి నేపధ్యంలో బోస్ కజిన్ కిషోర్ బాబు లోబడ్జెట్ సినిమా తీయడానికి వస్తున్నాడన్న విషయం ఒక పెద్ద అలజడిని లేపింది.
    ఆరోజు నుంచీ హమీద్ మియా బోస్ తో కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. నేను నిజం చెప్తున్నాయ్ బోసూ! ఇత్ నే దిన్ పైకి చెప్పలేదు గానీ -- ఈ అపార్ట్ మెంట్స్ లో నువ్వోక్కటే జెంటిల్మన్ ఉన్నయ్ " అంటూ డైలాగ్స్ కొట్టసాగాడు. రెండు మూడు రోజులు అలాంటి డైలాగ్స్ వదిలాక అప్పుడు అసలు విషయంలోకొచ్చాడు.
    "దేఖో బోస్ భయ్! సినిమా డైరక్షన్ లో నాకెంత నాలెడ్జ్ ఉన్నాయో నీకు తెల్సు! ఆ సబ్జెక్టు మీద నేను రెండు బుక్స్ భీ రాసినాయ్-"
    ఆ మాట వినగానే విజయ్ యాదవ్ ఉలిక్కిపడ్డాడు.
    "బుక్స్ రాశావా! ఎప్పుడు ? మాకెవరికీ కాఫీలు ఇవ్వలేదేం?"
    "పైసా నై హై! బుక్స్ రాసినయ్ గానీ పబ్లిష్ అవలే! ఒక సినిమా డైరెక్షన్ చేశాక పబ్లిష్ చేయాలని నా ప్లాన్ ఉన్నయ్-"
    "బెస్ట్ అయిడియా " వప్పుకున్నాడు శంకరమూర్తి . "ఇప్పుడు పబ్లిష్ చేస్తే -- ఆ చెత్త బుక్స్ మనల్నందరినీ కొనమని ప్రాణం తీస్తాడు " అన్నాడు మాతో రహస్యంగా . హమీద్ మియా మళ్ళీ కంటిన్యూ చేశాడు.
    "డైరెక్టర్ గా నేనెంత జీనియస్ ఉన్నాయ్యో-- సబ్ కో మాలూమ్ హై! లేకిన్ నాకు ఫైనాన్షియల్ బాకింగ్ లేవ్!"
    'అవునవును" బోసు వప్పుకున్నాడు.
    "ఇసీలియే నేను ఒక డిసెషన్ తీసుకున్నయ్-"
    "ఇంక చస్తే డైరెక్షన్ జోలికి వెళ్ళగూడదని డెసిషన్ తీసుకుని ఉంటారు-- " అన్నాడు విజయ్ యాదవ్.
    అందరూ తప్పట్లూ కొట్టారు. "సూపర్బ్ డిసిషన్ ! లైఫ్ లో అందరూ ఏదొక రోజు ఇలాంటి చేదు నిర్ణయాలు తీసుకోవాల్సిందే- తప్పదు " అన్నాడు రెడ్డి. హమీద్ మియా గాబరాగా చూశాడు.
    "అరెరె! వైసా నై హై నన్ను మీ అందరూ మిసండర్ స్టాండ్ చేసుకున్నాయ్ . నా డెసిషన్ అది లేవ్"
    'అది కదా?"
    "కాదు -- డెసిషన్ ఏమున్నాయ్ అంటే నేను ఇంకో డైరక్టర్ కింద కోడైరెక్టర్ గా వర్క్ చేస్తయ్! అప్పుడు నా టాలెంట్ స్టేటంతా తెలుస్తయ్-"
    విజయ్ యాదవ్ వప్పుకున్నాడు.
    "నిజమే! ఇంత టాలెంట్ ఉన్న హమీద్ మియా ఏమైనా సరే మా ఫిలిమ్ ఫీల్డ్ కి రావాల్సిందే- అంటూ ఏ బొంబాయో తీసుకెళ్తారు . అక్కడ ఏదొక ఫిలిమ్ కంపెనీ గెస్ట్ హౌస్ లో పెడతాడు -- సినిమా డైరెక్షన్ చేయిస్తారు అన్నాడు విజయ్ యాదవ్ -
    మా అందరికీ హమీద్ మీద జాలి కలిగింది.
    "నిజమే గురూజీ -- మీ లైఫ్ ఆ టర్న్ తీసుకోడానికి చాన్సుంది -" అన్నాడు శంకరమూర్తి .
    ఇంతకూ ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నాయ్ అంటే మీ అమెరికా కజిన్ ఫిలిమ్ తీయడానికి వస్తున్నాయ్ కదా! ఆయనకి నేను కోడైరక్టర్ గా వర్క్ చేస్తయ్" అని నువ్ రికమెండ్ చేయాలి !"
    బోస్ హాపీగా ఫీలయ్యాడు.
    "చాలా మంచి అయిడియా హమీద్ భాయ్! అటు మా బ్రదర్ కీ మంచి నాలెడ్జి ఉన్న కొడైరక్టర్ దొరికినట్లవుతుంది!"
    "ఉట్టి నాలెడ్జే కాదురా భయ్! నేను 'అజ్ తలక్ . ఎవరికీ చెప్పలేవ్ గానీ -- నేను చాలా గ్రేట్ జీనియస్ ఉన్నాయ్! బాకీ డైరక్టర్స్ కే వైసా నహీ హు! టోటల్ గా ఒక న్యూయాంగిల్లో షాట్స్ తీయాలని ఎప్పుడో నేను నోట్స్ తయారు చేసుకున్నాయ్! మేరే వైసా జీనియస్ కో డైరక్టర్ ......మీ కజిన్ కి పెద్ద 'ఎసెట్ ' ఉంటయ్!"
    "అవునవును " వప్పుకున్నాడు బోసు.
    "ఫిర్ - మీ కజిన్ నా గురించి రికమెండ్ చేస్తయ్?"
    "సెంట్ పర్సెంట్ చేస్తయ్!"
    "ప్రామిస్ కరో!"
    "గాడ్ ప్రామిస్-"
    "మదర్ ప్రామిస్?"
    "మదర్ ప్రామిస్"
    ఇది జరిగిన వారం రోజులకే కిషోర్ బాబు హైదరాబాద్ చేరుకోవటం మా అపార్ట్ మెంట్స్ లోనే -- అంటే బోస్ ఇంట్లోనే దిగటం జరిగిపోయింది.
    నిజానికి అతన్ జెట్ లాగ్ వల్ల కనీసం నాలుగయిదుగంటలు రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు గానీ -- హమీద్ మియా అతనికా చాన్స్ ఇవ్వలేదు.
    బోసుని తెగపోరి అతను వచ్చిన అరగంటకే కలుసుకున్నాడు హమీద్ మియా!
    బోసు అతనిని పరిచయం చేశాడు.
    "ఓ! కోడైరెక్టర్ గా ఉంటారా ! గుడ్ ! ఇంతకూ ముందు ఏమేం ఫిలిమ్స్ కి వర్క్ చేశారు ?" అడిగాడు కిషోర్ బాబు .
    "వర్క్ చేయటమంటే -- ఎగ్జాక్ట్ గా వర్క్ చేయలేదు గానీ -- విషయమేంటంటే -- హమీద్ మియాగారు ఇండిపెండెంట్ డైరెక్టర్ గానే వర్క్ చేయాలనే ఉద్దేశ్యంతో -- ఎన్నో ఆఫర్ లు వచ్చినా వప్పుకోలేదన్నయ్యా! ఎందుకంటే ఇప్పుడొచ్చే డైరక్టర్లకు ఏం గొప్ప నాలెడ్జ్ ఉంది సార్- నాకున్న దాంట్లో హాఫ్ కూడా ఉండదు -- అంటారాయన! అందుకే అలాంటి వాళ్ళకి అసిస్టెంట్ గా చేయటమనేది ఆయనకే మాత్రం లైకింగ్ లేదు -" సర్ది చెప్పాడు బోస్!
    "ఆఫ్ కోర్స్ - అప్ కా బాత్ అలగ్ హై! అప్ ఎన్నారై హై! అమెరికాలో ఆఫ్ కో - చాలా గొప్ప ఎక్స్ పోజర్స్ ఉంటాయ్! అందుకే -- మీలాంటి గ్రేట్ పీపుల్ దగ్గర కోడైరక్టర్ గా చేయటం నాకు చాలా హాపీగా ఉంటయ్!" చెప్పాడు హమీద్ మియా.
    కిషోర్ బాబు కొంచెం పజిలయాడు.
    "ఓ! ఎక్స్ పీరియన్స్ లేదన్నమాట -" అన్నాడు నిరుత్సాహంగా.
    "లేకపోయినా కూడా జీనియస్ బ్రదరూ " అన్నాడు బోసు బాబు కవర్ చేస్తూ.
    "ఆవు సార్! నా గురించి నేను చెప్పుకోవటం మంచి గుండయ్! లేకిన్ సచ్చీ -- నేను జీనియస్ ని సార్! నా ఫిలిమ్ చూసి అమెరికా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ వాళ్ళు -- 'యూ ఆర్ జీనియస్ డైరక్టర్' అని నాకు మెయిల్ పంపించినయ్ సార్-" తన ఇమేజ్ బూస్టప్ చేసుకున్నాడు హమీద్ మియా-
    "ఒకే -- ఓకే - నో ప్రాబ్లం - అయితే మనం కలసి ఈ ఫిలిమ్ తీయబోతున్నాం " అన్నాడు కిషోర్ బాబు.
    "థాంక్యూ సర్-" చాలా హాపీగా ఫీలవుతూ అన్నాడు హమీద్ మియా.

 Previous Page Next Page