ఆ మర్నాటి నుంచే రంగంలోకి దూకాడతను.
కిషోర్ బాబు నడిగి - అతనే సిద్దం చేసిన స్క్రిప్ట్ తీసుకుని స్టడీ చేయటం మొదలుపెట్టాడు.
ప్లాట్స్ లో వాళ్ళు ఎవరయినా ఏదయినా ప్రాబ్లమ్స్ ఉందని అతని దగ్గర కొచ్చినా అతను మాట్లాడేవాడు కాదు.
కళ్ళుమూసుకుని కోమాలో ఉన్నట్లు కూర్చుని ఉండేవాడు.
"సార్ -- హమీద్ మియా గారూ -- అలా ఉన్నారేంటి సార్? వంట్లో బాగుండలేదా?" అడిగేవారు వాళ్ళు.
"దేఖో- లక్ష్మినారాయణా! నేను డీప్ గా ఆలోచిస్తున్నాయ్! సినిమా డైరక్షన్ వ్యవహారం కదా! మా డైరెక్టర్లేంటంటే ఒక సినిమా వర్క్ మొదలు పెట్టినయ్యంటే 24 గంటలూ ఆ ధ్యాసలోనే ఉంటయ్ ! ఎందుకంటె మనం అందరి లెక్క ఎట్లా పడితే అట్ల సినిమా తీసి పారేయలెవ్! ఏం చేసినా కమిటెడ్ గా చేస్తయ్!
టేకింగ్ విషయంలో భీ బెటర్ మెంట్ ఆలోచిస్తూ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతయ్ !..... ఆ -- ఇంతకూ ఏం పని మీద వచ్చినయ్?" అంటూ అప్పుడే స్పృహలో కొచ్చినట్లు అడిగేవాడు.
మొత్తానికి సినిమా షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచక జరిగిపోతున్నయ్.
లొకేషన్ ఫిక్స్ యిపోయింది. ఆర్టిస్ట్ లను బుక్ చేసేశారు. యూనిట్ ఏర్పాటయిపోయింది.
మంచి రోజ్జూసి ముందు ప్రెస్ మీట్ పెట్టారు.
ప్రెస్ మీట్ ఎలా ఏర్పాటు చేయాలో హమీద్ మియాకి తెలుసు. ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి ఆ రోజు అందరికీ తలో వెయ్యి రూపాయలున్న కవర్లు ఇవ్వాలి.
అప్పుడు గానీ పబ్లిసిటీ ఇవ్వరు.
ప్రెస్ మీట్ లో హమీద్ మియా తాము తీయబోతున్న సినిమా కోసం ఎంత వైవిద్యంగా ఉండే కధను నిర్మాత , దర్శకులు కిషోర్ బాబు ఎన్నుకున్నారో చెప్పే ప్రయత్నం చేశాడు.
"అందరూ బాడీని మాక్సిమమ్ ఎక్స్ పోజ్ చేసే హీరోయిన్ని పెట్టుకుంటయ్! అలాంటి సెక్సీ హీరోయిన్ లేకపోతే బయ్యర్స్ రావ్! కానీ కిషోర్ బాబు గారు అలాంటి చీప్ టెస్ట్ ఉన్న మనిషి లెవ్! ఫిలిమ్ మీడియమ్ కి సొసైటీ ఒక రేపాన్స్బులిటీ హై! ఆ జుమేదారీ ఫీలయినోళ్లె మంచి సినిమా తీస్తాయ్! మా పిక్చర్ ల హీరోయిన్ ఒక జంగిల్లో ఉంటయ్! ఆ అమ్మాయికి జంగిల్ జంతువుల్తో దోస్తానా ఉంటయ్! ఒక గుర్రం , ఒక ఎలిఫెంట్ , ఒక కోతి , ఒక జాగిలాయ్ -- గొర్రె పొటేలు అన్నీ హీరోయిన్ కి దోస్తానా ఉంటాయ్-- జంతువుల్ని మనిషి ప్రేమించాలి అనేదే మా ధీమ్ ఉన్నాయ్-- ఇక స్టోరీ లైన్ ఏంటంటే ........"
జర్నలిస్ట్ చప్పున అడ్డుపడ్డాడు.
"స్టోరీ అక్కర్లేదు లెండి ! ధీమ్ చెప్పారుగా! చాలు! మాకింకో రెండు ఫిలిమ్ ఓపెనింగ్ ఫంక్షన్స్ ఉన్నయ్-- ముందు మా కవర్లు మాకిస్తే మేం వెళ్తాం --" అన్నాడు సీనియర్ జర్నలిస్ట్.
"ఓకే- ఓకే " అంటూ కిషోర్ బాబు అందరికీ కవర్లు ఇచ్చేశాడు.
"ఇంతకూ సినిమా పేరెం పెట్టారు ?" అడిగాడు ఇంకోకతను.
"జంగిల్ రాణి" చెప్పాడు విజయ్ యాదవ్.
"సినిమా అంతా జనువులతో తీసుతున్నారు కదా! మరి గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకున్నారా?" ఇంకో అతను అడిగాడు.
"పర్మిషన్లేంటి? సినిమా తీయడానిక్కూడా పర్మిషన్ తీసుకోవాలా?' ఆశ్చర్యంగా అడిగాడు కిషోర్ బాబు.
"ఇదివరకు అయితే అవసరం లేదు గానీ -- ఇప్పుడు జంతువులతో షూటింగ్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టంది."
కిషోర్ బాబు ప్రొడక్షన్ మేనేజర్ని అడిగాడు ఆ సంగతి.
"అదంతా ఓకే సార్-" అన్నాడతను.
ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయారు.
మర్నాడు "జంగిల్ రాణి" న్యూస్ అన్ని న్యూస్ పేపర్లో వచ్చేసింది. హమీద్ మియా ఆ పేపర్లన్నీ మా అపార్ట్ మెంట్ లో ఫ్రీగా పంచి పెట్టాడు.
సిటీకి దగ్గరలో ఉన్న ఒక అడవిలాంటి ప్రదేశంలో మొదటిరోజు షూటింగ్ పెట్టారు.
మొదటి రోజు షూటింగ్ కి మా అపార్ట్ మెంట్స్ వాళ్ళందరం కూడా ఒక బస్ వేసుకుని వెళ్ళాం.
మా లేడీస్ అందరికీ ఇంచుమించుగా వాళ్ళే ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది.
ఆరోజు హీరోయిన్ తో పాటు యాక్షన్ చేయడానికి ఒక గుర్రం, ఒక పొట్టేలు, ఒక ఏనుగుని కూడా తీసుకొచ్చారు.
హీరోయిన్ ఆ జంతువులన్నీటికీ ప్రాణమిత్రురాలన్నమాట! ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేసే టైపు!
హీరోయిన్ అడవుల్లోనే పుట్టి పెరిగింది కాబట్టి బట్టలేసుకోదు- చెట్ల ఆకులతో నారతో బాగా సెక్సీగా కనిపించే డ్రస్ వేసుకుంటుంది.
ఆ చెట్ల ఆకులే డ్రస్ గా వేసుకుందని తెలీగానే మొత్తం మగాళ్ళందరూ హీరోయిన్ చుట్టూ మూగిపోయారు.
ఆ సీన్ చూసి లేడీస్ మగాళ్ళ మీద కారాలూ, మిరియాలు నూరటం మొదలు పెట్టారు.
"ఎప్పుడూ ఆడదాన్ని చూడనట్లు -- చూడండి -- ఎలా సిగ్గులేకుండా -- మిడిగుడ్లేసుకుని చొంగకార్చుకుంటూ చూస్తున్నారో ?" అంది సీతారామానుజం.
"అవునవును -- ఈ మగజాతే అంత! వట్టి దగుబాల్జీలు " అంది షైనీ.
అయినా మగాళ్ళ లెక్క చేయక పోయేసరికి లేడీస్ వెంటనే ఆవేశంగా ఇళ్ళకు వెళ్ళిపోయారు.
జంగిల్ రాణి జంతువులతో మాట్లాడుతూ , వాటిని మధ్య మధ్యలో ముద్దు పెట్టుకుంటూ పాట పాడుతుంటేగా ఇద్దరు వ్యక్తులు కారు దిగి వచ్చారు.
"ఎవరు బాబూ -- ఈ ఫిలిమ్ డైరక్టర్ " అడిగారు వాళ్ళు. 'కట్' అన్నాడు హమీద్.
ఆ వచ్చిన వాళ్ళు -- తన టాలెంట్ గురించి విని -- తననను వాళ్ళు తీయబోయే సినిమాకి డైరెక్షర్ ఉండమని అడగటానికొచ్చిన ప్రోడ్యూసర్లెమో అనుకున్నాడు -
"నేనే నేనే! లేకిన్ అభీ ,, తో వేరే ఫిలిమ్ డైరక్ట్ చేసే ఆలోచన నాకు లెవ్ -" అన్నాడు కొంచెం ఓవర్ గా ఫోజిస్తూ.
"మేమొచ్చింది మిమ్మల్ని డైరక్షన్ చేయమని అడగటానిక్కాదు-- " అన్నాడు అందులో ఓ వ్యక్తీ.
"మరిదేని కొచ్చారు ?"
"జంతువులతో షూటింగ్ చేసేముందు మా పర్మిషన్ తీసుకోవాలన్న విషయం మీకు తెలీదా?" అడిగాడతను.
"మీరెవరూ?" అడిగాడు కిషోర్ బాబు.
"మేమెవరా? మేమెవరో తెలీకుండానే మా ఆఫీస్ కి సినిమా స్క్రిప్ట్ పంపించారా?" ఈ కన్ ఫ్యూజనంతా చూసి ప్రొడక్షన్ మేనేజర్ పరుగుతో వచ్చాడు.
"సార్! వీళ్ళు పి.సి.ఏ వాళ్ళు సార్. అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ ! ఏ సినిమాలో అయినా సరే ఏ జంతువునన్నా, ఏ పక్షినన్నా చూపించాల్సివస్తే వీళ్ళకు మన స్క్రిప్టు పంపించాలి! వాళ్ళు స్క్రిప్టు చూసి జంతువులున్న సీన్లు స్టడీ చేస్తారు. జంతువులకు బాధ కలిగించే సీన్లు గానీ, వాటి వల్ల క్రూరంగా ప్రవర్తించే సీన్లు గానీ ఉన్నాయనిపిస్తే అ సీన్లు షూటు చేయడానికి వీల్లేదని చెప్తారు -- ఒకసారి వీళ్ళు వీల్లేదంటే ఆ సినిమా ఇంక రిలిజవదు - గవర్నమెంట్ తో వ్యవహారం కదా! ఒకవేళ ఫరవాలేదనిపిస్తే -- వాళ్ళు స్వయంగా వచ్చి దగ్గరుండి ఆ సీన్లు షూటింగ్ చేయిస్తారు -" చెప్పాడతను.
అప్పుడర్ధమయింది విషయం అందరికీ !
వెంటనే వాళ్ళను షూటింగ్ జరిగే చోటుకు ఆహ్వానించాడు హమీద్ మియా!
"అంటే! షూటింగ్ టైం కి మేము కనపడ్దాం గనుక ఆహ్వానిస్తున్నారు- మేము కనబడకపోతే పాపం ఆ జంతువులను చిత్రహింసలు పెట్టి షూటింగ్ చేసేస్తారు -- అంతే కదా!"


