Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 42

                                 

       

   

    మా రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ లో కొంచెం ఎక్కువగానే ఫామిలీస్ ఉండటం వల్ల -- ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఒవర్ గానే వస్తుంటాయ్.

    అందుకని మా అపార్ట్ మెంట్స్ లో సొసైటీ కమిటీ వాళ్ళందరూ ఎప్పుడూ బిజీగానే ఉంటారు.
    ఇరుగు పొరుగు ప్లాట్ వాళ్ళు ఒక ప్లాట్ లో లేట్ నైట్ వరకూ జరుగుతోన్న మందు పార్టీలో న్యూసెన్స్ గురించి కొట్టుకోవటం దగ్గర్నుంచీ, ఇంకో ప్లాట్ లో ఉండే ఆసామీ తాలుకూ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతోన్న కూతురు బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవటం వరకూ -- ఒక ప్లాట్లో పెద్దేత్తున పేకాట లాడుతున్నారని తెలిసి రైడింగ్ చేసిన పోలీసులు వ్యవహారం దగ్గర్నుంచీ ఇంకో ప్లాట్ లో ఉండే స్టూడెంట్స్ మిడిలేజ్ ఫామిలీ లేడీస్ కి లైట్ కొట్టటం వరకూ --
    అన్నీ హెడేక్సే!
    వీటిల్లో ప్రతి గొడవకూ మా ప్లాట్స్ లోనే ఉంటోన్న తుగ్లక్ టివి జర్నలిస్ట్ -- వాళ్ళ చానెల్ కి ఇన్ ఫర్మేషన్ ఇచ్చి కవరేజ్ కి పిలిపించటం , చానెల్ కెమెరా చూసి మా ప్లాట్స్ లోని యూత్ ,, యంగ్ గాళ్స్ ఆంటీలు అందరూ పోటీలు పడి కెమెరాలో కనిపించడానికి తంటాలుపడటం చాలా నార్మల్ అయిపొయింది.
    తుగ్లక్ టీవి చానెల్లో అడపాదడపా కనిపించడమే కాకుండా, ప్లాట్స్ లో వచ్చిన సమస్యల గురించి వివరణలిస్తూ , దేశ ప్రజలందరూ కూడా ఎలా నడుచుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలివ్వాలో పాలిటీశియన్స్ లెవల్లో సలహాలివ్వటం మొదలు పెట్టారు మా కమిటీ ప్రెసిడెంట్ -- అతని టీమ్ మెంబర్స్ -
    దాంతో తుగ్లక్ టివి చానెల్ వాళ్ళు కెమెరాలతోనూ, ఆవుత్దోర్ యూనిట్ తోనూ మా అపార్ట్ మెంట్స్ లోనే మకాం పెట్టేశారు.
    వ్యవహారం ఇలా ఉండగా ఒకరోజు మా సొసైయిటీ వర్కింగ్ కమిటీ మెంబర్ బోసు ఒక వార్త మోసుకొచ్చాడు.
    అమెరికాలో ఉంటోన్న వాళ్ళ కజిన్ బ్రదర్ కిషోర్ బాబుకి సడెన్ గా కాష్ పోషణ మీద విరక్తి కలిగి కళాపోషణ మీద ఆసక్తి కలిగింది.
    అందుకని ఒక లోబడ్జెట్ సినిమా తీయాలన్న కోరికతో ఇండియావస్తున్నాడు.
    సహజంగానే ఆ వార్త మా ప్లాట్స్ లో ఉన్న వాళ్ళందరికీ అలజడి కలిగించింది.
    ఎందుకంటే మా ప్లాట్స్ లో ఉంటున్న మూడొందల పై చిలుకు ఫామిలిస్ లో సుమారు సగం మంది పైగా లేడీస్ కి తాము గొప్ప రచయిత్రుల మన్న అనుమానం ఉంది.
    అలాగే ప్లాట్స్ లో ఉంటున్న నలభైమంది స్టూడెంట్స్ లో - షుమారుగా అందరూ తాము సినిమాల్లో హీరో కారెక్టర్ కి సెంట్ పర్సెంట్ సూటవుతామనీ , నిజానికి ఇప్పుడు వస్తోన్న యువ హీరోలందరికంటే తామే గొప్ప నటులు క,మ్ అందగాళ్ళనీ ఫీలవుతుంటాడు - ఇక డైరక్టర్స్ కి కొదవే లేదు.
    ఛాన్స్ దొరికిందంటే ప్రతివాడూ కనీసం నలుగురయిదుగురు పక్క ప్లాట్ వాళ్ళను పోగుజేసుకుని తను చూసిన లేటెస్ట్ సినిమా గురించీ -- అందులోని డైవర్షన్ లోపాల గురించీ -- ఆ స్థానంలో తనే ఉండి ఉంటే ఎలా విరగదీసేవాడో - చెప్తూండటం అందరం వింటూనే ఉంటాం !
    ఆఖరికి హమీద్ మియా కూడా తనకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకపోవటం వల్ల ఒక మాములు వ్యక్తిలాగా ఇలా గవర్నమెంట్ జాబ్ చేస్తూ -- ఉంటున్నాడనీ , నిజానికి తను ఒక జీనియస్ ననీ -- కరెస్పాండేన్స్ కోర్స్ ద్వారా అమెరికాలోని ఒక ప్రఖ్యాత ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ నుంచి డైరక్షన్ కోర్స్ ప్లయింగ్ కలర్స్ తో పాసయ్యడనీ -- ప్రాజెక్ట్ వర్క్ కోసం తను తీసిన ఎక్స్ పెరిమెంటల్ డిజిటల్ ఫిలిమ్ చూసి ఆ అమెరికా వాళ్ళు షాకయిపోయారనీ -- తనకు వెంటనే అవుట్ ష్టడింగ్ డైరెక్షన్ సర్టిఫికేట్ పంపించారనీ చాన్స్ దొరికినప్పుడల్లా చెప్తుంటాడు.
    ఆ కోర్స్ చేసిన వాళ్ళందరికీ అలాంటి సర్టిఫికెట్స్ పంపిస్తారని విజయ్ యాదవ్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
    అయితే ఒకసారి మా అపార్ట్ మెంట్స్ కి ఎదురుగ్గా ఉన్న చాయ్ దుకాణం ఓనరు కమ్ సర్వర్ - కమ్- బాహర్ వాలా - యాదగిరి ఒకరోజు మా అందరికీ మీటింగ్ లో చాయ్ సర్వ్ చేస్తూ - మాటల్లో తనూ ఒక ఫిలిమ్ డైరెక్టర్ ననీ - త్వరలో చాయ్ లమ్మి వచ్చిన లాభంతో నాగార్జునను హీరోగా పెట్టి సినిమా తీయాలన్న ప్లాన్ లో ఉన్నాననీ చెప్పేసరికి మా అందరితో పాటు హమీద్ మియా కూడా షాకయ్యాడు.
    "నువ్ సినిమా డైరెక్ట్ చేస్తయ్!" నమ్మలేనట్లు అడిగాడు హమీద్ మియా.
    'అవున్సార్ - అసలు ఆకు చిన్నప్పటినుంచీ ఇంట్రెస్ట్ ఉంది లెండి!"
     "ఖాలీ ఇంట్రెస్ట్ హైతో తుమ్ డైరెక్టర్ అయిపోతాయ్?"
    "ఉట్టిఇంట్రెస్టే కాదులెండి! నేను సంవత్సరం నుంచీ అమెరికన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో డైరెక్షన్ కరెస్పాండెన్స్ కోర్స్ చేశాను -" మళ్ళీ అందరం షాకయ్యాం గానీ హమీద్ మియా కొంచెం ఎక్కువ షాకయ్యాడు.
    "ఏ ఇన్ స్టిట్యూట్ ? 'హాలీవుడ్ ఫిలిమ్ క్రాప్ట్స్ ' ఉన్నయ్?
    "అవున్సార్ - మీకెలా తెలుసు ?"
    హమీద్ మొఖం వాడిపోయింది.
    "దాని యాడ్ న్యూస్ పేపర్ లో నేను చూసినయ్" అంటూ అసలు విషయం చెప్పకుండా తప్పించుకున్నాడు.
    "మీకింకో విషయం చెప్తే ఇంకా షాకవుతారు సార్! ప్రాజెక్ట్ వర్క్ కింద వాళ్ళు ఒక డిజిటల్ ఫిల్మ్ చేసి పంపమన్నారు. నేనేం చేశానో తెలుసా? 'స్లమ్ డాగ్ ' అని ఊరకుక్కల మీద ఒక డాక్యుమెంటరీ తీశాను. అది చూసి వాళ్ళెంత త్రిల్ ఫీలయ్యారంటే 'యూ అరే జీనియస్' అని మెయిల్ ఇచ్చారు. 'ఎక్సట్రార్దినరీ ఫిలిమ్ ఆఫ్ ది డికేడ్ ' అని ఒక సర్టిఫికేట్ కూడా పంపించారు సార్-"
    అతనూహించినట్లే హమీద్ మియా మొఖం షాక్ తోనూ ఆక్రోశంతోనూ , ఆవేదనతోనూ నిండిపోయింది.

 Previous Page Next Page